mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజనం గుండెల్లో గుడి కట్టిన... ‘భక్త కన్నప్ప’!

2 గంటల క్రితం

BhaktaKannappa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 07:35 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

సరిగ్గా 50 ఏళ్ళ క్రితం.. 1976 మే నాటి సంగతి. దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్పటికే ఏడాది కావస్తోంది. నిర్బంధాలు నడుస్తున్న కాలం. కనిపించని చెయ్యేదో నడుపుతున్న నాటకంలో దేశమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, నివురుగప్పిన నిప్పులా ప్రజల్లో అసంతృప్తి, అనిశ్చితి రాజ్యమేలుతున్నాయి. కళ్ళెదుటి అరాచకం నుంచి విముక్తికి కనిపించని దేవుణ్ణి కొలుస్తూ, సినీ వినోదంలో పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్న సమయం. సరిగ్గా అప్పుడు వచ్చిన ఓ పంచరంగుల పౌరాణిక చిత్రం ఓ ఊపు ఊపేసింది. ప్రజల అమాయకత్వాన్ని దోచుకుంటున్నవారిని దుయ్యబడుతూ, ఛాందసాన్ని ప్రశ్నిస్తూ, చిత్తశుద్ధితో చేసే పనులకు దేవుడైనా దిగివస్తాడని నిరూపించిన ఆ చిత్రం ‘భక్త కన్నప్ప’.


బాపు – రమణల నేతృత్వంలో హీరో కృష్ణంరాజు, తన తమ్ముడు యు.వి. సూర్యనారాయణరాజు (నేటి అగ్రహీరో ప్రభాస్ తండ్రి) నిర్మాతగా గోపీకృష్ణా మూవీస్‌పై నిర్మించిన సినిమా ‘భక్త కన్నప్ప’ (రిలీజ్ 1976 మే 29). తెర నిండుగా భారీతనం, తెలుగుగడ్డపైనున్న మనోహర ప్రకృతి దృశ్యాలు, సూపర్ హిట్ పాటలు, సినీ నట - సాంకేతిక బృందం సమిష్టి కృషి.. 50 ఏళ్ళు గడచినా ఇవాళ్టికీ ఆ చిత్రాన్ని మరపురానిదిగా మార్చేశాయి.

​ప్రకృతి ఒడిలో.. పట్టిసీమ గుడిలో..

మహాభారతంలోని పాండవులలో ఒకడైన అర్జునుడి అంశతో ఉడుమూరు గూడెంలో బోయవాడిగా పుట్టిన తిన్నడు శ్రీకాళహస్తిలో కన్నప్పగా మారి శివసాయుజ్యం పొందిన వైనాన్ని ఈ చిత్రం తెరపై కనువిందు చేసింది. అప్పటికే హీరో కృష్ణంరాజు, ఆయన తమ్ముడు సూర్యనారాయణరాజు, చలసాని గోపి లాంటి పలువురు భాగస్వాములతో కలసి తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై తొలి చిత్రం ‘కృష్ణవేణి’ (1974) తీశారు. అందులో కొంత ఔట్‌డోర్ షూటింగ్ చేసినా, కన్నప్పను పూర్తిగా ప్రకృతి ఒడిలోనే తీయాలని భావించి, ఏలూరుకు దగ్గరలోని బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

BapuRamanabalakrishnasriramarajyammuhurat

కాళహస్తి ఆలయ దృశ్యాలు తీయడం కోసం ఓ పాత గుడి, ఆ ప్రాంతంలోనే నది ఉండి, కరెంటు కూడా లేనిది కావాలని గాలించారు. అలా వెతికి వెతికి పట్టిసీమ గుడిని ఎంచుకున్నారు. కొండ మీద పట్టిసం గుడి, చుట్టూ వడ్డాణంలా గోదావరి. అలా సినిమాలో కనిపించే కాళహస్తి ఆలయ దృశ్యాలన్నీ గోదావరి మీద పట్టిసీమలో శ్రీవీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాకారం లోపల తీశారు. ఆ కొండ వద్దకు పడవల మీద వెళ్ళాలి. నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అక్కడకు చేర్చడానికే చాలా సమయం పట్టేది. సాంకేతిక నిపుణులు ఎంత ప్రాణం పెట్టి పనిచేశారో, నటీనటులు తమ పాత్రలకు అంతే ప్రాణం పోశారు. బాపు – రమణల మార్గదర్శకత్వంలో కృష్ణంరాజు అచ్చం కోయజాతి తిన్నడులానే రాణించారు. అంతకు ముందే ‘ముత్యాలముగ్గు’లోని కాంట్రాక్టర్ పాత్ర, ఆ విలక్షణ వాచికంతో అలరించిన రావుగోపాలరావు ఆ క్రేజులోనే ఇందులోని కైలాసనాథ శాస్త్రి పాత్రనూ నడిపించారు. ‘ముత్యాలముగ్గు’ (1975) హీరో శ్రీధర్ ఇందులో హీరోతో తలపడే మరో కోయజాతి వీరుడిగా కనిపిస్తారు.


