బాపట్ల జిల్లాలోని సముద్ర తీరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా వేగంగా రూపుదిద్దుకుంటోంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా ‘బే ఆఫ్ బాపట్ల’ పేరుతో సుమారు రూ.98 కోట్లతో సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.1000 కోట్ల అంచనాలతో పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయి. జిల్లాలోని సూర్యలంక- చీరాల, వాడరేవు బీచ్, రామాపురం బీచ్ లను అనుసంధానిస్తూ బీచ్ కారిడార్ ను తీర్చిదిద్దుతున్నారు. ఈ బీచ్ ల్లో వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ జెట్ స్కై, ఆల్-టెర్రైన్ వెహికల్ (ఏటీవీ ) బైకింగ్ వంటి సాహస క్రీడలను అందుబాటులోకి తెచ్చారు. పర్యావరణ ఆధారిత టూరిజం (ఎకో-టూరిజం) ద్వారా స్థానిక పేరలి కాలువలో హౌస్ బోటింగ్ సౌకర్యాలు, మడ అడవులను తిలకించే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా పర్యాటక మార్గంలో భాగం చేస్తూ... టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గోవా పర్యాటక నమూనాను అధ్యయనం చేసి జిల్లా బీచ్ ల్లో రిసార్ట్‌లు, హోమ్‌స్టేలు, వాటర్ స్పోర్ట్స్, ఆహ్లాదకరమైన షాపింగ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు.
బాపట్ల జిల్లా అభివృద్ధి అడుగులు పర్యాటక రంగం తో ముడి పడి ఉన్న క్రమం లో జిల్లాలోని సముద్ర తీరం లో స్టార్ హోటళ్ల సూర్యలంక, చీరాల వాడరేవు కేంద్రాలుగా పలు పర్యాటక ప్రాజెక్టులు, రిసార్టులు, బీచ్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు రానున్నాయి.
బాపట్ల తీరం లో భారీ పర్యాటక ప్రాజెక్టులు
బాపట్ల జిల్లా సముద్ర తీరంలో రానున్న కాలంలో పర్యాటక పరంగా అభివృద్ధి అడుగులు వేగం పడనున్నాయి. ఈ మేరకు దేశంలోని దాదాపు టాప్ హాస్పిటాలిటీ బ్రాండ్లు అన్నీ జిల్లాలోని తీరం లో స్టార్ హోటళ్లు నిర్మించనున్నాయి. రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న బీచ్ లు కావడం, హైదరాబాద్, చెన్నై - కోల్ కతా జాతీయ రహదారులకు జిల్లా బీచ్ లు అనుసంధానమై ఉండటం, ఇప్పటికే పలు పర్యాటక ప్రాజెక్టులు వచ్చిన నేపథ్యంలో బాపట్ల సూర్యలంక - రామాపురం మధ్యలో హిల్టన్, ఐటీసీ హోటల్స్, రాడిసన్ బ్లూ, నోవాటెల్, లెమన్ ట్రీ, రాయల్ ఆర్కిడ్ లాంటి స్టార్ హోటల్స్ నిర్మాణాలు జరగనున్నాయి. ఈ కారణంగా చీరాల–బాపట్ల కారిడార్‌లో రానున్న కాలం లో పర్యాటక రంగం అభివృద్ధి చెందనుంది. తీరం వెంట రూ.వందల కోట్లతో స్టార్ హోటళ్ల నిర్మాణాలు జరగనున్నాయి. బాపట్ల మండలం, అడవి పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో రూ.250 కోట్ల పెట్టుబడితో నోవాటెల్ బీచ్ ప్రంట్ హోటల్ అకోర్, భ్రమర గ్రూప్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. హిల్టన్, లెమన్ ట్రీ వంటి సంస్థలు రూ.710 కోట్లతో హోటళ్లు, రిసార్ధుల నిర్మాణానికి ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకున్నాయి. సూర్యలంకలో రూ.468 కోట్లతో బీచ్ ఫ్రంట్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థతో ఎంవోయులు జరిగాయి. బాపట్ల, చీరాల మండలాల సరిహద్దులో అడవి గ్రామ పంచాయతీ పరిధిలోని తీరంలో ప్రముఖ సంస్థలు రిసార్టులు, బీచ్ ఫ్రంట్ హోటళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. లెమన్ ట్రీ సంస్థ స్టార్ హోటల్ నిర్మించనుంది. సూర్యలంకలో రూ.187.58 కోట్లతో ఫైవ్ స్టార్ కోస్టల్ రిసార్ట్, వెల్నెస్ సెంటర్, ఐటీసీ బ్రాండ్ తో ఎంటర్టైన్మెంట్ సెంటర్ ని ఆర్న కోస్టల్ రిసార్ట్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. అలానే సూర్యలంకలో రూ.64.44 కోట్లతో రాయల్ ఆర్చిడ్ బ్రాండ్ తో త్రీస్టార్ సూర్య నమస్కార్ రిసార్ట్ అభి వృద్ధి కోసం శుభం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు, ఇంద్రనీర్ ఫుడ్, బెవరేజెస్ సంస్థ ముందుకొచ్చాయి. సూర్యలంకలో రూ.183.87 కోట్లతో హిల్టన్ ఫైవ్ స్టార్ రిసార్ట్ తో పాటు సెయిలింగ్ క్లబ్, కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చాయి. ఇలా జిల్లాలో పర్యాటక రంగానికి రూ. వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే పర్యాటకులకు మెరుగైన వసతి లభించనుంది.
