మనిషి విజ్ఞానం ఆకాశం వైపు చూడడంతో ప్రారంభమయ్యిందని అంటారు. మొదట ఆకాశంలోని మెరుపులు, ఉరుములకు భయపడిన మానవుడు వాటిని ఆరాధించాడు. తర్వాతికాలంలో వాటి రహస్యాలను అన్వేషించడం, వాటిని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఈ అన్వేషణకు కావలసిన ప్రశ్నలు తన మేధస్సులో ఆవిష్కృతం అయ్యాయి. చంద్రునిపై ఏముంది? నక్షత్రాలలో ఏముంది? ఈ విశ్వంలో జీవం మరి ఎక్కడెక్కడ ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు శతాబ్దాలుగా అనేక పరిశోధనలు చేశారు. వాటి ఫలితంగా విజ్ఞాన శాస్త్రం పెరిగింది.
విజ్ఞాన శాస్త్ర పరిశోధనా ప్రయాణంలో వాయోజర్ అంతరిక్ష నౌకలు ఒక అద్భుతం. 1977లో భూమి నుంచి పంపిన ఈ చిన్న రోబోటిక్ అంతరిక్ష నౌకలు ఇవి. ఐదు దశాబ్దాలుగా విశ్వంలోని విలువైన సమాచారాన్ని మనకు చేరవేస్తూ వస్తున్నాయి. వాయోజర్ – 1, వాయోజర్ - 2 లను జంట అంతరిక్ష నౌకలు అంటారు. వీటిని అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA (National Aeronautics and Space Administration) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుండి మొదట వాయోజర్ -2 ను 1977 ఆగస్ట్ 20న, తర్వాత వాయోజర్ -1 ను 1977 సెప్టెంబర్ 05 న ప్రయోగించింది. వాయేజర్ల ఉద్దేశ్యం బృహస్పతి (Jupiter) , శని గ్రహాలు (Saturn), శని వలయాలు, ఆ రెండు గ్రహాల పెద్ద చంద్రులపై అధ్యయనాలు చేయడం. బృహస్పతి, శని గ్రహాలను అధ్యయన యాత్రను పూర్తిచేయడానికి వాయోజర్ నౌకలను ఐదేళ్లు పనిచేసేలా తయారుచేశారు. యాత్ర కొనసాగే కొద్దీ లక్ష్యాలను సాధించడంతో శాస్త్రవేత్తలు వాయోజర్ -2 ను భూమికి అత్యంత దూరంగా ఉన్న రెండు భారీ గ్రహాలైన యురేనస్, నెప్ట్యూన్ల సమీపంగా ప్రయాణింపజేసి, ఆ రెండు గ్రహాలపై అధ్యయనం కొనసాగించారు. వాయేజర్ 1, 2 కలిసి మన సౌరవ్యవస్థలోని అన్ని భారీ బాహ్య గ్రహాలను, వాటి 48 చంద్రులను, ఆ గ్రహాలు కలిగి ఉన్న ప్రత్యేకమైన వలయాలు, అయస్కాంత క్షేత్రాల వ్యవస్థలను అన్వేషించాయి, వాటి వివరాలను మనకు తెలియజేశాయి. బృహస్పతి (Jupiter) పరిశోధనలు.. వాయోజర్ -1 అంతరిక్ష నౌక వేగంగా వెళ్లి 1979 మార్చి 5న, వాయోజర్ -2 అంతరిక్ష నౌక 1979 జూలై 9 న జూపిటర్ గ్రహానికి అత్యంత సమీపంగా ప్రయాణించి సందర్శించాయి.
1. జూపిటర్ వాతావరణంలో వివిధ రంగుల మేఘాల పట్టీలు, భారీ గాలులు, తుఫానులు ఉన్నట్లు గుర్తించాయి.
2. జూపిటర్ పై కనిపించే అత్యంత ఆసక్తికరమైన అంశం గ్రేట్ రెడ్ స్పాట్. ఈ భారీ ఎరుపు రంగు తుఫానును వాయేజర్ నౌకలు స్పష్టంగా చిత్రీకరించాయి. ఈ తుఫాను అనేక శతాబ్దాలుగా కొనసాగుతున్నది.
