మొక్కజొన్న యొక్క సహజమైన తీపి, రుచిని హైలైట్ చేస్తూ, మీకు వేరియేటెడ్ అనుభవాన్ని అందిస్తాయి. బలవర్థకమైన మొక్కజొన్నతో వెరైటీ వంటలను ఇష్టంగా చేసుకుని ఆనందించండి!మొక్కజొన్నతో చేసే మూడు రుచికరమైన వంటకాలు ఎలా తయారు చేయాలో ఇస్తున్నాం. ఇవి మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో, సులభంగా ఇంట్లోనే చేసుకోగలిగేవి.

పకోడీ
కావలసినవి : ఉడికించిన మొక్కజొన్న గింజలు - కప్పు, శనగపిండి - 1/2 కప్పు (అవసరానికి), బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు (క్రిస్పీగా ఉండటానికి), ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి - 2 (తరిగినవి), అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా ఉప్పు, కారం - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి
తయారీ: ఉడికించిన మొక్కజొన్న గింజల్లో సగాన్ని (సుమారు 1/2 కప్పు) మిక్సీలో వేసి పూర్తిగా పేస్ట్ కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోండి. ఒక గిన్నెలో రుబ్బిన మిశ్రమం, మిగిలిన మొత్తం మొక్కజొన్న గింజలు, శనగపిండి, బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. (మిశ్రమం చేతికి అంటకుండా ఉండేలా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు చల్లుకోవచ్చు.) బాణలిలో నూనె వేడి చేయండి. మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు కరకరలాడేలా వేయించాలి. వేడి వేడి పకోడీలను టమాటా సాస్ లేదా పచ్చడితో వడ్డించండి.

సూప్
కావలసినవి: మొక్కజొన్న గింజలు - కప్పు (ఉడికించినవి), వెన్న - 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం - 1 టీస్పూన్, తురిమిన వెల్లుల్లి - 1 టీస్పూన్, తరిగిన పచ్చి ఉల్లిపాయ - 5 టేబుల్ స్పూన్లు, తురిమిన క్యారెట్ - 1/4 కప్పు, కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్ (నీళ్ళలో కలిపి పేస్ట్ చేయండి), నల్ల మిరియాలు - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - 4 కప్పులు
తయారీ : ఒక బాండీలో వెన్న వేడి చేసి, తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిమిషం వేయించండి. ఇప్పుడు తరిగిన పచ్చి ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేయించి, ఆ తర్వాత తురిమిన క్యారెట్ వేసి మరో 2 నిమిషాలు వేయించండి. ఉడికించిన మొక్కజొన్న ౠగింజలు వేసి, 4 కప్పుల నీరు పోసి, ఉప్పు, నల్ల మిరియాలు వేసి బాగా కలపండి. సూప్ మరిగిన తర్వాత, కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి, సూప్ కొద్దిగా చిక్కబడేవరకు 5-6 నిమిషాలు ఉడికించండి. వేడి వేడి సూప్‌ను కప్పుల్లో వేసి, పైన స్ప్రింగ్ ఆనియన్స్‌తో అలంకరించి వడ్డించండి.

పులావ్
కావలసినవి:బాస్మతి బియ్యం - 1 కప్పు (30 నిమిషాలు నానబెట్టినది), మొక్కజొన్న గింజలు - 1/2 కప్పు (ఉడికించినవి), నూనె/నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 1/2 టీస్పూన్, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు - ఒక్కొక్కటి, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది), అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, టొమాటో - 1 (తరిగినది), గరం మసాలా - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - 2 కప్పులు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ: ప్రెజర్ కుక్కర్‌లో నూనె/నెయ్యి వేడి చేసి, జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క,లవంగాలు వేసి వాసన రాగా వేయించండి. తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం వేయించండి. తరువాత తరిగిన టొమాటో వేసి మెత్తగా అయ్యేవరకు వేయించండి. నానబెట్టిన బియ్యం, ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి, ఉప్పు, గరం మసాలా వేసి 2 నిమిషాలు బాగా వేయించండి. 2 కప్పుల నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెజర్ పోయాక, పులావ్‌ను ఒక పాత్రలోకి తీసి పైన తాజా కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.







కామెంట్‌లు (0)