ఫోన్, ల్యాప్‌టాప్, సోషల్ మీడియా.. పిల్లలు డిజిటల్ ప్రపంచంలో మునిగితేలుతున్న ఈ రోజుల్లో, తల్లిదండ్రుల భద్రతా ప్రయత్నం కొన్నిసార్లు నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. అతిగా పర్యవేక్షిస్తే వారు దూరమవుతారు.. వదిలేస్తే ప్రమాదంలో పడతారు. 'వాళ్లు ఏం చేస్తున్నారు’ అనే ఆందోళనకు, ‘వాళ్ల గోప్యతను గౌరవించాలా’ అనే సందిగ్ధానికి మధ్య ఊగిసలాడే ప్రతి తల్లీతండ్రి కోసం.. ఈ రెండింటి మధ్య సమతుల్యాన్ని ఎలా సాధించాలో చెప్పే ఆచరణాత్మక, హృదయపూర్వక మార్గదర్శి ఈ వ్యాసం.
‘అమ్మా.. నన్ను ఫోన్ చూడొద్దు అంటున్నావేంటి?’ అని కోపంగా అడుగుతున్న పాప కళ్లలో బాధ. ఆ క్షణంలో తల్లి మనసులో ఒక ఉవ్వెత్తున ఆందోళన. ‘నేను ఆమె భద్రత కోసమే కదా అలా అన్నది’ అనుకుంటూ ఆమె లోలోపల కుమిలిపోతుంది. ఇది నేటి ప్రతి తల్లిదండ్రీ కథ. డిజిటల్ యుగంలో పిల్లల పర్యవేక్షణ అనేది ఒక అనివార్యమైన అవసరంగా మారినా, అది నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదంగా ఉంది. ఎక్కడ మొదలుపెట్టాలి? ఎక్కడ ఆపాలి? అనేది అత్యంత కీలకం.
పర్యవేక్షణ ఎందుకు ?
నేటి పిల్లలు పాఠశాల స్థాయి నుంచే అసైన్‌మెంట్లు, క్లాసుల కోసం సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో నుంచే ప్రపంచాన్ని చూడగలిగే శక్తిని టెక్నాలజీ అందిస్తున్నప్పటికీ, దాని ప్రమాదకరమై మరో ముఖాన్ని కూడా మనం మరచిపోవద్దు. పిల్లలు తెలిసీ తెలియక సైబర్ బెదిరింపులు, ఆన్‌లైన్ మోసాలు, అనుచిత కంటెంట్ వంటి వాటికి గురవుతున్నారు. చిన్న వయస్సులోనే 10 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా రీల్స్‌కు బానిసలవుతున్నారు. తల్లిదండ్రుల వైపు నుంచి తగిన శ్రద్ధ లేకపోతే, సోషల్ మీడియాలో గుర్తింపు కోసం వారి ఆకర్షణ పెరుగుతోంది. అలాగే ఫోన్లపై ఎక్కువ సమయం గడపడం వల్ల ఊబకాయం, కళ్ల సమస్యలు, మెదడుపై ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే డిజిటల్ పర్యవేక్షణ ఇంట్లోనే మొదలవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అతిగా చేస్తే ప్రమాదం
పర్యవేక్షణ అనేది ఒక సన్నని గీత. అతిగా చేస్తే అది ప్రమాదకరం. పిల్లలు నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు వారి సొంత ఖాళీ, గోప్యతా దెబ్బతింటాయి. ఇది వారి స్వంత గుర్తింపు, అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతుంది.
ఒక అధ్యయనం ప్రకారం, తల్లిదండ్రులు పర్యవేక్షణ యాప్‌లు ఉపయోగించిన రోజుల తర్వాత, యుక్తవయస్సులో ఉన్న పిల్లలు తమ గోప్యత ఉల్లంఘించబడిందని భావించారు. ‘సులభం అంటే సమర్థవంతం కాదు’ అని ఆ అధ్యయన బృందం అభిప్రాయపడింది. అతిగా రక్షించే తల్లిదండ్రుల వల్ల పిల్లల్లో ఆందోళన, తక్కువ ఆత్మవిశ్వాసం, సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మరో అధ్యయనం కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పింది. అవగాహన లేని తల్లిదండ్రులు అతిగా పర్యవేక్షించడానికి దారితీయవచ్చు. పిల్లల స్వయంప్రతిపత్తిని, శ్రేయస్సును కాపాడుతూ, విద్యా సహకారాన్ని పెంచే సమతుల్య వ్యవస్థ అవసరమని ఆ అధ్యయనం సూచించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పర్యవేక్షణ సాధనాలను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం (ఉదా: సంవత్సరానికి నాలుగు సార్లు) పిల్లల స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ తల్లిదండ్రులకు సమాచారం అందుబాటులో ఉంచుతుంది.
