సుధకు దోసకాయ గింజలంటే అంత పిచ్చి ఎందుకంటే? ఈ ప్రశ్నకు సమాధానం ఆమె అమ్మ సునీతమ్మ దగ్గరే ఉంది. చిన్నప్పుడు సునీతమ్మ చేసే రోటి పచ్చడిలో దోసగింజలు పంటి కింద తగిలితే వచ్చే ఆ “కిక్కు” సుధకు ఒక రకమైన సంగీతం. అద్భుతమైన రుచి. అమ్మ పచ్చడి రుబ్బుతుంటే సుధ వంటింటి గుమ్మం దగ్గర నిలబడి, “అమ్మా... గింజలు మెత్తగా నూరెయ్యకు!” అని అనడం ఆ ఇంట్లో దోసకాయతో రోటిపచ్చడి చేసినప్పుడల్లా వినిపించే మాట.
సునీతమ్మ నవ్వుతూ, “ముందు చేతులు కడుక్కో, తర్వాత గింజల మాట” అనేది. సుధ మాత్రం చేతులు కడుక్కోవడం కంటే గింజల వేసి చేసిన దోసకాయ చింతతొక్కు పచ్చడికోసం ప్లేటులో అన్నం పెట్టుకుని రోటి దగ్గరకు పరుగెత్తడమే ముందు చేసేది.
ఒకసారి సునీతమ్మ పచ్చడి రుబ్బుతుంటే సుధ గుమ్మం దగ్గర నిలబడి, “అమ్మా, ఈ రోజు గింజలు ఎక్కువ వేసావా?” అని అడిగింది. సునీతమ్మ కళ్లు పెద్దగా చేసి, “దోసకాయలో గింజలు నేను వేయాలా? అవి వాటంతట అవే వస్తాయి” అంది. సుధ సీరియస్‌గా, “అంటే దోసకాయ గింజల ఫ్యాక్టరీనా?” అని అడిగింది. సునీతమ్మ నవ్వి, “అవును, ప్రకృతి ఫ్యాక్టరీ. కానీ ఆ గింజల డిపార్ట్‌మెంట్ మొత్తం నీకు మాత్రమే ఇచ్చేయాలి” అంది. ఆ మాటలు సుధకు ఇప్పటికీ గుర్తు.
కాలం గడిచింది. సుధ ఉద్యోగంలో స్థిరపడింది. కానీ సునీతమ్మకు ఆరోగ్యం బాగోలేదు. రోజూ గుప్పెడు మందులు. మందుల చేదుకు నోరు వెగటు పుట్టింది. అన్నం ముద్దా మింగలేని పరిస్థితి. ఒక రోజు సునీతమ్మ మందుల బాక్స్ పక్కన కూర్చుని, బలహీనమైన స్వరంతో అన్నది.
“సుధా! నా నోరంతా చేదెక్కింది. ఆ దోసగింజల తగిలేలా దోసకాయ చింతకాయ తొక్కు వేసి రోటి పచ్చడి రుచి ఒకసారి చవి చూడాలని ఉంది.”
ఆ మాటలు సుధ గుండెను తడిమాయి. అమ్మ కోరింది పెద్ద విందు కాదు. ఒక చిన్న ముద్ద. అందులోనూ ఆ దోసకాయ ముక్కలు, గింజలు పంటికింద తగులుతుంటే ఆ కిక్కు వేరే లెవలు. సుధ వెంటనే ఫోన్ తీసుకుని ఆన్‌లైన్‌లో చింత తొక్కు ఆర్డర్ పెట్టింది. దోసకాయలు కూడా తెప్పించింది. డెలివరీ బాయ్ వచ్చినప్పుడు సుధకు అమ్మకు ఏదో గొప్ప బహుమతి ఇస్తున్న ఫీలింగ్. “అమ్మకు ఇష్టమైన పచ్చడి చేసి పెడతా!” అనుకుని ఆనందంగా అన్ని సిద్ధం చేసుకుంది.
కానీ దోసకాయ కోసిన క్షణమే ఆమె ముఖం వెలవెలబోయింది. గింజలు చేదు! ఒక్క గింజ నాలుకకు తగిలినా నోరంతా కటిక చేదు.
సుధ నమ్మలేక మళ్లీ రుచి చూసింది. మళ్లీ చేదు. “ఇదేంటి... దోసకాయ పైకి ఎంత బాగుంది. లోపల కూడా చక్కని ఎరుపు ఉంది. అలాంటి కాయలో దాదాపు గింజలు చేదు ఉండవు.. మరి ఇదేంటి ఏదో మాయలాగా... అంతా చేదే..!’’ అని గొణిగింది.
