mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తమ గ్రంథం

5 రోజుల క్రితం

Excellent Book
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:13 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

ఊరంతా సందడిగా ఉంది. శ్యామ్ కి స్వాగతాలూ, శుభాకాంక్షలూ చెపుతూ అన్ని వీధుల్లోనూ తోరణాలూ, ఫ్లెక్సీలూ కట్టారు. శ్యామ్ సన్మానసభకి వస్తున్న కలెక్టర్ కి, ముగ్గురు ఎమ్మెల్యేలకి కూడా స్వాగతాలు చెబుతూ కొన్ని ఫ్లెక్సీలుగా. తమ ఊరివాడు కేంద్ర ప్రభుత్వసంస్థ నాఫెడ్ ఎండీగా నియమితుడయ్యాడు. ఎండి అంటే ఆ సంస్థకి అత్యున్నతాధికారి. తమ వూరి మనిషి నేతృత్వంలో దేశవ్యాప్త సంస్థ పనిచేస్తోంది అంటే గర్వకారణమైన విషయమని ఊరి పెద్దలు ఢిల్లీ వెళ్లి, శ్యామ్ ని కలిసి, ఒక్కసారి ఊరికి విచ్చేయవలసిందిగానూ, సన్మానం స్వీకరించవలసిందిగానూ అభ్యర్థించారు. వీలు చూసుకొని వస్తానని హామీ ఇచ్చి, ఈరోజు వచ్చాడు. 14 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడే రావడం. చిన్ననాటి స్నేహితుల్నీ, పరిచయస్తుల్నీ కలుసుకుంటూ మొదటగా తనకి ఆప్తులైన శంకరయ్య వాళ్ళింటికి వచ్చాడు. తన ఉన్నతికి ఒకరకంగా శంకరయ్య వాళ్ళ కుటుంబం కూడా సాయపడింది.

'ఎలా ఉన్నావు శంకర్? పిల్లలు ఎంతమందీ, ఏం చదువుతున్నారు?` వస్తూనే ఆప్యాయంగా పలకరించాడు శ్యాం.

'ఏముందండీ.. ఏదో ఇలా ఉన్నాం. ఇద్దరు పిల్లలు. ఒకరు ఇంజనీరింగ్, ఒకరు డిగ్రీ పూర్తిచేశారు. ఉద్యోగాలు రాలేదు. ఆ ప్రయత్నాల్లో ఉన్నారండి`

'అండి ఏమిటీ, చిన్నప్పుడు రేయ్ అని తప్ప, పేరు పెట్టి కూడా ఎప్పుడూ పిలిచేవాడివి కాదు. అలాగే పిలువు. ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా తల్లికి బిడ్డే. అలాగే నేను ఈ ఊరి బిడ్డని. మీ అందరివాడినే.. కానీ ప్రత్యేకంగా ఆకాశం నుంచి వూడి పడలేదు. మీ అమ్మానాన్నని నా జీవితంలో నేను ఎప్పుడూ మరచిపోలేదు.. మరచిపోను కూడా! నాకు వాళ్ళు చాలా సాయం చేసారు.`

'అదేం మాటలు శ్యాంగారూ..`

'మళ్ళీ గారు ఎందుకు? వద్దు.. ‘‘శ్యామ్’’ అని పిలువు చాలు!`

అంత పెద్ద స్థాయిలో ఉన్న శ్యామ్‌తో మాట్లాడాలంటే శంకరయ్యకి బిడియంగానూ, సంకోచంగానూ, బెరుకుగానూ వుంది.

