ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆమె గెలిచింది.. !

6 రోజుల క్రితం

She won
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:40 పూర్వాహ్నం | 9 నిమిషాల చదవడం

ఉదయాన్నే గ్రామంలోని విశ్వకర్మ వీధి మేల్కొంది. కొలిమిలో మంటలు ఎగసిపడుతున్నాయి. సుత్తి దెబ్బలకు ఇనుము ఆకారాలు మార్చుకుంటోంది. ఆ శబ్దాల మధ్యలో పదెనిమిదేళ్ల శారద తన ఇంటి ముందర కూర్చొని పుస్తకం చదువుతోంది. ‘అమ్మా, ఇంకా చదువుతూనే ఉన్నావా?’ అని తల్లి లక్ష్మమ్మ పిలిచింది. ‘ఇంకో రెండు పేజీలు అమ్మా...’ శారద ఇంటర్ పూర్తిచేసింది. ఆమె చదువును చాలా ఇష్టం పడుతుంది. కానీ ఇంటి పరిస్థితులు, సమాజపు మాటలు ఆమెను వేరే దారి పడేస్తున్నాయి. ఆ రాత్రి తండ్రి రామయ్య చెప్పాడు. ‘లక్ష్మీ... పిల్లకి సంబంధం వచ్చింది. అబ్బాయి మంచివాడట.’ శారద చేతిలోని పుస్తకం ఒక్కసారిగా భారంగా అనిపించింది. ‘నాన్నా... నేను ఇంకా చదువుకోవాలి.’ అంది. రామయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. ‘నాకు తెలుసమ్మా!. కానీ మన పరిస్థితులు నీకు తెలుసు కదా తల్లీ’ అన్నాడు. శారద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘పెళ్లయినా చదువుకోవచ్చుగా నాన్నా?’ ఏదో అనుమానంగా, చదువు మీద తనకున్న ఆసక్తి వల్ల అడిగింది శారద. ‘అది అత్తింటి వాళ్ల మనసు మీద ఆధారపడి ఉంటుంది.’ ఆ మాట విన్నాక శారద గుండెలో ఒక చిన్న భయం వచ్చింది. తన ఆకాంక్షలను బుట్ట కింద దాచినట్టు అనిపించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల తల్లి దండ్రుల ఆలోచనకు తల వంచక తప్పలేదు శారద. కొన్ని నెలల్లోనే శారద పెళ్లి సాదాసీదాగా అయిపోయింది. తల్లి దండ్రులు ఒక బరువు దింపేసుకున్నామని అనుకున్నారు.

l l l

భర్త సురేష్ పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి రోజు అందరూ సరదాగా నవ్వుతున్నారు. కానీ శారద మనసులో మాత్రం ఒకే ప్రశ్న ఉంది. ‘నా చదువు ఇక్కడితో ముగిసిపోతుందా?’ అత్తింటి జీవితం మొదలైంది. ఉదయం నాలుగు గంటలకే లేవాలి. ఇల్లు ఊడవాలి. వంట చేయాలి. నీళ్లు తేవాలి. ఎవరైనా వచ్చినా టీ పెట్టాలి. రాత్రి అందరూ పడుకున్నాకే ఆమెకు విశ్రాంతి. ఒకరోజు పాత్రలు తోముతుండగా అత్త శారదను చూస్తూ, ‘ఇక పుస్తకాల సంగతులు మర్చిపోమ్మా. ఇల్లు చూసుకోవడమే నీ పని,’ అని కాస్త మూతి తిప్పుతూ అంది. అంతా కొత్త కదా. శారద నవ్వినట్టు మొఖం పెట్టింది. కానీ గుండెలో మాటలు మండుతున్నాయి. ‘ఒక అమ్మాయి పెళ్లయితే ఆమె కలలకూ పెళ్లి అయిపోతుందా?’. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా అనిపించింది శారదకు. భర్త సురేష్ మాత్రం మౌన స్వభావి. ఎక్కువ మాట్లాడడు. ఒకరోజు రాత్రి శారద ధైర్యం చేసి అడిగింది.

‘నాకు ఒక కోరిక ఉందండీ.’

‘ఏమిటి?’ అని అడిగాడు.

‘డిగ్రీ చదవాలి’. సురేష్ ఆశ్చర్యంగా శారద వైపు చూశాడు. ‘ఇన్ని పనుల మధ్య చదువుతావా?’