అది విన్న సునీతమ్మ ఆశలన్నీ ఆవిరైపోయాయి. “ఏదో నోరు చవిచూడాలని అడిగితే.. ఇలాంటి దోసకాయలు తెప్పిస్తావా?” అంటూ కోపంగా మండిపడింది.
సుధ మనసు ఉసురుమనిపించింది. అమ్మ కోపం కాదు, ఆమె ఆశ నెరవేరకపోవడం సుధను బాధించింది. అప్పటి నుంచి ఆమె ఒక పట్టుదల పట్టింది. చేదులేని, పుల్లని, గింజలున్న దోసకాయలు కనుక్కోవాలి. అప్పటి నుంచి ఆ పనిలోనే ఉంది. దాంతో కొలీగ్స్ సుధకు పేరు పెట్టేశారు..“దోసగింజ డిటెక్టివ్ సుధ”. అంటూ..
‘మీరు ఏమైనా అనండి.. మీరు తెచ్చినా సరే.. నాకు దొరికినా సరే.. ఆ దోసకాయ ఎలా దొరకదో చూస్తా!’’ అంటూ పట్టువదలని విక్రమార్కురాలిలా.. పంతం పట్టింది.
మొదట ఆఫీసులో ఆమె ప్రయోగం మొదలైంది. ఎవరు దోసకాయ కూర తెచ్చినా సుధ కళ్లు గింజల కోసం వెతికేవి. గింజ కనిపిస్తే చాలు, “ఈ దోసకాయ ఎక్కడ కొన్నారు? షాపు పేరు? వీధి పేరు? దుకాణదారుడి పేరు? పొట్టి దోసకాయా, పొడవు దోసకాయా?” అని ఒకటే ప్రశ్నల వర్షం. మొదట్లో కొలీగ్స్ నవ్వారు. తర్వాత వారు దోసకాయ కూర వండినా అందరికీ సుధే గుర్తుకు వచ్చేది. కొందరైతే దోసకాయలు కొని మరీ ఆమె కోసం ఎవరైనా తెచ్చినా, సుధ ఆశతో తీసికెళ్లడం.. భంగపడడం జరిగేది.
ఆఫీసులో రమేష్ అనే కొలీగ్ ఒకసారి దోసకాయ కూర తెచ్చాడు. సుధ కళ్లు మెరిశాయి. “రమేష్ గారూ.. ఈ దోసకాయ ఎక్కడ కొన్నారు?” అని అడిగింది.
రమేష్ నవ్వుతూ, “సుధా, ఇది నా భార్య చేసిన కూర. దోసకాయ మా ఇంటి దగ్గర పక్కింటి ఆవిడ వాళ్ల పెరటిలో కాస్తే ఇచ్చింది” అన్నాడు.
సుధ వెంటనే, “పక్కింటి ఆవిడ పేరు? ఫోన్ నంబర్? ఆవిడ దోసకాయలు ఎక్కడ నుంచి తెస్తారు?” అని అడిగింది.
రమేష్ తల పట్టుకుని, “నాకు ఆమె పేరు, ఫోన్ నెంబర్ ఏమీ తెలియదు సుధా.. ! నేను దోసకాయ ఇన్‌స్పెక్టర్ కాదు” అన్నాడు.
సుధ సీరియస్‌గా, “మీరు కాదు… నేను. ఇది నా జీవిత లక్ష్యం” అంది.
“సుధా, నువ్వు దోసకాయ చిరునామా అడగడం.. మన ఆఫీసులో హాట్ టాపిక్ అయిపోయింది. రేపటి నుంచి నీకూ.. దోసకాయలకూ.. నేరుగా ఇంటర్వ్యూ పెట్టాలి?” అంటూ ఒక కొలీగ్ జోక్ చేశాడు.
సుధ నవ్వుతూ, “పెట్టండి.. చేదు గింజలకు ఉద్యోగం ఇవ్వకుండా చూసుకుంటా!” అంది అంతే ధీటుగా.
ఆ తర్వాత సుధ ఒక “దోసకాయ డేటాబేస్” తయారుచేసింది.
ఎక్సెల్ షీట్లో కాలమ్స్‌లో షాపు పేరు, ఊరు, దోసకాయ రకం, గింజ సైజు, పులుపు రేటింగ్, చేదు స్థాయి. ఒకసారి బజారులో కొన్న దోసకాయలకు “చేదు స్థాయి: మూడు నక్షత్రాలు” అని రాసింది.
తల్లి చూసి, “ఇదేంటి, హోటల్ రివ్యూలాగా?” అని అడిగింది.
సుధ సీరియస్‌గా, “అమ్మా, ఇది రుచి రివ్యూ కాదు, జీవిత పరిశోధన” అని చెప్పింది.