ఏడో తరగతి వరకూ శంకరయ్య, శ్యామ్ ఇద్దరూ క్లాస్ మేట్లు. శ్యామ్‌ చదువులో చాలా చురుకు. టీచర్లు సైతం శ్యామ్ అసాధారణ ప్రతిభకీ, తెలివికీ ఆశ్చర్యపోయేవాళ్ళు. శ్యామ్ చదువులో ముందుకిపోతే, శంకరయ్య డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయంలో పడ్డాడు. పాతిక ఎకరాల పొలం ఉంది. ఒకేడు పంటా, ఒకేడు మంటా! ఒకేడు పండగా, తరువాతేడు దండగా! పండిన ఏడు ధరా ఉండదు. సేజ్యం పూజ్యం అయిపోయింది! రైతు బతుకు గాల్లో దీపం అయింది. చితికిపోయాడు శంకరయ్య. అప్పుల పాలయ్యాడు.

రైతుల పరిస్థితీ, తన స్థితినీ వివరించి చెప్పాడు శంకరయ్య.

'గ్లోబలైజేషన్ పుణ్యమా అని.. దేశమంతా వ్యవసాయరంగం సంక్షోభ పరిస్థితిలోనే ఉంది. వాళ్లని గట్టెక్కించడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం` అన్నాడు శ్యామ్‌.

'మీ సంస్థ ఏం చేస్తుంది? పని ఏమిటి?`

'మన రాష్ట్రంలో మార్క్ ఫెడ్ వుంది కదా? అలాగే దేశం మొత్తం మీద నాఫెడ్ వుంటుంది. అన్ని రాష్ట్రాల్లో రైతుల నుంచి పంటల కొనుగోలు చేయడం, నిల్వ చేయడం పంపిణీ చేయడం, రైతులకి ప్రభుత్వ పథకాల అమలు చేయడంలాంటివి చేస్తుంది.`

'దేశం మొత్తం మీద కొనుగోలు అంటే, అమ్మో.. చాలా పెద్ద పనే!` అన్నాడు శంకరయ్య. 'ఎంత పెద్ద పని అయినా ఒకరు చేసేది కాదు కదా? మా సంస్థలో కొన్ని వేల మంది ఉంటారు`

'అంత పెద్ద సంస్థ కదా! మా పిల్లలకి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చూసి పెట్టగలవా?` సందేహిస్తూనే అడిగాడు శంకరయ్య.

'నువ్వు నన్ను అడగాలా శంకర్? ఆదేశించాలి కానీ అడక్కూడదు. నువ్వు నాకు చెప్పిన క్షణమే వాళ్లకి ఉద్యోగాలు కల్పించాలని నిశ్చయించుకున్నా. నువ్వు మీ పిల్లల విషయంలో నిశ్చింతగా ఉండు. పాపా నీ పేరు ఏమిటి?`

'జాహ్నవి సార్!`

'జాహ్నవీ.. మీ అన్నయ్య ఎక్కడా?`

'హైదరాబాదులో ఉన్నాడండీ! రెండేళ్ల నుంచీ ఏవో కోర్సులు నేర్చుకుంటూ జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు సార్!`

'నీదీ, మీ అన్నయ్యదీ రెజ్యూమ్ నా మెయిల్ ఐడికి పంపించండి. మీ క్వాలిఫికేషన్స్ కి తగిన ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేస్తా. మొదట్లో అవి టెంపరరీ బేస్డ్ గా ఉంటాయి. ఓపిగ్గా, బాధ్యతగా పనిచేస్తే పర్మినెంట్ అవుతాయి.`

'నీ మేలు మా జీవితంలో మరిచిపోలేం శ్యామ్ గారూ..`

'నువ్వు నన్ను మళ్ళీ పరాయివాడిని చేసి మాట్లాడుతున్నావ్! సరే వస్తాను. మిగతావాళ్ళని కూడా కలుస్తాను..` అని తన మెయిల్ ఐడి ఇచ్చి, వెళ్ళిపోయాడు శ్యామ్. శంకరయ్యా, ఆయన భార్యా, కూతురు జాహ్నవీ మనసులు ఆనందంతో నిండిపోయాయి.

'ఎంత మంచివ్యక్తి నాన్నా ఆయన! గొప్పస్థాయిలో ఉన్నా ఎంత గౌరవంగా, పద్ధతిగా మాట్లాడారు` అంది జాహ్నవి.

