ఒకప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే పర్యాటక శాఖ బ్రోచర్ కోసం వెతికేవాళ్లం. ఇప్పుడు చేతిలోని మొబైలే ప్రపంచానికి కొత్త టూరిజం గైడ్. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో పర్యాటకానికి సంబంధించి వ్లాగర్స్ తీసే అద్భుతమైన వీడియోలు అనేకం వున్నాయి. ఒక వ్లాగ్ చూస్తే చాలు—తెలియని ఊరికి దారి కనిపిస్తుంది. స్థానిక హోటల్‌లో ఆవిరి కక్కే వంటకం ఎదురవుతుంది. బస్సు కిటికీలోంచి కనిపించే కొండలు ఉత్సాహపరుస్తాయి. ఓ గ్రామీణ కుటుంబం మనతో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. తెరపై కనిపించే ఆ పది నిమిషాల ప్రయాణం, మనలోని పర్యాటకుడిని మేల్కొలుపుతుంది. 2026లో పర్యాటకం అంటే... కేవలం ప్రదేశాలను చూసే ప్రయాణం కాదు; వ్లాగర్ల కెమెరా కంటితో ప్రదేశాలను, మనుషులను, సంస్కృతిని, రుచులను, ప్రకృతిని అనుభవించే సరికొత్త ప్రయాణంగా మారుతోంది. ఒకప్పుడు ఏ ప్రదేశానికి ఎలా వెళ్లాలో మ్యాప్‌లో చూసేవాళ్లం. ఇప్పుడు వెళ్లే ముందు అక్కడి వీధులు ఎలా ఉంటాయో, అక్కడి ప్రజలు ఎలావుంటారో, వారి అలవాట్లు, అభిరుచులు ఎలా వుంటాయో, వాళ్ల సంస్కృతి సంప్రదాయాలు, ఆహర అలవాట్లు, హోటల్ గది, భోజనం రుచి ఎలా ఉంటుందో, ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, షార్ట్ వీడియోలను చూస్తున్నాం. పర్యాటక ప్రపంచంలో ఇది చిన్న మార్పు కాదు. ప్రయాణాన్ని చూసే చూపే మారిపోయింది.
ఒకప్పుడు ప్రయాణం ముగిసిన తర్వాత ఫొటో ఆల్బమ్ తయారయ్యేది. ఇప్పుడు ప్రయాణం మొదలైన క్షణం నుంచే కెమెరా ఆన్ అవుతుంది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయం... ఎక్కడ నుంచి బయల్దేరినా... రోడ్డుపక్కన టీ తాగడం నుంచి స్థానికులతో మాట్లాడటం, చిన్న, పెద్ద హోటళ్లలో భోజనం చేయడం, స్థానిక ప్రదేశాలను సందర్శించడం, బడ్జెట్ లెక్కలు చెప్పడం—అన్నీ కంటెంట్‌గా మారుతున్నాయి. అంటే, ఇక్కడ వ్లాగర్ కేవలం పర్యాటకుడిగా మాత్రమే ఉండటం లేదు. గైడ్, కథకుడు, సమీక్షకుడు, అనుభవాన్ని పంచుకునే స్నేహితుడుగా మారుతున్నాడు.

ప్రభావం.. అనుభూతులు..
