ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం... నలువైపులా పచ్చదనం పరుచుకున్న ఎత్తైన కొండలు... ఆ కొండల నడుమ నిరంతరం జాలువారే జలపాతాలు...వాటిపైన గాలిలో తేలియాడే పల్చటి మంచు తెరలు... వీటన్నిటి మధ్యన మానవ మేధ సృష్టించిన అద్భుతం ‘మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం’. ఓ రాజు స్వప్నం, ఇంజనీర్ల మేధో మధనం, కార్మికుల కష్టం, ప్రకృతి సహకారం, ప్రభుత్వాల సమన్వయం కలసి వెలసిన కట్టడం మాచ్‌ఖండ్ పవర్ ప్లాంట్.
ఈసారి మా ఫ్యామిలీ ట్రిప్ కాంక్రీటు అరణ్యాలకు దూరంగా...కీకారణ్యానికి దగ్గరగా జరిగింది. అందాల అరకులో అనేక ప్రాంతాలు చుట్టొచ్చాక...ఆఖరికి చూసింది మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజక్టునే (‘మాచ్‌ఖండ్’ అంటే స్థానిక పరిభాషలో ‘మత్య్స గెడ్డ’ అని అర్థం. అంటే చేపల కొలను). మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనుకోవచ్చు. అయితే ‘వించ్’లో వెళ్లి చూస్తే మాత్రం ‘అద్భుత:’ అనిపించాల్సిందే.
పోయిన నెల 17న... సరిగ్గా ఉదయం 10.30 గంటలకు...మేం మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజక్టు గేటు ముందు నిలబడ్డాం. ముందుగానే లోపలికి వెళ్లేందుకు అనుమతి వుంది గనుక 11 గంటల షిఫ్టు ఉద్యోగులతో కలిసి వెళ్లాలన్నది మా ఆలోచన. కానీ అలా జరగలా! ముందు వించ్‌హౌస్‌కి వెళ్లి అక్కడి నుంచి వించ్‌లో పవర్‌ప్లాంట్‌కు రమ్మని చెప్పారు. మరో అర్ధగంటలో అక్కడుండాలి కాబట్టి కారు వెనక్కి తిప్పి వీలైనంత వేగంగా ఘాట్‌రోడ్ మీదగా వించ్‌హౌస్‌కి చేరుకున్నాం. ఆలస్యమైతే మళ్లీ వించ్ మిస్సయిపోతాం కదా. ఆ టెన్షన్ అందరిలోనూ వున్నా...సమయానికి చేరిపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం.

వించ్ ప్రయాణం
వించ్‌హౌస్ లోపలికి వెళ్లాక తెలిసింది. అదెలా పని చేస్తుందో. వించ్ స్టీరింగ్, అలారం, జిపిఎస్, 800 మీటర్ల పొడవాటి ఇనుప తీగ చుట్ట ... లాంటివన్నీ అక్కడ వున్నాయి. వీటితోపాటుగా వించ్ నడిపే డ్రైవర్ కూడా అక్కడే వున్నారు. ఆ రూమ్‌లో వుండే వించ్ నడుపుతానని చెప్పినపుడు మాకేం అర్థంకాలేదు. ఏ డ్రైవర్ అయినా ఆ వెహికల్‌లోనే వుంటాడు కదా. ఇదేదో తేడాగా వుందే అనిపించింది. బయటికొచ్చాక...వించ్ చూశాక...‘గుండె జారిపోయింది’ అంటారే! అలా అయింది పరిస్థితి. మేం నిలబడిన చోట రైలు ట్రాక్ లాంటిది వుంది. అదీ ఏటవాలుగా 2750 అడుగుల కిందికి. ఆ ట్రాక్ మీద రెండు పెద్ద ఆటోల వంటి బోగీలు కనిపించాయి. వించ్‌హౌస్‌లో చూసిన ఇనుప తీగ వాటికి కట్టి వుంది. మేం అందులో కూర్చున్నాక... మాతో పాటు ఎక్కిన వించ్ గార్డు సిగ్నల్ స్టిక్‌తో ఇచ్చిన సిగ్నల్ ఆధారంగా వించ్ హౌస్‌లో వున్న డ్రైవర్ వించ్‌ని నడపడం మొదలెట్టాడు. అంటే ఆ పొడవాటి ఇనుప తీగని వదులుతూ వుంటే వించ్ లోయలోకి మెల్లగా వెళుతోందన్నమాట. ‘ఇదిగాని ఒక్కసారిగా లోయలోకి పడితే...’ అన్న ఆలోచన రాగానే బోలెడంత భయమేసింది. ఆ రోజు ఉదయం తిన్న ఇడ్లీలే ఆఖరివనుకున్నా! కానీ... ప్రశాంతంగా 15 నిముషాలలో కిందికి చేరుకున్నామనుకోండి! అదే ప్లాంట్ నుంచి పైకి రావడానికి 13 నిముషాలు పడుతుంది!
