సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాప నవ్వింది..

25 అక్టోబర్, 2026

The baby smiled..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:47 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

"అమ్మ.. అమ్మా.. భయమేస్తోంది. నేను.. నేను.. స్కూల్ " నిద్రలో వణుకుతూ కలవరిస్తోంది శృతి. దిగ్గున లేచి లైట్ వేసి శృతిని ఒడిలోకి తీసుకుంది వసుంధర. పాప ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి ఉంది. చిగురుటాకులా వణుకుతోంది. కన్నబిడ్డను ఆ స్థితిలో చూసిన వసుంధర ఆందోళనతో శ్రీకాంత్ ని తట్టి లేపింది. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ ఆడుకునే పిల్ల. తరగతిలో అందరికంటే ముందుండే తమ చిట్టితల్లి వారం నుండి జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉండడం చూసి, తల్లడిల్లిపోయారు వాళ్ళిద్దరూ. జ్వరంతోపాటు నిద్రలోనే ఉలిక్కిపడడం, ఏవేవో అర్ధంకాని కలవరింతలతో స్కూల్ కి పోవడం లేదు శృతి. ఫస్ట్ క్లాస్ చదువుతోంది. డాక్టర్ కి చూపించి, పాప పరిస్థితి వివరించారు. శృతిని పరీక్షించిన డాక్టర్ "పాప ఎందుకో భయపడుతోంది. స్కూల్ లో టీచర్ ఎవరైనా బెదిరించడం లేదా కొట్టడం లాంటివి చేశారేమో. ఆ విషయాన్నీ సరిగా చెప్పలేకపోతోంది. లేదా మీకు చెప్పడానికి భయపడుతున్నట్లుంది. పాపకు మందులతో పాటు తల్లిదండ్రులుగా మీ కేరింగ్ చాలా అవసరం" అని చెప్పారు డాక్టర్ నీలిమ.

వసుంధర వారం ఆఫీస్ కి సెలవు పెట్టి చూసుకుంది. ఆ తర్వాత రెండు రోజులు శ్రీకాంత్ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. శృతికి సమయానికి మందులు ఇవ్వడం, అన్నం పెట్టడం దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఇంట్లో అమ్మ, నాన్నల ప్రేమ, సంరక్షణలో శృతికి జ్వరం పూర్తిగా తగ్గింది. కానీ హఠాత్తుగా భయపడడం, నిద్రలో కలవరించడం మాత్రం తగ్గలేదు. అయితే అసలు చిక్కు ఇప్పుడే మొదలైంది. ఆ రోజు పొద్దున శృతిని స్కూలుకి పంపాలనుకుని స్నానం చేయించాక బీరువాలో నుంచి యూనిఫామ్ డ్రెస్ ని తీసింది. ఆ డ్రెస్ ని చూడగానే, శృతి ముఖంలో భయం కదలాడింది. క్షణాల్లో ముఖం చెమటతో తడిచిపోయింది. "అమ్మా.. నేను స్కూలుకి పోను. ఇంట్లోనే ఉంటాను. నువ్వూ ఆఫీస్ కి వెళ్ళకు. నాతోనే ఉండు" అంది.. తన చిట్టి చేతులను ఊపుతూ. "మా బుజ్జితల్లివి కదా. ఈ రోజు పొద్దున స్కూల్ వ్యానులో వెళ్ళు. సాయంత్రం నేనొచ్చి, నిన్ను స్కూటీపై ఇంటికి తీసుకొస్తా" అంది లంచ్ బాక్స్ సర్దుతూ. "నేను స్కూల్ కి వెళ్ళను. ప్లీజ్ అమ్మా" శృతి మెల్లగా ఏడుపు ఎత్తుకుంది. "ఎందుకో స్కూల్ అంటేనే శృతి భయపడుతోంది. ఈ రోజుకి ఇంట్లోనే ఉంటుందిలే. నేను ఉంటాను శృతికి తోడుగా. నువ్వు ఆఫీస్ కి వెళ్ళు" అన్నాడు శ్రీకాంత్. ఆ మాట వినంగానే శృతి ముఖంలో వెలుగు వచ్చింది. జాగ్రత్తలు చెప్పి, ఆఫీస్ కి వెళ్ళింది వసుంధర. శృతిని ఆడిస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్. సాయంత్రం ఇద్దరి ఫోన్లకు "ఇంకో రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతాయి. శృతిని స్కూల్ కి పంపండి" అని శృతి క్లాస్ టీచర్ చేసిన మెసేజ్ పంపారు.

