కృష్ణానదీ తీరాన ఇంద్రకీలాద్రి కొండపైనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం. దసరా నవరాత్రుల్లో దేశం నలుమూలల నుండి లక్షలాది మంది వస్తుంటారు. ఇంద్రకీలాద్రి పైనుండి కిందకు చూస్తే ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే కృష్ణా నది, సువిశాలమైన విజయవాడ నగర దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ నగరానికి మణిహారం. సాయంత్రం వేళల్లో రంగురంగుల ఎల్‌ఈడీ లైట్ల వెలుగుల్లో ఈ బ్యారేజ్ సరికొత్తగా మెరిసిపోతుంది. చల్లని గాలిని ఆస్వాదిస్తూ, నదిపై సూర్యాస్తమయ దృశ్యాలను చూడటానికి స్థానికులతో పాటు పర్యాటకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వర్షాకాలంలో నిండుగా కృష్ణానది కనిపిస్తూ బ్యారేజీ గేట్లు ఎత్తేసిన సమయంలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కే సమయంలో వేలాదిగా సందర్శకులు వచ్చి తిలకిస్తుంటారు.
హరిత బెర్మ్ పార్క్ (పున్నమిఘాట్-ఎపిటిడిసి) : విజయవాడ భవానీపురంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఎపిటిడిసి హరిత బెర్మ్ పార్క్ రిసార్ట్ పర్యాటకులకు అద్భుతమైన వసతి, వినోద సౌకర్యాలను అందిస్తోంది. ఈ పార్కు సాయంత్రపు వేళల్లో సేదతీరడానికి, నడకకు ఎంతో అనుకూలమైన ప్రదేశం. ఉదయం 9:00 నుండి రాత్రి 8:30 గంటల వరకూ ఈ పార్కును సందర్శించొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా, సుందరమైన లాన్లు, నది ఒడ్డున కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడానికి వీలుగా సిట్టింగ్ బెంచీలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ లభించే బోటింగ్, వసతి, చిల్డ్రన్ పార్క్ రుచికరమైన ఆహారాన్ని అందించే రెస్టారెంట్ సౌకర్యాలు వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి వచ్చే సందర్శకులకు ఒక పరిపూర్ణమైన పర్యాటక అనుభూతిని అందిస్తున్నాయి.
భవానీ ద్వీపం : ప్రకృతి ఒడిలో ప్రకృతిని ప్రేమిస్తూ, కాస్త సాహస క్రీడలతో ఎంజాయ్ చేయాలనుకునే యువతకు, కుటుంబ సమేతంగా వీకెండ్ గడపాలనుకునే వారికి 'భవానీ ఐలాండ్' ఆకర్షిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నది నడిబొడ్డున 133 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
అమరావతి బోటింగ్ క్లబ్ వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ (పయివేటు) : దాదాపు రూ.51.48 కోట్ల వ్యయంతో భారీ అడ్వెంచర్ జోన్‌లో స్పీడ్ బోటింగ్, జెట్ స్కీయింగ్, కయాకింగ్ వంటి ఆధునిక వాటర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అత్యాధునిక జెట్ స్కీ, స్పీడ్ బోట్లు, ఫ్యామిలీ క్రూయిజ్ సేవలను అందుబాటులో ఉంచారు.