కొన్నిసార్లు ఆ చిరునామా పట్టుకుని వెళ్లి కొంటే మళ్లీ చేదు గింజలే.
ఒకసారి సూపర్ మార్కెట్‌లో “తీపి దోసకాయ” అని రాసి ఉన్న బోర్డు చూసి సుధ కళ్లు మెరిశాయి. ఇంటికి తెచ్చి కోస్తే గింజలు మళ్లీ చేదు.
“తీపి దోసకాయ అని రాసి ఉంది... చేదు గింజలు ఎందుకు?” అని షాపు వాడికి ఫోన్ చేస్తే, అవతల నుంచి, “మేడం, దోసకాయ తీపి, గింజలు చేదు.. అది ప్రకృతి రహాస్యం” అన్నాడు.
సుధకు ఆ రోజు ప్రకృతి మీద కాస్త కోపం, కాస్త నవ్వు వచ్చాయి.
మరోసారి పక్క వీధి రైతు రామయ్య దగ్గర కొన్న దోసకాయలు బాగుంటున్నాయని వింది.
“అమ్మా, ఇవి మా పొలం దోసకాయలు. గింజలు పంటి కింద తగిలితే ఆ రుచే వేరు. .” అంటూ రైతు రామయ్య దోసకాయల గొప్పతనం కథలు కథలుగా చెప్పాడు. అందులో సుధకి నచ్చే గింజల గురించి మరింత గమ్మత్తుగా ఊరిస్తూ చెప్తుంటే.. సుధ ఆనందంతో రెండు కిలోలు కొన్నది.
ఇంటికి వచ్చి కోస్తే… గింజలు చేదు.
సుధ రైతుకు ఫోన్ చేస్తే,
ఆయన నవ్వుతూ, “అమ్మా, రుచిగా ఉన్నాయా? అంటే నా మాట నిజమే కదా! అయినా ఆ దోసకాయ లోపల చేదు గింజలే వస్తున్నాయి ఎందుకంటే విత్తనం మేము తయారుచేసుకోకుండా జరిగే కుట్ర ఇది. అయినా లోపల చేదో, పులుపో, తీపో ఎలా చెప్తారమ్మా?” అన్నాడు.
సుధకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. “కిక్కు అంటే చేదు కాదు, సరదా” అని వివరించాలనిపించింది, కానీ ఫోన్ పెట్టేసింది.
ఇంట్లో సునీతమ్మ రోజూ ఒకే ప్రశ్న అడిగేది “సుధా, దోసకాయ దొరికిందా?”
సుధ తల ఊపుతూ, “ఇంకా వెతుకుతున్నా అమ్మా” అనేది.
సునీతమ్మ నవ్వి, “నేను తిన్నట్టేలే” అని వ్యంగ్యంగా అనేది.
పక్కింటి లక్ష్మి ఒకసారి సుధను చూసి, “ఏంటి సుధా, దోసకాయల కోసం ఇంత వేట? మార్కెట్‌లో అన్నీ ఉంటాయి” అంది.
సుధ నవ్వి, “లక్ష్మి గారూ, మార్కెట్‌లో దోసకాయలు ఉంటాయ... కానీ చేదులేని గింజలు ఉండాలంటే మనం వెతకాలి” అంది.
లక్ష్మి తల ఊపి, “నీవు దోసకాయలు వెతకడం కోసం ఎక్కువ ఖర్చుపెడుతున్నట్లు ఉన్నావు!” అంది.
సుధ ఒకసారి కలలో కూడా దోసకాయలు చూసింది. కలలో ఒక పెద్ద దోసకాయ నడుస్తూ వచ్చి, “నా గింజలు చేదు కావు” అని చెప్పింది.
సుధ ఆనందంతో కోస్తే... లోపల నుంచి చిన్న చేదు గింజలు బయటకు వచ్చి నవ్వాయి.
సుధ నిద్రలోనే “అబ్బా!” అని అరిచింది.
సునీతమ్మ పక్కన నవ్వి, “ఏంటి, కలలో కూడా దోసకాయలేనా?” అని అడిగింది.
సుధ కళ్లు నులుముకుని, “అమ్మా, నా జీవితం ఇప్పుడు దోసకాయ మయమైంది” అంది.
చివరకు ఒక రోజు ఆమెకు కావాల్సిన దోసకాయ దొరికింది.
ఒక పాత కిరాణా షాపులో, పచ్చని పుల్లని దోసకాయల మధ్య. సుధ అక్కడికి మూడోసారి వెళ్లింది. షాపు వాడు నవ్వుతూ, “మేడం, మళ్లీ వచ్చారా? ఈసారి మంచివి ఇస్తా” అన్నాడు.
