ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమీ కలలా? మీ బిడ్డ కలలా?

1 గంట క్రితం

parents-desktop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:39 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఉదయం 8 గంటలు. అమ్మ టిఫిన్ సర్దుతూ, ఆఫీస్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్న కూతురి వైపు చూస్తోంది. "నిన్ను ఇంజనీరు చేయాలని ఎన్ని కలలు కన్నానో.. నువ్వు ఉద్యోగం మానేసి, ఫొటోగ్రఫీ కోర్సు అంటున్నావు. ‘‘నీకు కావాల్సినది నువ్వు చేసుకో, కానీ.. ఈ వయసులో ఇలాంటి పిచ్చి ఆలోచనలు?" అమ్మ మాటల్లో ఆవేదన, నిస్సహాయత, ప్రేమ, ఆందోళన – అన్నీ కలిపి ఉన్నాయి. కూతురి మొహంలో నిరాశ, తిరుగుబాటు, మౌనం. ఈ సీన్ మన ఇంట్లో, మన పక్కింట్లో, మన ఊర్లో రోజూ జరుగుతున్న సాధారణ సంగతి. నిజం చెప్పాలంటే, పిల్లల కెరీర్ నిర్ణయించడం అనేది ఈ తరం తల్లిదండ్రులకు అతి పెద్ద సవాళ్లలో ఒకటి. మనం అనుకున్నది, వాళ్ళు అనుకోవడం లేదు. మనం కన్న కల, వాళ్ళు కనే కల వేరుగా ఉంది. అయితే ఇక్కడ సరైన మార్గం ఏమిటి?


మనం మన పిల్లల కోసం ఏది మంచిదో, అదే వాళ్ళ కోసం నిర్ణయించాలని అనుకుంటాం. మనం చూసిన కష్టాలు, అనుభవించిన లోటు, చేయలేని కోరికలు – ఇవన్నీ మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. "మనం చదువుకోలేదు, పిల్లలు బాగా చదవాలి" అని అనుకోవడం తప్పు కాదు. కానీ దాన్ని మన పిల్లల కెరీర్‌గా మార్చడం వేరే విషయం. ఎందుకంటే, ఈ తరం పిల్లలు పుట్టింది వేరే యుగంలో. ఇక్కడ ఎఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్రియేటివ్ ఆర్ట్స్, స్పోర్ట్స్ మేనేజ్‌‌మెంట్.. ఇలా ఎన్నో కొత్త కొత్త అవకాశాలు న్నాయి. ఇకపై మనం పుస్తకాలు చదివినంత మాత్రాన ఉద్యోగం దక్కే రోజులు పోయాయి. నైపుణ్యాలకు (skills) ప్రాధాన్యత పెరిగింది. అలాంటప్పుడు, మనం అర్థం చేసుకోని రంగంలో మన పిల్లల్ని నెట్టడం మంచిదేనా?

మాటకు విలువ ఇవ్వండి..

మన పిల్లలకి వాళ్ళు ఇష్టపడే విషయం ఏంటో తెలుసు. అదే వాళ్ళ స్వరం. వాళ్ళు 'ఇది నాకు నచ్చలేదు, ఇది చేయాలని ఉంది' అని చెప్పినప్పుడు, వెంటనే దాన్ని తిరుగుబాటుగా చూడకండి. అది వాళ్ళ ఆలోచనా విధానానికి ప్రతిబింబం. ఒక్కసారి వాళ్ళను అడగండి: "ఎందుకు నీకు అది నచ్చింది? అందులో ఏముంది? దాన్ని కెరీర్‌‌గా ఎలా మార్చుకోవాలి?" ఉదాహరణకి, మీ బిడ్డకు పాటలు పాడటం అంటే ఇష్టం అనుకోండి. కేవలం "సంగీతంతో పొట్ట నిండదు" అని కొట్టిపారేయకండి. ఆ ఆసక్తి వెనుక ఉన్న ప్రతిభను గుర్తించండి. అదే వాళ్లు మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్ ఇంజనీర్, మ్యూజిక్ థెరపిస్ట్, లేదా ఒక గొప్ప సింగర్ కావచ్చు.

