రాజ్యం ఆకాశ వీధుల్లోంచి
రహస్య తంత్రుల్ని మీటుకుంటూ
రాకాసి ఊడలు దిగబడుతున్నాయి!
అవి ముందుగా
నీ, నా కాళ్ళను చుట్టుకుంటాయి
తరువాత చేతుల్ని చుట్టుకుంటాయి
నువ్వూ నేనూ తేరుకునేలోపలే
మన కంఠాలచుట్టూ బిగుసుకుంటాయి!
ఊపిరాడదు ఉనికి తేలదు
తర్జనభర్జనల తకరారులోనే
ప్రాణం గడ్డకట్టుకుపోతున్న వైనం
మనువాద విరాట్ స్వరూపానికి
ఇరవై శిరస్సులుంటాయని తెలుసు
ఇరవై శిరస్సులకిందా ఇరవై చేతులూ
ఆ చేతుల్లో ప్రాణాంతక ఆయుధాలూ
సదా సిద్ధంగా వుంటాయనీ తెలుసు
అవి ప్రత్యక్షంగానే
ప్రత్యర్థుల్ని పరిమార్చటానికి
ప్రతినిత్యం కాచుక్కూర్చుంటాయన్న
కఠిన వాస్తవం కూడా తెలుసు
కానీ....
తల్వార్లు పట్టకుండానే
తలలు తీసేయగల నైపుణ్యం
నెత్తుటి బొట్లు రాలకుండానే
నరమేధం చేసేయగల కౌటిల్యం
ఈ మతం రక్తనాళాల్లోకి
కొత్తగా ఇంజెక్ట్ చేయబడిందని
ఇవాళే నాకు బోధపడుతోంది!
ఏ ప్రచండ భూకంప బీభత్సమూ లేదు
ఏ ప్రళయ భీకర తుపాను సంరంభమూ లేదు
కాలికింద నేల కారుమేఘమల్లే చీలిపోతోంది!
వేళ్ళు పాతుకుపోయిన వృక్షాల్ని
కూల్చి పారేసే కుతంత్రం ఏదో కమ్ముకుంటోంది!
ఆధిపత్యం!
కులం ఆధిపత్యం! మతం ఆధిపత్యం!
ప్రాంతం ఆధిపత్యం! భాష ఆధిపత్యం!
ప్రపంచ చరిత్ర పునాదుల్ని తవ్వి చూస్తే
ఆధిపత్యపు ఇనుప నాడాల కింద
అమాయకపు మూలవాసుల
చిట్లిన కంఠనాళాల నెత్తుటి మూల్గులు
నిద్రపట్టని రాత్రుల్ని రంపాలతో కోసి
తుంపులు తుంపులుగా కుప్పపోస్తాయి!
ఇక వున్నది వొకటే దారి
పౌరసత్వం మన జన్మహక్కని
వీధుల వెంబడి విరుచుకు పడాలి!
బంతులూ మందార చామంతులూ
ముచ్చటగా పేర్చి , దండ గూర్చినట్టు
మొక్కజొన్నలో కందిచేలూ కూరగాయలూ
అంతర పంటలుగా సాగు చేసినట్టు
దళిత మైనారిటీ ఆదివాసీ
అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ
అలయ్ బలయ్ ఆలింగనాలతో
ఆధిపత్య వర్గాల పీచమణచాలి!!
- పతివాడ నాస్తిక్
9441724167







కామెంట్‌లు (0)