సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅందాల సిరి.. అల్లూరి

1 రోజు క్రితం

borra guhalu .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 09:44 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రకృతి అందాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రసిద్ధిగాంచింది. ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు, ఆంధ్ర కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి ఈ జిల్లాలోనే ఉన్నాయి. ​ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు అనంతగిరి మండలంలో ఉన్నాయి. విశాఖపట్నం నుండి రైలులో ప్రయాణించే క్రమంలో కొండ గుహల నుండి రైలు వెళ్తూ ఉంటే ప్రయాణికులు ఎంతో అనుభూతి పొందుతారు. అరకులోయలో గిరిజన ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే గిరిజన మ్యూజియం ఉంది. మ్యూజియం ఆవరణలో బోటింగ్ చేయొచ్చు. కాఫీ మ్యూజియంలో పలు రకాల కాఫీ రుచులను ఆస్వాదించొచ్చు. పద్మాపురం ఉద్యాన వనంలో భిన్న రకాల పూల మొక్కలు స్వాగతం పలుకుతాయి. అరకులోయలో రాత్రికి బస చేయొచ్చు. మరుసటి రోజు అరకులోయ నుంచి పాడేరు వెళ్లే మార్గంలో అరకుకు కొద్ది దూరంలోనే డుంబ్రిగుడ వద్ద చాపరాయి జలపాతం ఉంది. సొంత వాహనాల్లో వెళ్ళవచ్చు. ఆర్‌టిసి, ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. డుంబ్రిగుడ మండలంలో అంజోడా సిల్క్ ఫారం, కొల్లాపుట్టు జలతరంగిని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. పాడేరులో ప్రసిద్ధిగాంచిన మోదకొండమ్మ, వంజంగి హిల్స్‌ ఆకట్టుకుంటాయి. జి.మాడుగుల మండలంలో కొత్తపల్లి జలపాతం ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటుంది.

1111.jpg

ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి

ఆంధ్ర కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి ప్రాంతం అతి శీతలమైంది. ఇక్కడ దట్టంగా కురిసే మంచు అందాలను ఆస్వాదించొచ్చు. విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకులు నర్సీపట్నం మీదుగా లంబసింగి చేరవచ్చు. పాడేరు నుండి అయితే చింతపల్లి మార్గంలో లోతుగెడ్డ జంక్షన్ మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు. అత్యధిక మంది పర్యాటకులు ముందు రోజు రాత్రి నర్సీపట్నంలో బస చేసి వేకువజామునే బయలుదేరి లంబసింగి వస్తుంటారు. ఇక్కడి ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు దట్టంగా మంచు కురుస్తూ ఉంటుంది. శీతాకాలంలో పక్కనున్న వారు కనిపించనంత దట్టంగా పొగమంచు పడుతుంది. ఇక ముంచింగిపుట్టు మండలంలోకి ప్రవేశిస్తే ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఆరాధించే డుడుమ జలపాతం కనిపిస్తుంది. ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ జలపాతం పాడేరు నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 600 అడుగుల ఎత్తు నుంచి హోరు శబ్దం వేస్తూ దిగువకు జాలువారుతూ సందర్శకులకు కట్టిపడేస్తుంది. జలపాతాన్ని దగ్గరగా చూడాలంటే చాలా కిందకు దిగాల్సి ఉంటుంది. పాడేరు నుంచి ఆర్‌టిసి బస్సులు నడుస్తాయి. పెదబయలు, ముంచంగిపుట్టు మీదుగా చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో ముంచంగిపుట్టుకు ముందు ఎడమవైపు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలాపుట్టు జలాశయాన్ని కూడా సందర్శించవచ్చు.

బొర్రా గుహలు

బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అరకు లోయకు సమీపంలోని అనంతగిరి కొండల్లో ఉన్న ప్రసిద్ధ సహజ గుహలు. వీటిని స్థానికంగా బొర్రా గుహలు అని పిలుస్తారు. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గుహలు సున్నపురాయి క్రమంగా కరిగిపోవడం వల్ల సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. గుహల్లో స్టలాక్టైట్స్‌, స్టలాగ్మైట్స్‌ వంటి అద్భుతమైన శిలా నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి వివిధ ఆకారాల్లో ఉండటం వల్ల ప్రకృతి కళాకృతులను తలపిస్తాయి. గుహల లోపల విద్యుత్‌ దీపాల ఏర్పాటుతో శిలా నిర్మాణాలు మరింత అందంగా కనిపిస్తాయి. బొర్రా గుహల సమీప ప్రాంతంలో పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే పర్యాటకులకు బొర్రా గుహలు ముఖ్యమైన సందర్శనా స్థలంగా నిలుస్తాయి. ప్రకృతి, భూగర్భ శాస్త్రం, సాహస యాత్రలను ఇష్టపడేవారికి ఇవి ప్రత్యేక ఆకర్షణ.

చాపరాయిని చూసొద్దామా..

చాపరాయి జలపాతం డుంబ్రిగుడ మండలంలో ఉంది. చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తూ అందరూ ఆనందడోలికల్లో తేలియాడతారు. శీతాకాలంలో పొగమంచు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పర్యాటకులను ఆకర్షించే విధంగా గిరిజన సంప్రదాయ థింసా నృత్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జలపాతం ఆవరణలో పర్యాటకులను ఆకర్షించే విధంగా పూలతోటలను పెంచుతూ నందనవనాన్ని తీర్చిదిద్దారు. కాటేజీలు, గార్డెన్ల మధ్యన చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో ఇక్కడకు పర్యాటకులు తరలివస్తారు.

ఈ ప్రాంతంలోని పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్