రైల్వే ట్రాక్ మీద వున్నట్టే ఇక్కడ కూడా కరెంటు తీగలు వుంటాయి. వించ్ గార్డు తన చేతిలో వున్న సిగ్నల్ స్టిక్‌తో కరెంటు తీగల్ని తడితే వించ్ హౌస్ లోపల అలారం మోగుతుంది. ఒకసారి తడితే బ్రేక్ వేయమని, రెండు సార్లు తడితే స్టార్టు చెయ్యమని కోడ్. ఈ చిన్న కోడ్ సహాయంతోనే ఇన్ని సంవత్సరాలుగా వించ్‌ని నడుపుతున్నారు. ఇదిగాక జిపిఎస్ లాంటిది కూడా వుంటుంది. వించ్ కదలికలను బట్టి జిపిఎస్ ముల్లు కూడా కదులుతూ వుంటుంది. దాన్ని కూడా చూసుకుంటూ వించ్‌ని నడుపుతాడు డ్రైవర్. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వించ్ నడుస్తుండడం గొప్ప విషయం.
ప్లాంట్ పనుల కోసం ఈ వించ్‌ని బ్రిటిష్ కాలంలోనే (1946) ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు కోసం నల్లరాతి కొండని డైనమైట్లతో పేల్చడం దగ్గర నుంచి శంకుస్థాపన, నిర్మాణం, నిర్వహణ అన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం ఈ వించ్. ప్రాజెక్టుకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సామగ్రి జర్మనీ, బ్రిటన్, అమెరికా నుంచి ఓడల్లో విశాఖ చేరితే అక్కడి నుంచి ఒనకడిల్లీ వరకు లారీల్లో చేర్చేవారు. వాటిని అక్కడి నుంచి సుమారుగా 3000 అడుగుల కిందన వున్న ప్లాంట్‌కు వించ్‌లో చేర్చేవారు. ఇంజనీర్లు, కార్మికులు అంతా ఈ వించ్‌లోనే ప్రయాణించేవారు. 25 టన్నుల వరకు పైకి, కిందికి చేర్చేది. అప్పట్లో ప్లాంట్‌కి కాలిబాట కూడా లేదు. ప్లాంట్ నిర్మాణం అయ్యాకనే ఘాట్ రోడ్ ఏర్పాటైంది (దేశంలో రెండు చోట్లే వించ్‌ల వాడకం వుంది. ఆ రెండవది తమిళనాడులోని పళని ఆలయంలో వుంది). ఐదు సంవత్సరాలకోసారి వించ్ కి కట్టే తీగను టెస్టింగ్‌కు పంపుతారు. అవసరమైతే మారుస్తారు. లేకుంటే పాతదే కొనసాగిస్తారు. గ్రీజు రాయడం తప్పనిసరి.
రెండు రాష్ట్రాల జల విద్యుత్ ప్లాంట్
ప్లాంట్ వున్నది ఎ.పి, ఒడిశా సరిహద్దుల్లోనే అయినా కచ్చితంగా చెప్పాలంటే ఒడిశాలోనే. ప్లాంట్‌కి అవసరమైన మచ్‌ఖండ్ నీరు అందేది ఆంధ్రప్రదేశ్ నుంచి. అంతేగాక అప్పట్లో నిర్మాణానికి అయిన రూ.18 కోట్లలో ఎ.పి రూ.12 కోట్లు, ఒడిశా రూ.6 కోట్లు ఖర్చు చేశాయి. అందువల్ల 120 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం వున్న ఈ ప్లాంట్ విద్యుత్‌ను రెండు రాష్ట్రాలూ పంచుకుంటాయి. అంతర్రాష్ట ఒప్పందం (1945 జనవరి 14) ప్రకారం 70:30 నిష్పత్తిలో పంచుకున్నాయి. అయితే ఆ తర్వాత (2020 అక్టోబర్ 23) కుదిరిన ఒప్పందం ప్రకారం 50:50 నిష్పత్తిలో పంచుకోసాగాయి. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏంటంటే...సంవత్సరంలో 365 రోజులూ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నాగార్జున సాగర్, సీలేరు వంటి పలు విద్యుత్ కేంద్రాలు పీక్‌లోడ్ అవర్స్ లో మాత్రమే (వర్షా కాలంలో) ఉత్పత్తి చేస్తుంటాయి (మరమ్మతులు వుంటూనే వుంటాయనుకోండి). 1955 నుంచి ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ 7 దశాబ్దాలకు పైగా ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదీ ప్లాంట్. అందుకేనేమో ఈ ప్లాంట్‌ను సజీవ మ్యూజియం అంటారు.

