గోదావరి పరవళ్లతో పచ్చని పంట పొలాలు.. చారిత్రక ఆనవాళ్లతో అలరించే క్షేత్రాలు.. నిత్యం యాత్రీకులతో కిటకిటలాడే పుణ్యస్థలాలు.. ప్రకృతి అందాలతో మంత్రముగ్ధులను చేసే నదీతీరాలు.. పర్యాటకులను ఆకర్షించే నర్సరీలు.. ఆహ్లాదాన్ని పంచే గోదావరి ఘాట్లు.. ఇలా ప్రకృతి, ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి సమ్మేళనంగా నూతన తూర్పుగోదావరి జిల్లా నిలుస్తోంది. జిల్లాలో ఉన్న పర్యాటక, పుణ్యక్షేత్రాలను సమగ్రంగా అభివృద్ధి చేసి ఒకే పర్యాటక సర్క్యూట్‌గా తీర్చిదిద్దితే జిల్లాకు కొత్త ఆర్థిక ముఖచిత్రం ఏర్పడే అవకాశముంది.
నీలాల గోదారి.. జిల్లాకు ప్రధాన ఆకర్షణ
నీలాల గోదావరి తూర్పు గోదావరి జిల్లాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా రాజమహేంద్రవరం కేంద్రంగా గోదావరి నది తీర ప్రాంతం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంది. గౌతమీ ఘాట్, పుష్కర ఘాట్లు నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. ఇప్పటికే రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద అఖండ గోదావరిలో బోటింగ్ ను పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. గోదావరి నిత్యహారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హేవలాక్ వంతెన రాజమహేంద్రవరం చరిత్రకు ఆనవాలుగా నిలుస్తోంది. ప్రస్తుతం దీన్ని పర్యాటకానికి అనువుగా యాత్రీకులు సందర్శించేలా పర్యాటక శాఖ పనులు చేపడుతోంది.
కాటన్ బ్యారేజీ, మ్యూజియం
గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. రాజమహేంద్రవరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం వద్ద దీన్ని నిర్మించారు. ఈ కాటన్ బ్యారేజీని సందర్శించేందుకు ప్రతి రోజూ వందలాది మంది వస్తుంటారు. బ్యారేజీని ఆనుకుని ఉన్న కాటన్ మ్యూజియం ఇక్కడ మరో పర్యాటక ప్రాంతం. ఈ మ్యూజియంలో నాడు బ్యారేజీ కట్టడానికి ఉపయోగించిన పలు యంత్రాలు, ఇటుకలు వంటివి పొందుపర్చారు. ప్రస్తుతం ఇవి శిథిలావస్థలోకి చేరాయి. వీటిని భద్రపర్చాల్సిన అవసరం ఎంతైనాఉంది.
టెంపుల్ టూరిజం మెండు
రాజమహేంద్రవరానికి సమీపంలోని కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి యాత్రికులు తరలివస్తుంటారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వైష్ణవాలయం కొండపై వెలసింది. సుమారు 600 మెట్లను ఎక్కి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆలయం చుట్టూ ఆకుపచ్చని పకృతి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ధవళేశ్వరంలోని రామపాదాల రేవు, దీన్ని ఆనుకుని ఉన్న లక్ష్మీజనార్థనస్వామి ఆలయాలకు శతాబ్ధాల చరిత్ర ఉంది. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం యాత్రికులకు సుపరిచితమైన మరో పుణ్యక్షేత్రం. ఇక్కడికి సమీపంలోని గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రం మతసామరస్యానికి ప్రతీక. దేవరపల్లిలో మేరీమాత దేవాలయం, ఉండ్రాజవరంలోని బౌద్ధ దమ్మ క్షేత్రం వంటివి టెంపుల్ టూరిజానికి అనువైన ప్రాంతాలు.
కడియం : పూల పరిమళాల పర్యాటకం
కడియం నర్సరీలు జిల్లాకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. వేలాది రకాల మొక్కలు, పూలు, అలంకార మొక్కలతో నర్సరీలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రాజమహేంద్రవరానికి 15 కిలోమీటర్ల దూరంలో కడియం మండలం ఉంది. ఈ మండలంలో కడియం మాత్రమే కాకుండా మారో పది గ్రామాల్లో నర్సరీలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పూలవనాలు పర్యాటకుల మదిని దోచేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్థానికంగా వృద్ధి చేసిన పూల, పండ్ల మొక్కలతో పాటూ బోన్సాస్ వృక్షాలు, శతాబ్ధాల చరిత్ర కలిగిన పెద్దపెద్ద వృక్షాలు సైతం అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఇతర దేశాల పూల, పండ్ల మొక్కలు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ధవళేశ్వరం నుంచి కడియపు లంక వరకూ బోటు విహారం త్వరలో అందుబాటులోకి రానుంది. తప్పక సందర్శించాల్సిన స్థలాల్లో కడియం ముందు వరుసలో ఉంటుంది.
ఉపాధి.. ఆదాయానికి పెద్ద వనరు
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, బోటింగ్, టూర్ గైడ్లు, హస్తకళలు, స్థానిక ఆహార ఉత్పత్తులు, పూలు–మొక్కల విక్రయాలు తదితర రంగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి టూరిజం గైడ్లు, బోటు ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగంలో అవకాశాలు కల్పించొచ్చు. ఇప్పటికే రాజమహేంద్రవరం నగరంలో పలు హోటళ్లు సందర్శకులకు విడిదిని కల్పిస్తున్నాయి.
సంపద ఉంది.. సర్క్యూట్ కావాలి!
తూర్పుగోదావరి జిల్లాకు ప్రకృతి ఇచ్చిన సంపదకు కొదవ లేదు. ఆధ్యాత్మిక వైభవం ఉంది.. గోదావరి ఉంది.. చరిత్ర ఉంది.. పచ్చదనం ఉంది.. కడియం నర్సరీలు ఉన్నాయి.. ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం ఉంది. కానీ వీటన్నింటినీ కలిపి ఒక సమగ్ర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం అంటే కేవలం రోడ్లు, పార్కులు నిర్మించడం కాదు.. స్థానిక సంస్కృతి, ప్రకృతి, చరిత్రను కాపాడుతూ వాటిని ప్రజలకు పరిచయం చేయడం. నూతన తూర్పుగోదావరి జిల్లాను గోదావరి పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దితే పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకూ పెద్ద ఊతం లభించే అవకాశం ఉంది.
చేయాల్సిన అభివృద్ధి పనులు:
పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రహదారులు, పార్కింగ్ వసతులు.
ఘాట్లు, నదీ తీరాల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, కఠినమైన భద్రతా ప్రమాణాలు.
పర్యాటకుల సౌకర్యార్థం బహుభాషా సైన్ బోర్డులు, స్థానిక హస్తకళల ప్రదర్శనశాలలు.
తూర్పుగోదావరి జిల్లాకు ప్రకృతి ఇచ్చిన సంపదకు కొదవ లేదు. పచ్చదనం, భక్తి, చరిత్ర అన్నీ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒక సమగ్ర పర్యాటక ప్యాకేజీగా మార్చడమే ఇప్పుడు కావాల్సింది. స్థానిక సంస్కృతిని కాపాడుతూ, మౌలిక వసతులు పెంచితే నూతన తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మణిహారంగా నిలుస్తుంది.








కామెంట్‌లు (0)