'అవునమ్మా! అంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నాడు. అన్నీ ఉన్నా విస్తరి అణిగి మణిగి ఉంటుందనీ, ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుందనీ అంటారు కదా! అలా ఉందమ్మా ఇప్పుడు నా పరిస్థితి. తలచుకుంటే ఇప్పుడు నా మీద నాకే కోపం కలుగుతోంది!`

'ఏమైంది నాన్నా?`

'శ్యామ్‌, నేనూ ఏడో తరగతి వరకూ మన ఊరి హైస్కూల్లో కలిసి చదువుకున్నాం. శ్యామ్ చదువులో చాలా మెరిట్ గా ఉండేవాడు. ఏడో తరగతిలోనే పదో తరగతి లెక్కలు అవలీలగా చేసేవాడు. శ్యామ్ తెలివికి టీచర్లు సైతం ఆశ్చర్యపోయేవాళ్ళు.

''ఒరేయ్, నువ్వు శ్రీనివాస రామానుజన్ అంతటివాడివి అవుతావురా`` అనే వాళ్ళు. అంత తెలివి ఎలా వచ్చిందో మరి? శ్యామ్ అమ్మానాన్నా, తాతావాళ్ళు ఎప్పుడూ మా పనిలోనే ఉండేవాళ్ళు. శ్యామ్ నాన్న అంత పద్ధతిగలవాడు కాదు. మా పనికి వచ్చేవాడు కదా! బాగా తాగుబోతు. మా నాన్న ఆయన్ని తిట్టేవాడు!`

'క్లాసులో నువ్వు ఎన్నో ర్యాంక్ లో ఉండేవాడివి నాన్నా?`

'నేను మూడూ, నాలుగూ స్థానాల్లో ఉండేవాడిని. శ్యామ్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. రమణ అనేవాడు నాకు మంచి దోస్త్. వాడిది పక్క ఊరు పాలెం. ఇప్పుడు ఏదో వూళ్ళో స్కూల్ టీచర్ గా చేస్తున్నాడు. వాడు సెకండ్ ర్యాంక్ వచ్చేవాడు. వాడికి శ్యామ్ అంటే బాగా ద్వేషం. మా పనోడి కొడుకు క్లాసులో నన్ను మించి చదవడం అంటే నాకు కొద్దిగా కసిగా ఉండేది. శ్యామ్ ని తన్నమని రమణగాడు నన్ను ఎక్కేసేవాడు. వాడి మాటలు విని, రెండు, మూడుసార్లు శ్యామ్ ని కదిలించుకుని మరీ కొట్టాను. ఉత్తపుణ్యానికే కొట్టాను!`

'అయ్యో.. ఎంత తప్పు నాన్నా?`

'అవును, చాలా తప్పు. మాకు ఆస్తి ఉందని అహంకారం! తెలిసీ తెలియని వయసు. తలచుకుంటే ఇప్పుడు నాకు బాధగా ఉంది. శ్యామ్ ఏడో క్లాసులో జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఎనిమిదికి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వస్తే వెళ్ళిపోయాడు. శ్యామ్ అమ్మానాన్నకి ఎయిడ్స్. ఎలా వచ్చిందో మరి? శ్యామ్‌ తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు అతని అమ్మానాన్న ఇద్దరూ ఏడెనిమిది నెలల తేడాతో చనిపోయారు. ఇక తాత పెంపకంలోనే పెరిగాడు. శ్యామ్ కి ఇంటర్ నుంచీ మా నాన్న టౌన్ కి తీసుకుపోయి బట్టలు కొనిపెట్టేవాడు డిగ్రీ వరకూ. శ్యామ్ ఛార్జీలకీ, చిల్లర ఖర్చులకీ అప్పుడప్పుడు శ్యామ్‌ తాతయ్య వచ్చి అడిగితే, కొద్దిగా డబ్బులు ఇచ్చేవాడు. పెద్దమొత్తం కాదు రెండు మూడొందల లోపు. టెన్త్ లో శ్యామ్ కి రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ వచ్చింది. ఇంటర్మీడియట్ నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివాడు. శ్యామ్ డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళ తాత కూడా కాలం చేసాడు.`