‘చదువుతాను’

‘అంత కష్టపడగలవా?’

‘కలల కోసం కష్టపడకపోతే అవి కలలుగానే మిగిలిపోతాయి.’ అంది. ఆ సమాధానం సురేష్‌ను ఆలోచింపజేసింది. మరుసటి రోజు తల్లి ముందు సురేష్ భార్య అభిప్రాయాన్ని చెప్పాడు.

‘అమ్మా... శారద డిగ్రీ చదవాలనుకుంటోంది.’ అత్త శారద వైపు కోపంగా చూసింది. ‘ఇంట్లో పనులు చాలవా?’

‘పనులు చేస్తూనే చదువుకుంటుంది.’

‘ఆడవాళ్లకు అంత చదువు ఎందుకు?’. శారద మౌనంగా నిలబడింది. కానీ సురేష్ మొదటిసారి భార్య పక్షాన నిలిచాడు.

‘చదువు ఎవరికైనా వృథా కాదు అమ్మా!’. ఆ మాట శారదకు గొప్ప ధైర్యం ఇచ్చింది. అలా డిగ్రీలో చేరింది. పగలు ఇంటి పనులు. రాత్రి చదువు. అందరూ నిద్రపోయిన తర్వాత చిన్న దీపం వెలుగులో పుస్తకాలు పట్టుకొని రాసుకునేది. కొన్నిసార్లు అలసటతో కళ్లే మూసుకుపోయేవి. కానీ ఆమె కలలు మేల్కొలిపేవి. ఒకరోజు బంధువులు వచ్చారు. ‘మీ కోడలు ఇంకా చదువుతోందట!’, ‘టీచర్ అవుతుందేమో!’ అని వెటకారంగా నవ్వారు. మరొకరు, ‘ఇవాళ చదువు అంటుంది. రేపు ఉద్యోగం అంటుంది.’ అన్నారు. అందరూ ముసిముసిగా నవ్వారు.

శారద మాత్రం మౌనంగా విన్నది. ఆ రాత్రి శారద కళ్ళల్లో కన్నీళ్లు టపటపా రాలాయి. సురేష్ దూరం నుంచే ఆ దృశ్యం చూశాడు.

‘ఎందుకు ఏడుస్తున్నావు?’

‘నన్ను చూసి నవ్వుతున్నారు మీ బంధువులు’ అంది. సురేష్ చిరునవ్వు నవ్వాడు. ‘నేడు నవ్వేవాళ్లు రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు. బాధపడకు’ అన్నాడు. ఆ మాట ఆమెకు కొత్త శక్తి ఇచ్చింది. మూడేళ్లు గడిచాయి. డిగ్రీ ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ క్లాస్ లో శారద పాస్‌ అయింది. ఆ రోజు శారద ఆనందంతో ఏడ్చింది. తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా, నేను పాస్ అయ్యాను.’ అవతల రామయ్య గొంతు కంపించింది. ‘నువ్వు నా గర్వం తల్లీ’ అన్నాడు.

డిగ్రీ పూర్తయిన కొన్ని రోజుల్లో శారద మరో నిర్ణయం తీసుకుంది. ‘నేను బీఈడీ చదువుతాను,’ అని భర్తతో చెప్పింది. అత్త అసహనం చూపించారు.

‘ఇంకా చాలదా?’ అన్నట్లు చూసింది. కానీ ఈసారి శారద వెనక్కి తగ్గలేదు. ‘ఇది నా చివరి మెట్టు కాదు అత్తయ్య. ఇది మొదటి మెట్టు మాత్రమే.’ ఆమె కళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూసి ఎవరూ మాట్లాడలేకపోయారు.

