ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిక్కోలులో బౌద్ధారామ క్షేత్రాలు

1 గంట క్రితం

Salihundam-Srikakulam-Buddhist-pilgrims.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 10:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

పేదల ఊటీగా పిలిచే సిక్కోలు ప్రకృతి సోయగాలకు నెలవు. 193 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం... క్రీస్తు పూర్వం నాటి ఘన చరిత్ర... అతి ప్రాచీన, అరుదైన ఆలయాలు.. బౌద్ధారామ క్షేత్రాలు... అపార ప్రకృతి వనరులు... ఇవీ శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకత. నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదుల సాగర సంగమ ప్రదేశాలు... కోనసీమను తలపించే ఉద్దానం... ఇలా చెప్పుకుంటూ పోతే సిక్కోలు సిగలో ఎన్నో... మరెన్నో...

ఉద్దానం : శ్రీకాకుళానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవిటి ఉద్దాన ప్రాంతం మరో కోనసీమ. దట్టమైన జీడిమామిడి, కొబ్బరి తోటలతో ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది.

తేలినీలాపురం : సైబీరియా పక్షులైన ఫెలికాన్, పెయింటెడ్, స్టార్క్స్ జాతి పక్షులు 12 వేల మైళ్లు దాటి ఏటా సెప్టెంబరులో ఇక్కడకు చేరుకుంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి, పొదిగాక పెద్దయిన పిల్లలతో కలిసి తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోతాయి. శ్రీకాకుళం నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో, టెక్కలికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.

కళింగపట్నం : శ్రీకాకుళం నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో కళింగపట్నం ఉంది. బీచ్, లైట్‌హౌస్ ఆకట్టుకుంటాయి. కళింగపట్నానికి సమీపంలోని షేక్‌మదీనా దర్గా సర్వమత సహనానికి ప్రతీకగా నిలుస్తోంది.

బారువ తీరం: సోంపేట మండలంలోని బారువా తీరం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. మహేందత్రనయ నది సాగర సంగమంతోపాటు ఏపుగా ఎదిగిన కొబ్బరితోటలు ప్రకృతి శోభకు ప్రత్యేక అందాన్నిస్తుంటాయి. బారువలో కోటిలింగేశ్వర, జనార్థన, జగన్నాథ ఆలయాలతో పాటు మరో పది ఆలయాలున్నాయి.

మొగదలపాడు బీచ్ : గార మండలంలోని మొగదలపాడు బీచ్ సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. రెండు దశాబ్దాల కిందట సముద్రంలోకి నిర్మించిన పొడవాటి వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

భావనపాడు బీచ్ : సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్ పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉంటోంది.

పరిఢవిల్లిన బౌద్ధం : శాలిహుండం, దంతపురి. బౌద్ధమతం జిల్లాలో ఎంతగా పరిఢవిల్లిందో ఈ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో లభించిన పురాతన సంపదే చాటిచెప్తోంది. జిల్లాలో శతాబ్దాల పాటు బౌద్ధమతం భాసిల్లిందనడానికి చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క బౌద్ధమతమే కాదు... జైనమతానికి సంబంధించిన పురాతన విగ్రహాలకూ సిక్కోలు నిలయం.

దంతపురి : శ్రీకాకుళానికి 21 కిలోమీటర్ల దూరంలో అలికాం బత్తిలి రహదారి నుంచి సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి తూర్పు దిశలో ఉన్న కోట ప్రాంతాన్ని దంతపురి, దంతవరపుకోట పేర్లతో పిలుస్తారు. ప్రాచీన కళింగ సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన దంతపురికి ఘన చరిత్ర ఉంది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణం చుట్టూ 50 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగిన మట్టి గోడలు ఆనాటి కోటకు ఆనవాళ్లుగా ఇప్పటికీ ఉన్నాయి. దంతపురానికి అనుబంధంగా మూడు కోటలు, ఒక దుర్గం ఉండేవని చెప్తారు. కోటలున్న స్థానంలో నిర్మించిన గ్రామాలనే కొత్తకోట, ధనుకోట, పెద్దకోటగా పిలుస్తున్నారు. కరకవలసలోని దుర్గంలో ఇప్పటికీ ప్రతిఏటా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. బౌద్ధ స్థూపాలు గత చరిత్రకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. బౌద్ధ భిక్షవులు పవిత్ర ప్రదేశంగా దంతపురిని గుర్తించారు.

