168 మంది నిప్పుకణికలు.. 114 పతకాలతో మన క్రీడాకారులు సరికొత్త రికార్డు
వైకల్యం అనేది శరీరానికే కానీ సంకల్పానికి కాదని ప్రపంచానికి చాటి చెప్పారు మన పారా అథ్లెట్లు. జపాన్‌లోని ఐచి`నగోయా వేదికగా ముగిసిన ఆసియా పారా క్రీడల్లో అత్యద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. పతకాలు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేయటానికి సర్వశక్తులూ ఒడ్డారు. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఈ క్రీడల్లో మనదేశానికి రికార్డుస్థాయిలో 30 స్వర్ణ, 35 రజత, 49 కాంస్యాలతో మొత్తం 114 పతకాలు దక్కాయి. అలాగే పతకాల పట్టికలోనూ టాప్ - 5 (నాల్గవ స్థానం)లో నిలిచింది.
ఆసియా పారా గేమ్స్ 2026 లో భారతీయ క్రీడాకారులు అత్యద్భుత ఆట తీరు ప్రదర్శించి పతకాల పట్టికలో ప్రభంజనం సృష్టించారు. అరకొర వసతులు..అయినా వెరువకుండా బలమైన ప్రత్యర్థులను సైతం తమ ఆటతీరుతో మట్టికరిపించారు. ధీటైన ఆటగాళ్లను సైతం పక్కకునెట్టేసిన మన క్రీడాకారులు ప్రపంచపటంలో పతకాలు సాధించి అగ్రదేశాల్లో వణుకు పుట్టించారు. నిపుణత, నైపుణ్యంతో బరిలోకి దిగిన మన ఆటగాళ్లు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసి జయకేతనాన్ని ఎగరేశారు. 2026 ఆసియా పారా గేమ్స్ వేదికపై సరిగ్గా ఇదే జరిగింది. కేవలం 168 అథ్లెట్లతో వెళ్లిన మన బృందం 114 పతకాలు సాధించింది. ఈ అంకెలు వినడానికి సాధారణంగా అనిపించొచ్చు. కానీ, దీని వెనుక ఉన్న అసలు కథ, ఆ క్రీడాకారుల రక్తం, చెమట, కన్నీళ్ల ప్రయాణాన్ని చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది.
వ్యూహం మారింది.. చరిత్ర తిరగబడింది !
హాంగ్జౌ ఆసియా పారా గేమ్స్ 2023 లో 309 మంది భారీ బృందంతో వెళ్లినా.. 108 పతకాలే దక్కాయి. కానీ ఈసారి కేవలం 168 మందిని దాదాపు సగానికి సగం తగ్గించి పంపింది. అయినా ప్రాతినిధ్యం వహించిన ప్రతి విభాగంలోనూ మనకు పతకాలు దక్కాయి. ఒకటి, రెండు ఈవెంట్లలో అయితే ఏకంగా మూడు పతకాలు సాధించి క్లీన్‌స్వీప్ చేశాయి. పతకాల సాధనకు వైకల్యం అడ్డురాదని మన అథ్లెట్లు చాటిచెప్పారు. వారు సాధించిన విజయాలు రికార్డుల కోసం కాదు రాబోయే తరాలకు ఒక దిక్సూచి అని చాటి చెప్పారు. క్రీడల బడ్జెట్లో కోతలాగా అథ్లెట్లను సగానికి సగం తగ్గించినప్పుడు పతకాలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ, నగోయా ట్రాక్‌పై భారత వీరులు అడుగుపెట్టాక ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. హాంగ్జౌకు పంపిన మాదిరిగా ఈసారి మరింతమందిని పంపించి ఉంటే టాప్-3లో భారత్‌కు చోటు దక్కేది.
బరువులను జయించిన గుండె నిబ్బరం..
శరీరానికి వైకల్యం ఉన్నా, గుండెల్లో కొండంత నిబ్బరాన్ని నింపుకున్న భారత వెయిట్‌లిఫ్టర్లు తమ భుజాలపై దేశ కీర్తిని మోసారు. పవర్‌లిఫ్టింగ్ హాల్లో బార్బెల్స్కు భారీ బరువులను అమర్చుతుంటే, స్టేడియంలోని ప్రేక్షకులంతా శ్వాస బిగబట్టి చూశారు. భారత లిఫ్టర్లు తమ సర్వశక్తులనూ ఒడ్డి, గురుత్వాకర్షణ శక్తిని సైతం సవాల్ చేస్తూ అత్యంత బరువైన వెయిట్స్‌ను విజయవంతంగా పైకి ఎత్తారు. క్లోజ్ కాంటెస్ట్‌లలో తృణప్రాయంలో స్వర్ణాలను చేజార్చుకున్నప్పటికీ, దేశానికి 2 అద్భుతమైన రజత పతకాలను అందించారు. వీరు ఎత్తిన ప్రతి బరువూ.. శారీరక లోపాలు ఉన్నా పట్టుదలే ఊపిరిగా బతికితే ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు.
రికార్డు బద్దలుకొట్టిన క్షణాలు...
ఈ టోర్నమెంట్లో భారత అథ్లెట్లు కేవలం విజేతలుగా నిలవడమే కాదు, అంతర్జాతీయ క్రీడా రికార్డుల పునాదులను కదిలించారు. స్టేడియంలను నివ్వెరపరిచిన ఆ అద్భుత ఘట్టాలూ ఉన్నాయి.
హానీ (జావెలిన్ త్రో) - సరికొత్త ప్రపంచ రికార్డు: పురుషుల జావెలిన్ త్రో ఎఫ్- 37/38 విభాగంలో హానీ ఏకంగా 60.49 మీటర్ల దూరం ఈటెను విసిరి, పాత రికార్డులన్నింటినీ తుడిచేస్తూ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. సుమిత్ యాంటిల్ పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్-64 విభాగం) లో తొలి ప్రయత్నంలోనే తన సొంత పాత రికార్డులను బద్దలు కొడుతూ, ఏకంగా 72.46 మీటర్ల అద్భుత దూరానికి ఈటెను విసిరి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ విభాగంలో పతకాలన్నీ మనకే దక్కడం మరో విశేషం. మహేంద్ర గుర్జార్ (రజతం), సందీప్ సంజయ్ సర్గర్ (కాంస్యం) సాధించడంతో ఈ పోడియంపై భారత్ క్లీన్‌స్వీప్ చేసి రికార్డు నెలకొల్పింది.
