నిశ్శబ్దపు తెరలు చీల్చుతూ జ్వలించు అగ్నిగోళమా !
పూరించు నీ పదునైన విప్లవ శంఖారావం !
శ్రామిక లోకానికిదే ఆరంభ ఘంటారావం !
పద ముందుకు.. పద ముందుకు !
బానిసత్వపు శృంఖలాలు తెంచుతూ,
అడుగులో అడుగు కలుపుతూ,
అన్యాయపు దుర్గాలు ధ్వంసం చేస్తూ..!
ఏసీ గదుల్లో బందీవైన ఐటీ శ్రామికుడా!
ఎవురు నీవు? ఎవరికని నీ శ్రమ?
కీబోర్డు కారాగారంలో నలిగే మేధో బానిసవా?
డెడ్ లైన్ల ఉరితాడుల ఆధునిక కూలీవా?
టార్గెట్ల వేటలో కరిగే నవయుగ శ్రమవా?
కురిపించు నీ ధిక్కారం నిప్పుల వర్షమై.. !
ప్రశ్నలే నీ ఫిరంగులై ప్రమాద గంటలు మోగించనీ !
అన్యాయపు అంధకారాన్ని అక్షర జ్వాలలు కాల్చనీ !
ఆకలి కేకల అగ్నిపర్వతం అధికార గద్దెను కదిలించనీ !
సమసమాజపు ప్రభాతం నేడే ఉదయించనీ !
పదముందుకు.. పద ముందుకు !
అన్యాయంపై ఎక్కుపెట్టిన అగ్ని బాణమై !
దుర్మార్గపు చీకట్లను చీల్చే వజ్రాయుధమై !
జగతిని మేలుకొలిపే మహా విప్లవ జ్వాలవై !
భ్రమరాంబికా సాయిశ్రీ మిరియాల








కామెంట్‌లు (0)