సరైన సమతుల్యత ఎలా?
పర్యవేక్షణ, నమ్మకం మధ్య సమతుల్యత సాధించడం అంత సులభం కాదు. కానీ కొన్ని మార్గాలు ఉన్నాయి..
పిల్లలకు పర్యవేక్షణ గురించి తెలియజేయండి. వారి అంగీకారం లేకుండా, వారికి తెలియకుండా పర్యవేక్షిస్తే అది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకు పర్యవేక్షిస్తున్నామో వివరించండి. ‘‘నీ భద్రత కోసమే’’ అని స్పష్టంగా చెప్పండి.
చిన్న పిల్లలకు ఎక్కువ పర్యవేక్షణ అవసరం కావచ్చు. కానీ పెద్దవారైన కొద్దీ క్రమంగా వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రతి పిల్లవాడూ విభిన్నంగా ఉంటాడు – కొందరు చురుకుగా ఉంటారు, ఇంకొందరు నిశ్శబ్దంగా ఉంటారు. వారి ప్రత్యేక లక్షణాలను గుర్తించి, వారి స్వభావానికి అనుగుణంగా మార్గనిర్ చేయాలి.
స్క్రీన్ టైమ్ పరిమితులు పెట్టడం మాత్రమే సరిపోదు. పిల్లలతో పేరెంట్స్ నేరుగా గడిపే సమయాన్ని పెంచాలి. కథలు చెప్పడం, బోర్డు గేమ్స్ ఆడటం, కలిసి భోజనం చేయడం – ఇవన్నీ సంబంధాల్ని బలోపేతం చేస్తాయి. ఫోన్లు భోజన సమయంలో, కుటుంబ సమావేశాల్లో జోక్యం చేసుకోనివ్వకూడదు.
ఎందుకంటే టెక్నాలజీ కుటుంబ జీవితంలో కలిపేది కాకుండా విడగొట్టేదిగా కూడా మారవచ్చు.
చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇంటిపనుల బాధ్యత ఇవ్వడం వల్ల వారు స్వతంత్రంగా ఉండటం నేర్చుకుంటారు. గదిని శుభ్రం చేయడం, వంటగదిలో సహాయం చేయడం వంటి చిన్న చిన్న పనులను వారికి అప్పగించాలి. ఇది పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోగలరనే విశ్వాసాన్ని పెంచుతుంది.
సాంకేతిక సాధనాల సమర్థవంతమైన వినియోగం.. యాప్‌లు డిజిటల్ పేరెంటింగ్‌లో ఉపయోగపడతాయి. కానీ వీటిని పిల్లల అంగీకారంతో, పారదర్శకంగా ఉపయోగించాలి. పిల్లల గోప్యతను దెబ్బతీసేలా అవసరం కంటే ఎక్కువ డేటా సేకరించకూడదు.
పిల్లల పర్యవేక్షణ అనేది ప్రేమా? భద్రతా? అంటే.. అతిగా చేస్తే అది ప్రేమగా కాకుండా నియంత్రణగా మారుతుంది. తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలను కాపాడడమే కాదు – వారు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి అవకాశం ఇవ్వడం కూడా. పర్యవేక్షణా, నమ్మకమా అనేది కాదు; పర్యవేక్షణతో పాటు నమ్మకాన్నీ పెంపొందించడమే సరైన మార్గం. ఎందుకంటే కనెక్షన్ అంటే కాంటాక్ట్ కాదు, గోప్యత అంటే దూరం కాదు. ఇవి ప్రతి పేరెంట్ గమనంలో పెట్టుకోవాలి.
మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యమే – కానీ వారు ఏమవుతున్నారో అర్థం చేసుకోవడం అంతకంటే ముఖ్యం. ఆ అర్థం చేసుకోవడమే నిజమైన పేరెంటింగ్.








కామెంట్‌లు (0)