ఈ చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి తాజా కూరగాయలు, తృణధాన్యాలు, నువ్వులు-మిరియాల పొడి లాంటి సహజమైన వెచ్చదనాన్ని ఇచ్చే పదార్థాలతో వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వెచ్చగా ఉంచే నాలుగు అద్భుతమైన సలాడ్ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి. అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
వేడి వేడి శనగలతో..
కావల్సినవి : నల్ల శనగలు - కప్పు (రాత్రంతా నానబెట్టి ఉడికించినవి); ఉల్లిపాయ ముక్కలు - 1/4 కప్పు; టమాటా ముక్కలు - 1/4 కప్పు; పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగినవి); అల్లం తురుము - 1/2 టీస్పూన్; నిమ్మరసం - స్పూన్; జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్; కొత్తిమీర - కొద్దిగా; ఉప్పు - తగినంత.
తయారీ : ఉడికించిన శనగలను ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం తురుము వేయాలి. తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం పిండుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. 
స్వీట్ కార్న్ - క్యాప్సికంతో..
కావల్సినవి : ఉడకబెట్టిన స్వీట్ కార్న్ - కప్పు; తరిగిన క్యాప్సికం (గ్రీన్/ఎల్లో) - 1/2 కప్పు; ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది); చాట్ మసాలా - 1/2 టీస్పూన్; నెయ్యి లేదా బటర్ - టీస్పూన్; నిమ్మరసం - టీస్పూన్; ఉప్పు - తగినంత.
తయారీ : పాన్లో కొద్దిగా నెయ్యి వేసి, తరిగిన క్యాప్సికం ముక్కలను నిమిషం పాటు తేలికగా వేయించాలి. అందులో ఉడకబెట్టిన స్వీట్ కార్న్ వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
నువ్వులు - క్యారెట్ తో..
కావల్సినవి: క్యారెట్ తురుము - కప్పు; తెల్ల నువ్వులు (వేయించినవి) - 2 స్పూన్లు; దానిమ్మ గింజలు - 1/2 కప్పు; ఆలివ్ /నువ్వుల నూనె - టీస్పూన్; తేనె -టీస్పూన్; నిమ్మరసం - స్పూన్; ఉప్పు, మిరియాల పొడి - చిటికెడు.
తయారీ: ఒక గిన్నెలో క్యారెట్ తురుము మరియు దానిమ్మ గింజలను వేసుకోవాలి. వేయించిన నువ్వులు కలపాలి. వేరుగా నిమ్మరసం, తేనె, ఆలివ్ నూనె, మిరియాల పొడి, ఉప్పును బాగా కలిపి డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యారెట్ తురుములో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.
పెసరపప్పు - కీరదోసతో..
కావల్సినవి: పెసరపప్పు - 1/2 కప్పు ( గంట నానబెట్టినది); కీరదోస ముక్కలు - 1/2 కప్పు; కొబ్బరి తురుము - స్పూన్; మిరియాల పొడి - 1/4 టీస్పూన్; నిమ్మరసం - టీస్పూన్; ఉప్పు - తగినంత.
తయారీ: నానబెట్టిన పెసరపప్పులోని నీరు పూర్తిగా వంపేయాలి. దానికి సన్నగా తరిగిన కీరదోస ముక్కలు, కొబ్బరి తురుము జోడించాలి. ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి తింటే రుచిగా ఉంటుంది.









కామెంట్లు (0)