ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూపర్ వైజర్ సూర్యం

1 గంట క్రితం

Supervisor Suryam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ పొద్దు మా సూపర్ వైజర్ సూర్యున్ని

కాస్త పెందలాడే ఇంటికి సాగనంపి

నులక మంచం మీద

అట్టా నడుం వాల్చ.


చీకటేమో నెమ్మదిగా భయపడుతూ

భయపడుతూ వచ్చి ఊరి మీద పడింది.

ఎక్కడైనా వెలుతురు కనపడితే దొంగతనం చేద్దామని.


పైరగాలి చెట్టా పట్టాలేసుకొని

చెట్టూ పుట్టా దాటుకుంటూ

నా తోట దగ్గరికొచ్చింది.

ఒక మూర మల్లెపూలు కొనుక్కు వెళ్దామని.


కీచురాళ్ళు నా పెరటి గుమ్మం ఎనకాల

ఎక్కడో నిశ్శబ్దంగా సంగీత సాధన చేస్తున్నాయి.

ఈసారి దసరా ఉత్సవాల్లో కచేరీ చేయడానికి.


మిణుగురులు మిలమిలా మెరుస్తూ

చీకటిని కొంచెం కొంచెం తింటున్నాయి.

తమ ఆకలిని తీర్చుకోవడానికి.


మేఘాలు అటు ఇటు పరిగెడుతున్నాయి.

తమ ప్రేయసి అయిన చల్లగాలి కోసం.

కనబడితే కారు మబ్బులై కౌగిలించుకోవడానికి.


మా ఇంటి ఎనకాల సరస్సు దగ్గరికి

సందమామ ఒంటరిగా వచ్చింది.

ఎవరికంటా పడకుండా కాసేపు సరసలాడి పోదామని.


నెమ్మదిగా శీతల పవనాలు

నా దుప్పట్లోకి దూరాయి.

చలికాచుకోవడానికి తలదాచుకోవడానికి.


ఆపైన నిద్ర దేవత నన్ను వెతుక్కుంటూ వచ్చి

నాకోసం ఒక జోల పాట పాడింది.

నన్ను నిద్రపుచ్చడానికి.


ఆ తరువాత ఎప్పటికో వచ్చినాయి యాడ నుంచి

వచ్చినాయో తెలియదు ఉరుములు

మెరుపులు పోట్లాడుకుంటూ తన్నుకుంటూ మా ఊరి మీదకి వచ్చినాయి.


తరువాత వాటి తగువులు తీర్చడానికి,

తీర్పు చెప్పడానికి పెద్ద మనిషి వరుణుడు వచ్చాడు.


ఆ పంచాయతీ తెల్లారినా

కూడా తెగలేదు.


మా సూపర్వైజర్ 'సూర్యం' వీళ్లని

ఒక సూపు సూస్తే గాని వీళ్ళ ఆటలు ఆగవు....

అనుకొని అట్టనే ఆయన కోసం

ఆ తూరుపు దిక్కు వైపే చూస్తూ ఉండిపోయిన....


ఏరువ శ్రీనాథ్ రెడ్డి

7659877744


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్