సూర్యలంకలో పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97.52 కోట్లు మంజూరు చేసి పనులు వేగంగా చేస్తున్నారు. ఈ ప్రణాళికలన్నీ అమలయితే బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని తీర ప్రాంతం అంతా పర్యాటక పరంగా అభివృద్ధి చెందడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
చీరాల బీచ్ లు - చీరాల చేనేత
చిన్న ముంబైగా పేరుతో పాటు చేనేతకు ప్రసిద్ధి చెందిన చీరాల పర్యాటక రంగంలో అభివృద్ధి అడుగులు వేస్తోంది. చీరాల వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు విస్తరించి ఉన్న సముద్రతీరంలో విస్తారంగా రిసార్టులు వెలిశాయి. వందల ఎకరాల్లో విల్లాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. సువిశాల సముద్ర తీరం, చేనేత రంగం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలగలిసిన చీరాల ప్రాంతానికి పర్యాటక రంగంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. చీరాల వాడరేవును అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తికావడంతో రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి పర్యాటకుల రాక పెరిగింది. చీరాల మీదుగా ప్రధాన రైలు మార్గం ఉండడం ఇక్కడి పర్యాటక రంగ అభివృద్ధికి మరింత తోడ్పడుతోంది. చీరాలకు అతి సమీపంలో ఉన్న వాడరేవు-రామాపురం బీచ్‌లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంతమైన వాతావరణం, సుదీర్ఘమైన సముద్ర తీరప్రాంతం వల్ల వారాంతాల్లో హైదరాబాద్, విజయవాడ గుంటూరు ప్రాంతాల నుండి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగింది. చీరాల ప్రాంతం చేనేత కార్మికుల నైపుణ్యంకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది కావడం తో టెంపుల్ టూరిజం తో పాటు చేనేత టూరిజం కూడా అభివృద్ధి చెందుతోంది.
మరిన్ని మౌలిక వసతులు
చీరాల పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు బీచ్ ల వద్ద మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. బీచ్‌లలో సురక్షితమైన లైఫ్‌గార్డ్స్, రాత్రి వేళల్లో తగినంత విద్యుత్ దీపాలు, తాగునీరు, పారిశుధ్య వసతులను మరింతగా మెరుగుపరచాలి. చీరాల - వాడరేవు మార్గంలో ఏర్పాటు చేసిన నగరవనాన్ని పూర్తిస్థాయి వసతులతో తీర్చిదిద్ది పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని కల్పించాలి. పర్యావరణహిత టూరిజాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. రాష్ట్ర పర్యాటక శాఖ చీరాల బీచ్‌లను, చేనేత రంగాన్ని, ఆధ్యాత్మికతను కలగలుపుతూ విస్తృత ప్రచారం చేయాల్సి ఉంది.
చీరాలలో సముద్ర తీరం - చేనేత సంస్కృతి అనే రెండు అంశాలు కలసి ఉండటం ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి అతిపెద్ద బలంగా ఉంది. స్పష్టమైన ప్రణాళిక, మౌలిక వసతులు, విస్తృత ప్రచారం కల్పిస్తే చీరాల అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశంగా రూపాంతరం చెందే అవకాశం మెండుగా ఉంది.








కామెంట్‌లు (0)