సందీప్ కుమార్ (400 మీటర్ల పరుగు): పురుషుల 400 మీటర్ల (టి64) ట్రాక్ విభాగంలో సందీప్ పరుగు ఒక తుపానులా సాగింది. కేవలం 52.28 సెకన్లలో రేసును పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డుతో బంగారు పతకాన్ని గెలిచాడు.
మోనా అగర్వాల్ (షూటింగ్) - డబుల్ రికార్డు ధ్వంసం: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ షూటింగ్ విభాగంలో మోనా అగర్వాల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఫైనల్ లో ఆమె ఏకంగా వరల్డ్ రికార్డ్, ఏషియన్ గేమ్స్ రికార్డ్ రెండింటినీ ఒకే ఈవెంట్ లో బద్దలు కొట్టి స్వర్ణాన్ని దక్కించుకుంది.
నిషాద్ కుమార్ (లాంగ్ జంప్): పారాఒలింపిక్స్‌లో హైజంప్‌లో మెరిసిన నిషాద్, ఈ గేమ్స్‌లో తొలిసారిగా ఎఫ్- 46 కేటగిరీ లాంగ్ జంప్‌లో పోటీపడి 7.11 మీటర్ల దూరం దూకి సరికొత్త ఏషియన్ రికార్డుతో స్వర్ణం కొల్లగొట్టాడు.
శీతల్ దేవి (ఆర్చరీ) - కాళ్లతో రాసిన ప్రపంచ రికార్డు :
చేతులు లేకపోయినా కాళ్లతోనే విల్లు ఎక్కుపెట్టి, నోటితో బాణాన్ని లాగి గురితప్పకుండా కొట్టే జమ్మూ కాశ్మీర్ వీరనారి శీతల్ దేవి ఈ గేమ్స్‌లో ఒక సంచలనం. కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో పాత రికార్డులన్నింటినీ తుడిచేస్తూ, ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒత్తిడిని అధిగమిస్తూ వరుసగా పర్ఫెక్ట్ 10 స్కోర్లను కొట్టి ఏకంగా 3 పతకాలు (రెండు గోల్డ్, ఒక సిల్వర్) తన ఖాతాలో వేసుకుని, ఈ ఎడిషన్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.
షటిల్ బ్యాడ్మింటన్ : కోర్టును శాసించిన సామ్రాజ్యం
పారా-బ్యాడ్మింటన్ కోర్టులపై భారత షట్లర్లు ఆసియా ఖండంలోనే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మొత్తం 15 పతకాలను (రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్యాలు) కొల్లగొట్టారు. ఈ విభాగంలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ - మూడు ఫైనల్. పారిస్ పారాలింపిక్ ఛాంపియన్ నితీష్ కుమార్, టోక్యో పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ ఒకరికొకరు తలపడ్డారు. ఒకే దేశానికి చెందిన ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో నితీష్ కుమార్ తన అద్భుతమైన డ్రాప్ షాట్లతో ప్రమోద్ భగత్‌ను ఓడించి చారిత్రాత్మక బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు యువ సంచలనం నవీన్ శివకుమార్ (ఎస్ ఎల్ - 4) తన మెరుపు వేగంతో ప్రత్యర్థిని మట్టికరిపించి మరో బంగారు పతకాన్ని దేశానికి అందించాడు. ఇందులో మొత్తం 15 పతకాలు (రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్యాలు) మన షట్లర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
మహిళల విభాగంలో, 24 ఏళ్ల తులసిమతి మురుగేషన్ సింగిల్స్‌లో రజతంతో సరిపెట్టుకున్నా, ఆ నిరాశను పక్కనపెట్టి సీనియర్ ప్లేయర్ మానసి జోషితో కలిసి మహిళల డబుల్స్ (ఎస్ ఎల్ - 3, ఎస్యు5) ఫైనల్లో చైనా బలమైన జోడీని కేవలం 28 నిమిషాల్లోనే చిత్తు చేసి బంగారు పతకాన్ని ముద్దాడింది! టేబుల్ టెన్నిస్ విభాగంలో చైనా, జపాన్ వంటి ప్రపంచ దిగ్గజ దేశాల నుండి భారత ప్యాడ్లర్లకు అత్యంత కఠినమైన పోటీ ఎదురైంది. కానీ మన క్రీడాకారులు పట్టు వదలకుండా టేబుల్‌పై బంతిని మెరుపు వేగంతో తిప్పుతూ అద్భుత పోరాట పటిమను కనబరిచారు. సెమీఫైనల్స్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరాటాలలో భారత ప్లేయర్లు కొద్దిపాటి తేడాతో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఐదు కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు.
తెలుగు తేజాల గర్జన
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఆరుగురు అథ్లెట్లు సృష్టించిన సంచలనం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. శారీరక వైకల్యాన్ని తమ సంకల్ప బలంతో ఓడించిన ఆరుగురు వీరే !