‘గైడ్’ అవ్వండి, ‘డైరెక్టర్’ కాదు..

పిల్లల కెరీర్ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఒక 'కెప్టెన్' లాంటిది కాదు, 'నావికుడు' (Navigator) లాంటిది. వాళ్ళకు దారి చూపించండి కానీ, వాళ్ళే నడిపించనివ్వండి. వాళ్ళ ఆసక్తిని అర్థంచేసుకోండి. 10వ తరగతి /ఇంటర్ తర్వాత వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారో అడగండి. వాళ్ళ అభిరుచులను తెలుసుకోండి. వాళ్ళు టీవీలో ఏం చూస్తారు? ఇంటర్‌‌నెట్లో ఏం సెర్చ్ చేస్తారు? ఆ సూచనలను గమనించండి. సమాచారం సేకరించండి. ఈ రోజుల్లో సమాచారం అందుబాటులో ఉంది. ఆయా కెరీర్ల గురించి, వాటి భవిష్యత్తు గురించి, అక్కడ లభించే ఆదాయం, ఉద్యోగ అవకాశాల గురించి కలిసి పరిశోధించండి. ఆ రంగంలో ఉన్నవారితో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఓపెన్ మైండెడ్‌‌గా ఉండండి. నేను మంచిదనుకున్నది, నా బిడ్డకు తప్పక మంచిది కావాల్సిన అవసరం లేదు. పిల్లలు కొత్త రంగాలను ఎంచుకున్నప్పుడు వాళ్ళకు మద్దతు ఇవ్వండి. కొన్ని తప్పులు జరిగితే వాళ్ళు నేర్చుకుంటారు, అది జీవిత పాఠం.

ఆర్థిక భద్రత గురించి మాట్లాడండి

అన్ని కలలకు ఒక ఆర్థిక అంశం ఉంటుంది. కెరీర్ ఎంచుకునేటప్పుడు డబ్బు ఒక్కటే ప్రధానంకాదు. కానీ, అదీ ముఖ్యమైనదే. అయితే, ఆర్థిక భద్రత కోసం వాళ్ళ ఆసక్తిని వదిలించుకోవద్దు. ఎలా ప్లాన్ చేస్తే, ఆర్థికంగా మంచి భవిష్యత్తు ఉంటుందో చెప్పండి. తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొన్నిసార్లు మనం ఎంచుకున్న కెరీర్ బాగా పని చేయకపోవచ్చు. అప్పుడు పిల్లలు నిరుత్సాహపడతారు. అలాంటప్పుడు వాళ్ళను నిలబెట్టాల్సింది మనమే. "ఏమైందిలే, మరో ప్రయత్నం చేద్దాం" అనే ధైర్యం మనమే ఇవ్వాలి.

వెన్నుదన్నుగా ఉండండి..

మనం పిల్లల కెరీర్ నిర్ణయించమని కాదు. మనం వాళ్ళ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలి. వాళ్ళ ఆలోచనలను గౌరవించాలి. ఎందుకంటే, చివరికి పనిచేసేది వాళ్ళే. బాధపడేది వాళ్ళే, సంతోషించేది వాళ్ళే. మీ పిల్లల కెరీర్ అనే ఓడను వాళ్ళు స్వయంగా నడిపించుకోవాలి. మనం మాత్రం 'లైట్ హౌస్' లాగా ఉండాలి – చీకట్లో ఓడ సరైన దారిలో ప్రయాణించడానికి కాంతిని ఇవ్వాలి. కానీ, ఆ ఓడకు కెప్టెన్ మీరు కాదు, మీ బిడ్డే అని మర్చిపోవద్దు. ఇదే నిజమైన పేరెంటింగ్!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్