ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలోని వివిధ భాగాలకు వచ్చే ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే అంశం. అయితే ఇది అంటువ్యాధి మాత్రం కాదు. జీవనశైలిలో మార్పులు, ముందస్తుగా గుర్తించి చికిత్సలు చేయటం ద్వారా క్యాన్సర్ బాధితులు సైతం కోలుకుని సాధారణ జీవితాన్ని గడపొచ్చు. రొమ్ము క్యాన్సర్‌ను పూర్తిగా నివారించగల ఒకే పద్ధతి లేదు. అక్టోబర్ 19న ప్రపంచ రొమ్ము క్యాన్సర్ డే (World Breast Cancer Day) . మహిళల్లో అత్యధికంగా కనిపించే రొమ్ము క్యాన్సర్ పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం, దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించడం, నివారణా చర్యలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
ఆరోగ్యకరమైన జీవనశైలి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీర బరువును ఆరోగ్యకర స్థాయిలో ఉంచడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, పోషకాహారం తీసుకోవడం, మద్యం వినియోగాన్ని నివారించడం లేదా తగ్గించడం, పొగ తాగకుండా ఉండటం వంటి చర్యలు ఉపయోగకరమైనవి. తల్లి పాలివ్వడమూ కొన్ని సందర్భాల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇవన్నీ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కావు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నప్పటికీ రొమ్ము క్యాన్సర్ రావొచ్చు. అందుకే అవగాహనతో పాటు వయస్సు, ప్రమాద స్థాయికి అనుగుణంగా వైద్య సలహా తీసుకోవాలి. క్యాన్సర్ అనేది అంటువ్యాధికాదు. రోగితోపాటు ఉండే వారికి ఇదిసోకదు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. రొమ్ములో మార్పు కనిపించినా కుటుంబ సభ్యుల భయం, సామాజిక అపోహలు, ఖర్చు, ఆసుపత్రికి వెళ్లడంలో ఆలస్యం వంటి కారణాలతో కొందరు చికిత్సను వాయిదా వేస్తారు. అందుకే గ్రామస్థాయిలో ఆరోగ్య కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించడం, అనుమానిత లక్షణాలను తొలిదశలో గుర్తించడం, అవసరమైన వారికి పరీక్షలు చేయించడం, ప్రభుత్వ వైద్యసేవలతో అనుసంధానం చేయడం కీలకం. మొబైల్ వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి.
అపోహలు వీడాలి
రొమ్ము క్యాన్సర్‌పై సమాజంలో ఇంకా అనేక అపోహలు ఉన్నాయి. ‘గడ్డ కనిపిస్తే అది తప్పనిసరిగా క్యాన్సర్’, ‘నొప్పి లేకపోతే క్యాన్సర్ కాదు’, ‘కుటుంబంలో ఎవరికీ లేకపోతే మనకు రాదు’ వంటి భావనలు తప్పుదారి పట్టించొచ్చు. అదే విధంగా క్యాన్సర్ అంటే అంతే అని భావించడమూ సరికాదు. క్యాన్సర్ రకం, దశ, జీవ సూచకాలు, రోగి ఆరోగ్య పరిస్థితి వంటి అనేక అంశాలపై చికిత్స, ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల భయంతో చికిత్సను వాయిదా వేయకుండా, అపోహలకు బదులు వైద్య శాస్త్రంపై నమ్మకం పెంచుకోవాలి.
పరిశోధనకు ప్రజల సహకారం
రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు మరింత ముందుకు సాగాలంటే శాస్త్రవేత్తలు, వైద్యులు మాత్రమే కాదు.. సమాజమూ భాగస్వామి కావాలి. పరిశోధనలకు నిధులు, క్లినికల్ అధ్యయనాలకు సహకారం, శాస్త్రీయ అవగాహన, రోగులకు మానసిక–సామాజిక మద్దతు అవసరం. విద్యార్థుల్లోనూ క్యాన్సర్‌పై శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. వ్యాధిని మూఢనమ్మకాలతో కాకుండా జీవశాస్త్రం, వైద్యం, పరిశోధన కోణంలో అర్థం చేసుకునేలా చేయాలి. రోగులను వివక్షకు గురిచేయకుండా కుటుంబం, సమాజం అండగా నిలవాలి.
పరీక్షలకు భయపడొద్దు
అక్టోబర్ పింక్ నెల కేవలం పింక్ రిబ్బన్ ధరించే సందర్భంగా మిగలకూడదు. ప్రతి ఇంట్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెరగాలి. శరీరంలో వచ్చే మార్పులను గమనించడం, అనుమానాస్పద లక్షణాలను నిర్లక్ష్యం చేయకపోవడం, అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించడం అలవాటుగా మారాలి. పరిశోధనకు ప్రోత్సాహం, ప్రజలకు శాస్త్రీయ అవగాహన, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షల విస్తరణ, అందుబాటులో నాణ్యమైన చికిత్స.. ఇవన్నీ కలిసినప్పుడే రొమ్ము క్యాన్సర్ భారాన్ని తగ్గించగలం.
అవగాహన..అప్రమత్తతే ముఖ్యం
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్ల భారం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ అంచనా వేస్తున్నాయి. క్రమబద్ధత లేని జీవనం, శారీరక శ్రమ తగ్గడం, స్థూలకాయం, మద్యం వినియోగం, పొగాకు వినియోగం వంటి జీవనశైలి అంశాలు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ కుటుంబ చరిత్ర, జన్యుపరమైన మార్పులు, హార్మోన్ల ప్రభావం తదితర అనేక అంశాలు ప్రమాదాన్ని ప్రభావితం చేయొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సుమారు 80 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు లింగం, వయస్సు మినహా నిర్దిష్టంగా గుర్తించగల ప్రమాద కారకాలు లేని మహిళల్లోనూ సంభవిస్తాయి. అందుకే ప్రతి మహిళలో అవగాహన అవసరం.
