ఖండాంతరాలు దాటిన చేనేత వైభవం
ఆగస్టు 7 – జాతీయ చేనేత దినోత్సవం
దారానికి సృజనాత్మకతను జోడించడంలో వాళ్లకు వాళ్లే సాటి. వారి చేతుల్లో రూపుదిద్దుకున్న వస్త్రాలు.. కళాత్మకంగా కాంతులీనడంలో మేటి. నాజూకు చీరలైనా, సొగసైన కోకలైనా... వారు నేస్తే... మహిళలు వాటిని ధరిస్తే... వచ్చే ఆ నిండుదనం, రాజసం వేరు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం చేనేత వస్త్రాలు. ప్రకృతి, పర్యావరణానికి ఎంతో మేలైన ఈ వస్త్రాలు అందంతోపాటు మన్నికని ఇస్తాయి. అందుకే వీటిని అందరూ ఆదరిస్తుంటారు. చేనేత పేరు పలకగానే.. పట్టుపావడా కుచ్చిళ్లు కాళ్లకు అడ్డం పడుతున్నా పరుగులు ఆపని పకపకా నవ్వుల పాపాయి గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? ఐలారం.. చీరాల పేరాల సుతిమెత్తని చీరల్లో అమ్మ మడతపెట్టి తెచ్చిన పుట్టింటి జ్ఞాపకాలు ఎలా మరిచిపోగలం.
భారతీయ సంస్కృతికి, సంప్రదాయానికి, కళాత్మకతకు ప్రతీకగా నిలిచిన చేనేతకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. దారానికి సృజనాత్మకతను జోడించి ప్రపంచాన్ని అబ్బురపరిచిన చేతులు మన నేతన్నలవి. వారి చేతుల్లో ప్రాణం పోసుకున్న వస్త్రాలు కేవలం దుస్తులు కాదు.. అవి భారతీయ నాగరికతకు ప్రతిరూపాలు. నాజూకైన చీరైనా, సొగసైన పట్టు పంచె అయినా, అందమైన పావడా అయినా.. నేతన్న మగ్గంపై నేసిన ప్రతి వస్త్రంలో శ్రమ, కళ, సంస్కృతి, ఆత్మగౌరవం అల్లుకుపోయి ఉంటాయి.
చేనేత వస్త్రాలు ప్రకృతికి మిత్రం. పర్యావరణానికి హాని కలిగించవు. శరీరానికి అనుకూలంగా ఉండటంతో పాటు మన్నిక, అందం రెండింటినీ అందిస్తాయి. అందుకే కాలం మారుతున్నా చేనేతకు ఆదరణ తగ్గలేదు. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోనూ చేనేత తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.
చేనేత అనే మాట వినగానే వెంకటగిరి జరీ చీరల మెరుపులు, మంగళగిరి కాటన్ వస్త్రాల నాజూకుదనం, ఉప్పాడ జాందాని చీరల అందం, ధర్మవరం పట్టుచీరల వైభవం, పొందూరు ఖద్దరు సరళత, పెడన కలంకారీ కళాత్మకత మన కళ్లముందు కదలాడతాయి. గూడవల్లి, రాజోలు, అంబాజీపేట వంటి గ్రామాల్లో మగ్గాల చప్పుడు, ఇంటి ముందు ఆరబోసిన రంగురంగుల నూలు, గంగాళాల్లో నానబెట్టిన దారాలు... ఇవన్నీ చేనేత జీవన విధానానికి అద్దం పడతాయి.
ఒక సినీ కవి చెప్పినట్లు... "సింగారమనే దారంతో చేసిందీ చీర... ఆనందమనే రంగులను అద్దిందీ చీర..." అనే మాటలు అక్షరాలా మన నేతన్నలకే సరిపోతాయి. వారి చేతుల్లో పుట్టిన ప్రతి వస్త్రం ఒక కళాఖండమే.

మగ్గం నుంచి ప్రపంచ మార్కెట్ వరకు
ఒకప్పుడు గ్రామీణ జీవితానికి పరిమితమైన చేనేత నేడు ప్రపంచ మార్కెట్‌లో భారతీయ కళకు ప్రతినిధిగా నిలిచింది. సిరిసిల్ల చీరలు, పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ పట్టు, గొల్లభామ చీరలు, వరంగల్ డర్రీలు, రాజోలీ రగ్గులు, కొత్తపల్లి తువ్వాళ్లు... ప్రతి ప్రాంతం తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.
భారతీయ నేతన్నలు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరను నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇది కేవలం కళానైపుణ్యమే కాదు, భారతీయ శ్రామిక శక్తి, ఓర్పు, అంకితభావానికి నిదర్శనం.
వస్త్ర వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతీయ చేనేతదే. మగ్గంపై అల్లిన ప్రతి దారంలోనూ, వస్త్రం తయారీలో కార్మికుల శ్రమ, ప్రతి రంగులో సంస్కృతి, ప్రతి డిజైన్‌లో సృజనాత్మకత కనిపిస్తుంది.
స్వదేశీ ఉద్యమానికి స్ఫూర్తి
భారత స్వాతంత్య్రోద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మా గాంధీ చేతిలో చరఖా స్వావలంబనకు ప్రతీకగా మారింది. ఖద్దరు వస్త్రాలు స్వదేశీ ఉద్యమానికి ఇంధనమయ్యాయి. విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను ధరించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక మలుపు తీసుకొచ్చింది.
చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. అది స్వదేశీ ఆత్మగౌరవానికి చిహ్నం. దేశభక్తికి ప్రతీక. మనం ధరించే ప్రతి చేనేత వస్త్రం భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నామనే సందేశాన్ని ఇస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
భారతదేశంలో దాదాపు 150కు పైగా చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అసోం, కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక నేతకు ప్రసిద్ధి చెందింది.
ఇక్కత్, జాందాని, కలంకారీ, పటోలా, చందేరి, పైఠాణీ, మైసూరు సిల్క్, టసర్ సిల్క్, మూగా సిల్క్, పష్మినా, ఖాదీ... ఇలా భారతీయ చేనేతలో అనేక వైవిధ్యాలు కనిపిస్తాయి. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది.
సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే భారతీయ వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈజిప్టులోని కైరో ప్రాంతంలో లభించిన భారతీయ హంస డిజైన్ వస్త్రాలు ఇందుకు నిదర్శనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మస్లిన్ వస్త్రాలను అత్యంత పలుచగా నేసిన ఘనత కూడా భారతీయ నేతన్నలదే.