ఒక ప్రదేశానికి వెళ్లే ముందు అక్కడి దృశ్యాలు, వసతి, రహదారి, ఆహారం, ఖర్చు, స్థానిక వాతావరణం ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి పర్యాటకులు ముందుగా వీడియోలను చూడటం పెరుగుతోంది. పర్యాటక శాఖ ప్రకటన ఒక ప్రదేశం గురించి సమాచారం ఇవ్వొచ్చు; కానీ ఒక వ్లాగర్ తీసిన పది నిమిషాల వీడియో ఆ ప్రదేశాన్ని చూసిన అనుభూతిని కలిగిస్తుంది. కెమెరా వెంట ప్రయాణిస్తూ రహదారిని చూపించడం, స్థానికులతో మాట్లాడటం, ఆహారాన్ని రుచి చూడటం, చిన్న హోటల్‌లో ఉండటం, ఎదురైన ఇబ్బందులను చెప్పడం వంటి వ్లాగర్ అనుభవాలు పర్యాటకుడికి తన ప్రయాణంపై ఒక స్పష్టతను కలిగిస్తాయి. మొదట ఆసక్తితో చూసి, వీడియో పూర్తయ్యేసరికి మనమూ ఒకసారి వెళ్లాలి అనే ప్రయాణ కోరికగా మారుతోంది. చిన్న విరామాలతో చేసే ప్రయాణాలు, దేశీయ పర్యటనలు, ఒంటరి ప్రయాణాలు, బడ్జెట్ ట్రిప్పులు, ఆధ్యాత్మిక పర్యటనలు, ప్రకృతి యాత్రలు, అడ్వెంచర్ ట్రావెల్ వంటి విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి. 2026 ప్రయాణ ధోరణులపై వచ్చిన నివేదికల్లో దేశీయ ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతున్నట్లు కూడా నమోదైంది. ఇందులో సోషల్ మీడియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలే గమ్యాలుగా ఉండేవి. ఇప్పుడు ఒక చిన్న గ్రామం, తెలియని కొండదారి, స్థానిక జాతర, పాత కోట, నది ఒడ్డున ఉన్న చిన్న ఊరూ ఒక్క వ్లాగ్‌తో కొత్త పర్యాటక కేంద్రంగా మారుతోంది.
తెలియని ప్రాంతాలు వెలుగులోకి..
తెలియని ప్రాంతాలను పర్యాటకుల ముందుకు తీసుకురావడంలో వ్లాగర్లు ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. పెద్దగా ప్రచారం లేని ఓ చిన్న గ్రామం, కొండ ప్రాంతం, జలపాతం, చెరువు, పాత దేవాలయం, చారిత్రక ప్రదేశం లేదా స్థానిక ఆహారం—వ్లాగర్ కెమెరాలో కనిపించిన క్షణం నుంచి ఆ ప్రదేశానికి కొత్త గుర్తింపు వస్తోంది. మ్యాప్‌లో ఒక చిన్న బిందువుగా ఉన్న ఊరు, సామాజిక మాధ్యమాల్లో వేలాది మందికి కనిపించే పర్యాటక గమ్యస్థానంగా మారుతోంది. ముఖ్యంగా స్థానికుల జీవనశైలి, సంప్రదాయాలు, వంటకాలు, ప్రకృతి అందాలను చూపించే వ్లాగ్‌లు పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా, స్థానిక దుకాణాలు, వసతి, రవాణా వంటి చిన్న వ్యాపారాలకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఒకప్పుడు పర్యాటక శాఖ పరిచయం చేయాల్సిన ప్రదేశాలను ఇప్పుడు ఒక మొబైల్ కెమెరా ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

లోకల్ లైఫ్..
పర్యాటక వ్లాగ్‌లలో వస్తున్న మరో ముఖ్యమైన మార్పు లోకల్ లైఫ్‌ను దగ్గరగా చూపించడం. ఇప్పుడు వ్లాగర్లు కేవలం ఆయా ప్రదేశాల అందాలనే కాదు... ఆ ప్రాంత ప్రజల జీవితం, వారి భాష, గ్రామీణ సంస్కృతి, స్థానిక ఆహారం, చిన్న హోటళ్లు, బస్సు ప్రయాణాలు, సందడిగా ఉండే మార్కెట్లు, తరతరాలుగా కొనసాగుతున్న చేతివృత్తులను కూడా కెమెరాలోకి తీసుకొస్తున్నారు. స్థానికులతో మాట్లాడుతున్నారు. వారి ఇళ్లలో బస చేస్తున్నారు. దీంతో పర్యాటకుడు ఒక ప్రదేశాన్ని కేవలం చూసి వెళ్లడం కాకుండా, అక్కడి మనుషుల మధ్య కొంతసేపు జీవించిన అనుభూతిని పొందుతున్నాడు. ఒక గ్రామం అంటే అక్కడి కొండలు, చెట్లు, దేవాలయాలు మాత్రమే కాదు— స్థానిక ప్రజలు, వారి మాటలు, వంటల వాసనలు, బతుకుతెరువు, సంస్కృతి కలిసిన సజీవ ప్రపంచాన్ని వ్లాగర్లు కొత్తగా పరిచయం చేస్తున్నారు. టూరిజంలో ఇదో కొత్త అనుభూతి.
