నిన్ను కలిసిన ఆ క్షణం...
మన ముందున్న దారి
ఇంత సుదీర్ఘమైన జీవితమవుతుందని
అప్పుడు మనకెక్కడ తెలుసు!
ఒకరి చేతిలో ఒకరి ప్రాణం అమర్చుకుని
ఈ దారిలోనే జీవితాన్ని ఇటుకలుగా పేర్చి
ఒక చిన్న గూడు కట్టాం
పిల్లలకు రెక్కలొచ్చేంతవరకు
మనల్ని మనం కరిగించుకుంటూ...
కలల్ని కళ్లల్లోనే నిద్రపుచ్చి
కాలంతో పందెం కాశాం
కోపాల్ని. అలకల్ని
గడప దాటనివ్వకుండా
తలుపుల వెనకే పూడ్చేశాం
మన యవ్వనమంతా...
స్కూలు బస్సు వెనకాల పరుగుల్లో
నెలాఖరు లెక్కల గుణకారాల్లో
జ్వరంతో మేలుకున్న రాత్రుల పహరాలో
చిన్నచిన్న ముక్కలై
మౌనంగా కరిగిపోయింది
ఇంట్లో ఖాళీగా మిగిలిన గదులు
అలమారాలో దుమ్ముపేరుకున్న పాత పుస్తకాలు
డ్రాయర్‌లో పసుపుపచ్చగా మారిన ఫొటోలు...
ఎప్పుడో ఆగిపోయిన
సున్నితమైన మాటలు
ఇప్పటికీ గోడల మధ్య
నిశ్శబ్దంగా తిరుగుతూనే ఉన్నాయి
నీ జుట్టులోని వెండితీగలు
నా కళ్లకింద ముడతల నదుల్లో
ప్రతిబింబిస్తున్నాయి
ఒకరి వయసును మరొకరం
మనసనే అద్దంలో దాచుకుంటూ
మన ప్రయాణం ఇంత దూరం వచ్చిందని
చెపుతూ మన గడపపై వాలిపోయింది
శరదృతువు
నువ్వు రావటం
కాస్త ఆలస్యమైతే చాలు...
గడియారం ముళ్లు
నా గుండెపైనే వడివడిగా నడుస్తున్నట్లుండేది
చూపు మాత్రం తలుపు వైపే ..
వంటగదిలో అల్లం టీ పరిమళం
ఉదయాన్నే నీ గదిలోంచి వినిపించే
సుప్రభాత శ్లోకం...
తలంటు పోసుకున్న
ఆర్థ్ర కవితలా ఇల్లంతా పరుచుకునేవి
నా మందుల సీసా ఎక్కడుందో
నీకు తెలిసినంత సహజంగా...
నీ కళ్లద్దాల జాడ
నా చేతులకు తెలిసిన నిత్యకృత్యం
గుండె వేగంగా కొట్టుకోవడం మానేసే రోజున
ఒకరు లేని శూన్యాన్ని
మరొకరు మోయలేరేమో...
వెనక్కి తిరిగి చూస్తే
ఇదేమీ మహాకావ్యం కాదు—
మనిద్దరం కలిసి రాసుకున్న
ఒక సాదాసీదా జీవితకథ
నీ జీవిత పుటలపై నా వేలిముద్రలు...
నా దారిలో నీ అడుగుజాడలు...
కాలం కూడా చెరపలేనంతగా
ఒకదానిలో ఒకటి
లీనమైపోయిన ఆనవాళ్లు
రేపటి గురించి
ఇక ఏమాత్రం దిగులు లేదు
ఈరోజు సాయంత్రం
నీ పక్కన కూర్చుని
చేతిలోని టీ చల్లారేంతవరకు
నీ కళ్లల్లోకి చూస్తూ ఉంటే చాలు
యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత
ప్రేమను కొత్తగా నిర్వచించడానికేముంది?
"నువ్వున్నావు కదా..."
అనే చిన్న ఓదార్పు చాలు
రెండు వేర్వేరు దేహాలు
ఒకే జీవితాన్ని నడిచి
తగులు, మిగులు
పదాలకు తావి లేకుండా
ఒకే నిశ్శబ్ద శ్వాసగా...
వైష్ణవి శ్రీ
8074210263








కామెంట్‌లు (0)