"శృతీ! ఈ రోజు నువ్వు స్కూలుకి పోవాలి తల్లి. రెండ్రోజుల్లో ఎగ్జామ్స్ మొదలవవుతాయట" యూనిఫామ్ తీస్తూ అంది వసుంధర. "అమ్మా.. నేను ఎగ్జామ్స్ రాయను. స్కూలుకి పోను. ఇంట్లోనే ఉంటా!" మళ్ళీ మొదలుపెట్టింది శృతి. "ఇలా పేచీ పెడితే ఎలా శృతి? స్కూల్ లో ఎవరైనా టీచర్ నిన్ను కొటా్టరా చెప్పు? నేను వచ్చి అడుగుతాను" అనునయంగా శృతికి యూనిఫామ్ వేయసాగింది. "పాప ఎందుకు భయపడుతోందో మెల్లగా అడిగి తెలుసుకోండి" అని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తుకొచ్చాయి వసుంధరకి. అప్పుడే సెల్ ఫోన్ మ్రోగింది. "హలో వసుంధర గారు. నేను మీ శృతి ఫ్రెండ్ మౌనిక వాళ్ళమ్మని. శృతి స్కూలుకు రావడంలేదని మా మౌని చెప్పింది. తనూ స్కూలుకి పోనని పేచీ పెడుతోంది. పోనీలే అని రెండురోజులు పంపలేదు. ఈ రోజు యూనిఫామ్ వేస్తుంటే ఏడుస్తోంది స్కూలుకి పోనని. గట్టిగా అరిస్తే బెదిరిపోతోంది. ఎందుకో స్కూల్ అంటే భయపడుతున్నారు వీళ్ళు. ఏమైందో వీళ్ళకి. నాకు కంగారుగా ఉంది. ఈ రోజు స్కూల్ కి వెళ్ళి కనుక్కోవాలనుకుంటున్నాను. మీరేమైనా వస్తారా?" అని అడిగిందావిడ.

"అవునా. శృతి కూడా స్కూల్ అంటే ఎందుకో భయపడుతోంది. నేనూ ఈ రోజు స్కూల్ కి వస్తానండి. తప్పకుండా కనుక్కుందాం" అని ఫోన్ కట్ చేసింది వసుంధర. తల్లి మాటలు విన్న శృతి కళ్ళల్లో భయం. "అమ్మా! ప్లీజ్ నువ్వు రావొద్దమ్మా. నేనూ స్కూల్ కి పోను. నువ్వొస్తే చంపేస్తాడు" వణికిపోతూ అంది శృతి. "ఎవరు శృతి ? ఎందుకు చంపుతారు?" వసుంధర అనునయంగా అడిగింది. శృతి ఏం చెప్పలేక వెక్కుతోంది. శృతిని ఒళ్ళోకి తీసుకుని ఓదారుస్తూ "ఎందుకు తల్లీ! అంత భయం. ఎవరు చంపుతానన్నారు? నాకు చెప్పు. నేను వెళ్ళి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇస్తాను. నీకేం భయం లేదు. నిన్ను ఎవరూ ఏమనకుండా నేను చూసుకుంటాను.. సరేనా" శృతి ముద్దాడుతూ అంది వసుంధర.