శాలిహుండం: శ్రీకాకుళం నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో గార మండలంలోని శ్వేతపర్వతంపై ఉన్న పవిత్ర బౌద్ధ యాత్రా స్థలం శాలిహుండం. శాలిహుండం అంటే ధాన్యం గాదె అని అర్థం. బౌద్ధ భిక్షవులు ఆహారధాన్యాలను నిల్వ చేసుకునే కేంద్రంగా శాలిహుండం ఉండడంతో ఈ పేరు వచ్చిందని చెప్తారు. కళింగ రాజుల కాలంలో బౌద్ధమతం ఈ ప్రాంతంలో వ్యాప్తి చెందిందనడానికి శాలిహుండం ఒక నిదర్శనం. ఇక్కడ పలు విలువైన విగ్రహాలు, బౌద్ధ స్తూపం, బౌద్ధ చైత్యం బయటపడ్డాయి. పురావస్తుశాఖ వాటిని భద్రపరచడానికి చిన్న మ్యూజియంను ఏర్పాటు చేసింది. ఈ శాలిహుండం కొండ పక్కగా వంశధార నది ప్రవహిస్తుంది. వంశధార నది కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసే దృశ్యం ఇక్కడ్నుంచి చూస్తే లీలగా కనిపిస్తుంది. బౌద్ధమత వ్యాప్తి కేంద్రంగా, బౌద్ధ సంస్కృతికి నిలయంగా శాలిహుండం పేరుగాంచింది. ఇక్కడ బౌద్ధమతానికి సంబంధించిన ఎన్నో అవశేషాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. 50 ఏళ్ళ కిందట జరిపిన తవ్వకాల్లో అపురూపమైన శిల్ప సంపద, చారిత్రక అవశేషాలు బయటపడ్డాయి. బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు, మహా చైత్యం, భిక్షవులు వాడే పాత్రల నమూనాలతో పాటు మూడు తలలు, ఆరు చేతులు గల ఛాయాదేవి విగ్రహం, మరీచి, మంజుశ్రీ, జంబాల, జడధారిణి, తార విగ్రహాలు లభించాయి.

ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లు

అతి ప్రాచీన, అత్యంత అరుదైన ఆలయాలకు సిక్కోలు పుట్టినిల్లు. ప్రభాతవేళ భానుడి లేలేత కిరణాలు ఆదిత్యుని తాకే ఏకైక సూర్య దేవాలయం అరసవల్లి. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు ధ్వజస్తంభాలను కలిగి ఉన్న శ్రీకూర్మనాథ క్షేత్రం. దేశంలోనే ముఖాకృతి కలిగిన ఏకైక ఆలయం శ్రీముఖలింగం. ఈ ఆలయాల్లో కుడ్య చిత్రాలు, శిల్పకళా సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. శ్రీముఖలింగంలో ఆనాడే అత్యంత సూక్ష్మస్థాయిలో శిల్పాలను చెక్కిన తీరు మహాద్భుతం. పాండవుల మెట్ట సందర్శనీయ క్ష‍ేత్రం.

అరసవల్లి : శ్రీకాకుళం నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని సూర్యనారాయణ స్వామి ఆలయం దేశంలోనే ఏకైక సూర్యదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయం పక్కనున్న సూర్యగుండాన్ని 11వ శతాబ్దంలో తవ్వినట్లు చెప్తారు. ఈ ఆలయాన్ని గంగరాజులు నిర్మించి పోషించారు. ఆదిత్యుని ఆలయంలోనే ఐదు ద్వారాల నుంచి ఏటా రెండు పర్యాయాలు మార్చి తొమ్మిదో తేదీ నుంచి 12వ తేదీ వరకు... అక్టోబరు 1, 2, 3 తేదీల్లో ఉదయం సూర్య కిరణాలు నేరుగా ఆదిత్యుని తాకడం విశేషం.

శ్రీముఖలింగం : శ్రీకాకుళానికి 48 కిలోమీటర్ల దూరంలో వంశధార నదీ తీరాన జలుమూరు మండలంలో శ్రీముఖలింగం ఉంది.

శ్రీకూర్మం: శ్రీకాకుళం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో గార మండలంలోని శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథుని ఆలయం ఉంది. తూర్పు దిశనున్న స్తంభాలపై అశ్వరాయసింగారి శాసనం ఉంది. దీన్ని క్రీస్తుశకం 1727లో రాసినట్లు తెలుస్తోంది. ఆస్థాన మండపం ఎడమ వైపున ‘దేవరహస్యం’ అని పిలువబడే భూగుహ ఉంది. ఆలయ గోడలపై ఆకుపసర్లతో తీర్చిదిద్దిన కుడ్య చిత్రాలున్నాయి.

బౌద్ధ, జైన, శైవ మతాల సంగమం

శ్రీకాకుళానికి 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం బౌద్ధ, జైన, శైవ మతాల సంగమానికి గుర్తుగా నిలుస్తోంది. సంగమేశ్వర ఆలయం ఉన్న కొండను శిలాథ పర్వతమని పిలుస్తారు. ఆలయ ముఖద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. కొండపై జైనుల విగ్రహాలు మరో రెండున్నాయి. సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.మందిరాల ఆనవాళ్లు కూడా ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్