నీలూ! ఎందుకోగాని నిద్ర పట్టలేదమ్మా. చదవాలని కూడా అనిపింఛట్లేదు. టైమ్ చూస్తే పన్నెండు కావొస్తోంది. అమ్మ నిద్ర పోతోంది. ఏం చేయాలో తోచక, నెమ్మదిగా లేచి, చప్పుడు చేయకుండా హాల్లోకి వచ్చాను. కబోర్డ్ లోనుండి పాత ఫోటోఆల్బం తీసుకొని నీ చిన్నప్పటి ఫోటోలు… మనం ‘ఈస్ట్ పాయింట్ కోలనీ’లో ఉంటున్నప్పుడు తీసినవి... చూస్తూ కూర్చున్నాను.
వాటిలో ఒక ఫోటోలో... నేను సోఫాలో కూర్చొని చదువుకుంటున్నాను. నువ్వేమో నా ఒళ్ళో తలపెట్టుకు పడుకొని, నిద్ర పోతున్నావు. నల్లటి ఉంగరాల జూత్తూ, పాలబుగ్గలూ... మల్లెమొగ్గలా, ఎంత ముద్దుగా ఉన్నావో!
నువ్వు ఎల్.కేజీ.లో ఉన్నప్పటి ఫోటో అది. మేలుకొని ఉన్నంతసేపూ నాదగ్గరే, నన్ను అంటిపెట్టుకొనే ఉండేదానివా రోజుల్లో. ‘వచ్చి పడుకోమని’ అమ్మ ఎంత పిలిచినా వెళ్ళేదానివి కాదు. అంతకీ నిద్ర ఆపుకోలేకపోతే, నా ఒళ్లో పడుకుని, నిద్రపోయేదానివి.
అలా నిద్రపోతున్నప్పుడు తీసిన ఫోటో అది. దాన్ని చూస్తుంటే చిన్నప్పడు నువ్వు చేసిన అల్లరీ, ముద్దు పనులూ, వాగిన గీర కబుర్లూ... అవన్నీ గుర్తొచ్చి మనసంతా బరువుగా అయిపోయిందమ్మా. బుజ్జితల్లి అప్పుడే నలభయ్యేళ్లదైపోయిందా అనుకుంటే మరింత భారంగా అయిపోయింది.
సాయంత్రం ఆఫీస్ నుండి లేటుగా వస్తే ఎంత కోపం వచ్చేసేదో నీకు. మాట్లాడడం అటుంచు, కనీసం నావేపు చూసేదానివి కాదు. అలిగి కూర్చునేదానివి. ఎంతోసేపు బతిమాలితే తప్ప నీ కోపం తగ్గేది కాదు.
ఆరోజుల్లో ప్రతీ సాయంత్రం రామకృష్ణా బీచ్ వరకూ మనిద్దరమే స్కూటర్ మీద ఒక రౌండ్ కొట్టి వచ్చేవాళ్ళం. అప్పుడు ఒన్, టూ, త్రీ, ఫోర్ అంటూ దూరంగా సముద్రంలో లంగరు వేసి ఉన్న ఓడల్ని లెక్కబెట్టేదానివి నువ్వు. ‘వాటిలో ఎవరుంటారు? ఎంతమంది ఉంటారు? సముద్రంలో ఉండడానికి భయమెయ్యదా వాళ్ళకి? తుఫాను వస్తే ఎలా పాపం? షిప్ మునిగిపోదా?’ ఎన్ని ప్రశ్నలో నీ చిన్నిబుర్రలో!
ఎప్పుడూ అడిగే ప్రశ్నలే అవన్నీ. అయినా సమాధానం చెప్పాలి నేను. చెప్పకపోతే నీకు కోపం వచ్చేసేది. అది తగ్గాలంటే ఐస్క్రీమ్ పెట్టించాలి! పెట్టించినట్టు అమ్మకు తెలిసిపోతే నాకు తల అంటేసేది. ప్రతీరోజూ ‘టైట్ రోప్ వాక్’ చేస్తున్నట్టే ఉండేది నా పరిస్తితి.
ఆ రోజుల్లో వీక్ ఎండ్స్ ఎంత బాగుండేవో జ్ఞాపకం ఉందా నీలూ? శనివారం నీకు స్కూల్ ఉండేది కాదు. నాకేమో మధ్యాన్నం రెండుగంటలకే బ్యాంకు అయిపోయేది. ఇంటికి వచ్చి, భోంచేసేసి, భీమిలీ వెళ్లిపోయేవాళ్లం, తాతయ్య దగ్గరకు.
మనం వెళ్ళే సరికే పెద్దత్తా, చిన్నత్తా వచ్చేసి ఉండేవారక్కడ. వాళ్ళతో పాటు హర్ష, అశోక్, హదస, సింధు! ఆ రెండురోజులూ మీరు చేసే అల్లరికీ, ఆడే ఆటలకూ అంతుండేది కాదు.