3. శని గ్రహంలాగే జూపిటర్ కి కూడా పలుచని వలయాలు ఉన్నాయని గుర్తించాయి. ఇవి ధూళి కణాలతో ఏర్పడ్డాయి. సూర్యకాంతి వెనుక నుంచి పడినప్పుడు మాత్రమే వీటిని స్పష్టంగా గుర్తించడం సాధ్యమైంది.
4. జూపిటర్ ఉపగ్రహాలైన ఐయో, యూరోపా, గనిమీడ్, కాలిస్టోలను దగ్గరగా పరిశీలించి వాటి ఉపరితలాల చిత్రాలను పంపించాయి. ఐయో (Io) అగ్నిపర్వతాలతో నిండిన ఉపగ్రహమని, యూరోపా (Europa) మంచుతో కప్పబడిన ఉపరితలమని, గనిమీడ్ (Ganymede) పై గుంటలు, పగుళ్లు, భిన్నమైన భౌగోళిక నిర్మాణాలు ఉన్నట్లు, కాలిస్టో (Callisto) ఉపరితలంపై అనేక ఉల్కా ఢీకొన్న గుర్తులను (Impact Craters) గుర్తించాయి. అంతేకాకుండా, వాయేజర్–1 బృహస్పతికి చెందిన గతంలో తెలియని రెండు ఉపగ్రహాలను గుర్తించింది. వాటికి థీబీ (Thebe), మెటిస్ (Metis) అని పేర్లు పెట్టారు.
5. జూపిటర్ చుట్టూ ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం, రేడియేషన్ గురించి సమాచారాన్ని సేకరించాయి. ఈ అయస్కాంత ప్రాంతంలో విద్యుదావేశిత కణాలు, రేడియేషన్, ప్లాస్మా వంటి పదార్థాలు ఉన్నాయని వెల్లడించాయి.

శని (Saturn)పై పరిశోధనలు...
నాసా (NASA) ప్రయోగించిన వాయిజర్-1, వాయిజర్-2 అంతరిక్ష నౌకలు వరుసగా 1980 నవంబర్ 12, 1981 ఆగస్టు 25 లలో శని గ్రహాన్ని (Saturn) దగ్గరగా సందర్శించాయి.
1. శని చుట్టూ అనేక వలయాలు ఉన్నాయని, అవి మంచు ముక్కలు, ధూళి, రాతి కణాలతో ఏర్పడ్డాయని పరిశీలించాయి.
2. శని అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్ చుట్టూ దట్టమైన వాతావరణం ఉందని గుర్తించాయి. అందులో ప్రధానంగా నైట్రోజన్, కొంత మీథేన్ ఉంటాయని తెలుసుకున్నాయి. శని చుట్టూ గతంలో తెలియని ప్రోమీథియస్ (Prometheus), పాండోరా (Pandora), అట్లాస్ (Atlas), టెలెస్టో (Telesto), కాలిప్సో (Calypso) చిన్న ఉపగ్రహాలను గుర్తించాయి.
3. శని గ్రహంపై భారీ గాలులు, మేఘాలు, తుఫానులు ఉన్నట్లు పరిశీలించాయి.
4. శని గ్రహానికి ఉన్న అయస్కాంత క్షేత్రం గురించి సమాచారాన్ని సేకరించాయి.
5. టైటాన్‌పై చేసిన పరిశోధనలు భవిష్యత్తులో అంతరిక్షంలో జీవానికి అనుకూల పరిస్థితుల అన్వేషణకు ఉపయోగపడ్డాయి.
యురేనస్, నెప్ట్యూన్ లపై వాయేజర్ -2 సాధించిన అద్భుతాలు:
వాయోజర్ -2 యురేనస్ గ్రహాన్ని 1986 జనవరి 26న, నెప్ట్యూన్ గ్రహాన్ని 1989 ఆగస్ట్ 25 న అత్యంత సమీపంగా ప్రయాణించి సందర్శించింది. యురేనస్ 11 కొత్త ఉపగ్రహాలను, రెండు కొత్త వలయాలను కనుగొనింది. మిరాండా ఉపగ్రహంపై ఎత్తైన కొండలు, లోతైన లోయలను చిత్రీకరించింది. అలాగే నెప్ట్యూన్ ఆరు కొత్త ఉపగ్రహాలను, నాలుగు కొత్త వలయాలను కనుగొనింది. భారీ తుఫాను (Great Dark Spot)ను, గంటకు సుమారు 2,000 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను గుర్తించింది. ట్రైటాన్ ఉపగ్రహంపై మంచు అగ్నిపర్వతాల వంటి చర్యలను గుర్తించింది.
