“అమ్మా.. నాన్న ఎప్పుడొస్తారు?” అన్న శశి మాటలకి. “వస్తారు నాన్న.. లీవ్ దొరకగానే వస్తారు.” కనుకొనల నుండి వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది శాంతి.
“ఎప్పుడూ ఇదే చెబుతున్నావు. నేను ఫోర్త్ క్లాస్ పాస్ అవ్వగానే వస్తారు అన్నావు. ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. ఇంకా ఎప్పుడొస్తారు?” అంటున్న శశితో.. “వస్తారు కన్నా.. స్కూల్ టైమ్ అవుతోంది పద!” అంటూ లంచ్ బాక్స్ బ్యాగ్ లో పెట్టి, శశి భుజానికి తగిలించింది. బేలగా చూస్తున్న వాడి వంక చూస్తూ వస్తున్న బాధని దిగమింగుకుంది శాంతి.
ఒక్కసారిగా ఆమె మనసు గతంలోకి నడిచింది.
“మీరెన్నన్నా చెప్పండి ఈ సంబంధం నేను ఒప్పుకోను.” అంది కాత్యాయిని.
“నీకేమన్నా మతి పోయిందా కాత్యాయినీ మంచి సంబంధం అంటే వినవే. అయినా ఆర్మీలో పనిచేసే అందరూ యుద్ధానికి వెడతారనుకోవడం అవివేకం. యుద్ధం అనేది
ఎప్పుడోగానీ రాదు. ముందు అది తెలుసుకో!” అన్నాడు విశ్వనాథం. లాసెన్స్ బే కాలానీలో నివాసం ఉంటున్న విశ్వనాథం ఒక్కగాని ఒక్క కూతురు శాంతి. బి.టెక్ పాస్ అయ్యింది. ఇక ఏదైనా జాబ్ చూసుకోవాలి అనుకుంటుండగా ఈ సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకు పేరు రాజేష్. ఆర్మీలో కల్నల్ హోదాలో పనిచేస్తున్నాడు. అతను తల్లి తండ్రులకు ఒక్కడే. ఆస్తి పరులు. అబ్బాయి ఒక్క ఆర్మీలో పనిచేస్తున్నాడు అన్నది తప్ప ఏ వంకా లేదు. అందుకే కీర్తి కి ఈడు జోడు అని ఆ సంబంధం వదులు కోవడం విశ్వనాథానికి ఇష్టం లేదు.
“సరే అబ్బాయి వచ్చాడట ఒకసారి చూడడానికి రమ్మందాం. నచ్చితే తరవాత చూడొచ్చు.” అన్నాడు విశ్వనాథం.
అయిష్టంగానే “సరే” అంది కాత్యాయిని.
“పెళ్లివారు వచ్చారు” అంటూ పరుగు పరుగున వచ్చి చెప్పాడు శాంతి చిన్నాన్న కొడుకు ప్రకాష్. చిన్నప్పటి నుండి శాంతి అంటే చాలా ఇష్టం అతనికి.
వైట్ ఇన్నోవా కారు ఇంటి ముందు ఆగింది. ముందుగా కిందకి దిగాడు కల్నల్ రాజేష్.
అబ్బో ఎంత ఎత్తు ఉన్నాడు. అతని పక్కన శాంతి పొట్టిగా ఉంటుందేమో అని గుస గుసలాడారు అక్కడికి వచ్చిన కొందరు ఆడవాళ్లు. తరువాత పెళ్లి కొడుకు తల్లి, తండ్రి దిగారు. లోపల వున్న బ్యాగ్ లు తీసుకుని ముందుగా నడుస్తున్నాడు పెళ్లి కొడుకు రాజేష్ మేనమామ. అతనే ఈ సంబంధం తెచ్చింది.
ఆర్మీలో పనిచేసే వారి తీరే వేరు. ఎంత దగ్గరగా వున్నా ముఖం లో భావాలు కనిపించవు. కొద్ది సీరియస్ గానే ఉన్నట్టు ఉంటుంది. దానికి విరుద్ధంగా నవ్వుతూ ఉన్నాడు
రాజేష్. శాంతికి బాగా నచ్చాడు. ఇద్దరూ విడిగా మాట్లాడుకున్నారు. తన గురించి మొత్తం చెప్పాడు రాజేష్. అతని దేశభక్తికి పులకించి పోయింది. ఒక్కగానొక్క కొడుకును దేశరక్షణకు పంపిన రాజేష్ తల్లి తండ్రులను చూసినప్పుడు తెలిసింది ‘జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి’ అన్న గీతం గుర్తుకు వచ్చింది.
