అవి పదవ తరగతి రిజల్ట్స్ వచ్చిన రోజు. ఊరంతా ఏదో తెలియని ఉత్చాహం. ఉల్లాసం రంగరించుకున్న వాతావరణం. పుల్లారెడ్డి స్వీట్ల దుకాణం వాళ్ళకి గిరాకీ ఉన్న రోజు. పాస్ అయిన పిల్లల తల్లిదండ్రులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భం. అన్నీ చూస్తున్న జ్ఞానేశ్వర్ మాత్రం దిగులుగా ఉన్నాడు. అతనికి ఆ పేరు పెట్టినందుకో ఏమో! జ్ఞానం అనేది కొద్దిగా అయినా లేకుండా పోయింది.
‘ఏమిట్రా! ఏం మార్కులు ఇవీ.. మరీ రెండు మార్కులా? నా సబ్జెక్టులో నేను ఇలాగే పాఠం చెబుతున్నానా? మిగిలిన వాళ్ళకూ ఇలాగే వస్తున్నాయా మార్కులు? కాస్త జ్ఞానం తెచ్చుకుని చదవరా బాబూ!’ అంటూ మొత్తుకునే వారు తెలుగు మాష్టారు జానకి రామయ్య పంతులు. అతను రెండవ తరగతిలో ఉన్నప్పుడే. నిజానికి అదే కొరవడింది జ్ఞానేశ్వర్‌కి. అయితే, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తాడో! ఎవరికీ తెలీదన్నట్లు.
ప్రస్తుతం సెవెంతు క్లాసులో కామన్ పరీక్షలు తీసేయ్యడంతో.. అటెండెన్సు సహాయంతో నిరాటంకంగా ఎనిమిదిలోకి అడుగుపెట్టాడు. ఏదోలా పదిలోకి వచ్చాడు. సంవత్సరం చివరాఖరున పెద్ద పరీక్షలు కూడా రాసేసాడు. అయితే, ఫెయిల్ అయ్యాడు.
ఏ ఒక్క సబ్జెక్ట్.. రెండు సబ్జెక్ట్‌లో కాదు.. మొత్తం అన్ని సబ్జెక్ట్‌లోనూ.
రిజల్ట్స్‌తో పాటు వచ్చిన మార్కుల లిస్టు చూసి దిగులుపడ్డాడు. అమ్మానాన్నా ఏమంటారోనని భయపడ్డాడు. చరిత్రలో ఇదే మొదటి ఫలితం కావచ్చు.
‘ఎంత చదివినా గుర్తు ఉండకపోవడం తన తప్పుకాదు. అయితే ఏం చెయ్యాలి?’ అని ఆలోచిస్తున్నాడు.
‘ఆత్మహత్య చేసుకోవాలా! చేసుకుంటే.. ఎలా చేసుకోవాలి? ఉరి వేసుకోవాలా? నదిలో దూకాలా? ఇల్లు వదిలి వెళ్లిపోవాలా?’ ఇలా ఎన్నో ఆలోచనలు జ్ఞానేశ్వర్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో ఒకటి చెయ్యకపోతే పరీక్ష ఫలితాలకు ఫలితం ఏముంది?
అయితే, తనని అమ్మానాన్నలు ఏమీ అనలేదు. కనీసం ముఖం చిట్లించనూ లేదు.
పైగా ఇంటి ముందు షామియానా వేసి.. క్లాసులో ఉండే పిల్లల్ని అందర్నీ పిలిచి, కేకు కట్ చేయించి మరీ ఖుషీ చేసుకున్నారు. అది చూసి పత్రికల వాళ్ళు కూడా వచ్చారు. దాంతో వేడుక మరింత రక్తి కట్టింది. అయోమయంగా చూసాడు జ్ఞానేశ్వర్.
‘ఇలాక్కూడా జరుగుతాయా?’ అన్నట్లు. ‘ఆంటీ గారూ! ఏమిటి? ఈ ఫంక్షను? మీ అబ్బాయి జ్ఞానం ఏ సబ్జెక్ట్‌లోనూ పాస్ కాలేదు కదా!. క్లాసు మొత్తానికీ ఏ సబ్జెక్ట్ పాస్ కానిది .. ఒక్క మన జ్ఞానం మాత్రమే కదా! ఇలాంటివాటికి కూడా డబ్బు ఖర్చు చేసి వేడుక చేస్తారా? ఎవరైనా?’ ఆశ్చర్యంగా అడిగారు పిల్లలు.
‘ఎవరి సంగతో మాకు ఎందుకయ్యా! పాస్ అయితేనే ఫంక్షన్లు చేసుకోవాలా? పరీక్ష ఫెయిల్ అయినవాళ్ళు మాత్రం చేసుకోకూడదా? సంతోషం ఎవరికైనా సంతోషమే. మా జ్ఞానం ఇప్పుడు కాకపోతే.. వచ్చేసారి పాస్ అవుతాడు. అనగననగ రాగామతిశయించునుండు .. తినగతినగ వేము తియ్యనుండు అన్నట్లు .. చదవగా .. చదవగా వాడే పాస్ అవుతాడు’ గట్టిగా సమాధానం చెప్పాడు జ్ఞానం తండ్రి.
‘అందుకు.. వెంటనే సంప్లిమెంటరీ పరీక్షకు కట్టి చదువుతాడు. వాడు ఆనందంగా ఉండడమే మాకు కావలసింది’ చెప్పింది తల్లి.
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కొడుక్కి దిశానిర్దేశం చేస్తున్నట్లు. అప్పుడు బుర్ర వెలిగింది జ్ఞానేశ్వర్‌కి. ముఖం వికసించింది. అవును. ‘నేను మళ్ళీ పరీక్ష ఫీజు కడతాను.. రాస్తాను. ఇక ఆత్మహత్యతో పనేముంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన పని ఏమిటీ?’ అనుకున్నాడు.
‘వార్తల్లో వార్తగా.. రేపు పత్రికలో ఇదీ రావాలి’ చెప్పాడు తండ్రి జ్ఞానానందరావు.
‘అలాగే’ అన్నట్లు తలూపాడు విలేకరి గుర్నాధం. అందుకు సంబధించిన పొటోలు ముందే తీసుకోవడంతో.. జ్ఞానం తేలికపడ్డాడు.
తన తోటివాళ్ళలాగే రేపు తన పేరు కూడా పత్రికల్లో వస్తున్నందుకు.
పి.ఎల్.ఎన్. మంగారత్నం
9701426788









కామెంట్‌లు (0)