ఈ రోజుల్లో పేరెంటింగ్ అత్యంత కష్టమైన పనిగా మారింది. కృత్రిమ మేధస్సును సృష్టించవచ్చు, నియంత్రించవచ్చు - కానీ పిల్లల పెంపకం మాత్రం అంత సులభం కాదు. ఒకప్పటిలా ఇప్పటి రోజులు లేవు. ఇన్ని ప్రభావాలూ లేవు. తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా మారిపోయింది. కొందరు తల్లిదండ్రులు చండశాసనుల్లా వ్యవహరిస్తారు. మరికొందరు పిల్లలకు కష్టం తెలియకూడదని ‘బొమ్మరిల్లు’లా పెంచుతారు. కొందరు తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలని కోరుకుంటారు. ఇంకొందరు పిల్లల విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటారు. ఇలా రకరకాల తల్లిదండ్రులు మన సమాజంలో కనిపిస్తున్నారు. మరి, వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్? ఏది బెస్ట్ పేరెంటింగ్? ఈ ప్రశ్నకు సమాధానంగా మనస్తత్వవేత్తలు ‘డాల్ఫిన్ పేరెంటింగ్’ ది బెస్ట్ అంటున్నారు.
డాల్ఫిన్ పేరెంటింగ్ అనే భావనను ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. షిమీ కాంగ్ తన ‘ది డాల్ఫిన్ వే’ పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పారు. హార్వర్డ్ శిక్షణ పొందిన ఈ వైద్యురాలు ముగ్గురు పిల్లల తల్లి కూడా. డాల్ఫిన్ పేరెంటింగ్ అనేది రెండు తీవ్రమైన పేరెంటింగ్ పద్ధతుల మధ్య సమతుల్యతను కనుగొనే విధానం. ఇది కఠినమైన ‘టైగర్ పేరెంటింగ్’కి, అతి సడలించే ‘జెల్లీఫిష్ పేరెంటింగ్’ కి మధ్య ఉండే ఒక ఆదర్శవంతమైన పద్ధతి.
డాల్ఫిన్ తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని స్పష్టమైన నియమాలు, అంచనాలను నిర్దేశిస్తారు. కానీ వారు సృజనాత్మకత, స్వేచ్ఛ, స్వతంత్రతకు కూడా విలువ ఇస్తారు. వారు పిల్లల జీవితాల్లో సమతుల్యతను కాపాడుకోవడంపై దృష్టి పెడతారు. వారి లక్ష్యం
పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఎదగడమే!అయితే ఇందుకోసం అతిగా ఒత్తిడి చేయకుండా, సహజసిద్ధమైన మార్గంలో వారికి తోడుగా ఉండటం.
ప్రత్యేకతలు..
డాల్ఫిన్ తల్లిదండ్రుల ప్రత్యేకతలను పరిశీలిస్తే.. నియమాలు - స్వేచ్ఛ మధ్య సమతుల్యత పాటిస్తారు. డాల్ఫిన్ తల్లిదండ్రులు స్పష్టమైన అంచనాలను నిర్దేశిస్తారు. అదే సందర్భంలో స్వతంత్రంగా ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత స్వేచ్ఛను కూడా ఇస్తారు. అనుబంధానికి ప్రాధాన్యతనిస్తారు. వారు బహిరంగ సంభాషణను, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ప్రోత్సహిస్తారు. ఒత్తిడి కాదు, ప్రోత్సాహం మిన్న అనుకుంటారు. పిల్లలు విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ వారి శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తారు. సమగ్ర వికాసం ముఖ్యమని భావిస్తారు. చదువు, స్నేహాలు, అభిరుచులు, మానసిక ఆరోగ్యం - అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తారు. సరళంగా చెప్పాలంటే, డాల్ఫిన్ పేరెంటింగ్ అంటే ‘పిల్లల పక్కనే ఈదుతూ ఉండటం’. వారిని లాక్కెళ్లకుండా, వారిని ఒంటరిగా కొట్టుకుపోనివ్వకుండా చూడటం.

పేరెంటింగ్ శైలిలు
పేరెంటింగ్ శైలిలను అర్థం చేసుకోవడానికి జంతువుల ఉపమానాలు బాగా పనిచేస్తాయి. డా. షిమీ కాంగ్ మూడు ప్రధాన శైలిలను గుర్తించారు.