l l l

బీఈడీ కాలేజీ మొదటి రోజు. అక్కడ తనలాంటి ఎంతోమంది మహిళలను చూసింది. కొందరు పెళ్లి తర్వాత చదువుతున్నారు. కొంతమంది పిల్లల్ని చూసుకుంటూ చదువుతున్నారు. అప్పుడే శారదకు ఇది అర్థమైంది. ‘నేను ఒక్కదాన్నే పోరాటం చెయ్యటం లేదు. నాలాంటి వేలాది మహిళల కలల కోసం కూడా పోరాడుతున్నాను.’ తనను తాను ధైర్యపరుచుకుంది. ఆ ఆలోచనతో ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. బీఈడీ కాలేజీలో మొదటి రోజు శారద జీవితంలో ఒక కొత్త వెలుగు తీసుకొచ్చింది. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, బంధువుల మాటలు. అన్నింటి మధ్య చదువుకోవడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. కానీ తనలాంటి మహిళలను చూసిన తర్వాత ఆమె సంకల్పం మరింత బలపడింది. కాలేజీలో లెక్చరర్ విజయలక్ష్మి తరచూ చెప్పే మాట శారద మనసులో నిలిచిపోయింది. ‘విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు. మనిషి తనను తాను గుర్తించుకోవడానికి కూడా అవసరం.’

ఆ మాటలు ఆమె ఆలోచనలకు కొత్త దారులు చూపించాయి. ఒక రోజు శారద కాలేజీ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. అత్త కోపంగా ఎదురుచూస్తున్నారు. ‘ఇప్పుడా రావడం? ఇంట్లో పనులు ఎవరు చేయాలి?’ అని అడిగింది. శారద నెమ్మదిగా సమాధానం చెప్పింది. ‘ప్రాక్టికల్స్ ఉండిపోయాయి అత్తయ్యా!.’

‘చదువు పేరుతో ఇంటిని మర్చిపోతే ఎలా?’ అంది అత్త. ఆ మాట శారద గుండెల్లో ముల్లులా గుచ్చుకుంది. కానీ ఈసారి సురేష్ మాట్లాడాడు.

‘అమ్మా, ఆమె ఇంటి కోసం ఎంత కష్టపడుతోందో మనం చూస్తూనే ఉన్నాం కదా. అత్తగారు ఏమీ మాట్లాడలేదు. కొడుకు మాటకు శారద మాత్రం భర్త వైపు కృతజ్ఞతగా చూసింది. సంవత్సరాలు గడిచాయి. ఎట్టకేలకు బీఈడీ పూర్తయింది. ఇప్పుడు ఆమె లక్ష్యం ఒక్కటే. టీచర్ ఉద్యోగం. ఉదయం నాలుగు గంటలకు లేచి చదువుతుండేది. రాత్రి అందరూ పడుకున్నాక మళ్లీ పుస్తకాలు తెరిచి, ఓపిక లేకున్నా ఒక యుద్ధం చేసేది. శారద విషయంలో అన్నీ త్వరగా జరిగాయి. ఆమె పిల్లలు కూడా పెరుగుతున్నారు. పిల్లలను చూసుకుంటూనే శారద తన లక్ష్యంపై దృష్టి పెట్టింది. ఒక రోజు కుమార్తె చిన్నగా అడిగింది. ‘అమ్మా! నువ్వు కూడా పరీక్షలు రాస్తావా?’ అని.

శారద నవ్వింది. ‘అవును అమ్మా.’

‘అయితే నువ్వూ స్టూడెంట్‌వేనా?’

‘అవును తల్లీ, నేర్చుకోవడానికి వయసు ఉండదు.’

ఆ చిన్న ప్రశ్న ఆమెకు పెద్ద ప్రేరణగా మారింది. డీఎస్సీ ఉద్యోగ పరీక్ష రోజు వచ్చింది. పరీక్ష హాల్లో కూర్చుంది. ప్రశ్నాపత్రం చూసిన వెంటనే ఆమెకు తన జీవితం కళ్లముందు తిరిగింది. కొలిమిలో మంటలు. తండ్రి కష్టం. అత్తింటిలో ఉన్న బాధలు. రాత్రి చదివిన రోజులు. అన్నీ గుర్తుకొచ్చాయి. ‘ఇది కేవలం పరీక్ష కాదు. ఇది నా జీవిత పోరాటం.’ అని మనసులో అనుకుంది. నమ్మకంతో రాసింది. కొన్ని నెలల తర్వాత ఫలితాలు వచ్చాయి. శారద ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నియామకం అయింది. ఆ వార్త విన్న వెంటనే ఆమె కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి.

సురేష్ చేతిని పట్టుకుంది.. ‘మన కల నిజమైందండీ’ అంది.