గోల్డెన్ రికార్డ్ (Golden Record):
ఈ అనంత విశ్వంలో మనలాంటి ప్రాణులు లేవా? ఉంటే వారిని ఎందుకు కలవకూడదు? వాళ్ళతో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నించకూడదు? వందల ఏళ్ళ పాటు శాస్త్రవేత్తలలో మేధోమధనమై చివరికి వాయోజర్ రూపాన్ని సంతరించుకున్నది. భూమి గురించి ఇతర గ్రహాంతర జీవులకు తెలియజేయడానికి వాయేజర్–1, వాయేజర్–2 అంతరిక్ష నౌకల్లో పంపించిన ఒక ప్రత్యేక సందేశమే గోల్డెన్ రికార్డ్.
దీనిని 1977లో NASA పంపించింది. రెండు అంతరిక్ష నౌకలలోనూ గోల్డెన్ రికార్డులు అమర్చారు. ఇది మానవాళి తరఫున విశ్వానికి పంపిన ఒక సందేశం. భవిష్యత్తులో ఏదైనా గ్రహాంతర జీవి ఈ అంతరిక్ష నౌకను కనుగొంటే, భూమిపై జీవం, మానవ నాగరికత, మన సంస్కృతి, విజ్ఞానం గురించి తెలుసుకోవాలనేది దీని ప్రధాన ఉద్దేశం. ఈ రికార్డులో భూమి ఎక్కడ ఉందో తెలియజేసే పల్సార్ మ్యాప్, రికార్డును ఎలా వినాలో వివరించే సూచనలు కూడా ఉన్నాయి.

పేల్ బ్లూ డాట్ (Pale Blue Dot)
పేల్ బ్లూ డాట్ అంటే లేత నీలి చుక్క అని అర్థం. అంతరిక్షం నుంచి చూస్తే మన భూమి ఎంత చిన్నగా కనిపిస్తుందో తెలియజేసే ఒక ప్రసిద్ధ ఛాయాచిత్రం ఇది. 1990 ఫిబ్రవరి 14న వాయేజర్–1 భూమి నుంచి సుమారు 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఫోటో తీస్తే ఆ చిత్రంలో భూమి ఒక చిన్న లేత నీలి చుక్కలా కనిపించింది. మనకు ఎంతో పెద్దదిగా కనిపించే భూమి, మనుషులు, దేశాలు, సరిహద్దులు, యుద్ధాలు, విజయాలు అన్నీ విశ్వంలోని అపారమైన అంతరిక్షంతో పోలిస్తే ఎంత చిన్నవో ఈ చిత్రం గుర్తుచేస్తుందని ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ (Carl Sagan) ఈ చిత్రానికి ప్రత్యేకమైన తాత్విక విశ్లేషణ ఇచ్చారు.
నక్షత్రాంతర అంతరిక్షంలోకి ప్రయాణం...