అమ్మ వెనక్కు లాగినా శాంతి సరే అనడంతో ఆ సంబంధం ఒకే అయింది. పైగా ఇద్దరూ ఈడూ జోడు సరిపోయారు. అనుకున్న ముహూర్తంలో పెళ్లి ఘనంగా జరిగింది.
రాజేష్ కల్నల్ కనుక బందో బస్తీ, వచ్చిన మిలిటరీ మిత్రులు అబ్బ ఎంతో సందడి. తరువాత శశి పుట్టాడు. వాడి మొదటి బర్తడే అయ్యాకా రాజేష్ కి ఢిల్లీ ట్రాన్స్ఫర్
అయ్యింది. పెహల్గాం లో పాకిస్తాన్ ముష్కరుల దాడికి ప్రతిగా భారతదేశం నుంచి యుద్ధానికి వెళ్ళిన టీంకి కల్నల్ రాజేష్ సారథ్యం వహించాడు. పెల్లుబుకిన దేశభక్తి పోరాట పటిమతో రాజేష్ టీం విజయం సాధించింది. ఆ రోజు చీకటి పడడంతో నెమ్మదిగా వస్తున్న ఆర్మీ ట్రక్ పై ఉగ్రవాదులు మరలా దొంగదెబ్బ తీశారు. ఫలితం రాజేష్ తో పాటు మరో ఐదుగురు సైనికులు వీర మరణం పొందారు. విజయం సాధించి వస్త్తున్నాడు అనుకున్న భర్త విగత జీవుడై వచ్చాడు.
ఒక పెట్టెలో రాజేష్ మృత దేహం, దానిపై కప్పిన జాతీయ జండా. చుట్టూ విషణ్ణ వదనంతో మిలటరీ స్నేహితులు. ప్రభుత్వ లాంఛనాలు. అసలేం జరుగుతోందో తెలీని మనవడు శశి, మాట్లాడలేని కూతురు శాంతిని చూస్తూ అలా ఉండిపోయాడు విశ్వనాథం. మొదటిసారి తప్పు చేసానా అన్న అతని సందేహాన్ని.. అక్కడకి వచ్చిన ప్రజలు, అధికారులు, మిత్రులు అభిమానంతో కన్నీరు కార్చడం చూసాకా దేశం కోసం పోరాడిన తన అల్లుడు కీర్తి అజరామరం అనిపించింది. ఇక శాంతి అలా చూస్తూ ఉండిపోయింది.
***
ఫోన్ రింగ్ అవడంతో గతం నుండి బయటకి వచ్చింది శాంతి. కల్నల్ చోప్రా ఫోన్. “అమ్మా శాంతి ఎలా వున్నావు?” యు.పి. వాడైనా రాజేష్ బెస్ట్ ఫ్రెండ్ చోప్రా. తెలుగు నేర్చుకున్నది రాజేష్ దగ్గరే. “బావున్నా సార్” అంది శాంతి. అప్పటికే రాజేష్ చనిపోయి సంవత్సరం అయ్యింది.
“రాజేష్ కి భారత ప్రభుత్వం పరమ వీర చక్ర ప్రకటించింది. ఈ జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేస్తారు. నువ్వు తప్పక రావాలి. ఎవరెవరు వస్తారో చెబితే నేను ఫ్లైట్ టికెట్స్ ఎరేంజ్ చేస్తాను. ఇది ప్రతి సైనికుడి కి ఓ గొప్ప గౌరవం.” అంటూ కాసేపు మాట్లాడి, ఫోన్ పెట్టేసాడు.
అన్నయ్య ప్రకాష్ తోడు రాగా, శశిని తీసుకుని ఢిల్లీలో అడుగుపెట్టింది శాంతి. అంతా మౌనంగా ఆమెకు స్వాగతం పలికారు.
భారత రాష్ట్రపతి రాగానే అంతా మౌనంగా నిలుచున్నారు. ముందుగా ప్రార్థన, తరువాత భారత రాష్ట్రపతి ప్రసంగం అయిన తరువాత మూడో పేరుగా కల్నల్ రాజేష్ కు పరమ వీరచక్ర ప్రకటించారు. మౌనంగా రెడ్ కార్పెట్ మీదుగా నడిచి ఆ అవార్డు అందుకుంది శాంతి.
