గుమ్మడికాయను చాలామంది సాధారణ కూరగాయగా భావిస్తారు. కానీ ఇందులో దాగి ఉన్న పోషక విలువలు తెలుసుకుంటే, దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవాలనిపిస్తుంది. తక్కువ కేలరీలు, అధిక పీచుపదార్థం, విటమిన్–ఎ, సి, ఇ, పొటాషియం, ఫోలేట్, బీటా-కెరోటిన్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉండే గుమ్మడికాయ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. గుమ్మడికాయతో కేవలం కూర మాత్రమే కాదు, పులుసు, సాంబారు, సూప్, హల్వా, పాయసం, కట్లెట్స్, సలాడ్ వంటి ఎన్నో రుచికరమైన వంటకాలను కూడా తయారు చేయవచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

గుమ్మడికాయ పరాఠా
కావలసినవి: గుమ్మడికాయ తురుము - కప్పు, గోధుమపిండి- రెండు కప్పులు, పచ్చిమిర్చి ముద్ద- స్పూను, అల్లం-వెల్లుల్లి పేస్ట్- 1/2 స్పూను, జీలకర్ర పొడి- 1/2 స్పూను, గరం మసాలా పొడి- 1/2 స్పూను, వాము- 1/2 స్పూను, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె- పరాఠాలు కాల్చడానికి సరిపడా.
తయారీ : వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి తీసుకోవాలి. అందులో గుమ్మడికాయ తురుము, పచ్చిమిర్చి ముద్ద, అల్లం-వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి, బాగా కలపాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకుని, పైన కొద్దిగా నూనె రాసి, 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. నానిన పిండిని సమాన ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని, పొడి పిండి చల్లుకుంటూ కొద్దిగా మందంగా పరాఠాలాగా కానీ గుండ్రంగా రుద్దుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కిన తర్వాత రుద్ది పెట్టుకున్న పరాఠాను వేసి, రెండు వైపులా మీడియం ఫ్లేమ్‌పై కాల్చాలి. పరాఠా పైన కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తూ, మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు చుక్కలు వచ్చే వరకూ అటూ ఇటూ తిప్పుతూ బాగా కాల్చాలి. అంతే వేడివేడి గుమ్మడికాయ పరాఠాలు రెడీ. వీటితో తాజా పెరుగు, ఆవకాయ పచ్చడి లేదా టొమాటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా కూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు, గుమ్మడికాయలోని పోషకాలను అందించడానికి ఇదొక మంచిమార్గం.

గుమ్మడికాయ గారెలు
కావలసినవి: గుమ్మడికాయ తురుము- కప్పు, బియ్యప్పిండి- 1.5 కప్పు, బెల్లం తురుము- 3/4 కప్పు, యాలకుల పొడి: 1/2 స్పూను, నువ్వులు- స్పూను, ఉప్పు- చిటికెడు, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ : ఒక గిన్నెలో గుమ్మడికాయ తురుము, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం గుమ్మడికాయలోని నీటి తడికి కరిగిపోతుంది. అందులో యాలకుల పొడి, నువ్వులు, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా బియ్యప్పిండిని వేస్తూ కలపాలి. గుమ్మడికాయలో ఉండే నీటి శాతాన్ని బట్టి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, జారుగా కాకుండా గారెలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. అరటి ఆకు తీసుకుని కొద్దిగా నూనె రాయాలి. కలిపి పెట్టుకున్న పిండి నుంచి చిన్న సైజ్ అంత ఉండను తీసుకుని, కవర్‌పై పెట్టి గారెల్లా ఒత్తుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి, ఒత్తి పెట్టుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేయాలి. రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకూ వేయించి తీసేయాలి. ఈ గారెలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అనిపించినా, కాసేపు ఆరిన తర్వాత చక్కగా పైన కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా భలే రుచిగా తయారవుతాయి. ఇవి రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి.
![]()
పాయసం
కావలసినవి : గుమ్మడికాయ తురుము: కప్పు, సగ్గుబియ్యం: 1/4 కప్పు, చిక్కటి పాలు- 3 కప్పులు, బెల్లం తురుము- 3/4 కప్పు, నెయ్యి- 2 స్పూన్లు, జీడిపప్పు, కిస్‌మిస్: కొద్దిగా, యాలకుల పొడి- 1/2 స్పూను.
తయారీ : ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె లేదా కడాయి పెట్టి 2 చెంచాల నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో గుమ్మడికాయ తురుము వేసి, 4-5 నిమిషాల పాటు బాగా వేయించాలి.తురుము మెత్తబడ్డాక గిన్నెలోకి తీసి పక్కన ఉంచాలి. అదే గిన్నెలో పాలు పోసి, మరిగించాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు వంపేసి పాలల్లో వేయాలి. సగ్గుబియ్యం మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌పై అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడికాయ తురుమును పాలల్లో వేసి బాగా కలపాలి. పాయసం కాస్త చిక్కబడే 3-4 నిమిషాలు ఉడికించాలి. ఇందులో బెల్లం తురుము వేసి కలపాలి. యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్ చల్లుకుని స్టవ్ ఆపేయాలి. గుమ్మడికాయ పాయసం సిద్ధం.








కామెంట్‌లు (0)