రవి కార్తీక్ బుడిగిన (ఆంధ్రప్రదేశ్): పూల్ సంచలనం 18 ఏళ్ల ఈ ఆంధ్రా కుర్రాడు జపాన్ ఈత కొలనులో సరికొత్త చరిత్ర రాశాడు. ఒకే ఒక్క ఈవెంట్లో కాకుండా, మూడు వేర్వేరు విభాగాల్లో పతకాలు సాధించి ‘మెడల్ హ్యాట్రిక్’ కొట్టాడు. 100 మీటర్ల ఫ్రీస్టైల్ లో 56.68 సెకన్లు, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 1:10:10 సమయంలో పూర్తి చేసి రెండు రజతాలు, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో 25.89 సెకన్లులో పూర్తిచేసి ఒక కాంస్యం గెలిచి, జలవిహారంలో భారత్ జెండాను ఎగురవేశాడు.

రవి రొంగలి (ఆంధ్రప్రదేశ్) : రవి రొంగలిది ఇనుప గుండు గురి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ షాట్‌పుట్ క్రీడాకారుడు రవి రొంగలి (ఎఫ్ - 40 విభాగం) తన అనుభవాన్నంతా ఉపయోగించి బలాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ఇనుప గుండును రికార్డు దూరంలో విసిరి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

రవణ్ణి వలసనైని : పట్టుదలకు నిలువుటద్దం మహిళల 1500 మీటర్ల (టి11) సుదీర్ఘ పరుగు పందెంలో రవణ్ణి చూపిన సహనం, గుండె నిబ్బరం అమోఘం. ప్రతి అడుగులోనూ దేశభక్తిని నింపుకుంటూ పరుగెత్తిన ఆమె, భారతదేశానికి ఎంతో విలువైన కాంస్య పతకాన్ని అందించింది.

అజయ్ కుమార్ : వేగమే ప్రాణంగా... _పురుషుల 400 మీటర్ల (టి64) విభాగంలో అజయ్ కుమార్ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పతక పట్టికలో స్థానం కోసమే కాకుండా, తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో ట్రాక్‌పై అథ్లెటిక్స్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.

దీప్తి జీవాంజి (తెలంగాణ) : ట్రాక్‌పై మెరుపు తీగ _తెలంగాణ పల్లెటూరు నుండి వచ్చిన దీప్తి జీవాంజి. మహిళల 400 మీటర్ల (టి20) పరుగు పందెంలో ఉరుములా దూసుకెళ్లింది. గాలి కంటే వేగంగా పరుగెడుతూ ఆమె కేవలం బంగారు పతకాన్ని గెలవడమే కాకుండా, గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది.

అకిరా నందన్ బానోతు : అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో తొలిసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన ఈ 19 సంవత్సరాల తెలంగాణ అథ్లెట్, పురుషుల 400 మీటర్ల (టి353),(టి38) రేసులో మెరిసాడు. అనుభవజ్ఞులైన ప్రత్యర్థులను వెనక్కి నెడుతూ తుది గీతను 51.25 సెకన్లలో తాకి, రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ చిచ్చరపిడుగుపై మనదేశ ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంశలు కురిపించారు.
నంబూరి సంజయ్
9989118028








కామెంట్లు (0)