సింహపురి పర్యాటకులకు కనుల విందు చేస్తోంది.... సాగర తీరం ఇతర జిల్లాలు, రాష్ర్టపర్యాటకులకు అనుభూతి మిగుల్చుతోంది..నరసింహ కొండ. జొన్నవాడ కామాక్షి దేవాలయం, మైపాడు , కొత్త కోడూరు , రామతీర్థం బీచ్ లు....నెల్లూరు నగరంలో ప్రపంచ ఖ్యాతి గడించిన బారా షాహీద్ రొట్టెల పండుగ. కసుమూరు మస్తాన్ వలీ దర్గా, కనుపూరు ముత్యాలమ్మ జాతర...ఎఎస్పేట దర్గా, సోమశిల, కండలేరు జలాశయాలు, సైదాపురంలో సిద్దలయ్యకోన, ఇలా జిల్లా నలుమూలల పర్యాటకులను విశేషంగా ఆకర్షించే అనేక కేంద్రాలున్నాయి.. ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నా ఆ స్థాయిలో ఎక్కడా పనులు సాగడం లేదు.
రొట్టెల పండుగకు 25 లక్షల మంది
నెల్లూరు నగరంలో ఏటేటా మొహరం సమయంలో బారా షాహీద్ రొట్టెల పండుగ జరుగుతుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. స్వర్ణాల చెరువు సమీపంలో 12 మంది మృత వీరుల జ్ఞాపకార్థం ఇక్కడ ఏర్పాటు చేసిన దర్గాకు యాత్రికులు పెద్దఎత్తున వస్తుంటారు. ఐదు రోజులపాటు జరిగే ఈ పండుగకు సుమారు 25 లక్షల మంది యాత్రికులు నెల్లూరుకు వస్తారు. కుల, మతాలకు అతీతంగా మతసామరస్యానికి పత్రీకగా ప్రతేడాది ఆ పండుగ జరుగుతుంది. జిల్లాలో ఇది ప్రత్యేక యాత్ర స్థలంగా మారిపోయింది. మంత్రి నారాయణ, ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహంతో రూ.25 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు. స్వర్ణాల చెరువు ఘాట్లు, దర్గా, రోడ్లు, డ్రెయిన్లు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించారు. నెల్లూరు రొట్టెల పండుగను ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్ణయించింది. నెల్లూరు ప్రాంతానికి వచ్చే ప్రతి పర్యాటకుడు ఇక్కడ దర్గాను దర్శంచుకోవడం పరిపాటి. ఇందుకూరుపేట - పల్లెపాడు వద్ద గ్రామంలో గాంధీ ఆశ్రమం ఉంది. విడవలూరు మండలం అలగానిపాడు గ్రామం కమ్యూనిస్టులకు సందర్శనీయక్షేత్రంగా ఉంది. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో నిర్మించిన గ్రంథాలయం పాఠకుల ఆదరణ పొందుతోంది. రాపూరు మండలం వద్ద పెంచల కోనలో జలపాతాలు ఆకట్టుకుంటాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలం, జొన్నవాడ గ్రామంలో కామాక్షమ్మ దేవాలయం పెన్నా నది తీరాన ఉంది. కొండపై వెలసిన నరసింహ స్వామి దేవాలయానికి ఐదు వందల సంవత్సరాల చర్రిత ఉంది. పెన్నా నదీ తీరంలో రంగనాయకుల స్వామి దేవాలయం, మూలా పేటలో వేణుగోపాల స్వామి దేవాలయం, రాజరాజేశ్వరి దేవాలయాలు ఉన్నాయి.
సముద్ర తీరం అందలా సాగరం..!
నెల్లూరు జిల్లాకు 180 కిలో మీటర్లు సముద్ర తీరం ఉంది. కోడూరు బీచ్, వేళాంగిణి మాత దేవాలయం ప్రత్యేకత. కృష్ణపట్నం పోర్టు ప్రపంచంలోనే అత్యంత లోతైన పోర్టుగా ఖ్యాతినెక్కింది. దేశ, విదేశాల నౌకలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి. మైపాడు, విడవలూరు సమీపంలో ఉన్న రామతీర్థంబీచ్ లు యాత్రికులతో కళకళలాడుతూ ఉంటున్నాయి. కొత్త కోడూరు, రామతీర్దం బీచ్ లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.







కామెంట్‌లు (0)