దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో గ్రామీణ మహిళల పాత్ర ఎంతో కీలకం. వ్యవసాయం, పశుపోషణ, చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి వంటి రంగాల్లో మహిళలు కీలకంగా పనిచేస్తున్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆదాయాన్ని సమకూర్చుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు. అయినప్పటికీ వారి శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం, అవకాశాలు అనేక సందర్భాల్లో లభించడం లేదు. గ్రామీణ మహిళలకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆర్థిక వనరులు, మార్కెట్ అవకాశాలు అందితే వారు స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా కుటుంబ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచగలరు. స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు, రుణ సదుపాయాలను వినియోగించుకుని చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తున్న మహిళలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్టోబర్ 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదు. నిర్ణయాలు తీసుకునే హక్కు, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం కూడా. గ్రామీణ మహిళల శ్రమను గుర్తించి, వారికి మరిన్ని అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే గ్రామీణ మహిళలను అభివృద్ధి భాగస్వాములుగా గుర్తించి, వారి సాధికారతకు ప్రభుత్వాలు, సమాజం మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. మొదటి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం 1995 అక్టోబర్ 15వ తేదీన 'ఉమెన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్' (Women’s World Summit Foundation) రూపకల్పన చేసి నిర్వహించింది. ఆ తర్వాత, 2007 డిసెంబర్ 18న, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 62/136 తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఈ తేదీని అధికారికంగా గ్రామీణ మహిళా దినోత్సవంగా గుర్తించింది. ప్రపంచ ఆహార వ్యవస్థలలో గ్రామీణ మహిళలు మరియు బాలికలు పోషించే కీలక పాత్రను ఇది నొక్కి చెబుతుంది. పంటల ఉత్పత్తి నుండి ఆహార పదార్థాల శుద్ధి, తయారీ, పంపిణీ వరకు, వేతనంతో కూడిన లేదా వేతనం లేని మహిళల శ్రమ వారి కుటుంబాలకు, సమాజాలకు, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోంది. అయినప్పటికీ, వారికి పురుషులతో సమానమైన గుర్తింపు లేదు, అధికారం లేదు; దీని ఫలితంగా, వారు తక్కువ ఆదాయాన్ని పొందుతూ, తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆహార భద్రత, గ్రామీణ పేదరిక నిర్మూలనలో గ్రామీణ మహిళలు పోషించే కీలకమైన పాత్రను గుర్తించి, ప్రోత్సహించటం ఈ గ్రామీణ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
వ్యవసాయంలో కీలకపాత్ర..
రాష్ట్రంలో గ్రామీణ మహిళల్లో అత్యధిక శాతం మంది మహిళలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. సాగుదారులుగా, కౌలు రైతులుగా, వ్యవసాయ కూలీలుగా, పశు పోషకులుగా, మత్స్య కారులుగా, అటవీ ఉత్పత్తుల సేకరణ దారులుగా, రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ఎందుకంటే భూమి కలిగి వుండి, పంటలు పండిస్తున్న వారినే అధికారికంగా రైతులుగా గుర్తిస్తున్నారు. పైన పేర్కొన్న ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారిని, ముఖ్యంగా మహిళలను రైతులుగా గుర్తించటం లేదు. తాజా వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో మహిళలు మొత్తం సాగు విస్తీర్ణంలో 12 శాతం భూమిని కలిగి ఉన్నారు. మొత్తం కమతాల్లో మహిళలు దాదాపు 14 శాతం మాత్రమే ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కమతాలలో 30 శాతం, మొత్తం సాగు విస్తీర్ణంలో 37 శాతం భూమిని మహిళలు సాగు చేస్తున్నారు . జాతీయ స్థాయి కంటే ఇది ఎక్కువగా అనిపించొచ్చు. అయితే వారు ఎక్కువగా కుటుంబ భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. వారి పేరు మీద భూమి పట్టాలు వున్నది సంఖ్యలోనూ, విస్తీర్ణంలోనూ కూడా తక్కువ.
రాష్ట్రంలో మొత్తం 85,24,000 వ్యవసాయ కమతాల్లో అత్యధికం(59,04,000) ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణం కలవే. వాటిని ఎక్కువగా కలిగి వున్నది ఎస్ సి, ఎస్ టి వర్గాలు, మహిళలు. అంటే వ్యవసాయం చేసే వారి దగ్గర చాలా తక్కువ భూమి వుంది. ఆయా తరగతుల్లో ఎక్కువ మంది భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది కౌలు రైతులున్నట్లు అధికారిక గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వారిలో 6.4 శాతం మంది భూమి లేనివారు (రాష్ట్రంలో 47 శాతం మంది రైతులకు ఎలాంటి భూమి లేదు).
ఎక్కువ మంది ఒంటరి మహిళలు..