రుచుల వెంట ప్రయాణం..
ట్రావెల్ వ్లాగ్స్‌లో మరో ముఖ్యమైన మార్పు ఫుడ్ టూరిజం. ఒక ప్రాంతాన్ని దాని చారిత్రక కట్టడాల ద్వారా మాత్రమే కాదు.. ఆయా ప్రాంతాల్లో ప్రముఖంగా లభించే ఆహారంతో పాటు స్థానికంగా దొరికే వీధి ఆహారం కూడా పరిచయం చేస్తున్నారు. దీంతో ఫలానా ఊరికి వెళ్లాలి, అక్కడి ప్రాంతాలను తప్పకుండా చూడాలనే కోరికతో పాటు “అక్కడి ఆహారం తినాలి” అనే కోరికగా మార్చడంలో ఫుడ్ వ్లాగ్స్ పాత్ర పెరుగుతోంది. అదే సమయంలో స్థానిక హోటళ్లు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తిదారులు, గ్రామీణ ఉత్పత్తులకు కూడా డిజిటల్ ప్రచారం లభిస్తోంది. అంటే వ్లాగ్ ఒక వ్యక్తి ప్రయాణకథ మాత్రమే కాకుండా స్థానిక ఆర్థికవ్యవస్థకు డిజిటల్ వేదికగా కూడా మారుతోంది.

వ్లాగర్ నుంచి ఏఐ వరకు..
ఇప్పుడు పర్యాటకంలో మరో కొత్త సహచరుడు చేరాడు—అదే కృత్రిమ మేధస్సు. ఎక్కడికి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఏ మార్గంలో వెళ్లాలి, ఎన్ని రోజులు ఉండాలి, బడ్జెట్ ఎంత కావాలి, ఏ ప్రాంతాల్లో ఏమేమి చూడాలి, స్థానికంగా ఏ ఆహారం ప్రయత్నించాలి, ఏ ప్రాంతంలో ఏ ఆహారం ప్రసిద్ధి? వంటి విషయాల్లో ఏఐ సూచనలు ఇవ్వగలదు. ఒక పర్యాటకుడి సమయం, ఖర్చు, ఆసక్తులకు అనుగుణంగా ప్రయాణ ప్రణాళికను రూపొందించడం, వివిధ ప్రదేశాలను పోల్చడం, మార్గాలను సూచించడం వంటి పనుల్లో ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. భాషా అనువాదం, మ్యాపింగ్, వ్యక్తిగతీకరించిన సిఫారసులు, కంటెంట్ తయారీ, వీడియో ఎడిటింగ్ వంటి అనేక రంగాల్లో ఏఐ పాత్ర పెరుగుతోంది. యుఎన్ టూరిజం కూడా పర్యాటక రంగంలో ఏఐని సమర్థత, వ్యక్తిగతీకరణ, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచే సాధనంగా పరిశీలిస్తోంది. ఏఐ చెప్పింది అంతా వాస్తవం అనుకోవడం ప్రమాదకరం. మారిన రహదారులు, మూసివేసిన ప్రదేశాలు, తాజా టికెట్ ధరలు, వాతావరణ పరిస్థితులు, స్థానిక నియమాలు వంటి సమాచారం మారుతూ ఉంటుంది. అంతేకాదు, ఏఐ ఒక ప్రదేశం గురించి సమాచారం ఇవ్వగలదు. కానీ అక్కడి మనుషుల అనుభవాన్ని పూర్తిగా భర్తీ చేయలేదు. అందుకే ఏఐని ‘ప్రయాణ ప్రణాళిక సహాయకుడిగా’ మాత్రమే చూడాలి; తుది నిర్ణయానికి మాత్రం మనదే కావాలి.