డుడుమ, జోలాపుట్ ప్రధాన ఆధారం
మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో వున్న డుడుమ, జోలాపుట్ జలాశయాలే ప్రధాన ఆధారం. వీటికి మాచ్‌ఖండ్ నీరే మూలం. వీటి నుంచి నిరంతర ప్రవాహంగా నీరు రావడం, చుట్టూ వున్న ఎత్తైన కొండలు ఆ నీటిని నిల్వ వుంచడంతో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమౌతోంది.
వందేళ్ల నాటి కల
ఈ కథ నూరేళ్ల కిందట (1926) మొదలైంది. జయపూర్ మహారాజు విక్రమ్ దేవ్...నీటితో విద్యుత్ తయారుచేసి...తన రాజ్యంలోని గ్రామాలకు అందివ్వాలని కల కన్నాడు. అందుకోసం బ్రిటిష్ ఇంజనీర్ హెన్రీ హోవార్డ్ ను నియమించాడు. ఆయన 1929 నుంచి దీనిమీద పనిచేయడం మొదలెట్టాడు. ఒనకడిల్లీ లోని డుడుమా జలపాతానికి 500 మీటర్ల దిగువన ప్లాంటుకు వీలైన ప్రదేశాన్ని సూచించాడు. అయితే పాలనా పరమైన అడ్డంకులు, భారత దేశంలో చోటుచేసుకున్న రాజకీయపరమైన మార్పులు, రెండవ ప్రపంచ యుద్ధం తదితర కారణాలతో నిర్మాణం బాగా ఆలస్యమైపోయింది. 1946లో వాస్తవ నిర్మాణం మొదలైంది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ (తర్వాత ఆంధ్రప్రదేశ్), ఒరిస్సా( ఇపుడు ఒడిశా) కలిసి ఈ ప్లాంట్ నిర్మించాయి. 1955 ఆగస్టు 19న మన తొలి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా విశాఖ వచ్చి ప్లాంట్ ప్రారంభించారు.
ఇపుడు...
ప్లాంట్ చర్రిత లోంచి ప్రస్తుతానికి వద్దాం. వించ్ లోంచి బతుకు జీవుడా అంటూ కిందికి దిగాక ప్లాంట్‌లోకి అడుగెట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ నార్మల్‌గానే అనిపించింది. ప్లాంట్ వివరాలు, ఉత్పత్తి సామర్ధ్యం తెలిపే మ్యాప్‌లు ఇతర పరికరాలు కనిపించాయి. అక్కడి నుంచి ఫస్టు ఫ్లోర్‌లోకి ఎత్తైన, ఇరుకైన మెట్ల మీదగా వెళ్లాం. పక్కన వున్న పరికరాలేవీ తాకకుండా జాగ్రత్తగా రమ్మన్నారు. లోపల గ్రీజు/ ఆయిల్ చుక్కలతో ఫ్లోర్ కొద్దిగా చెమ్మగా వుంది. భారీ శబ్దాలతో మిషన్లు నడుస్తున్నాయి. అంత పెద్ద శబ్దాల మధ్య గంటల తరబడి దశాబ్దాలు పాటు విధులు నిర్వహించడమంటే మామూలు విషయంగా అనిపించలా! స్విచ్ వేస్తే చాలు! లైటు వెలుగుతుంది. ఫ్యాన్ తిరుగుతుంది. నీళ్లొస్తాయి. అన్నం ఉడుకుతుంది. మనకు ఇంతటి సౌకర్యాన్ని అందిస్తున్న ఆ కార్మిక సోదరుల కాళ్లకు మొక్కాల్సిందే అనుకున్నా మనసులో.
షిఫ్టు ముగించుకున్న వారితో కలిసి మళ్లీ వించ్‌లోనే పైకి వచ్చేశాం.
విశాఖ వీడి...విజయవాడ చేరినా...ఆ పచ్చదనం, కొండగాలి వెంటే వున్నట్టుంది!
కె. అంజన
9490099025








కామెంట్‌లు (0)