టైగర్ పేరెంటింగ్ : ఇది అతి కఠినమైన, నియంతృత్వ విధానం. అతి క్రమశిక్షణ, అధిక అంచనాలు, విజయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి పేరెంటింగ్ వల్ల పిల్లలు ఆత్రుత, నిరాశ, సామాజిక నైపుణ్యాల కొరతతో బాధపడే ప్రమాదం ఉంది.
జెల్లీఫిష్ పేరెంటింగ్ : ఇది అతి సడలించే, నియమాలు లేని విధానం. ఇలాంటి పిల్లలకు క్రమశిక్షణ ఉండదు. నియమాలను పాటించడానికి ఇష్టపడరు.
డాల్ఫిన్ పేరెంటింగ్: ఇది పై రెండింటి మధ్య సమతుల్యత. కఠినంగా కాకుండా సున్నితంగా మార్గనిర్దేశం చేయడం. ఏ విషయంలోనైనా సౌమ్యంగా మాట్లాడటం.
పిల్లలకు ఉపయోగాలు
డాల్ఫిన్ పేరెంటింగ్ పిల్లల్లో అనేక సానుకూల లక్షణాలను పెంపొందిస్తుంది. స్వతంత్రత అనేది ప్రధానం. దీనివల్ల తల్లిదండ్రుల మద్దతుతో స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు. భావోద్వేగ మేధస్సు కలిగి ఉండటం. బలమైన సంభాషణ, సమస్య పరిష్కార నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉండడం కీలకం. సహాయకరమైన, నియంత్రణ లేని పెంపకం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సామాజిక నైపుణ్యాలు ప్రధానం. ఆరోగ్యకరమైన సంబంధాలు, జట్టు (సమిష్టి) కృషిని ప్రోత్సహిస్తుంది. ఆత్రుత, ఒత్తిడి తగ్గించడం అవసరం. ఇది అతి ఒత్తిడి లేదా నిర్లక్ష్యం లేని సమతుల్య విధానం. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అలవడితే మంచిది. డాల్ఫిన్ తల్లిదండ్రులు తమ పిల్లలలో ‘CQ’ - సృజనాత్మకత (Creativity), సంభాషణ (Communication), సహకారం (Collaboration), విమర్శనాత్మక ఆలోచన (Critical thinking) - వీటిని పెంపొందిస్తారు.
సవాళ్లు
ఏ పేరెంటింగ్ శైలిలోనైనా సవాళ్లు ఉంటాయి. డాల్ఫిన్ పేరెంటింగ్ లో కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి.
సరైన సమతుల్యతను కనుగొనడం కష్టం.
ఎప్పుడు కఠినంగా ఉండాలో, ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో అర్థం చేసుకోవడం సవాలుగా మారవచ్చు.
ప్రతి పిల్లవాడికీ ఇది సరిపోకపోవచ్చు. కొందరికి ఎక్కువ నిర్మాణాత్మక విధానం అవసరం కావచ్చు.
క్రమశిక్షణ, అధికారాన్ని సరైన స్థాయిలో ఉంచడం సవాలు.
ఈ రోజుల్లో పేరెంటింగ్ ఎంత కష్టమో ప్రతి తల్లిదండ్రికీ తెలుసు. పిల్లల పెంపకంలో ఏ ఒక్క మార్గమూ పరిపూర్ణమైనది కాదు. కానీ, డాల్ఫిన్ పేరెంటింగ్ ఒక సమతుల్యమైన, శాస్త్రీయంగా నిరూపితమైన మార్గంగా నిలుస్తోంది. పిల్లలకు కఠినమైన నియమాలు, స్వేచ్ఛా వాతావరణం రెండూ అవసరం. వారు ఆట ద్వారా నేర్చుకుంటారు.. సహజసిద్ధమైన ఉత్సుకతతో పెరుగుతారు. డాల్ఫిన్ తల్లిదండ్రుల్లాగా మనం కూడా - కఠినంగా కానీ సున్నితంగా, నిర్మాణాత్మకంగా కానీ సౌలభ్యంతో, మార్గనిర్దేశం చేస్తూ ఉండాలి. అదే సందర్భంలో స్వేచ్ఛను ఇస్తూ - పిల్లల పక్కనే ఈదుతూ ఉండాలి. ఎందుకంటే, పిల్లలు కేవలం విజయవంతమైన వ్యక్తులుగా కాకుండా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో, సమతుల్యతతో ఎదగడమే నిజమైన పేరెంటింగ్ లక్ష్యం.








కామెంట్‌లు (0)