mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వంకాయతో ఘుమఘుమలు

1 రోజు క్రితం

ruchi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:05 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

వంకాయ రుచిలోనే కాదు పోషకాల్లోనూ రారాజే. ఇందులో విటమిన్ సి, కె, బి-కాంప్లెక్స్ (బి6) వంటి కీలక విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వంకాయలోని ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు లభించి శరీరానికి రోగనిరోధక శక్తిని చేకూరుస్తాయి. ఇందులో ఉండే 'నాసునిన్' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మెదడు కణాలను రక్షించడమే కాకుండా, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ (పీచుపదార్థం) కలిగిన వంకాయను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగై, బరువు అదుపులో ఉంటుంది. వంకాయతో వండగలిగినన్ని వంటలు ఏ ఇతర కూరగాయతోనూ వండలేము. మరి వంకాయతో రుచికరమైన వంటకాలను ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.


ruchi 01

పచ్చడి

కావల్సినవి: వంకాయలు- అరకేజీ, ఉప్పు - తగినంత, ఆయిల్ -తగినంత, ధనియాలు - రెండు స్పూన్లు, జీలకర్ర – స్పూన్, పచ్చిమిర్చి - 15, నూనె - తగినంత, పసుపు - అర ​స్పూను, టమాటాలు - మూడు, చింతపండు - నిమ్మకాయ సైజంత, శనగపప్పు - ​స్పూన్, ఆవాలు - ​స్పూన్, ఎండుమిర్చి - 4, వెల్లుల్లి రెబ్బలు - 8, కరివేపాకు - కొద్దిగా.

తయారీ : వంకాయలను శుభ్రంగా కడిగి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి, ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోవాలి. స్టవ్​పై కడాయి పెట్టి, ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసుకొని కలుపుతూ కాసేపు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, ఉప్పు వేసుకొని కలుపుతూ మూతపెట్టి, ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్ చేసి, కడాయి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరో స్పూన్ నూనె పోసి, వేడి చేసి, వంకాయ ముక్కలను వేసుకోవాలి. వెంటనే అర టేబుల్​స్పూన్ చొప్పున ఉప్పు, పసుపు వేసుకొని, మంచి కలర్ వచ్చేంత వరకూ కలుపుతూ వేయించుకోవాలి. చివరిగా ఇందులో గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేయించిన టమోటా ముక్కలు, నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి చల్లారిన వంకాయ ముక్కలు వేసి ఒక పల్ప్‌ ఇవ్వాలి.

స్టవ్​పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని, కొద్దిసేపు వేయించుకోవాలి. చివరిగా కరివేపాకు వేసుకొని చిటపటలాడనిచ్చి స్టవ్​ ఆఫ్ చేసుకోవాలి. తాలింపుని ముందుగా రెడీ చేసుకున్న వంకాయ పచ్చడిలో వేసి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే నోరూరించే వంకాయ పచ్చడి రెడీ !


cutlets



కట్లెట్స్

కావాల్సినవి: పెద్ద వంకాయ- 1, ఉడికించిన బంగాళాదుంప -ఒకటి (పెద్దది), ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- రెండు, అల్లం,వెల్లుల్లి పేస్ట్- స్పూన్, శనగపిండి / బియ్యప్పిండి- 3 నుండి 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు- గుప్పెడు, కారం పొడి- స్పూన్, ధనియాల పొడి- 1/2 స్పూన్, గరం మసాలా - 1/2 స్పూన్, చాట్ మసాలా- 1/2 స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా.

తయారీ : వంకాయను శుభ్రంగా కడిగి, దానికి కొద్దిగా నూనె రాసి స్టవ్ మీద కాల్చాలి. లోపల వరకూ మెత్తగా ఉడికేలా తిప్పుతూ కాల్చాలి. తర్వాత చల్లార్చి, పైన ఉన్న నల్లటి తొక్కను తీయాలి. స్పూన్‌తో మెత్తగా మ్యాష్ చేసి, పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో వంకాయ గుజ్జు, ఉడికించి మ్యాష్ చేసిన బంగాళాదుంపను వేసి బాగా కలపాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేయాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమం కాస్త లూజ్‌గా అనిపిస్తే.. శనగపిండి, కాస్త బియ్యప్పిండి వేసి చపాతీపిండి కంటే కాస్త మెత్తగా ఉండేలా ముద్దలా కలుపుకోవాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని, నచ్చిన ఆకారంలో గుండ్రంగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె రాసి, వేడి చేయాలి. నూనె కాగాక, సిద్ధం చేసుకున్న కట్లెట్స్‌ను పాన్‌ మీద ఉంచి, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. రెండు వైపులా నూనె కొంచెం, కొంచెం వేస్తూ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ, క్రిస్పీగా అయ్యేలా అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే! నోరూరించే, వేడివేడి వంకాయ కట్లెట్స్ రెడీ!. వంకాయ తినడానికి మారాం చేసే పిల్లలకు ఇదొక హెల్దీ, టేస్టీ స్నాక్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటుంది.


mulakkaya


ములక్కాయ, మామిడికాయతో ఇగురు

కావల్సినవి: వంకాయలు- పావుకేజీ, ములగకాయలు- 2, పచ్చి మామిడికాయ ముక్కలు - 1/2 కప్పు, ఉల్లిపాయ- 1 పెద్దది, పచ్చిమిర్చి- 3, పసుపు- పావు స్పూన్, కారం పొడి- 2 స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర- కొద్దిగా, నూనె- 3 స్పూన్లు, ఆవాలు, జీలకర్ర- 1/2 స్పూన్, మెంతులు- కొంచెం, కరివేపాకు- స్పూన్.

తయారీ: స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ మగ్గించుకోవాలి. మునక్కాయ ముక్కలను వేసి, రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత ఉప్పు నీళ్లలో ఉన్న వంకాయ ముక్కలను తీసి వేయాలి. అందులోనే పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి మంటను సిమ్‌లో ఉంచి ఐదు నిమిషాల పాటు వంకాయ, మునక్కాయ ముక్కలు నూనెలోనే మగ్గనివ్వాలి. వంకాయలు సగం ఉడికిన తర్వాత, మామిడికాయ ముక్కలు వేయాలి. కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి, అంతా ఒకసారి బాగా కలపాలి. ముక్కలన్నీ మునిగేలా అర గ్లాసు నీళ్లు పోసి మూతపెట్టాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, నీరంతా ఇగిరిపోయి కూర దగ్గరకు పడి, నూనె పైకి తేలేంత వరకూ ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే! నోరూరించే వంకాయ ములక్కాయ మామిడికాయ ఇగురు రెడీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్