ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‌రాయల వైభవాన్ని తెలిపేలా కట్టడాలు

58 నిమిషాల క్రితం

LPK 3.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 11:05 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నుంచి లేపాక్షి వరకు, తిమ్మమ్మ మర్రిమాను నుంచి పెనుకొండ కోట వరకు అనేక చారిత్రక, పర్యాటక, విశిష్ట ప్రదేశాలు ఉన్నాయి.ఆయా ప్రాంతాల్లో నాటి రాయల వైభవాన్ని తెలియజేస్తూ అద్భుత కట్టడాలు ఉన్నాయి.

శిల్పకళకు లేపాక్షి, విజయనగర చరిత్రకు పెనుకొండ, ప్రపంచ పర్యాటక కేంద్రంగా పుట్టపర్తి, ప్రకృతి అద్భుతానికి తిమ్మమ్మ మర్రిమాను, పక్షుల సందడికి వీరాపురం ఇలా ప్రతి ప్రాంతం తనదైన ప్రత్యేకతను కల్గివున్నాయి. ​విజయనగర సామ్రాజ్య కాలం నాటి కళా వైభవానికి ప్రతీక లేపాక్షి. వీరభద్రస్వామి ఆలయం, వేలాడే స్థంభం, ఏకశిల నంది ప్రధాన ఆకర్షణలు. ఇక్కడి ఆలయ నిర్మాణం, శిల్పాలు మధ్యయుగ దక్షిణ భారత వాస్తు–శిల్ప సంపదను ప్రతిబింబిస్తాయి. రాతిలో చరిత్ర.. శిల్పాల్లో సంస్కృతి.. అడుగడుగునా విజయనగర వైభవం లేపాక్షి కట్టడాల్లో కనిపిస్తుంది. లేపాక్షి.. ఒక ఆలయం మాత్రమే కాదు. విజయనగర కాలం నాటి శిల్పకళ, చిత్రకళ, నిర్మాణ నైపుణ్యం, సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ మ్యూజియం. రాతిలో ప్రాణం పోసిన నాటి కళాకారుల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా లేపాక్షి నిలుస్తుంది. రాతి స్తంభాలపై చెక్కిన అద్భుత శిల్పాలు, పైకప్పులను అలంకరించిన కుడ్యచిత్రాలు, ఏకశిలపై మలిచిన మహానంది, నాట్యమండపంలోని అపురూప కళాకృతులు, అసంపూర్తిగా మిగిలిన కళ్యాణమండపం.. ఇలా అడుగడుగునా అబ్బురపరిచే కళా సంపద ఈ ఆలయ ప్రత్యేకత. నాటి శిల్పుల ప్రతిభకు నేటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తూ దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతరాయలు క్రీ.శ. 1530 నుంచి 1542 వరకు పాలించిన కాలంలో రాజ్యకోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కూర్మగిరి అనే కొండపై ఆలయం నిర్మించారు. తాబేలు ఆకారాన్ని పోలి ఉండటంతో ఈ కొండకు కూర్మగిరి అనే పేరు వచ్చినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ఒకప్పుడు ఏడు ప్రాకారాలతో విస్తరించిన ఆలయ సముదాయంలో ప్రస్తుతం నాలుగు ప్రాకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీరభద్రస్వామి ఆలయ నిర్మాణంలోనే ఓ వైవిధ్యం కనిపిస్తుంది.మొత్తం 876 స్తంభాలు ఉన్నట్లు చెబుతారు. వాటిలో అనేక స్తంభాలపై అద్భుతమైన శిల్పాలను చెక్కారు.

మహానంది : ఏకశిలపై మహానంది లేపాక్షి అనగానే గుర్తుకొచ్చేది మహానంది. ఈ నందీశ్వరుని విగ్రహం సుమారు 8.1 మీటర్ల ఎత్తుతో ఆలయానికి కొంత దూరంలో మహాలింగానికి ఎదురుగా కొలువుదీరింది. నందికి మెడపట్టీపై గంటలు, మువ్వలు, రుద్రాక్షమాలలు అత్యంత సున్నితంగా చెక్కారు. మూపురంపై శివలింగాన్ని మలిచారు. మెడ కింద భాగంలో కనిపించే గరుడ పక్షుల ఆకృతులు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నంది విగ్రహం అప్పటి శిల్పుల అసాధారణ నైపుణ్యానికి ప్రతీక. లేపాక్షి బసవన్నను ప్రముఖ కవి, చిత్రకారుడు అడవి బాపిరాజు తన రచనల్లో కీర్తించారు. నంది శిల్పం కళా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.

కుడ్యచిత్రాల్లో ఒక్కో గోడపై కనిపించే డిజైన్‌ మరోదానికి భిన్నంగా ఉండటం శిల్పుల సృజనాత్మకతకు నిదర్శనం.