సురేష్ ప్రేమగా శారదను దగ్గరకు తీసుకున్నాడు. ఓ స్నేహితుడిగా భుజం తడుతూనే, ‘నీ కల నిజమైంది. నేను కేవలం నీతో నడిచాను అంతే.’ అన్నాడు.

l l l

మొదటి రోజు స్కూల్‌కు వెళ్లినప్పుడు పిల్లలు ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అంటూ అంతా నిలబడ్డారు. ఆ రెండు మాటలు ఆమెకు జీవితకాల పురస్కారంలాగా అనిపించాయి. విద్యార్థులను చూసి సంతోషపడింది. ఒకప్పుడు తనను ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు ‘శారద చాలా పట్టుదల గల అమ్మాయి.’ అంటున్నారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రయాణం ఆగలేదు. ఒకరోజు పాఠశాలలో ఓ బాలిక ఏడుస్తూ కనిపించింది.

‘ఏమైంది అమ్మా?’ అని శారద అడిగింది.

‘నాన్న చదివించను అంటున్నారు టీచర్’ అంది. ఆ మాట విన్న శారద మనసు బాధపోయింది. ఆ బాధను తాను కూడా అనుభవించింది కాబట్టి.

ఆ రోజు నుంచి ఆమె మహిళా విద్య, బాలికల చదువు గురించి సభల్లో మాట్లాడటం ప్రారంభించింది. అంతలోనే ఆమె మనసులో ఒక ఆలోచన కలిగింది. మనసులోని విషయాలన్నీ, తన అనుభవాలను అక్షరాలుగా మార్చి, రాయాలనుకుంది. వాటిని పది మంది చదవాలనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే, ఆ రాత్రి డైరీ తీసుకుంది. మొదటి కవితను ప్రారంభించింది. శీర్షిక: "అరచేతిలో ఆకాశం". ఆ కవితను స్థానిక పత్రికకు పంపింది. వారు ముద్రించారు. ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి.

‘శారదా, నీ కవిత చదివాను.’ అని ఒక రోజు హెడ్‌మాస్టర్ చెప్పారు. ‘చాలా బాగుంది.’ ఆ ప్రశంస ఆమెకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. తర్వాత కథలు రాసింది. వ్యాసాలు రాసింది. మహిళల జీవితాలపై పలు రచనలు చేసింది. అనుభవాలు ఆమెకు పాఠం నేర్పాయి. ఇవే ఆమెకు వెలుగు దారులు చూపించాయి. ఒకసారి జిల్లా స్థాయి సాహిత్య సభకు ఆహ్వానం వచ్చింది. శారద వేదికపై మాట్లాడింది. మొదట ఆమె కొంచెం భయపడింది. కానీ మైక్ ముందు నిలబడి ధైర్యంగా చెప్పింది. ‘స్త్రీకి అవకాశం ఇస్తే ఆమె కుటుంబాన్ని గెలిపిస్తుంది. సమాజాన్ని గెలిపిస్తుంది.’ సభ హర్షధ్వనులతో మార్మోగింది. అప్పటి నుంచి శారద పేరు జిల్లా అంతటా వినిపించడం ప్రారంభమైంది. రచయిత్రిగా గుర్తింపు పెరిగింది. పత్రికల్లో ఆమె కథలు, కవితలు తరచూ ప్రచురితమవుతున్నాయి. ఒక రోజు ఇంటికి వచ్చిన బంధువు ఆశ్చర్యంగా చూస్తూ, ‘అరే, పేపర్లో వచ్చిన శారద నువ్వేనా?’ అన్నాడు. శారద నవ్వింది. సంవత్సరాల క్రితం తనను వెక్కిరించిన వ్యక్తే ఇప్పుడు అభినందిస్తున్నాడు. ఇది కాలం ఇచ్చిన సమాధానం. కానీ శారదకు ఇంకా ఒక పెద్ద కల ఉంది. కేవలం రచయిత్రిగా కాదు, మహిళల చైతన్యానికి వేదికగా నిలవాలి. అక్షరాలను ఆయుధాలుగా మార్చాలి. ఆ ఆలోచనతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది.

l l l

ఉపాధ్యాయురాలిగా, రచయిత్రిగా శారద జీవితం కొత్త దిశలో సాగుతోంది. కానీ ఆమె మనసులో ఒక ప్రశ్న పదేపదే మెదులుతోంది.