"అమ్మా.. మరేమో.. మరేమో.. వ్యాను అంకుల్ లేడు" కళ్ళు పెద్దవి చేసి అంది శృతి. " వ్యాను డ్రైవర్ బాబ్జీనా?" ఆందోళనగా అడిగింది వసుంధర. "హా..ఆ అంకులే అమ్మా. ఇంటెర్వెల్ తర్వాత నేను టాయిలెట్ కి వెళితే.. అక్కడేమో వ్యాను అంకుల్ నాకిష్టమైన డైరీమిల్క్ ఇచ్చాడు. నేను తింటుంటే.." ఇంట్లోకి రాబోయిన శ్రీకాంత్ శృతి ఏం చెప్తుందా అని గుమ్మం దగ్గరే ఆగిపోయాడు చప్పుడు చేయకుండా. "తర్వాత ఏమైంది చెప్పు శృతీ" వసుంధర కళ్ళల్లో ఆందోళన. "మరేమో. అంకుల్ నా దగ్గరకి వచ్చి బుగ్గలు కొరికాడు. సుస్ పోసుకునే దగ్గర చెయ్యిపెట్టి...." శృతి చెప్తున్న మాటలు విని గట్టిగా గుండెలకి హత్తుకుంది వసుంధర. శ్రీకాంత్ దవడ కండరం బిగుసుకుంది. అప్పటికప్పుడు వ్యాను డ్రైవర్ బాబ్జీని చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. "చాలా నొప్పి అమ్మా ఇక్కడ. నువ్వు అప్పుడప్పుడూ చెప్తావు కదా నాకు. ఎవరైనా బుగ్గలు, భుజాలు టచ్ చేస్తే.. వాళ్ళు బాడ్ అని.. వ్యాను అంకుల్ బాడ్‌ అమ్మా!" వణుకుతూ, ఏడుస్తూ తల్లిని అల్లుకుపోయింది శృతి. బిడ్డ మాటలకు వణికిపోయింది వసుంధర. శృతిని గుండెల్లో పొదువుకుంది. నెమ్మదిగా శృతి తలనిమురుతూ "ఎప్పుడు అలా చేసాడు నిన్ను? నాకెందుకు చెప్పలేదు నువ్వు" అంది దుఃఖాన్ని అదిమిపెట్టి. "చాలాసార్లు అమ్మా. నీకు చెప్తే నిన్ను, నన్నూ చంపుతానన్నాడు. నాకు భయం వేసి నీకు చెప్పలేదు" అమాయకమైన ఆ పసిమొగ్గ ఎదుర్కొన్న ఆ కిరాతక చర్యకు ఆ దంపతుల మనసులు విలవిల్లాడాయి.

శ్రీకాంత్, వసుంధరల ద్వారా విషయం తెల్సుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి నివ్వెరపోయారు. "తమ స్కూల్ లో ఇంతటి దారుణం జరుగుతుంటే.. ఇంతవరకు ఒక్కరైనా కంప్లైంట్ ఇవ్వలేదు. చాలారోజుల నుంచి స్కూల్ లో వ్యాను డ్రైవర్ గా చేస్తూ, నమ్మకస్తుడిగా ఉన్న అతనిపై ఎలాంటి అనుమానం రాలేదన్నారు". పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేముందు మనమే అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. శృతి చెప్పినదాని ప్రకారం టాయిలెట్ దగ్గర సి.సి. కెమెరా ఫుటేజ్ చూద్దామని కంప్యూటర్ ఆన్ చేశారు. సి.సి. కెమెరాలో ఏం రికార్డు కాలేదు. అంతా నల్లగా ఉంది. టాయిలెట్ దగ్గరకెళ్ళి చూస్తే, సి.సి. కెమెరా పగిలిపోయి ఉంది. ఆ వెధవ చేసిన పనే అయివుంటుందని.. స్కూల్ లో ఏం జరుగుతోందో తెలుసుకోలేని చీకట్లో ఉన్నాం" అంటూ ప్రిన్సిపాల్ బాధపడ్డారు. ప్రతిక్షణం వాడి కదలికలను కనిపెట్టి, రెడ్ హ్యాండెడ్ గా ఆ వెధవను పట్టుకోవాల"ని నిర్ణయించుకున్నారు.

లాస్ట్ ట్రిప్‌ లో పిల్లలను తీసుకువచ్చిన డ్రైవర్ బాబ్జీ, వ్యానుని పార్కింగ్ స్థలంలో పెట్టి, టిఫిన్ తిన్నాడు. తనతో పాటు ఉన్న కుర్రాడిని ఇంటికి పంపేశాడు. తర్వాత తాపీగా సిగరెట్టు తాగుతూ కూర్చున్నాడు. నెమ్మదిగా సీట్ మీదకు వాలి ఓ కునుకు తీసాడు. ఇంటెర్వెల్ బెల్ మ్రోగడంతో లేచాడు. పిల్లలందరూ వాష్ రూమ్స్ దగ్గరకు వెళ్ళి, మళ్ళీ క్లాసులలోకి వెళ్ళిపోయారు. బాబ్జీ మెల్లగా వ్యాను దిగి వాష్ రూమ్ వైపు నడిచాడు. అతని చేతిలో ఫైవ్ స్టార్ చాక్‌లెట్లు ఉన్నాయి.