కెమెరా వెనుక వ్యాపారం..
ట్రావెల్ వ్లాగింగ్ ఇప్పుడు కేవలం హాబీ కాదు. డబ్బు సంపాదనకు మార్గంగానూ మారింది. వీక్షణలు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ భాగస్వామ్యాలు, హోటల్ ప్రమోషన్లు, టూరిజం సంస్థల ప్రచారాలు— ఇవన్నీ వ్లాగర్ ఆర్థికవ్యవస్థలో భాగమవుతున్నాయి. “నేను చూస్తున్నది నిజమైన అనుభవమా? లేక మార్కెటింగ్ కోసం రూపొందించిన వ్యాపారమా?” అనేది గమనంలో వుంచుకోవాలి. వీడియోల్లో కనిపించే అందమైన హోటల్ వెనుక స్పాన్సర్ ఉండవచ్చు. ఒక రెస్టారెంట్ ప్రశంస వెనుక డబ్బు చెల్లించే ప్రమోషన్ ఉండవచ్చు. అందుకే కంటెంట్‌ను ఆస్వాదించడంతో పాటు దాని వాణిజ్య నేపథ్యాన్ని గుర్తించడం కూడా డిజిటల్ పర్యాటకుడి గమనంలో వుండాలి.

ఇన్‌ఫ్లుయెన్సర్ టూరిజం..
ఒకప్పుడు ఎవరికీ తెలియని చిన్న గ్రామం.. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కెమెరాలో కనిపించిన తర్వాత ఒక్కసారిగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించవచ్చు. ఒక వీడియో వైరల్ అయితే ఆ ప్రాంతానికి సందర్శకుల రాక పెరిగి, స్థానిక దుకాణాలు, హోటళ్లు, రవాణా సేవలకు ఆదాయం పెరగడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలూ ఏర్పడవచ్చు. కానీ ఈ మార్పునకు మరో కోణమూ ఉంది. పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగితే చెత్త పేరుకుపోవడం, నీటి వినియోగం పెరగడం, ట్రాఫిక్ సమస్యలు, అద్దెలు పెరగడం, ప్రకృతి దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. స్థానికుల జీవన విధానంపైనా ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అందుకే ఒక ప్రదేశాన్ని వైరల్ చేయడం మాత్రమే కాదు, ఆ ప్రాంతం ఎంతమంది పర్యాటకులను తట్టుకోగలదు? ప్రకృతిని, స్థానిక జీవనాన్ని ఎలా కాపాడాలి? అనే ప్రశ్నలకు కూడా సమాధానం వెతకాలి. సోషల్ మీడియా పర్యాటకాన్ని ప్రోత్సహించే శక్తివంతమైన సాధనం; అదే సమయంలో బాధ్యత లేకుండా ఉపయోగిస్తే... అది కొత్త సమస్యలకు కారణమయ్యే అవకాశమూ ఉంది. అంటే, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో ఒక ఊరి భవిష్యత్తును మార్చగలదు. అదే సమయంలో కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశమూ వుంది. ప్లాస్టిక్ చెత్త, ట్రాఫిక్, నీటి వినియోగం, శబ్ద కాలుష్యం, ప్రకృతి ప్రాంతాల నష్టం, స్థానిక జీవన విధానంలో మార్పులు—ఇవి పర్యాటక విజయం వెనుక కనిపించని సమస్యలు కావచ్చు.
ఎంతవరకు నిజం?