“అమ్మా .. అక్కడ డాడీ ఫొటోకి దండ వేశారు కదా!” అన్నాడు శశి.
అటు చూసి “అవును నాన్న” అంది శాంతి.
“దేవుడి దగ్గరకి వెళ్ళిన వాళ్ళకే దండ వేస్తారు కదా!” అన్నాడు అమాయకంగా.
“ఎవరు చెప్పారు?’’ అడిగింది శాంతి. “
‘‘మా సార్ చెప్పారు. బాధ పడకు అమ్మా నేను దేవుడి దగ్గరకి వెళ్లి నాన్నని తీసుకువస్తాగా!” అన్నాడు అమాయకంగా. వాడిని దగ్గరకు తీసుకుని, బాధ పడింది శాంతి.
***
కాలం గిర్రున తిరిగింది. శశి డాక్టర్ శశికాంత్ ఎం.ఎస్. ఆర్తోగా మారాడు. పెద్ద హాస్పిటల్ లో సీనియర్ డాక్టరుగా పేరు సంపాదించాడు.
“అమ్మా.. ఇక్కడ జాబు బోర్ కొడుతోంది, నేను ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. అక్కడ నాకు మేజర్ హోదా ఇస్తారట!” చెప్పాడు తల్లికి.
ఒక్కసారిగా పక్కన బాంబు పేలినట్లు ఉలిక్కిపడింది శాంతి. “ఏమిటి నువ్వు మాట్లాడేది?” అంది కోపంగా.
“కోపగించకు, నాన్న డైరీ చదివాను. ఆయన ఆశయాలు నాకు తెలుసు. పైగా నాన్నకు కల్నల్ చోప్రా రాసిన లెటర్ ద్వారా నాకు అన్ని విషయాలు తెలిసాయి.” అన్నాడు. “ఏం తెలిసాయి?’’ అంది శాంతి.
“సరైన సమయానికి వైద్యం అంది ఉంటే కల్నల్ రాజేష్ బతికేవారు అన్న ఆయన రాసిన మాటలు చూసిన తరువాత కూడా నేను ఇక్కడే వుండడం భావ్యం కాదు. నాన్నలా వైద్యం అందక ఏ సైనికుడూ మరణించకూడదు. సరైన సమయంలో వైద్యం అందితే ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించే
వారిని రక్షించుకోవడం మన బాధ్యత. అది నా తండ్రి ఆశయం కూడా. అది తీర్చ కలిగితే నాన్న తిరిగి వచ్చినట్టే ” అన్నాడు శశి.
ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడుతాడు. వాడిని మార్చడం కష్టం. అప్పుడే కల్నల్ చోప్రా దగ్గర నుండి ఫోన్. “చెల్లెమ్మా ఒక చిన్న మాట ఈ మధ్యనే జరిగిన ఒక సెమినార్ లో మా అమ్మాయి కీర్తి, శశిని చూసిందట. వీలుంటే నీతో మాట్లాడమంది. అన్నట్టు అమ్మాయి కూడా డాక్టర్. ప్రస్తుతం బాంబే మిలటరీలో హాస్పిటల్ లో డాక్టర్ గా సేవలందిస్తోంది. శశి కూడా మిలటరీలో జాయిన్ అవుతానని చెప్పాడట. పెళ్ళైతే ఇద్దరు ఇక్కడే బాంబేలో పనిచెయ్యొచ్చు” అన్నాడు.
‘‘ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఒకరికి ఇద్దరు తోడౌతున్నారన్న మాట!’’ అనుకుంది మనసులో.
“ఎవరమ్మా ఫోన్” అన్నాడు శశి. “ఇంకెవరు నీకు కాబోయే మామగారు మీ మిలటరీ మామయ్య చోప్రా. వాళ్ళమ్మాయి కీర్తి నీకు తెలుసట కదా!” అంది.
“అమ్మా అది..అది ..” అంటున్న శశితో “దీనికేరా నువ్వు మిలటరీలో చేరేది” అంది శాంతి.
“అది కాదమ్మా!” అంటూ నవ్వేసాడు శశి.
కూచిమంచి నాగేంద్ర
91821 27880.








కామెంట్లు (0)