నా జీవితాన్ని మార్చిన విద్య, నా ఆలోచనలను మార్చిన సాహిత్యం, మరెందరో మహిళల జీవితాల్లో వెలుగు నింపలేవా? ఆ ఆలోచనే ఆమెను మరో గొప్ప నిర్ణయం వైపు నడిపించింది. ఒక సాయంత్రం ఇంటి మేడపై కూర్చొని పత్రిక చదువుతోంది. అందులో మహిళలపై జరిగిన అన్యాయాల వార్తలు కనిపించాయి. ఆమె నిట్టూర్చింది. సురేష్ గమనించాడు. ‘ఏమైంది?’ ఆతృతగా అడిగాడు. ‘ఎంతో మంది మహిళలు తమలోని శక్తిని గుర్తించకుండానే జీవితాన్ని గడిపేస్తున్నారు.’

‘అయితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు?’

కొద్దిసేపు మౌనం. తర్వాత శారద నెమ్మదిగా ‘మహిళల కోసం ఒక సాహిత్య మాసపత్రిక ప్రారంభిస్తాను’ అంది. సురేష్ ఆశ్చర్యపోయాడు.

‘పత్రికా?’

‘హా..’

‘అవును. వారి సమస్యలు, విజయాలు, సాహిత్యం, చైతన్యం అన్నీ అందులో ఉంటాయి,’ అంది. సురేష్ చిరునవ్వు నవ్వాడు.

‘నీ కలలకి హద్దులే లేవు,’ అంటూ ఓ సెటైర్ వేశాడు. భార్య ఆలోచనల్ని స్వాగతిస్తూనే..

‘కలలకు హద్దులు పెడితే అవి కలలు కావు,’ అంది మనో నిబ్బరంతో. కొన్ని నెలల కృషి తర్వాత మొదటి సంచిక వెలువడింది.

పత్రిక పేరు ‘నవచైతన్యం’ ముఖచిత్రంపై పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది. స్త్రీ నిలబడితే కుటుంబం నిలుస్తుంది. స్త్రీ ఎదిగితే సమాజం ఎదుగుతుంది.

మొదటి సంచికను చేతిలో పట్టుకున్నప్పుడు శారద కళ్లలో ఆనందం కనిపించింది. తన మొదటి కవిత ప్రచురితమైనప్పుడు కలిగిన ఆనందం కంటే ఇది తనకు ఎక్కువగా అనిపించింది. ఇది అతని ఒక్కరికి మాత్రమే చెందిన విజయం కాదు. చాలా మంది మహిళలు తమ స్వరాలను వినిపించడానికి ఇది వేదిక. మెల్లగా పత్రికకు ఆదరణ పెరిగింది. పల్లెల్లో కూడా, పట్టణాల్లో కూడా మహిళలు తమ రచనలు పంపడం ప్రారంభించారు. ఒకరోజు ఓ వృద్ధ మహిళ లేఖ రాసింది. ‘అమ్మా, నేను అరవై ఏళ్ల వయసులో మొదటిసారి కవిత రాశాను. నీ పత్రికే నాకు ధైర్యం ఇచ్చింది.’ అంటూ. ఆ లేఖను చదివిన తర్వాత శారద కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. ‘ఇదే నా అసలు బహుమతి’ అని అనుకుంది. ఉదయం స్కూల్, సాయంత్రం ఇంటి పనులు. రాత్రి రచనలు.

మధ్యలో పిల్లల చదువులు ఉన్నాయి. ఒక రోజు కుమారుడు అడిగాడు. ‘అమ్మా, నువ్వు అలసిపోవా?’ అని. శారద నవ్వింది. ‘ప్రేమతో చేసే పనికి అలసట ఉండదు నాన్న’ అంది. కాలం గడిచింది. పిల్లలు పెద్దయ్యారు. చక్కగా చదువుకున్నారు. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారి పెళ్లిళ్లు కూడా చాలా ఘనంగా జరిగాయి. పెళ్లి మండపంలో కూర్చున్న శారదను చూసి బంధువులు ‘నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి’ అన్నారు. అప్పుడు సురేష్ నవ్వుతూ ...‘అదృష్టం కాదు. ఆమె కష్టం’ అన్నాడు. ఆ మాట విని ఈసారి శారద కళ్లలో ఆనందబాష్పాలు ముత్యాల్లా రాలాయి.

