ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకాస్త నీ జాడచెప్పవా ప్లీజ్.

1 గంట క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నీతో ఏకాంతంగా మాట్లాడాలని

నీకోసం వెతుకుతున్నాను.

కులం గురించో.. మతం గురించో_

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే గాలిమాటల

గురించో మాట్లాడటానికి కాదు.!

శ్రమజీవుల గొంతును నీకు వినిపించాలని...

మతం మత్తులో కొట్టుకుపోతున్న_

యువతరం గురించి నీకు చెప్పాలని...

పెరుగుతున్న ధరల తుఫానులో కొట్టుకుపోతున్న

పేద ప్రజల ఆర్థనాదాన్ని కనులారా నీకు

చూపించాలని నీకోసం వెతుకుతున్నాను.

స్వార్ధపు మనిషి ముసుగుకప్పుకొని రంగస్థలం మీద

మనిషిలా నాటకం ఆడుతున్నావు కదా.

నిన్నెలా గుర్తు పట్టేది.!

నేలరాలుతున్న కన్నీరును తుడిచి

నను ఓదార్చుతావని ఆశల దీపాన్ని

వెలిగించుకొని చూస్తున్నాను

మదిలోని బండరాయిలాంటి బాధల బరువునుదించి

ధైర్యపు పసరును నూరిపోస్తావని ఎదురుచూస్తున్నాను.

గొంగలిపురుగులా ఉన్న నన్నుచూసి_

నువ్వు చీదరించుకుంటున్నావేమో!

నీ ప్రేమ దోసిల్లలో ఒక్కసారి నను బంధించిచూడు.

రంగుల సీతాకొకచిలుకై నింగికి ఎగురుతాను.

ఆనందానికి చిరునామై నీ భుజంపై వాలుతాను.

నువ్వాడుతున్న నాటకం నాకు ఎరుకేలే.

చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నా బతుకునుచూసి..

నిశీధి కూడా చింతిస్తూ కూర్చుంది.

వెలుగును వెతుక్కుంటూ నాతోపాటు

యుద్ధం చేస్తూనే ఉంది.

నన్ను నేనే ఓదార్చుకుంటున్నా.

దిగులుగుండెతో నాతోనేనే మాట్లాడుకుంటున్నా.

నాకు ఇప్పుడు

ఒక మనిషి తోడంటూ ఎవ్వరూ లేరు.

ఓ మనిషీ...నిన్నెక్కడని వెతకాలి.

కాస్త నీ జాడ చెప్పవా ప్లీజ్.!

అశోక్ గోనె

9441317361

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్