సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతింటే గారెలే తినాలి..

1 రోజు క్రితం

gare
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 09:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

లోపల మెత్తగా.. పైన కరకరలాడే గారెలు నోటికి రుచి మాత్రమే కాదు, పోషకాలూ ఉంటాయి. ఉదయం అల్పాహారంగా, సాయంత్రం వేళ వేడి వేడి చిరుతిండిగా గారెలు తింటాము. అయితే ఈ గారెల్లో మినప పొట్టు, పెసరపప్పు, శనగపప్పు, అలసందలు, కొత్తిమీర, పుదీన వంటి పదార్థాలతో తయారుచేస్తే బాగుంటుంది. ఈ గారెలు రుచితో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, పీచు (ఫైబర్), ఇనుము, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, అలాగే బి-కాంప్లెక్స్ విటమిన్లు వంటి విలువైన పోషకాలను అందిస్తాయి. గారెలు ఎక్కువగా నూనెలో వేయిస్తాము కాబట్టి పరిమిత మోతాదులో తీసుకోకపోవడం మంచిది. సరైన పదార్థాల ఎంపికతో, తక్కువ నూనె పీల్చుకునే విధంగా రకరకాల గారెలు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

MASALA VADA

శనగపప్పుతో..

కావాల్సినవి: శనగపప్పు- కప్పు, ఉల్లిపాయ – ½ కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం – చిన్నముక్క, వెల్లుల్లి – మూడు రెమ్మలు, జీలకర్ర – స్పూను, ఉప్పు – తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర, పుదీన- గుప్పెడు, గరంమసాలా- స్పూను, ఇంగువ- అరస్పూను, నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా.

తయారీ : శనగపప్పును శుభ్రంగా కడిగి 3–4 గంటలు నానబెట్టాలి. నీరు పూర్తిగా వంపేయాలి. నానబెట్టిన పప్పులో ఒక గుప్పెడు పక్కన పెట్టి, మిగిలిన పప్పును చాలా తక్కువ నీటితో కొద్దిగా బరకగా రుబ్బాలి. రుబ్బిన మిశ్రమంలో పక్కన పెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లంవెల్లుల్లి తరుగు, జీలకర్ర, గరంమసాలా, ఇంగువ, కొత్తిమీర పుదీన తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. చేతిని తడిపి నిమ్మకాయంత ముద్ద తీసుకుని అరచేతిపై వడ ఆకారంలో ఒత్తాలి. వేడిచేసిన నూనెలో జాగ్రత్తగా వేసి, మొదట రెండు నిమిషాలు కదపకుండా ఉంచాలి. తర్వాత మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకూ రెండువైపులా వేయించాలి. టిష్యూపేపర్‌పై తీసి, వేడి వేడిగా కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో తినాలి.


minumula gare

మినుములతో..

కావాల్సినవి: నల్ల మినుములు – కప్పు, మిరియాలు – స్పూను, జీలకర్ర – స్పూను, ఇంగువ- అరస్పూను, అల్లం – పెద్దముక్క, కరివేపాకు – రెమ్మ, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.

తయారీ : మినుములను శుభ్రంగా కడిగి, 5–6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. నానిన మినుములను నీటిని పూర్తిగా వంపాలి. పొట్టు తీయకూడదు. చాలా తక్కువ నీరు చల్లుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండి తేలికగా, గట్టిగా ఉండేలా చూసుకోవాలి. మిక్సీజార్‌‌లో మిరియాలు, జీలకర్ర, అల్లం, ఇంగువ, కరివేపాకు వేసి మిక్సీపట్టుకోవాలి. బాండీలో నూనె పోసి, వేడి చేయాలి. పలుచటి క్లాత్‌ ‌తీసుకొని, తడిపి, కొద్దిగా పిండి తీసుకుని గుండ్రంగా ఒత్తి మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. వేడిచేసిన నూనెలో జాగ్రత్తగా వేసి, మధ్యస్థ మంటపై రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకూ వేయించాలి. ప్రతిగారె 10 నిమిషాలు పాటూ కాల్చాలి. అప్పుడే మినపగారె రుచిగా ఉంటుంది. కాలిన తర్వాత తీసి ప్లేట్‌‌లో పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మినపొట్టు గారె రెడీ. ఇవి నూనెను అసలు పీల్చవు. ఇవి తింటుంటే మిరియాలు, జీలకర్ర పలుకులు తగులుతూ బయట కరకరలాడుతూ, లోపల కాస్త మెత్తగా ఉండి, బాగుంటాయి. ఇవి మూడు రోజులు నిల్వ ఉంటాయి.

alasandhala garelu

అలసందలతో..

కావాల్సినవి: అలసందలు- 2 కప్పులు, ఉల్లిపాయలు- ఒకటి, పచ్చిమిర్చి – 3, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి- నాలుగు రెమ్మలు, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర, పుదీన – గుప్పెడు, జీలకర్ర – స్పూను, కారం- స్పూను, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా.

తయారీ : అలసందలను 6–8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. నానిన అలసందలను బాగా కడిగి, నీరు పూర్తిగా వంపేయాలి. గుప్పెడు అలసందలను పక్కన పెట్టి, మిగిలిన వాటిని మిక్సీలో బరకగా రుబ్బాలి. నీరు అసలు పోయకపోవడం మంచిది. అవసరమైతే ఒకటి రెండు స్పూన్లు మాత్రమే చల్లాలి. రుబ్బిన మిశ్రమంలో పక్కన పెట్టిన అలసందలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి మరీ పలుచగా ఉంటే కొద్దిగా బియ్యప్పిండి కలపాలి. చేతికి నీరు రాసుకుని చిన్న ఉండ తీసి, గుండ్రంగా ఒత్తి, మధ్యలో రంధ్రం చేయాలి. వేడిగా ఉన్న నూనెలో వేసి, మధ్యస్థ మంటపై రెండు వైపులా బాగా వేయించాలి. ఇవి నూనెను పీల్చవు. వేడి వేడిగా కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయి.


pesara gare

పెసరపప్పుతో..

కావాల్సినవి: పచ్చ ముడిపెసలు – 2 కప్పులు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 3, అల్లం – అంగుళం ముక్క, జీలకర్ర – స్పూను, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర –గుప్పెడు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా.

తయారీ: పెసలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. నానిన పెసలలోని నీటిని పూర్తిగా వంపి, ఒక గుప్పెడు పెసలను పక్కన పెట్టాలి. మిగిలిన పెసలను నీరు పోయకుండా బరకగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో పక్కన పెట్టిన పెసలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. బాండీలో నూనె పోసి, వేడి చేయాలి. చేతిని తడిపి కొద్దిగా పిండి తీసుకుని గుండ్రంగా ఒత్తి, మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. వేడిచేసిన నూనెలో వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. ప్లేట్‌‌లోకి తీసి, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీతో తింటుంటే.. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్