నాట్యమండపం శిల్పకళా వైభవం

ఆలయంలోని రెండో ప్రాకారంలో ఉన్న నాట్యమండపం అపురూప శిల్ప సంపదకు నిలయం. శతపత్రకమలం ఆకారంలో తీర్చిదిద్దిన పైకప్పు, స్తంభాలపై చెక్కిన నాట్యభంగిమలు చూపరులను ఆకట్టుకుంటాయి. రంభ నాట్యం, తుంబురుడు, నటేశ్వరుడు, నంది, బ్రహ్మ తదితర రూపాలను అద్భుతంగా మలిచారు. భృంగీశ్వరుడిని నాట్యాచార్యుడిగా చూపించిన తీరు విశేషం. శివుడి భిక్షాటన దృశ్యాన్ని సహజత్వం ఉట్టిపడేలా చెక్కారు. నాట్యమండపంలోని వేలాడే స్తంభం అప్పటి నిర్మాణ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. పైకప్పుపై కిరాతార్జునీయం, మనుచరిత్ర వంటి పురాణగాథలను చిత్రించారు. ఆరు శతాబ్దాలు గడిచినా అవి నేటికీ సజీవంగా కనిపించడం లేపాక్షి కళా వైభవానికి నిదర్శనం.

శివపార్వతుల కళ్యాణ దృశ్యాలు, దేవతలు, రాజులు, మహర్షుల శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి. రెండు కోతులను విభజించినట్లు కనిపించే శిల్పం, ఒకే దేహంతో మూడు తలల ఆవు వంటి అరుదైన శిల్పాలు చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. అనేక రకాల ఆకృతులు, లేపాక్షి డిజైన్లు శిల్పుల ఊహాశక్తికి అద్దం పడతాయి. కళ్యాణ మండపం సమీపంలోని వినాయకుడు, ఏడు పడగల సర్పం తదితర శిల్పాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

​​​రాయల కీర్తి పతాక పెనుకొండ

విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధానిగా పెనుకొండ వెలుగొందింది. అక్కడ ఉన్న అలనాటి నిర్మాణాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. వెలుగులీని అలసిపోయిన దీప స్తంభాలు, ఆధ్యాత్మిక సుగంధాలు పంచిన ఆలయాలు, మూగబోయిన కళా మండపాలు, విశాల వాకిళ్లు, ఎత్తైన బురుజులు, నేటికీ చెక్కుచెదరని మెట్ల బావులు, పంట భూములను తడుపుతున్న చెరువులు గత శతాబ్దాల నాటి ఆనవాళ్లు. పెనుకొండలో పురాతన దేవాలయాలు, గిరిడురాయి, రాజ భవనాలు, నేటికీ చెక్కు చెదరని కోట గోడలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఆనాటి ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కట్టడాల్లో కనిపించే వైవిధ్యం, శిల్పాకళా నైపుణ్యం అబ్బుర పరుస్తున్నాయి. నాటి రాయలపాలన ఘన చరిత్రకు నిదర్శనంగా నిలుస్తున్న నిర్మాణాలు, దేవాలయా ల్లో అబ్బుర పరుస్తున్న శిల్ప సంపద విజయనగర రాజుల రెండో రాజధానిగా విరాజిల్లిన పెనుకొండ జైనులు, ముస్లింలు, హిందువులతో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

బుక్కరాయల కుమారుడైన వీర విరుపణ్ణ ఉడయార్ కాలంలో ఈ శతృదుర్భేద్యమైన గిరి దుర్గం (కోట) నిర్మించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెనుకొండ అత్యంత వైభవాన్ని చూసింది. ఆయనకు ఇది వేసవి విడిది కేంద్రంగా ఉపయోగపడింది. ఇకడ గగన్ మహల్ (రాజప్రసాదం) క్రీ.శ. 1575 లో నిర్మించిన ఈ ప్యాలెస్ హిందూ,ఇస్లామిక్ నిర్మాణ శైలుల అద్భుత సమ్మేళనం. శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి, రాయలచే ఆప్యాయంగా 'అప్పాజీ' అని పిలవబడిన తిమ్మరుసును (రాయల కుమారుడి మరణానికి కారణమనే అపవాదుతో) ఇక్కడి జైలులోనే బంధించి, కళ్ళు పీకించారని చరిత్ర చెబుతుంది. ఈ చిన్న చీకటి గది నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పెనుకొండ కోట ప్రధాన ప్రవేశ ద్వారమైన 'ఎర్రమంచి గేటు' వద్ద సుమారు 11 అడుగుల ఎత్తైన భారీ హనుమంతుని విగ్రహం ఉంది. ఊరు వాకిలి ఆంజనేయ స్వామిగా నేడు పిలుస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్