బటర్ ఫ్లై పార్కు : ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి అటవీ శ్రేణుల్లోని మూలపాడులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'బటర్ ఫ్లై పార్క్' పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. దాదాపు 50కి పైగా రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు విహరించే ఈ వనంలో సందర్శకుల కోసం ప్రత్యేకంగా రెండు కిలోమీటర్ల పొడవైన నేచురల్ వాకింగ్ ట్రయల్‌ను (నడక మార్గం) ల్యాండ్‌స్కేపింగ్ పద్ధతిలో తీర్చిదిద్దారు. వ్యూ పాయింట్లు, ఫొటో స్పాట్‌లు, సాహస క్రీడలైన జిప్ లైన్ రైడ్స్, స్కై సైక్లింగ్ సదుపాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో నెమలి ధార, క్షీరలింగ జలపాతం వంటి సహజ జలపాతాలు, సెలయేళ్లు పారే దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రత్యేకమైన ట్రెక్కింగ్ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పర్యాటకుల సౌకర్యార్థం అటవీ శాఖ ఆధ్వర్యంలోనే 14 కిలోమీటర్ల మేర సాగే సరికొత్త 'జంగిల్ సఫారీ' వాహన వసతిని కూడా ఉంది.
కొండపల్లి ఖిల్లా : ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు, ఆ తర్వాత కుతుబ్ షాహీల కాలంలో అత్యంత కీలకమైన రక్షణ దుర్గంగా వెలిసిన ఈ కోట కొండలపై మూడు అంతస్తుల నిర్మాణంతో గంభీరంగా ఉంటుంది. కోటలోని 'తనీషా మహల్', ఏకశిలా గ్రానైట్‌తో చెక్కిన 'దర్గా దర్వాజా' అప్పటి ఇంజనీరింగ్ అద్భుతాలు. ఈ కోట చుట్టుపక్కల ఉండే దట్టమైన అడవులు ట్రెక్కింగ్ ప్రియులకు ఆకర్షిస్తోంది. ఈ కోట పాదాల చెంత ఉండే గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన, భౌగోళిక గుర్తింపు (జిఐ ట్యాగ్) పొందిన కొండపల్లి బొమ్మల తయారీని పర్యాటకులు ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. కొండపల్లి బొమ్మల ఎక్ష్సీపిరియాన్స్ సెంటర్‌లో తెల్ల పొనికి కర్రతో చేసే ఈ హస్తకళాఖండాలను కొనుగోలు చేయడానికి పర్యాటకులు ఎగబడుతుంటారు.
బాపు మ్యూజియం (విక్టోరియా జూబ్లీ మ్యూజియం) : ఆధునిక హంగులతో, డిజిటల్ గ్యాలరీలతో పునర్నిర్మించబడిన ఈ మ్యూజియంలో శతాబ్దాల నాటి బౌద్ధ, హిందూ శిల్పాలు, నాణేలు, ఆయుధాలు ప్రదర్శనలో ఉన్నాయి. దేశ చరిత్రలోనే ఒక ప్రముఖ ఘట్టానికి ఇది వేదిక – 1921లో జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య... మహాత్మా గాంధీకి మన త్రివర్ణ పతాకాన్ని ఈ చారిత్రక భవనంలోనే మొదట అందించారు.
గాంధీ హిల్ : భారతదేశంలో మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో కొండపై నిర్మించిన మొదటి మెమోరియల్ ఇది. దాదాపు 500 అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండపై నుండి రాత్రి వేళల్లో విజయవాడ నగరం విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎలా మెరిసిపోతుందో 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. ఇక్కడి ప్లానిటోరియం, పిల్లల కోసం నడిచే టాయ్ ట్రైన్, సాయంత్ర వేళల్లో జరిగే సౌండ్ అండ్ లైట్ షో పర్యాటకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి.
రాజీవ్ గాంధీ, రాఘవయ్య పార్కులు: కృష్ణా నది, కెనాల్స్ పక్కనే ఉన్న ఈ పార్కులు సాయంత్రం వేళల్లో ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా గడపడానికి అనువైనవి. రాఘవయ్య పార్కులోని సస్పెన్షన్ స్లింగ్ బ్రిడ్జ్, రాజీవ్ గాంధీ పార్కులోని మ్యూజికల్ ఫౌంటెన్, గేమ్ జోన్‌లు పిల్లలను విశేషంగా ఆకర్షిస్తాయి.
విజయవాడలోని మొగల్రాజపురం గుహలు పురావస్తు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. ఐదో శతాబ్దం నాటి శిలా గుహల్లోని శిల్పాలు, ముఖ్యంగా అర్ధనారీశ్వర రూపం, నాటరాజ, వినాయక విగ్రహాలు గతకాలపు కళా వైభవాన్ని తెలియజేస్తాయి. పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ ఆలయానికి పెద్దఎత్తున యాత్రికులు వస్తుంటారు.

గుణదల మేరీమాత ఆలయం : విజయవాడలోని గుణదల కొండపై వెలసిన గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్రం ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. 1923లో ఇక్కడ కాథలిక్ మిషనరీల ఆధ్వర్యంలో అనాథాశ్రమం, విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. 1925లో ఫాదర్ పి. అర్లాటి కొండపై సహజ గుహలో మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఈ పుణ్యక్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. కొండ మధ్యలోని గుహ, శిఖరాగ్రంలోని పవిత్ర శిలువ, కొండపైకి వెళ్లే మార్గం యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణలు. 1971లో ప్రధాన చర్చి నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు ఇక్కడికి తరలివస్తుంటారు.








కామెంట్‌లు (0)