వ్లాగ్ టూరిజం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తెరపై కనిపించేదంతా వాస్తవం అని భావించకూడదు. కెమెరా కోణాలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, ఎంపిక చేసిన దృశ్యాలు ఒక ప్రదేశాన్ని మరింత అందంగా చూపించవచ్చు. కొన్నిసార్లు హోటళ్లు, రెస్టారెంట్లు లేదా పర్యాటక సంస్థల ప్రచారమూ వ్లాగ్‌లో భాగం కావచ్చు. కాబట్టి వ్లాగ్‌ను ప్రయాణానికి ఒక ప్రాథమిక మార్గదర్శిగా తీసుకుని, ధరలు, వసతి, రవాణా, వాతావరణం వంటి వివరాలను అధికారిక వనరులతో నిర్ధారించుకోవాలి. కెమెరా చూపించే అందం ఒక కోణం మాత్రమే; ఆ ప్రదేశం యొక్క అసలు జీవితం మరోకోణం అన్నది ఎప్పుడూ గమనంలో వుంచుకోవాలి.
భవిష్యత్తులో ఎఐ ప్రయాణాన్ని ప్లాన్ చేయవచ్చు. డ్రోన్లు అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించవచ్చు. వ్లాగర్లు ప్రపంచంలోని తెలియని మూలలను పరిచయం చేయవచ్చు. కానీ ప్రయాణానికి అసలు అర్థం మాత్రం మనిషి–ప్రకృతి–సంస్కృతుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. మొబైల్ మన చేతిలో కొత్త టూరిజం గైడ్ కావచ్చు. కానీ మన ప్రయాణానికి దిశను నిర్ణయించేది సాంకేతికత మాత్రమే కాకూడదు. చూసే కళ్లతో పాటు.. ప్రకృతిని కాపాడే మనసూ ఉండాలి. అదే డిజిటల్ యుగపు బాధ్యతాయుత పర్యాటకం.

భారతీయ ట్రావెల్ వ్లాగర్లు
అన్వేష్‌చిన్ని – Naa Anveshana : ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న వరల్డ్ ట్రావెల్ వ్లాగర్ విశాఖపట్టణం భీమిలి ప్రాంతానికి చెంది 125కు పైగా దేశాలు సందర్శించారు. v వరుణ్ వగీష్ – Mountain Trekker: ఒంటరి ప్రయాణాలు, తక్కువ ఖర్చుతో ప్రయాణం, కొండలు–ప్రకృతి ప్రాంతాల అనుభవాలను చూపించే వ్లాగర్‌గా గుర్తింపు పొందారు.
హరీష్ బాలీ – Visa2Explore: ప్రయాణంతో పాటు స్థానిక ఆహారం, సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, అక్కడికి ఎలా చేరుకోవాలి వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తారు. v దీపాంశు సంగ్వాన్ – Nomadic Indian: సాధారణ పర్యాటక ప్రదేశాలకే పరిమితం కాకుండా భిన్నమైన ప్రాంతాలు, స్థానిక సంస్కృతి, ప్రయాణ అనుభవాలను చూపించడం ఆయన వ్లాగ్‌ల ప్రత్యేకతగా పేర్కొనబడింది.
సరవణ కుమార్ – India in Motion: భారతదేశంలోని ప్రకృతి దృశ్యాలు, స్థానిక జీవితం, సాహస ప్రయాణాలను తన వ్లాగ్‌లలో చూపిస్తున్నారు.
తమిళ్ ట్రెక్కర్: తమిళంలో ట్రెక్కింగ్, ఒంటరి ప్రయాణాలు, అంతర్జాతీయ ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని పరిచయం చేసే ప్రాంతీయ భాషా వ్లాగింగ్ ఉదాహరణ. v ఉమా తెలుగు ట్రావెలర్: తెలుగులో దేశ, విదేశీ పర్యాటక అనుభవాలను అందించే ప్రాంతీయ భాషా ట్రావెల్ కంటెంట్‌కు ఉదాహరణగా చెప్పొచ్చు. వీరంతా తమ తమ భాషల్లో కొత్త ప్రాంతాలను పరిచయం చేస్తూ పర్యాటకాన్ని మరింత స్థానికంగా, వ్యక్తిగతంగా మారుస్తున్నారు.
రాజాబాబు కంచర్ల
9490099231







కామెంట్‌లు (0)