సూర్యుడి నుంచి నిరంతరం విద్యుత్ ఆవేశం కలిగిన కణాలు వెలువడుతుంటాయి. వీటిని సౌర పవనం (Solar Wind) అంటారు. ఈ సౌర పవనం సృష్టించే ప్రభావం సూర్యుడి చుట్టూ చాలా దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతాన్నే హీలియోస్పియర్ అంటారు. సూర్యుడు తన చుట్టూ సృష్టించుకున్న ఒక రక్షణ కవచం లాంటిది హీలియోస్పియర్. హీలియోస్పియర్కు ఒక బయటి సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దునే హీలియోపాజ్ అంటారు. దీన్ని సూర్యుడి ప్రభావ ప్రాంతానికి, నక్షత్రాంతర అంతరిక్షానికి మధ్య ఉన్న సరిహద్దుగా భావించవచ్చు. నాసా శాస్త్రవేత్తల అధికారిక ప్రకటన ప్రకారం, వాయేజర్–1 తన ప్రయాణంలో 2012 ఆగస్టు 25న, వాయేజర్-2 నవంబర్ 5, 2018న 'హీలియోపాజ్'ను దాటి నక్షత్రాంతర అంతరిక్షం (Interstellar Space) లోకి ప్రవేశించాయి. దీంతో సూర్యుడి ప్రభావ ప్రాంతం వెలుపల ఉన్న అంతరతారక అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత అంతరిక్ష నౌకగా వాయేజర్–1 చరిత్ర సృష్టించింది. తద్వారా సూర్యుడి ప్రభావం లేని ప్రాంతం గురించి ప్రత్యక్ష సమాచారాన్ని అంతరతారక అంతరిక్షంలోని కణాలు, అయస్కాంత క్షేత్రం గురించి విలువైన సమాచారాన్ని వాయేజర్ నౌకలు అందించాయి. వాయేజర్–1 సెకనుకు సుమారు 17 కిలోమీటర్ల వేగంతో, గంటకు సుమారు 61,000 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. భూమి నుంచి సుమారు 25 బిలియన్ కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. దూరం నిరంతరం పెరుగుతోంది.. దీనికి సౌర ఫలకాలు లేవు. ప్లూటోనియం-238 నుంచి వేడిని ఉత్పత్తి చేసి విద్యుత్తుగా మార్చే RTG వ్యవస్థ ద్వారా విద్యుత్ పొందుతోంది. కాలక్రమేణా విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోంది. విద్యుత్తును ఆదా చేయడానికి నాసా కొన్ని పరికరాలను ఒక్కొక్కటిగా నిలిపివేస్తోంది. ముఖ్యమైన పరికరాలు పనిచేసేలా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. 2026 సెప్టెంబర్‌లో నాసా కొత్త విద్యుత్ ఆదా చర్యను చేపట్టింది. దీనికి ‘బిగ్ బాంగ్’ అని పేరు పెట్టారు. 2026 అక్టోబర్ 18–20 మధ్య కొంతసేపు సమాచార సంబంధం నిలిచిపోయినా తిరిగి పునరుద్ధరించబడింది. ప్రస్తుతం ప్రధానంగా రెండు పరిశోధనా పరికరాలు పనిచేస్తున్నాయి. అవి మాగ్నెటోమీటర్ అయస్కాంత క్షేత్రాన్ని కొలుస్తుంది. ప్లాస్మా వేవ్ సబ్‌సిస్టమ్ ప్లాస్మా తరంగాలను పరిశీలిస్తుంది. వాయేజర్ -1 సుమారు 40,000 సంవత్సరాల తర్వాత Gliese 445 అనే నక్షత్రానికి దగ్గరగా వెళుతుంది. అయితే దాని నుంచి కూడా చాలా దూరంగానే ఉంటుంది. విద్యుత్ తగ్గిపోవడంతో 2030 ప్రాంతంలో శాస్త్రీయ పరిశోధనలు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత భూమికి సంకేతాలు పంపలేకపోవచ్చు. కానీ అంతరిక్షంలో దాని ప్రయాణం ఆగదు. కోట్ల సంవత్సరాల పాటు ప్రయాణం కొనసాగుతుంది. భూమి నుంచి బయలుదేరిన వాయేజర్ అంతరిక్ష నౌకలు ఇంత దూరం ప్రయాణించడం మానవ విజ్ఞానానికి గొప్ప ఉదాహరణ. మనిషి తన ఆలోచన, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానంతో భూమి సరిహద్దులను దాటి విశ్వాన్ని అన్వేషించగలడని ఇది నిరూపించింది. విశ్వం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ప్రతి కొత్త పరిశోధన మనకు కొత్త విషయాలను నేర్పుతుంది. కొత్త ప్రశ్నలను పుట్టిస్తుంది. వాయేజర్ మనకు చెప్పే సందేశం ఒక్కటే తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నంతకాలం మానవ విజ్ఞాన ప్రయాణానికి అంతం ఉండదు.
తవ్వా సురేష్
9705333305
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి







కామెంట్లు (0)