సుధ కొన్నది. ఇంటికి వచ్చి కోసింది. గింజలు గుబురుగా, పుల్లని పులుపు. ఒక్క గింజ తిన్నా చేదు లేదు. సుధ కళ్లు మెరిశాయి.
“అమ్మా… దొరికింది! చేదు లేదు!” అని అరిచింది.
సునీతమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. “నిజంగా? ఒక్కసారి నాకూ ఇవ్వు” అని కొద్ది గింజలు తీసుకుంది. నమిలి, కళ్లు పెద్దగా చేసి, “అవును... చేదు లేదు. పులుపు బాగుంది” అంది.
సుధకు ఆ మాటలు విన్నప్పుడు ఏదో పరీక్ష పాస్ అయిన ఫీలింగ్.
వెంటనే సుధ వంటింట్లోకి దూకింది. పచ్చిమిర్చి, చింత తొక్కు, వెల్లుల్లి, జీలకర్ర వేసి రుబ్బింది. రోటిలో పచ్చడిలో దోసగింజలు మెరుస్తూ కనిపించాయి. ఆ సువాసన ఇల్లంతా నిండింది.
సునీతమ్మ మంచం మీద నుంచి లేచి కూర్చుంది. “ఏదీ, రుచి చూపించు” అంది.
సుధ పచ్చడి ముద్దను అమ్మ నోటికి అందించింది. సునీతమ్మ నెమ్మదిగా నమిలింది. ఆ రుచి నాలుకకు తగిలిందో లేదో, ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. “అదే రుచి… అదే గింజల రుచి” అంటూ సుధను గట్టిగా కౌగిలించుకుంది. మందుల చేదు మరచిపోయిన ఆ క్షణంలో సునీతమ్మ ముఖంలో మళ్లీ పాత చిరునవ్వు మెరిసింది.
సుధ కూడా ఒక ముద్ద తీసుకుంది. గింజ పంటి కింద తగిలింది. ఆ రుచికి ఆమె నాలుక జివ్వుమంది. అమ్మ కోసం వెతికిన రుచి, తన బాల్యాన్ని తిరిగి తెచ్చిన రుచి... రెండూ కలిసి ఆ ఇంట్లో ఓ చిన్న దోసకాయ పండుగను సృష్టించాయి.
“సుధా! ఇక దోసకాయ చిరునామా అడగడం మానేయి. నువ్వు వెతికిన రుచి దొరికింది. ఇప్పుడు నా మందుల బాక్స్ దగ్గర ఈ పచ్చడి డబ్బా పెట్టు. రోజూ ఒక ముద్ద.. చేదు మందుల మధ్య తీపి గుర్తు.” అంటూ సునీతమ్మ చిన్నగా నవ్వింది.
సుధ నవ్వుతూ, “అమ్మా, ఇది పచ్చడి డబ్బా కాదు.. నా పరిశోధన ఫలితం” అంది.
సునీతమ్మ మళ్లీ నవ్వింది. ఆ నవ్వులో మందుల చేదు కరిగిపోయింది. దోసగింజల రుచి మాత్రం ఆ ఇంట్లో శాశ్వతంగా మిగిలిపోయింది.
ఆ తర్వాత ఆఫీసులో సుధను చూసి రమేష్ అడిగాడు.. “సుధా, ఇక దోసకాయ వేట ఆపేశావా?”
సుధ గర్వంగా నవ్వి, “ఆపేశా.. కానీ నా ఎక్సెల్ షీట్ మాత్రం భవిష్యత్తులో దోసకాయలు కొనేవాళ్లకు ఉపయోగపడుతుంది” అంది.
రమేష్ నవ్వుతూ, “అంటే నువ్వు దోసగింజ డిటెక్టివ్ నుంచి దోసకాయ కన్సల్టెంట్‌వి అయ్యావా?” అన్నాడు.
సుధ చిరునవ్వుతో.. “అవును.. ఫీజు మాత్రం ఒక ముద్ద పచ్చడి” అంది.
ఇంటికి వచ్చి, అమ్మ పక్కన కూర్చుని, మళ్లీ ఒక ముద్ద తిన్నప్పుడు సుధకు అనిపించింది... ‘‘కొన్ని రుచులు కడుపు కోసం కాదు.. గుండె కోసం. దోసగింజల రుచి అలాంటిది. అది పంటి కింద తగిలినప్పుడల్లా, అమ్మ చేతి వాసన, చిన్ననాటి నవ్వులు, ఈ ఇంటి వెచ్చదనం గుర్తొస్తాయి.!’’ అనుకుంది. అందుకే సుధ ఆ దోసగింజలను ఎప్పటికీ వదల్లేదు.
శాంతిశ్రీ
8333818985








కామెంట్‌లు (0)