​వాణిశ్రీకి ఓ ఆకుపచ్చని జ్ఞాపకం!

నటి వాణిశ్రీతో బాపు – రమణలు పనిచేయడం అదే మొదటిసారి. అప్పటికి వాణిశ్రీ టాప్ హీరోయిన్. ఆ సమయంలో మొత్తం ఔట్‌డోర్‌లో, అదీ ఊహకందని సామాన్య కోయ వనిత పాత్ర చేయడానికి ఆమె అంగీకరించడం విశేషం. కృష్ణంరాజే నిర్మించగా, తాను నటించిన ‘కృష్ణవేణి’ హిట్టవడంతో ఆమె కాల్షీట్లు ఇచ్చారు. ఆ తర్వాత ‘ముత్యాలముగ్గు’ ఫేమ్ బాపు-రమణల చేతుల్లోకి ప్రాజెక్ట్ చేరిందనేసరికి వారి మీద గౌరవమూ తోడైంది. ఆ పాత్రను ఆమె ఆడుతూ పాడుతూ, ఆనందంగా చేశారు. ఆ రోజుల్లో రాత్రిళ్ళు హీరో, తదితరులు వాళ్ళ వాళ్ళ జీపుల్లో వెంట రాగా, తన జీపు బానెట్ మీద కూర్చొని వాణిశ్రీ అడవిలో వేటకు వెళ్ళేవారట. విసుగెత్తించే పట్టణ వాతావరణానికి దూరంగా, హాయిగా ప్రకృతి మధ్య సాగిన ఆ సినిమా చిత్రీకరణ అప్పట్లో అలా ఆమెకు ఓ ఆటవిడుపు.

“నెలకో పది రోజుల చొప్పున ఆ సినిమాకు నా కాల్షీట్లు. ఎప్పుడెప్పుడు ఆ డేట్లు వస్తాయా, షూటింగ్ చేద్దామా అని నాకు ఉత్సాహంగా ఉండేది. ఆ ఏజెన్సీ ప్రాంతపు జనంతో వరసలు కలుపుకొంటూ, పల్లెల్లోని వాళ్ళ ఇంట్లోకి చనువుగా వెళ్ళి, వారితో కలివిడిగా ఉంటూ, వారు పెట్టినవి తిని, నేను చేసినవి తినిపించేదాన్ని. నా కెరీర్‌లో ''భక్త కన్నప్ప`` షూటింగ్ ఓ ఆకుపచ్చని జ్ఞాపకం” అని వాణిశ్రీ ఈ వ్యాసకర్తతో గుర్తు చేసుకున్నారు. బాపు – రమణలు ఆ చిత్రాన్ని అణువణువూ తీర్చిదిద్దినతీరు ఆమెను అమితంగా ఆకట్టుకుంది. అందుకే, ‘గోరంత దీపం’ (1978)లో మేకప్ లేని డీ-గ్లామర్ పాత్ర అయినా సరే వాణిశ్రీ వెంటనే ఒప్పుకున్నారు.

​ముళ్ళపూడి మార్కు మాటలు!

ఈ పౌరాణిక స్క్రిప్టును ముళ్ళపూడి వెంకట రమణ జనరంజకంగా మలిచిన వైనం నిజంగా చెప్పుకోదగ్గది. కైలాసనాథ శాస్త్రి పాత్రతో మూఢభక్తిని నిరసిస్తూనే, ‘కిరాతార్జునీయం’ లాంటి ఘట్టాలతో భక్తిరసం పండించారు. కన్నప్పకు మారువేషంలోని శివయ్య జ్ఞానబోధ చేసే ఘట్టంలో, “..అసలు మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లోవెలుగు. మన లోపలి చీకట్లో వెలిగే చిన్నదీపం. నీ తప్పుని నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్పని ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది. దీపం పెద్దదవుతుంది. దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడోకన్ను” అన్న డైలాగు కథ తాలూకు సారాన్ని కొద్దిమాటల్లో చెప్పేస్తుంది. అదీ ముళ్ళపూడి మార్కు రచనలోని ఘనత.