మధ్యమధ్యలో అశోక్ గాడు నీకూ హదసకీ దెయ్యాల కథలు చెప్పి భయపెట్టేసే వాడు. మీరు భయంతో గట్టిగా అరుస్తూ మేమున్న దగ్గరకు పరుగెత్తుకు వచ్చేసేవారు. తాతయ్య నవ్వుతూ వాడిని దెబ్బలాడినట్టు ఏక్షన్ చేసేవారు. ఎప్పుడైనా గుర్తొస్తాయా అవన్నీ నీకు?
అప్పట్లో వారానికో రెండువారాలకో ఒకసారి అందరం భీమిలీలో కలిసేవాళ్లం. కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కలిసి భోంచేసేవాళ్లం. ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళం. లాంగ్ వీకెండ్ అయితే తెల్లవార్లూ పేకాట ఆడుకునేవాళ్లం కూడా. అలా హాయిగా గడిపి సోమవారం ఉదయం మళ్ళీ ఎక్కడి వాళ్ళం అక్కడకు వెళ్లిపోయేవాళ్ళం.
ఎంత చక్కని రోజులమ్మా అవి! ఎప్పటికీ అలాగే ఉంటాయనీ, రిటైరైపోయాక అక్కడికే వెళ్లిపోతామనీ, సిబ్లింగ్స్ అందరం పక్కపక్కనే ఉంటామనీ... ఎన్నెన్నో ఊహించుకునేవాడ్ని అమాయకంగా!
ఎంత మారిపోయింది కాలం! పిల్లలందరూ దేశానికొకరు చొప్పున చెదిరిపోయారు. ఇక్కడ, ఇండియాలో ఉన్నది నువ్వొక్కదానివే. అదృష్టవశాత్తూ ఒక ఊళ్లోనే ఉంటున్నా, మనం రెండురోజులు కలిసుండి, హాయిగా కబుర్లు చెప్పుకొని ఎన్నో రోజులైపోయినట్టు లేదూ!
ఎప్పుడూ ఏవో మీటింగులూ, క్లయింట్ విజిట్సూ, ప్రాజెక్ట్ డెడ్లైన్సూ, ఫారిన్ ట్రిప్సూ... వీటితోనే సరిపోతుంది మీకు. ఆరోజుల్లో మేం కూడా బిజీగానే ఉండేవాళ్ళం అమ్మా. అప్పుడప్పుడూ ఆదివారాల్లోనూ, హాలిడేస్లోనూ కూడా బేంకుకు వెళ్ళి పనిచేయాల్సి వచ్చేది. అయినా పేరెంట్స్ కీ, సిబ్లింగ్స్ కీ ఎంతో కొంత టైం ఇవ్వగలిగే వాళ్ళం.
ఇప్పుడు వర్క్ స్టైల్స్ మారిపోయాయి. టైమింగ్స్ మారిపోయాయి. అమెరికన్, యూరపియన్ టైమింగ్స్ తో ఎలైన్ అయ్యి పని చేస్తున్నారు మీరు. ఇన్కమ్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. లీజర్ టైమ్ తగ్గిపోయింది. కొంచెం సమయం దొరికితే వియత్నాంకో, మాల్దీవులకో, మనదేశంలోనే అయితే ఏదైనా ‘ఎక్సోటిక్ రిసార్ట్’కో వెళ్ళి ‘ఛిల్’అయి రావడానికే సరిపోతుంది మీకు. కదూ!
ఏంటో, ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం తీసిన నీ ఫోటో చూసి, అప్పటి జ్ఞాపకాలతో మొదలుబెట్టి, ఎంత దూరం వచ్చేసానో చూసావా. ఇంకా రాస్తూ పోతే ఇంకెంత దూరం, ఎక్కడికి వెళ్లిపోతానోనని భయంగా ఉందమ్మా. నీ ‘కాల్స్’ అయిపోతే నువ్వు నిద్రపోతావు కూడా! అందుకే ఇక్కడితో ఆపేస్తాను. ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చెయ్యమ్మా. మనం తీరికగా కబుర్లు చెప్పుకొని యుగాలైనట్టుంది.
ఉండనా మరి. లవ్ యూ!
- నాన్న.
వాట్సాప్ మెసేజ్ పంపి పావుగంటైనా గడవకుండానే కూతురు దగ్గరనుండి ఫోన్. ‘రేపు లీవ్ పెడుతున్నాం. మనింటికి వస్తున్నాం’… దుఃఖంతో పూడుకుపోతున్న గొంతు స్వాధీనంలోకి తెచ్చుకొని ఈ రెండు వాక్యాలూ చెప్పడానికి తనకు నాలుగు నిమిషాలు పట్టింది పాపం!!
కృపాకర్ పోతుల
8008416660








కామెంట్లు (0)