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలు, కుటుంబ పెద్దగా వున్న మహిళలు ఎక్కువ సంఖ్యలో వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో కూడా మహిళా రైతులే పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అదే విధంగా పాడి పరిశ్రమలో కూడా పెద్ద ఎత్తున వున్నారు. దీని ద్వారా ఉపాధి పొందటమే కాకుండా కుటుంబ సభ్యులకు పోషకాహారం అందించటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సంస్కరణలు.. సంక్షోభాలు
1990 లలో దేశంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలతో అన్ని రంగాలు ప్రయివేటీకరణకు గురైన క్రమంలో వ్యవసాయ రంగంలో గత మూడు దశాబ్దాలకు పైగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. 1995 నుండి 2024 వరకు జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) ప్రకటించిన లెక్కల ప్రకారం దేశంలో నాలుగు లక్షల 11 వేల మందికి పైగా రైతులు వ్యవసాయ సంక్షోభ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో 15 శాతం వరకు మహిళా రైతులున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సంఖ్య 25 వేల వరకూ ఉండొచ్చునని ఒక అంచనా. ఇవి ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో, మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో జరిగాయి. పురుష రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలలోని మహిళలు, ఆ అప్పుల భారాన్ని మోస్తూ, వ్యవసాయాన్ని కొనసాగిస్తూ, కుటుంబ పోషణ సాగిస్తూ విపరీతమైన ఒత్తిడిలో బతుకుతున్నారు. పంట నష్టం, ఆదాయాలు తగ్గిపోవటం, ప్రభుత్వ మద్దతు వ్యవస్థలు అందుబాటులో లేకపోవటం వల్ల ఉన్న ఊళ్ళో పనులు లేక, పురుషులు వలస పోవటం మూలంగానూ మహిళలపైనే అధిక భారం పడుతోంది. వారు రకరకాల వేధింపులు, హింసను ఎదుర్కొంటున్నారు.
వలస కుటుంబాల్లో పిల్లలపై తీవ్ర ప్రభావం
వర్షాధార వ్యవసాయం సాగిస్తున్న శ్రీకాకుళం, కర్నూలు తదితర జిల్లాల నుండి ఖరీఫ్ పంట ముగిసే సమయం. అంటే దసరా పండుగ తర్వాత ఇతర జిల్లాలకు, కొన్ని తెలంగాణ జిల్లాలకు 2 నుంచి 3 నెలల పాటు వలస వెళ్ళటం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ విధంగా వలస వెళ్ళటంలో మొత్తం కుటుంబాలు, పిల్లలతో సహా వెళ్ళటం కనిపిస్తోంది. వలస వెళ్ళినచోట వారికి సరైన నివాస వసతి, నీరు, మరుగుదొడ్ల వసతి లేక మహిళలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలా వలస వెళ్ళిన కుటుంబాల్లోని పిల్లలూ పనిచేస్తారు. వారి చదువులు దెబ్బతినటమే కాకుండా వారి శారీరక మానసిక ఎదుగుదల కుంటుపడుతోంది.
గుర్తింపేదీ?
అంతర్జాతీయంగా మహిళలు వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 80 శాతం దోహదం చేస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ఆహార, వస్తు ఉత్పత్తిలోనూ ప్రధాన భాగస్వామిగా ఉన్న మహిళలకు భూమి వంటి సహజ వనరులపై అధికారం, హక్కులు లేవు. వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ వ్యవసాయంలోనూ నిర్ణయాధికారం లేదు. ఈ నేపథ్యంలో 2026ను ఐక్యరాజ్యసమితి “అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం”గా ప్రకటించింది. ఇది వ్యవసాయ రంగంలో మహిళలకు మద్దతుగా విధానాల్లో సంస్కరణలను తీసుకురావటానికి.. మహిళలకు వ్యవసాయ వనరులపై హక్కులను కల్పించే దిశలో పనిచేయటానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
నికరంగా నిలబడి పనిచేస్తున్న ‘మకాం’
జాతీయ స్థాయిలో 2015లో ఏర్పడిన మహిళా రైతుల హక్కుల వేదిక (మకాం) రెండేళ్ల పాటు చేసిన నిరంతర కృషి ఫలితంగా 2017 లో కేంద్ర వ్యవసాయ మంత్రి అక్టోబర్ 15 వ తేదీని ‘మహిళా రైతుల దినోత్సవం’ గా ప్రకటించి, దేశవ్యాప్తంగా జరగుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అప్పటినుండి మన దేశంలో ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన కార్యాలయాలు, పరిశోధనా సంస్థలు అక్టోబర్ 15వ తేదీన మహిళా రైతుల దినోత్సవంగా జరుపుతున్నాయి. మహిళా రైతులతో సమావేశాలు నిర్వహించి, వారిని సత్కరిస్తున్నాయి. మహిళా రైతులు, వ్యవసాయ కూలీలతో పనిచేసే సంస్థలు, సంఘాలు కూడా అక్టోబర్ 15 వ తేదీని గ్రామీణ మహిళా దినోత్సవం, మహిళా రైతుల దినోత్సవంగా జరుపుకుంటూ మహిళలు వ్యవసాయంలో పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను ఎలుగెత్తి చాటుతున్నాయి. వారి హక్కుల కోసం పోరాడుతున్నాయి.
మొక్కుబడిగా జరుపుకోవటం కాకుండా వారికి నిజమైన సాధికారత, గుర్తింపు కలిపించటానికి కృషి చేయాల్సిన అవసరం వుంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. మహిళా రైతులకు భూమి, నిరుపయోగంగా ఉన్న అటవీ భూములు, సాగునీటి వనరులు వంటివి అందుబాటులో ఉంచాలి. వారికి జీవనోపాధి వనరులపై హక్కులు కల్పించాలి. మహిళా రైతులు, కూలీలపై కుటుంబాలలోనూ, పనిచేసే చోటా జరుగుతున్న వ్యవస్థీకృత హింస, వేధింపులను గుర్తించి వాటిని నివారించే దిశగా కృషి చేయాలి. మహిళా వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలను, మహిళలకు, పురుషులకు సమానపనికి సమాన వేతనం అందించాలి. భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలకు వ్యవసాయ పథకాలు అందుబాటులోకి తేవాలి. వీటితో పాటు వారికి సామాజిక భద్రత పధకాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు కచ్చితమైన విధానపరమైన చర్యలు చేపట్టాలి.
ఎస్ ఆశాలత,
మహిళా రైతుల హక్కుల వేదిక
(మకాం) 94901 19242








కామెంట్‌లు (0)