​డైరెక్టర్ సహా మారింది ఎందరో!

నిజానికి, ‘భక్త కన్నప్ప’ ప్రాజెక్ట్ మొదట అనుకున్నప్పుడు వి. మధుసూదనరావు దర్శకుడు. బాపు ‘అందాల రాముడు’కి సహాయ దర్శకుడిగా పనిచేసిన ముంజులూరి భీమేశ్వరరావు స్క్రీన్‌ప్లే రైటర్. ఆదినారాయణరావు మ్యూజిక్ డైరెక్టర్. విప్లవభావాల నేపథ్యమున్న మధుసూదనరావు ఈ పౌరాణిక చిత్రానికి కూడా ఆ తరహా ట్రీట్‌మెంట్ సిద్ధం చేయించారు. తీరా ఆయనకూ, నిర్మాతలకూ ఎక్కడో తేడా వచ్చింది. దాంతో, ఆయన తప్పుకున్నారు.

‘ముత్యాలముగ్గు’తో జోరు మీదున్న బాపు – రమణల దగ్గరకు స్క్రిప్టు, ప్రాజెక్ట్ చేరాయి. జనరంజకమైన పౌరాణిక కథగా రమణ దాన్ని మలిచి, బాపు చేతిలో పెట్టారు. ఆదినారాయణరావుకు సహచరుడైన సత్యం పూర్తిస్థాయి సంగీత దర్శకుడయ్యారు. ‘కో.కొ.పా’ అంటూ ఈ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన నటుడు సారథి. ‘కోయపిల్లకి కొత్త పాఠాలు’ (కో.కొ.పా.) చెప్పడానికి ప్రయత్నించి, దెబ్బలు తిన్న పూజారి(రావుగోపాలరావు) కి కుమారుడిగా ఈ సినిమా ఆయనకు మంచిపేరు తెచ్చింది. రాజబాబు, పద్మనాభం మిస్సవడంతో ఆఖరి క్షణంలో సారథికి ఆ పాత్ర దక్కింది. అది క్లిక్ అవడంతో నటుడిగా సారథి దశ మారిపోయింది.

bhaktakannappa

ఔట్‌డోర్‌లో... అపూర్వ పౌరాణిక నిర్మాణం!

ప్రసిద్ధ సినీ పంపిణీ సంస్థ లక్ష్మీ ఫిలిమ్స్ అండదండలతో సాగిన ‘భక్త కన్నప్ప’ చిత్ర నిర్మాణం ఆ రోజుల్లో ఓ సంచలనం. నాటి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించిన తొలి తెలుగు సినిమా ఇదే. పూర్తిగా ఔట్‌డోర్‌లోనే షూటింగ్ జరుపుకొన్న తొలి తెలుగు పౌరాణిక చిత్రమూ ఇదే! ఔట్‌డోర్‌లో, అందులోనూ ఈస్ట్‌మన్ కలర్‌లో సినిమా తీయడంతో ఏజెన్సీ ప్రాంతపు అందచందాలనూ, పాపికొండలనూ అంతకు ముందెన్నడూ ఎవరూ చూపని రీతిలో చిత్రీకరించారు వి.ఎస్.ఆర్. స్వామి. ‘ఎన్నీయల్లో...’ పాటను మండుటెండలో తీసినా, మంచి వెన్నెల వేళ సాగినట్టు తెర మీద స్వామి భ్రమింపజేశారు. ఇక, తిన్నడు పరమభక్తితో ‘శ్రీకాళహస్తీశ్వరా...’ పాట పాడే సందర్భంలో తెరపై కనిపించే ట్రిక్ ఫోటోగ్రఫీ రవికాంత్ నగాయిచ్ పనితనం.

​స్థానికుల సహకారం మరువలేనిది!

​ఇంత భారీ చిత్రం ఔట్‌డోర్ షూటింగ్ ఏ లోటుపాట్లూ లేకుండా సజావుగా సాగడానికి స్థానిక బుట్టాయగూడెం పెద్దలు కారణం. ఈ సినిమాకు స్థానికులు అందించిన సహకారం అంతా ఇంతా కాదు. బుట్టాయగూడెంలో చిత్రయూనిట్ క్యాంప్ చేసిన చోటు నుంచి షూటింగ్ కోసం రోజూ పది, పదిహేను మైళ్ళ దూరం వెళ్ళాల్సి వచ్చేది. అడవి ప్రాంతంలో ఆ రోడ్ల మీద జీపులు తప్ప మిగిలిన వాహనాలు నడవలేవు. ఆ జీపులు నడవడానికి కూడా రోజూ రోడ్డు బాగు చేసుకోవాల్సి వచ్చేది. స్థానికుల సహకారం వల్లే రోడ్లు లేని ప్రాంతాలకు సైతం వెళ్ళి, షూటింగ్ జరపగలిగారు.

bhaktakannappa

​కనువిందు చేసిన కోయగూడెం సెట్టు!