నేటి అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మన చేనేత కళాకారులు కొత్త డిజైన్లు రూపొందిస్తూ పోటీ ప్రపంచంలో తమ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను జోడించడం భారతీయ చేనేత విజయ రహస్యం.
ఆంధ్రప్రదేశ్‌లోని పెడన, మచిలీపట్నం కలంకారీ కళకు ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉంది. చెట్ల బెరడులు, ఆకులు, పూలు, విత్తనాలతో, సహజ సిద్ధంగా తయారుచేసిన రంగులతో వస్త్రాలపై బ్లాక్ ప్రింటింగ్ చేసే ఈ కళ శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. సహజ రంగుల వల్ల ఈ వస్త్రాలు పర్యావరణ హితంగా ఉండటమే కాకుండా కళాత్మక విలువను కూడా సంతరించుకుంటాయి. పెడన కలంకారీకి భౌగోళిక గుర్తింపు (GI) లభించడం ఈ కళా వైభవానికి నిదర్శనం.
శ్రీకాళహస్తి కలంకారీ మరో ప్రత్యేకత. ఇందులో బ్లాక్ ప్రింటింగ్‌కు బదులుగా కళాకారులు చేతితోనే పురాణాలు, ఇతిహాసాలు, దేవతా చిత్రాలు, ప్రకృతి దృశ్యాలను వస్త్రాలపై చిత్రిస్తారు. ఈ కళకు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు లభించాయి.
వెంకటగిరి చీరలు జరీ అంచులు, సున్నితమైన నేతకు ప్రసిద్ధి. రాజవంశాల ఆదరణతో అభివృద్ధి చెందిన ఈ చీరలు నేటికీ విలాసవంతమైన వస్త్రాలుగా గుర్తింపు పొందుతున్నాయి.
మంగళగిరి కాటన్ వస్త్రాలు సరళత, మన్నిక, ఆకర్షణీయమైన రంగుల కలయికతో ప్రత్యేకతను సంపాదించాయి. వేసవి కాలంలో ధరించేందుకు అనువైన ఈ వస్త్రాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ జాందాని చీరలు అత్యంత సున్నితమైన నేతతో ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఒక్క చీర నేయడానికి నెలల సమయం పట్టినా, ఆ కళాత్మకతకు తగ్గట్టుగానే వాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి విలువ లభిస్తోంది.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టు చీరలు వెడల్పాటి అంచులు, సంప్రదాయ రంగుల కలయికతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వివాహాలు, శుభకార్యాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దరు మహాత్మా గాంధీ ఆదరించిన వస్త్రంగా చరిత్రలో నిలిచింది. చేతితో వడికిన నూలుతో నేసే ఈ ఖద్దరు నాణ్యతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
లక్షలాది కుటుంబాలకు జీవనాధారం
చేనేత కేవలం ఒక పరిశ్రమ కాదు. ఇది లక్షలాది కుటుంబాల జీవనాధారం. నూలు వడకడం, రంగులు అద్దడం, పడుగులు తయారు చేయడం, మగ్గాల నిర్మాణం, డిజైన్లు రూపొందించడం, అద్దకం, మార్కెటింగ్ వంటి అనేక అనుబంధ రంగాలపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షలాది మంది చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక చీర తయారీ వెనుక అనేక మంది శ్రమ దాగి ఉంటుంది. అందుకే చేనేతను ఒక కుటుంబ ఆధారిత పరిశ్రమగా పేర్కొంటారు.
చేనేతలో మహిళల పాత్ర కూడా విశేషమైనది. నూలు చుట్టడం, రంగులు వేయడం, డిజైన్ తయారీ, నేతకు సహకరించడం వంటి అనేక పనుల్లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే రంగంగా కూడా చేనేతకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రపంచ మార్కెట్‌కు తగ్గట్లు మారుతున్న డిజైన్లు
కాలానుగుణంగా వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా చేనేత కళాకారులు కూడా కొత్త డిజైన్లు, కొత్త రంగులు, ఆధునిక నమూనాలను రూపొందిస్తున్నారు. సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం చేనేత వస్త్రాలు అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. పర్యావరణ హిత వస్త్రాలపై పెరుగుతున్న ఆసక్తి భారతీయ చేనేతకు మరింత అవకాశాలను తీసుకొస్తోంది.
యడవల్లిశ్రీ
9490099214








కామెంట్‌లు (0)