దసరా వచ్చిందంటే ఇంటింటా సంబరాలే,
పిల్లల నవ్వులతో పల్లెల్లో పండుగ శోభలే!
కొత్త బట్టలు.. కొత్త బొమ్మలు.. కొత్త కొత్త సరదాలు,
అమ్మానాన్నల ప్రేమతో నిండిపోతాయి పిల్లల హృదయాలు!
బొమ్మల కొలువులో బొమ్మలన్నీ కొలువుదీరగా,
బంధుమిత్రుల రాకతో ఇల్లంతా కళకళలాడగా,
అమ్మ చేతి పిండివంటలు నోరూరిస్తుంటే,
అమ్మమ్మ చెప్పే కథలు మధురానుభూతులిస్తుంటే!
దసరా సెలవులొస్తే పిల్లలకు ఎంతో సంబరం,
స్నేహితులతో ఆటపాటలు.. ఆనందమే ఆభరణం!
కొత్త చొక్కా.. కొత్త ప్యాంటు.. మురిసిపోయే మనసులు,
పండుగ వేళ కలిసిపోయే కుటుంబాల అనుబంధాలు!
పిల్లలకు దసరా అంటే ఆటలతో కూడిన వేడుక,
పెద్దలకు మాత్రం ఆత్మీయతలు పంచే అపురూపమైన సందర్భం!
అమ్మానాన్నల ఆశీస్సులు.. తాతయ్యల అనురాగం,
అమ్మమ్మల ఆప్యాయతలు.. బంధువుల మమకారం!
చెడుపై మంచి గెలిచిందని చాటే విజయదశమి,
ధర్మమే గెలుస్తుందని తెలిపేది!
కోపం, అసూయలను విడిచి మంచితనాన్ని పెంచుదాం,
సత్యం, ప్రేమ, స్నేహంతో సంతోషంగా జీవిద్దాం!
విందులు.. ఆత్మీయ పలకరింపులు,
మనసులను కలిపే మధురమైన దసరా జ్ఞాపకాలు!
పిల్లలకు ఆనందాల హరివిల్లు.. పెద్దలకు ప్రేమల కానుక,
తరతరాల అనుబంధాలకు దసరా ఓ మధురమైన వారధి!
వల్లభనేని నాగలక్ష్మి మురళీకృష్ణ








కామెంట్లు (0)