​చిత్ర నిర్మాణ సమయంలో అనుకోని అవరోధాలకూ అంతులేదు. బుట్టాయగూడెంలో ఒక పొలంలో కథలో వచ్చే కోయగూడెం తాలూకు పెద్ద ఎరీనా సెట్టు ప్లాన్ చేశారు. అందులో హీరోకూ, అతని ప్రత్యర్థికీ పోటీ వగైరా లాంటివెన్నో తీయాలి. అలాగే, 30 అడుగుల ఎత్తు అమ్మవారి విగ్రహం చేయాలి. వందల మంది శ్రమిస్తే కానీ పూర్తికాని ఈ సెట్స్ పనుల కోసం స్టూడియో కార్పెంటర్లు, పెయింటర్లు, ఫౌండ్రీలు, బోలెడంత మంది కూలీలు అంతా వచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ భాస్కరరాజుకు అనుకోని ఇబ్బంది. అర్జెంట్‌గా మద్రాస్ వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితుల్లో బాపు – రమణల ఆప్త మిత్రుడైన బి.వి.ఎస్. సీతారామారావు ఆదుకున్నారు. ఎరీనా సెట్‌తో పాటు డ్రమ్ డ్యాన్స్ పాట కోసం పాతిక పైగా భారీ డ్రమ్ములు చేయించారు. ఆ భేరీ వాద్యాలు, ఎరీనా సెట్, ఆ అమ్మవారి విగ్రహం.. అన్నీ సినిమాకే హైలైటయ్యాయి.

ఆ డ్యాన్స్, ఫైట్.. అలా వచ్చాయి!

చిన్నప్పుడు జెమినీ వారి ‘చంద్రలేఖ’ (1948) లో చూసిన ఆ భేరీ వాద్యాలపై నృత్య సన్నివేశం, అలాగే ‘బెన్ హర్’, ‘టెన్ కమాండ్ మెంట్స్’ లాంటి హాలీవుడ్ చిత్రాలు కృష్ణంరాజు మనసుపై బలమైన ముద్ర వేశాయి. అలాంటి సీన్లు, డ్యాన్సులు తీయాలన్న తన చిరకాల స్వప్నాన్ని ఆయన ఈ కన్నప్పలో నెరవేర్చుకున్నారు. వాణిశ్రీ బృందంతో శీను మాస్టర్ ఆ డ్రమ్ డ్యాన్స్‌ను అద్భుతంగా తీశారు. అలాగే, హీరో కళ్ళకు గంతలు కట్టుకొని, చప్పుడు ఆధారంగానే తిరుగుతూ ప్రత్యర్థి (నటుడు శ్రీధర్) తో ఫైట్ చేయడమూ కృష్ణంరాజు ఆలోచనే.

సగటు నిర్మాణవ్యయం రూ. 12 లక్షలైన ఆ రోజుల్లో దాదాపు రూ. 20 లక్షలతో ‘భక్త కన్నప్ప’ తీసినట్టు కృష్ణంరాజు ఓసారి చెప్పారు. ఖర్చులు బాగా పెరగడంతో, నిర్మాణం మధ్యలో డబ్బుకు తిప్పలూ తప్పలేదు. ఔట్‌డోర్‌ షూటింగ్‌లో ఒకసారి సమయానికి నిర్మాతల చేతిలో డబ్బులు లేకపోయేసరికి రచయిత ముళ్ళపూడి

రాజమండ్రి నుంచి లక్ష రూపాయలు తెచ్చి, సర్దుబాటు చేశారు.

​పాటలన్నీ నేటికీ పెద్ద హిట్!

