mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమ్మ చెప్పింది

2 గంటల క్రితం

balala katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:31 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

​వేసవి సెలవులు పూర్తయ్యాయి. బడులు తెరుచుకుంటున్నాయి. అజయ్ మూడో తరగతి నుండి నాలుగో తరగతికి వచ్చాడు.

'అజయ్! రేపటి నుండీ నువ్వు బడికి వెళ్ళాలి` అమ్మ చెప్పింది.

ఈ వేసవి సెలవుల్లో అమ్మ చేతి గోరుముద్దలు తింటూ, రోజూ అమ్మ చెప్పే కమ్మని కథలను వింటూ, సాయంత్రం వేళల్లో ఇరుగుపొరుగు స్నేహితులతో దాగుడు మూతలు, కబడ్డీ ఆటలు ఆడుకుంటూ హాయిగా, ఆనందంగా గడిపేశాడు.

'అప్పుడే సెలవులు అయిపోయాయా?.... ప్చ్!` అనుకుంటూ నిట్టూర్చాడు.

'బడికి వెడితే, పగలంతా బడిలోనే ఉండాలి. టీచర్ చెప్పే పాఠాలు వినాలి. ఇంటికి వచ్చి హోమ్ వర్కులు చేయాలి. సెలవుల్లో ఈ బాధలుండవు` మనసులో అనుకున్నాడు. మొదటిరోజు రానే వచ్చింది.

'అజయ్ త్వరగా స్నానం చేసి రెడీగా. బడికి వెళ్ళాలి’ అమ్మ నిద్ర లేపుతూంది.

అజయ్ అమ్మ చెప్పినట్లుగా రెడీ కాగానే, అమ్మ వద్దకు వచ్చాడు.

'అమ్మా....` అంటూ పిలిచాడు.

'పుస్తకాల సంచీ పట్టుకోలేదే? మొదటి రోజు కదాని మర్చిపోయావా?` అమ్మ అజయ్ ను చూస్తూ అంది.

'కాదమ్మా... మరీ.. మరీ...`

'పూర్తిగా చెప్పరా. సందేహం దేనికి?` అమ్మ అంది.

'ఈ రోజు మొదటిరోజు కదమ్మా. పాఠాలు చెప్పరు. ఈ ఒక్కరోజూ ఆడుకుంటానమ్మా. రేపట్నుంచి మానకుండా బడికెళ్లిపోతాను` బతిమాలే ధోరణిలో అడిగాడు.

'అజయ్ బతిమాలడంతో అమ్మ మెత్తబడింది. రేపట్నుంచి మాత్రం క్రమం తప్పకుండా బడికి_ వెళ్ళాలి` అంది.

'అలాగేనమ్మా` అంటూ అజయ్ హుషారుగా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు తెల్లారింది.

'అజయ్! త్వరగా లే. బడికి వెళ్ళాలి` అంటూ అమ్మ నిద్ర లేపింది.

'అమ్మో! ఈ రోజు బడికి వెళ్లనంటే అమ్మ ఊరుకోదు. ఇప్పుడెలా? అజయ్ నిద్ర లేస్తూనే అనుకున్నాడు.

_కొంత సేపటికి అమ్మ దగ్గరకు వచ్చి, 'అమ్మా! ఈ రోజు శనివారం. రేపు ఆదివారం కనుక సెలవు. అందుకని ఈ రెండు రోజులూ ఆడుకుని, సోమవారం నుండి మాత్రం బడికి మానకుండా వెళ్లిపోతానమ్మా` అలవాటుగా బతిమాలడసాగాడు.

'అజయ్! రేపు అంటే లేదుకు పర్యాయ పదం. వాయిదా అనేది బద్దకానికి నేస్తం. నిన్న పోనీలే అని ఊరుకున్నాను. ఈ రోజు బడికి వెళ్లనంటే_ మాత్రం ఒప్పుకోను.` అమ్మ హెచ్చరింపుగా అంది.

'అమ్మా! ప్లీజ్, ఈ ఒక్కరోజే` అంటూ గదిలోకి దూరి మంచం ఎక్కాడు.

'మొండివాడు రాజు కన్నా బలవంతుడు. అజయ్ కు కథలంటే ఇష్టం కనుక, కథ చెప్పి వాడికి బడి మీద దృష్టి కలిగించాలి` అని అమ్మ మనసులో అనుకుంది.

'అజయ్! నీకో కథ చెప్పనా`_

'క..థా.!.. చెప్పమ్మా` అంటూ అమ్మ వద్దకు వచ్చాడు.

'నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ పేర్లు చెప్పు` అడిగింది.

'రాజు, రాము, సలీమ్` ఈ ముగ్గురంటే నాకు చాలా ఇష్టం` చెప్పాడు.

'అవునా, చిన్నప్పుడు నాకూ ఒక ఫ్రెండ్ ఉంది. పేరు లక్ష్మి. ఇద్దరమూ కలిసే బడికి వెళ్లేవాళ్ళం. కలిసి ఆడుకునేవాళ్ళం. చదువుకునే వాళ్ళం. లక్ష్మి నాకంటే బాగా చదివేది. పదో తరగతిలో జిల్లాకే ప్రథమస్థానం వచ్చింది. అప్పుడేమైందో, తెలుసా?` అంటూ అమ్మ ఒక్కసారిగా అజయ్ కేసి చూసింది.

'ఏమైందమ్మా? చెప్పమ్మా?`

అజయ్ ఆసక్తిని గమనించి అమ్మ చెప్పసాగింది.

'పదోతరగతి వరకూ చదివింది చాలును. ఆడపిల్లకు అంతకంటే చదువవసరం లేదు. పెళ్లీడురాగానే పెళ్లి చేసేస్తాను. అంతవరకూ ఇంట్లోనే బుద్ధిగా ఉంటూ, కుట్లు, అల్లికలు నేర్చుకో` అని లక్ష్మి వాళ్ళ నాన్న అన్నారు.

లక్ష్మి నాన్న మాటను ఎదిరించలేదు. కానీ చదువంటే చాలా ఇష్టం.

అందుకే 'నాన్నా! చదువయ్యాక నువ్వు చెప్పినట్లే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అప్పటివరకూ నన్ను_ చదివించు నాన్నా` నెమ్మదిగా బతిమలాడింది లక్ష్మి.

'మరి లక్ష్మి ఆంటీ మాటను_ వాళ్ళ నాన్న_ విన్నారా?`

అజయ్ ఉత్సుకతకు అమ్మ ఆనందించింది.

'వినలేదు అజయ్! చదివించలేదు. లక్ష్మీకి పెళ్లి చేసేసారు.

పెళ్ళయ్యాక బాధ్యతలు మీద పడటంతో లక్ష్మీకి చదవడం సాగలేదు.

తాను చదవలేనందుకు బాధపడటం మానేసింది. తన పిల్లల్ని బాగా చదివించడానికి ప్రయత్నిస్తోంది. పిల్లల చదువులో తనను చూసుకుంటూ మురిసి పోవాలనుకుంటోంది.`

'ఇప్పుడు లక్ష్మీ ఆంటీ ఎక్కడున్నారమ్మా?` అజయ్ ఆసక్తిగా అడిగాడు.

'ఆంటీని నీకు పరిచయం చేస్తాను. మరి రోజూ బడికి వెడతావా?` అమ్మ అడిగింది.

'ఓ! పిల్లలు బాగా చదవగానే సరిపోదు. పెద్దలు కూడా చదవడానికి సహకరించాలని ఆంటీ కథ ద్వారా తెలుసుకున్నాను. ఇంకెప్పుడూ బడి మానను` అన్న అజయ్ మాటలకు అమ్మ మురిసి పోయింది.

'అజయ్ నీకు ఇప్పుడే మా ఫ్రెండ్ లక్ష్మిని చూపిస్తాను పదఅం` టూ డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు అజయ్ ను తీసుకెళ్లింది. ఎదురుగా అద్దం ముందు అజయ్ ను నిలబెట్టి,

'అద్దంలో నీ వెనుక లక్ష్మి నిలబడి ఉంది, చూడు` అంది.

వెంటనే అజయ్ ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి, 'అమ్మా! లక్ష్మీ ఆంటీ అంటే నువ్వేనా?` అన్నాడు.

'అవును అజయ్! నా పూర్తి_పేరు సుధాలక్ష్మి. కానీ నన్నందరూ 'సుధా' అనే పిలుస్తారు` అంది నవ్వుతూ.

'అమ్మ చెప్పింది వింటాను. బడి మానకుండా చదువుకుంటాను` అన్నాడు అజయ్ ఆనందంగా.

'అజయ్ లో మార్పు మొదలైంది` అమ్మ అజయ్ కేసి మెచ్చుకోలుగా చూస్తూ చప్పట్లు కొట్టింది.


కె.వి.లక్ష్మణరావు

9014659041

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్