దసరా వచ్చింది...
చెడుపై మంచి గెలిచిన విజయగాథను వినిపిస్తూ,
మనసుల్లో మానవత్వపు దీపాలను వెలిగించమంటూ...
మనిషిలోని అహంకారాన్ని అంతం చేసి,
మనసుల మధ్య ప్రేమపూల వంతెనలు నిర్మించమంటూ...
ఆరాధించే చేతులు,
ఆపదలో ఉన్న మనిషికి అండగా నిలవాలి.
దీపం వెలిగించే హృదయం,
దీనుడి జీవితంలోనూ వెలుగులు నింపాలి.
పరుల కన్నీటిని తుడిచే చేతులే పవిత్రం కదా!
ఈ దసరా...
కులాల గోడలు కూలిపోవాలి,
మతాల పేరుతో మనసుల మధ్య
పెరిగిన దూరం తగ్గిపోవాలి.
ధనికుడి చిరునవ్వులోనూ,
పేదవాడి కన్నీటిలోనూ
ఒకే మానవత్వాన్ని చూడగలగాలి.
ఎందుకంటే...
ఆకలికి కులం లేదు,
కన్నీటికి మతం లేదు,
ప్రేమకు సరిహద్దులు లేవు!
రావణుడి దిష్టిబొమ్మను దహిస్తాం...
మరి మనలోని ద్వేషాన్ని ఎప్పుడు దహిస్తాం?
అహంకారపు పది తలలను ఎప్పుడు తెగనరుకుతాం?
అసూయను, వివక్షను, స్వార్థాన్ని
మనసుల నుంచి ఎప్పుడు వెలివేస్తాం?
మనలోని చెడును జయించినప్పుడే
విజయదశమికి నిజమైన అర్థం కదా!
పండుగ వెలుగులు రాజభవనాలకే కాదు,
పేదవాడి పూరిగుడిసెకూ చేరాలి.
పిండివంటల పరిమళం ప్రతి ఇంటా విరియాలి,
అనాథ బిడ్డ పెదవులపై చిరునవ్వు పూయాలి.
ఆకలితో అలమటించే కడుపుకు అన్నం అందాలి,
ఒంటరితనంతో కుమిలే గుండెకు ఆప్యాయత దక్కాలి.
మనిషితనం ఒక్కటే!
మన భాషలు వేరైనా... మన కన్నీటి భాష ఒక్కటే!
మన సంప్రదాయాలు వేరైనా...
మనిషిని ప్రేమించాలనే ధర్మం ఒక్కటే!
దసరా అంటే కేవలం సంబరమా?
కాదు... ఒక మనసు మరో మనసుకు చేరువయ్యే సందర్భం.
విజయదశమి అంటే కేవలం విజయం కాదు...
బలహీనుడికి బలంగా నిలిచే మానవీయ సంకల్పం.
పండుగ అంటే ఒక్కరోజు ఆనందం కాదు...
నలుగురి జీవితాల్లో వెలుగు నింపే నిరంతర ప్రయాణం.
తోరణాలు వాడిపోవచ్చు...
దీపాలు ఆరిపోవచ్చు...
పండుగ సందడి ముగిసిపోవచ్చు...
కానీ మనలో వెలిగిన మానవత్వం మాత్రం
ఎప్పటికీ ఆరిపోకూడదు!
మనిషిని మనిషిగా చూసే చూపు కావాలి
కష్టంలో తోడుండే చేయి కావాలి
భేదాలను మరచిపోయే హృదయం కావాలి
అందరి ఆనందంలో మన ఆనందాన్ని చూసే సమభావం కావాలి.
అప్పుడే ప్రతి గుండె ఒక దేవాలయం...
ప్రతి మనిషి ఒక ఆత్మీయుడు...
ప్రతి ఇల్లు ఆనందాల హరివిల్లు...
ప్రతిరోజూ విజయదశమి!
మనిషితనమే మన మతం...
సమానత్వమే మన సంస్కృతి...
ప్రేమే మన పండుగ...
మానవత్వపు విజయమే నిజమైన విజయదశమి!
డాక్టర్ ఈమని శ్రీసత్యసాంబశివరావు







కామెంట్లు (0)