‘భక్త కన్నప్ప’కు సంగీతం, పాటలు మరో పెద్ద బలం. ఈ సినిమాలో అత్యధిక భాగం పాటలను గాయకుడు రామకృష్ణ పాడడం విశేషం. ‘ఆకాశం దించాలా...’, ‘ఎన్నీయల్లో...’ (రచన - ఆరుద్ర) లాంటి డ్యూయట్లు, ‘శివశివ శంకర...’ (వేటూరి), ‘శ్రీకాళహస్తీశ్వరా హరహర...’ (ఆరుద్ర) లాంటి భక్తిగీతాలు, ‘శివ శివ అననేలరా...’ (సినారె) లాంటి శృంగార రక్తిగీతాలు, ‘కండ గెలిచింది...’ (సినారె) లాంటి భారీ బృందగీతాలు, కిరాతార్జునీయ సారంతో సాగే అద్భుత సినీగీతం (వేటూరి) – ఇలా అన్నీ హిట్టే.

BhaktaKannappa

ప్రసాద్ ల్యాబ్‌లో తొలి సినిమా!

తెర నిండా పరుచుకున్న రంగులతో కలర్ చిత్రాలు వరుసగా ఊపందుకొంటున్న కాలమది. ఆ సమయంలోనే దర్శక – నిర్మాత – స్టూడియో అధినేత ఎల్వీ ప్రసాద్ తమ సంస్థ పక్షాన ప్రసాద్ ఫిల్మ్ కలర్ లేబరేటరీ ప్రారంభించారు. సదరు కలర్ ఫిల్మ్ లేబరేటరీలో ప్రాసెసింగ్ జరుపుకొన్న తొలి చిత్రం ‘భక్త కన్నప్పే!’ అప్పట్లో ఆ చిత్రం ఏకంగా 25 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది.

​నేషనల్ అవార్డ్స్‌లో కన్నప్ప సౌండ్!

‘భక్త కన్నప్ప’లో మ్యూజిక్ డైరెక్టర్ సత్యం ఆశ్చర్యపరిచారు. మంగళప్రదమైన మధ్యమావతి రాగాన్ని తీసుకొని ‘ఆకాశం దించాలా...’ పాటకు ట్యూన్ చేశారు. ఆ పాట అందరికీ నచ్చింది. ఆ రాగాన్నే థీమ్‌గా తీసుకొని అద్భుతంగా నేపథ్య సంగీతం చేశారు. అడవి నేపథ్యంలోని ఈ చిత్రంలో పక్షులు, ప్రకృతి రావాలను తెర మీద కూడా సహజంగా వినిపించడం కోసం దర్శకుడు బాపు ఎంతో శ్రద్ధగా రియల్ లొకేషన్స్‌లో రికార్డ్ చేసి మరీ తెచ్చిన శబ్దాలను వాడుకున్నారు. ఆ శ్రద్ధ, శ్రమ గొప్ప ఫలితమిచ్చాయి. బెస్ట్ సౌండ్ రికార్డింగ్ విభాగంలో ‘భక్త కన్నప్ప’ శబ్దగ్రాహకుడైన ప్రసాద్ స్టూడియో ఎస్. రామనాథన్‌కు ఆ ఏడాది జాతీయ అవార్డ్ దక్కింది.

Prabhasas

ప్రభాస్‌తో తీయాలనుకున్నా...

తనకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన ఈ సినిమా అంటే కృష్ణంరాజుకు అభిమానం. నటవారసుడిగా ప్రభాస్‌తో ఈ కథను మళ్ళీ తీయాలని ఆయన కలలుగన్నారు. కుదరలేదు. ఆ తర్వాత నట – రచయిత తనికెళ్ళ భరణి లాంటివాళ్ళు కన్నప్ప కథను కొత్తగా చెప్పాలని ప్రయత్నించారు. చివరకు హీరో మంచు విష్ణు విదేశాల్లో భారీగా స్వీయ నిర్మాణం సాగించి, స్వయంగా ఆ పాత్ర ధరించి, 2025లో జనం ముందుకు వచ్చారు. పెదనాన్న ఆశించినట్టు ప్రభాస్ ‘భక్త కన్నప్ప’ పాత్ర చేయలేకపోయినా, మంచు విష్ణు ‘కన్నప్ప’లో కీలక సందర్భంలో మారువేషంలోని శివుడిగా అతిథి పాత్రలో కనిపించారు. ఆ సినిమా ప్రారంభ వసూళ్ళలో ప్రధానభాగం వహించారు. ఏమైనా, పాత ‘భక్త కన్నప్ప’కు మరేదీ సాటి రాలేదు. యాభై ఏళ్ళు నిండినా నేటికీ ఆ సినిమా వన్నెతరగని ఓ క్లాసిక్.


(ఈ జులై 28న రచయిత ముళ్ళపూడి 95వ జయంతి, 50 వసంతాల ‘భక్త కన్నప్ప’ వెండితెర నవల పునర్ముద్రణ ఆవిష్కరణ సభ)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్