ఇప్పుడు సాహిత్య రంగంలో ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కథా సంపుటాలు వెలువడ్డాయి. కవితా సంపుటాలు వచ్చాయి. ఆమె రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందింది. ఒకసారి రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆమెను ముఖ్య అతిథిగా పిలిచారు. సభ మందిరం నిండిపోయింది. వేదికపైకి వచ్చిన శారదను అందరూ నిలబడి చప్పట్లతో స్వాగతించారు. మైక్ ముందు నిలబడి ఆమె మాట్లాడటం ప్రారంభించింది. ‘ఒకప్పుడు...’ అని ఆగింది. భావోద్వేగాన్ని అణుచుకుంటూ.. ‘ఒకసారి నాకు కూడా ‘‘నీకు ఏమీ చేతకాదు’’ అన్నారు. సభలో మౌనం ఏర్పడింది. "పెళ్లయిన అమ్మాయి చదువుకోవడం ఎందుకు’’ అని చెప్పారు. ‘‘ఉద్యోగం చేస్తావా’’ అని అపహాస్యం చేశారు. "రాస్తావా అన్నారు." "పత్రిక నడుపుతావా అన్నారు." "కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ".. ఆమె స్వరం గంభీరంగా మారింది. "స్త్రీని ఎవరూ ఆపలేరు. ఆమెను ఆపేది ఆమె భయమే." హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. సభ ముగిసిన తర్వాత ఒక యువతి ఆమె దగ్గరకు వచ్చింది. "మేడమ్..." "చెప్పమ్మా." అంది శారద

నేను కూడా చదువు మానేయాలని అనుకున్నాను. కానీ మీ జీవితాన్ని గురించి విని, నా నిర్ణయం మార్చుకున్నాను. శారద ఆమె భుజంపై చేయి వేసింది. నీ గెలుపే నా గెలుపు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక మేడపై కూర్చొని ఆకాశాన్ని చూస్తోంది. సురేష్ వచ్చి పక్కనే కూర్చున్నాడు.

‘ఏమి ఆలోచిస్తున్నావోయ్?’ అన్నాడు.

శారద చిరునవ్వు నవ్వి ‘జీవితాన్ని,’ అంది.

‘సంతోషంగా ఉందా?’

‘చాలా’

‘అయితే ఇక గెలిచినట్టే కదా?’ శారద మెల్లగా తల ఊపింది.

‘లేదు’

‘ఇంకా గెలవాల్సింది ఏమైనా ఉందా?’

‘నేను కాదు సురేష్...’ అంది.

‘అయితే?’

‘నాలాంటి ప్రతి మహిళ గెలిచిన రోజే నా గెలుపు పూర్తవుతుంది.’ అప్పుడే ఆమె ఫోన్ మోగింది. ఒక సాహిత్య సంస్థ నుంచి కాల్.

‘అమ్మా, ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారానికి మిమ్మల్ని ఎంపిక చేశాం.’ శారద కాసేపు మాట్లాడలేకపోయింది. ఫోన్ పెట్టేసి నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసింది. ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు. తల్లి గుర్తొచ్చింది. కొలిమి మంటలు గుర్తొచ్చాయి. చిన్న దీపం వెలుగులో చదివిన రాత్రులు గుర్తొచ్చాయి. తనను వెక్కిరించినవాళ్లు గుర్తొచ్చారు. తనను నమ్మిన భర్త గుర్తొచ్చాడు. అన్నీ కళ్లముందు మెరిశాయి. మరుసటి రోజు పురస్కార వేదికపై ఆమెను సత్కరించారు. వేలాది మంది నిలబడి చప్పట్లు కొట్టారు. అప్పుడే సభలోని మొదటి వరుసలో కూర్చున్న ఒక వృద్ధురాలు తన పక్కవారితో ఇలా అంది. "ఆమె గెలిచింది." అని. నిజం ఏమిటంటే...!? ఆమె ఒక్కరే గెలవలేదు. ఒక అమ్మాయి కల గెలిచింది.. ఒక భార్య పట్టుదల గెలిచింది.. ఒక తల్లి బాధ్యత గెలిచింది.. ఒక ఉపాధ్యాయురాలి సేవ గెలిచింది.. ఒక రచయిత్రి అక్షరం గెలిచింది.. ఒక మహిళ ఆత్మవిశ్వాసం గెలిచింది.. అవును.. ఆమె గెలిచింది..!

డా.కటుకోఝ్వల రమేష్

9949083327

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్