'పాపం! చాలా కష్టాలుపడ్డారు నాన్నా!` 'సాధారణ కష్టాలు కాదు. ఆ స్థితిలో ఎవరైనా కుంగిపోతారు. నిరాశపడతారు. ఆస్తిపాస్తులు లేవు.. నిరుపేదలు.. వెనుకబడిన కులం.. నా అనేవాళ్ళు లేరు. పెదనాన్నా, బాబాయిలు ఉన్నారు. కానీ వాళ్ల పరిస్థితీ అంతంత మాత్రమే. వాళ్ళు ఏం సాయపడగలరు? బంతిని నేలకేసి ఎంత బలంగా కొడితే అంత వేగంగా వస్తుందో, కష్టాల్లో నుంచి ఆయన అంతే వేగంగా రాటుదేలిపోయాడు. చదువే లోకం! మరో ధ్యాస లేదు. అందులో లీనమైపోయాడు. సాగర్ లో ఇంటర్ తర్వాత రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో మ్యాథ్స్ లో డిగ్రీ చేశాడు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసాడు. అక్కడే పీహెచ్ డీ చేస్తూ సివిల్స్ రాసి, ఐఏఎస్ కి ఎంపికై, గుజరాత్ క్యాడర్ కి వెళ్ళాడు. ఐఏఎస్ లోనే క్లాస్మేట్ ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. రిజిస్టర్ ఆఫీసులో ఇద్దరు దండలు మార్చుకొని, ఒకటయ్యారు. అప్పుడు పేపర్లలోనూ నిరాడంబరంగా ఐఏఎస్ ల వివాహం అని వచ్చింది. పెళ్ళికి వచ్చిన స్నేహితులకి స్నాక్స్, టీ లే విందు అని కూడా ఆ వార్తలో వుంది! భార్యాభర్తా ఇద్దరూ గుజరాత్ లో కలెక్టర్లుగా చేశారు. ఇప్పుడు కేంద్రసంస్థకి ఎండి అయ్యాడు!`

'అబ్బ! ఎంత గొప్పవాడు! మీరూ ఉన్నారు ఎందుకూ, డిగ్రీ అయిన తర్వాత చక్కగా బిఇడీ చేసినా టీచర్ పోస్ట్ వచ్చేది. వ్యవసాయంలో పడ్డారు. దీనిలో ముందుకీ పోలేం, వెనక్కీపోలేం!` అంది భార్య.

'నా విషయం అయిపోయిందిగా! గతాన్ని తలచుకుని ఏం ప్రయోజనం? శ్యామ్ గురించి పిల్లలకి ఎన్నోసార్లు చెప్పాను. జాహ్నవీ మీకు చిన్నప్పటి నుంచీ చెప్పేది ఒకటేనమ్మా! ప్రస్తుత సమాజంలో చదువుని మించిన సంపద లేదు. నిజమైన ఆస్తి చదువే! దానికి తిరుగులేదు. చదివితే శ్యామ్ జీవితం ఒక మంచి గ్రంథమే అవుతుంది. అది ఉత్తమ గ్రంథం! ఆ గ్రంథం నుంచి ఎవరైనా స్ఫూర్తి పొందొచ్చూ, ప్రేరణ పొందొచ్చూ! అంత గొప్పవ్యక్తీ, వ్యక్తిత్వమూ ఆయనది!` చెప్పాడు శంకరయ్య. శ్యామ్ చెప్పినట్లుగానే రెండు నెలలకి జాహ్నవికి మార్క్ ఫెడ్ లోనూ, శంకరయ్య కొడుక్కి నాఫెడ్ లోనూ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు వచ్చాయి.

మొలకలపల్లి కోటేశ్వరరావు

9989 224 280


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్