ముందస్తు గుర్తింపే కీలకం
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గ్లోబల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇనిషియేటివ్ లక్ష్యం 2040 నాటికి రొమ్ము క్యాన్సర్ మరణాలను ఏటా 2.5 శాతం చొప్పున తగ్గించడం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ముందస్తు గుర్తింపు, సమయానుకూల నిర్ధారణ, నాణ్యమైన చికిత్స అందుబాటు కీలకమైనవి. ఆధునిక వైద్య చికిత్సలతో ఎలాంటి క్లిష్ట క్యాన్సర్లనైనా తగ్గించుకునే అవకాశాలు వచ్చాయి. వ్యాధిని తొలిదశలో గుర్తించి, సరైన పరీక్షలు చేయించి, క్యాన్సర్ రకాన్ని బట్టి చికిత్స అందిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
అక్టోబర్ అవగాహనా నెల
ఏటేటా అక్టోబర్‌ను ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలో పింక్ రంగు చిహ్నంగా నిలుస్తూ.. మహిళల్లో అవగాహన పెంచడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించేలా ప్రోత్సహించడం, పరిశోధనలకు మద్దతు ఇవ్వడం, చికిత్స అందుబాటును మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి పెడతారు.
లక్షణాలు తెలిస్తే నిర్లక్ష్యం వద్దు
రొమ్ములో కొత్తగా గడ్డ ఏర్పడటం, చంకలో గడ్డ లేదా వాపు, రొమ్ము పరిమాణం లేదా ఆకృతిలో మార్పు, చర్మంలో పల్లం పడినట్లు కనిపించడం, చర్మం మందంగా లేదా వేరుగా మారడం, చనుమొన లోపలికి తిరగడం, చనుమొన నుంచి అసాధారణ స్రావం రావడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే రొమ్ములో కనిపించే ప్రతి గడ్డ క్యాన్సర్ అని భావించాల్సిన అవసరం లేదు. చాలా గడ్డలు క్యాన్సర్ కానివి కూడా కావొచ్చు. స్వయంగా నిర్ణయించకుండా వైద్య నిపుణులని సంప్రదించడం అత్యవసరం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన లేదా మార్పు చెందుతున్న లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకూడదు.
నిర్ధారణలు ఎలా చేస్తారంటే...
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో వైద్య పరీక్ష, చిత్రీకరణ పరీక్షలు, అవసరమైతే కణజాల పరీక్ష కీలకం. వయస్సు, లక్షణాలు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ప్రమాద స్థాయి వంటి అంశాలను బట్టి వైద్యులు మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, అవసరమైన సందర్భాల్లో ఎంఆర్ఐ వంటి పరీక్షలను సూచించొచ్చు.
బయాప్సీ : క్యాన్సర్ ఉందా? లేదా? అన్నది కచ్చితంగా నిర్ధారించడానికి సాధారణంగా బయాప్సీ ద్వారా కణజాలాన్ని పరీక్షిస్తారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అది ఏ రకం? ఎంతవరకు వ్యాపించింది? కణాల్లో ఏ మార్పులు ఉన్నాయి? హార్మోన్ గ్రాహకాలు, హెచ్ఈఆర్-2 వంటి జీవసూచకాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను పరిశీలిస్తారు. వీటి ఆధారంగానే చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు.
రోగి స్థితిని బట్టి చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు ఒకే విధంగా ఉండవు. రోగి ఆరోగ్యస్థితి, వచ్చిన క్యాన్సర్ రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ చికిత్స రోగి పరిస్థితిని బట్టి మారుతుంది. శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ, హార్మోన్ చికిత్స, లక్ష్యిత చికిత్స, కొన్ని రకాల క్యాన్సర్లలో ఇమ్యూనోథెరపీ వంటి విధానాలను ఒంటరిగా లేదా కలిపి ఉపయోగించొచ్చు.
డిజిటల్ మామోగ్రఫీ, త్రీ-డీ టొమోసింథసిస్, ఎంఆర్ఐ వంటి చిత్రీకరణ విధానాలు కూడా కొన్ని సందర్భాల్లో వ్యాధి గుర్తింపుకు సహాయపడుతున్నాయి. అయితే ప్రతి పరీక్షను ప్రతి మహిళకు తప్పనిసరిగా చేయాలనే అర్థం కాదు. వయస్సు, ప్రమాద స్థాయి, లక్షణాలను బట్టి వైద్యుల సూచన ముఖ్యం.
భయం కాదు.. అవగాహన కావాలి. నిర్లక్ష్యం కాదు.. ముందస్తు పరీక్ష అవసరం. అపోహలు కాదు.. శాస్త్రీయ దృక్పథం అవసరం. పరిశోధన నుంచి చికిత్స వరకు సాగుతున్న వైద్యశాస్త్ర ప్రగతికి ప్రజల సహకారం తోడైతే రొమ్ము క్యాన్సర్‌పై పోరాటం మరింత బలపడుతుంది.

డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ
MS., Mch,(B.H.U)., FMAS
Chief Surgical Oncologist
కొత్తవంతెన రోడ్డు, విజయవాడ.
సెల్ : 9398520368








కామెంట్లు (0)