పిల్లలందరూ వెళ్ళాక, ఆయమ్మ వాష్ రూమ్స్ ని శుభ్రం చేసి వెళ్ళిపోయింది. పది నిముషాల తర్వాత, యూకేజీ చదివే నిఖిత ఒక్కటే వాష్ రూమ్ కి వెళ్ళి రాగానే "పాప.. ఇలారా" అంటూ పిలిచాడు. "ఏంటి అంకుల్" అంది నిఖిత. "ఇదిగో ఈ చాక్‌లెట్ నీకోసం తెచ్చాను తీసుకో" అన్నాడు. "ఐ.. ఫైవ్ స్టార్ చాక్ లెట్.. థాంక్స్ అంకుల్" అంటూ రేపర్ తీసి ఓ ముక్క కొరికి తినసాగింది. బాబ్జీ అటూఇటూ తలతిప్పి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని, నిఖితకి దగ్గరగా వెళ్ళి బుగ్గలు నిమిరాడు. తర్వాత పాప భుజాలు పట్టుకోబోయాడు. అంతే..! అప్పటివరకు అక్కడ, మాటువేసి ఉన్న వసుంధర, ప్రిన్సిపాల్ మేడం విజయలక్ష్మి, మౌనిక వాళ్ళ అమ్మ సివంగుల మాదిరి దూసుకువచ్చి బాబ్జీని చుట్టుముట్టారు. గట్టిగా పట్టుకుని, చెంపలు వాయించారు. అక్కడ జరుగుతున్న అలికిడికి ఇంకొందరు టీచర్లు, పిల్లలు వచ్చారు. పట్టు విదిలించుకుని పారిపోబోయాడు బాబ్జీ. అయితే అప్పుడే ఎదురుగా గన్ పట్టుకుని వస్తూ కనిపించాడు ఇన్స్పెక్టర్ రవీంద్ర. వెనుకనే బేడీలతో సిద్ధంగా ఉన్నారు కానిస్టేబుల్స్. శ్రీకాంత్ కూడా వచ్చాడు పోలీసులతో పాటే. బాబ్జీ చేతులకు బేడీలు వేసి, నెట్టుకుంటూ పోయి తీసికెళ్లారు పోలీసులు.

"సరైన సమయంలో మాకు విషయం తెలియజేసి, మంచి పని చేశారు మేడం. అందరూ చెడ్డవాళ్ళని కాదు. మంచివాళ్ళుగా నటిస్తూ అవకాశం దొరికినప్పుడు తమ వక్రబుద్ధిని చూపించే వాళ్ళు సమాజంలో ఎక్కువయ్యారు. స్కూల్స్ యాజమాన్యాలు, పేరెంట్స్ మాతో సహకరిస్తే, ఇటువంటి విషయాల పట్ల పిల్లలకి అవగాహన చేకూర్చే కార్యక్రమాలు చేపడదాము" అన్నాడు ఇన్స్పెక్టర్ రవీంద్ర.

"తప్పకుండా సర్. మీలాంటివారు సహకరిస్తే, ఇలాంటి నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చు. పిల్లలకు ఇలాంటి వ్యక్తుల గురించి, వారి నీచపు చేష్టల గురించి, గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి అవగాహన కలిగేలా క్లాసులు తీసుకోవచ్చు" అన్నారు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి. శృతి పాప చెప్పిన విషయం ద్వారా ఈ రోజు ఒక దుర్మార్గుడిని చట్టానికి పట్టించగలిగాము. మీరూ ధైర్యంగా మాకు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు" అంటూ వసుంధర, శ్రీకాంత్ కి థాంక్స్ చెప్పారు విజయలక్ష్మి.

"మరి.. శృతి బంగారు తల్లీ..! ఆ బ్యాడ్ బాబ్జీని పోలీసులు జైల్లో పెడతారు. ఇక వాడెప్పుడూ స్కూల్ కి రాడు. మరి నువ్వు రోజు స్కూల్ కి వెళతావా" అంది వసుంధర. "ఓ.. రోజూ స్కూల్ కి వెళతాను" అంటూ పకపకా నవ్వింది శృతి. ఆ నవ్వుల్లో చాలామంది పసిపాపల నవ్వులు శృతి కలిసాయి.

రోహిణి వంజారి

9000594630


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్