ఆ ఉదయపు నీరెండలో....
అవస్థల ముళ్ళతీగలన్నీ
లంకెలు వేసుకొని అల్లుకుపోయిన
బతుకు డొంకను భారంగా మోస్తూ
గుమ్మం నుంచి గమ్యం దిశగా
రెండు తడి తడి హృదయాలు...!
ఒకటి తల్లి హృదయం!
మరొకటి బిడ్డ హృదయం!
తల్లి హృదయం రోడ్డు పక్కన
దుకాణం పరిచి కూలబడితే
బిడ్డ హృదయం యాప్ లలో
ఆర్డర్లు ఇచ్చిన ఇళ్ల చుట్టూ
చక్కర్లు కొడుతూ చెడతిరుగుతోంది!
ఆ మధ్యాహ్నపు మండుటెండలో
ఆ తల్లి హృదయం
తన ఆకలి కడుపుకు
ఏమైనా ఆహారం అందించిందో!
లేక పచ్చి మంచినీళ్లే తాపించి
ఉయ్యాలలో బజ్జోబెట్టేసిందో ...!
బిడ్డ హృదయమైతే ఆ సమయానికి
కాలే కడుపుని తోడు తీసుకొని
ఓ మేడింటి రెండు ఫ్లోర్ల మెట్లెక్కి
ఆర్డర్ చేసిన ఫుడ్ పార్సిల్లను
ఆశగా తడుముతూనే
అందజేసి కిందికి దిగుతూవుంది!
ఆపై,అందుబాటు ధరలోని
ఏ చిరు తిండితోనో సరిపెట్టుకొని
గాలి ఊదిన బెలూనై మళ్లీ
ఎక్కడెక్కడి ఆర్డర్లనో
ఒక్కొక్కటిగా బట్వాడా చేస్తూ
రోజంతా ఓటీపీలతో
పోటీపడుతూనేవుంది!
శ్రమసూర్యుడు అలసి సొలసి
కందగడ్డైన ఆ సాయంత్రంవేళ...
ఎప్పుడో పొద్దుటి నీరెండలో
పరిచిన ఆ చిరు దుకాణం మాత్రం
పలుచని చీకట్లు పలుకరిస్తున్నా
ఏ బేరగాళ్ళ సందడీ లేక
బోసిపోయింది!
వాడిపోయిన కూరగాయల్లా
మాడిపోయిన తల్లి హృదయాన్ని
ఓసారి తడిమి చూసి
పక్కనున్న అపార్ట్మెంట్ వైపు
బండి తిప్పిన బిడ్డ హృదయం
ఆర్డర్ చేసిన కూరగాయల
ప్యాకెట్లను
ఆ ఇంటి గుమ్మం ముందు కుప్పపోసి
తల్లి హృదయాన్ని చేరుకుంది!
దుకాణంలో అమ్ముడుపోని
సరుకుల్ని సంచులకెత్తుకుంటూ...
రెక్కలు ముక్కలవుతున్నా
రోజు గడవని బతుకు యాతనకు
మూలమెక్కడో మర్మమేమిటో
కొద్దికొద్దిగా ఆకళింపు
చేసుకుంటూ...
ఆ తల్లీబిడ్డల తడి తడి హృదయాలు
ముసురుకుంటున్న చీకట్లను
విసురుగా చీల్చుకుంటూ
ఎర్రబడ్డ కళ్ళతో ఇల్లు
చేరుకున్నాయి!
పతివాడ నాస్తిక్
9441724167







కామెంట్‌లు (0)