సూర్య కిరణాల లేత రంగుల్ని చూస్తూ, సుతారంగా తాకుతున్న కిరణాల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ తమ్ముడి ఇంటి ముందు ఉన్న తోటలో మొక్కల మీద వాలుతున్న చిన్న చిన్న పిట్టలను చూస్తూ కాఫీ తాగుతున్నాను. నా మరదలు చక్కగా చిన్న తోటను పెంచుతోంది. గులాబీ, మల్లె, మందారాల వంటి పూలమొక్కలే కాకుండా రకరకాల క్రోటను మొక్కలతో పాటు దానిమ్మ, అరటి, వంకాయ, మునగ వంటి ఇంటికి సరిపడా వంగడాలు వేసుకుంది. తీగలు అల్లించిన బీర, పొట్లకాయ పూతలు పూసి ఇంటి పంటను త్వరలో అందిస్తామనే ఆశను కలిగిస్తున్నాయి. అన్నీ ఒకేసారి చేతికి అందివచ్చేలా ఉన్నాయి అనిపించింది. అలాగే కరివేపాకు, ఆకుకూరలతో పాటు చక్కటి గోరింటాకు మొక్క ఏపుగా పెరిగి చేతులలో మందారాలు పూయించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఊరిస్తోంది. పూలల్లో తేనెను జుర్రుకుంటున్న పిట్టలు చిన్ని పొట్టలు నిండాక కిలకిలమంటూ ఎగిరిపోతూ మరిన్ని పిట్టలకు అవకాశమిస్తున్నాయి. కొన్ని పిట్టలు గోడ మీద పెట్టిన చిన్న నీటి పాత్రలో నీటిని కడుపారా తాగుతున్నాయి. మొక్కలకు తమ్ముడు నీళ్ళు పడుతుంటే ఆ జల్లుల్లో తడిసి రెక్కలు విదిలిస్తుంటాయి ఖుషీగా! తెల్లవారి కంటికి ఇంపుగా కనబడుతున్న ఆహ్లాదకర దృశ్యాన్ని ఆనందంగా అనుభూతిస్తున్న నాకు 'శాంతి ఒదినమ్మా బయలుదేరదామా' అంటున్న మరదలు కృతి మాటలు చెవినబడ్డాయి.
నేను, నా మరదలు చేపల మార్కెట్టుకు వెళదామని నిన్ననే మాట్లాడుకున్నాం. తెల్లవారే బయలుదేరాలని అనుకున్నా, ఆలస్యమైంది. తమ్ముడి దగ్గర నాలుగు రోజులు గడపడానికి హైదరాబాదు వచ్చాను. తమ్ముడు చేతన్, మరదలు కృతి కూడా ప్రభుత్వోద్యోగం చేసి, ఇటీవలే రిటైరై విశ్రాంత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను కూడా గత సంవత్సరం ఉద్యోగ విరమణ చేయడంతో అందరం ఒక ప్రశాంత జీవితంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. ఉరుకుల పరుగుల జీవితం నుండి ఊపిరి నెమ్మదిగా తీసుకునే స్థితికి వచ్చామనిపిస్తూ ఉంటుంది. అందువల్ల రెండు రోజులు గడుపుదామని హైదరాబాదు వచ్చాను. ఉద్యోగాలు చేసుకుంటూ హడావిడిగా గడిపిన జీవితంలో తలమునకలుగా మునిగిపోయిన మేము ఇప్పుడు ప్రతీ క్షణం తీరిగ్గా ఉండడం ఎలాగో నేర్చుకుంటున్నాం.. ఆస్వాదిస్తున్నాం. ఇదొక సంధి కాలం. ప్రతిరోజునూ ఆస్వాదిస్తూ కాలం గడపడం అలవాటు చేసుకునే స్థితిలోకి వచ్చామని అర్థమవుతోంది. హాడావిడి, గడబిడ లేకుండా ఎలా ఉండాలో నేర్చుకునే స్థితికి నెమ్మదిగా చేరుకుంటున్నాం.
'శాంతి ఒదినమ్మా రండి డ్రైవర్ వచ్చాడు' అంటూ మరదలు పిలిచింది.
'వస్తున్నానంటూ' అడుగులేశాను. ఆప్పటికే సమయం ఆరున్నర దాటుతోంది.
ఈలోగా పనమ్మాయి లలిత ఇంట్లో చెత్తలూడుస్తూ చేతిలో పరకను పక్కకు పెట్టి పరుగున వచ్చింది.
లలిత హడావిడి చూసి కృతి 'ఏమిటే' అంది కృతి. 'అమ్మా' అంటూ పిలిచింది.
'పని నిలిపి వచ్చావేంటి?' అంది కృతి.
'పరక పట్టుకుని ఎదురు రావొద్దని...' అంటూ నసిగింది.
'సరే, విషయం చెప్పు? ఇప్పటికే ఆలస్యమైంది?' అని కృతి అనడంతో
'నాకూ ఒక కేజీ చేపలు తెచ్చివ్వరా ఏమను కోకుండా ! డబ్బులు ఇస్తాను' అంది.
'అనుకోవడానికి ఏముంది ? తెస్తాంలే' అంది కృతి. పనివాళ్ళతో మరదలు ప్రేమగా ఉంటుంది. స్వేచ్ఛగా మాట్లాడతారు వాళ్ళు కూడా! కావలసింది అడుగుతారు.
ఇద్దరం వచ్చి కారులో కూర్చున్నాం. తమ్ముడి కుటుంబం ఉన్నది మీర్ పేట్ లో. కారు మందమల్లమ్మ కళ్యాణ మండపం, కర్మన్ ఘాట్, మలక్ పేట్, కాచిగూడ స్టేషన్
రోడ్డు, అలా ట్రాఫిక్ ని దాటుకుంటూ సుమారు ఒక గంట ప్రయాణమయ్యాక రామ్ నగర్ చేపల మార్కెట్టు దగ్గరకు చేరుకున్నాం. చిన్న చిన్న దారుల్లో విపరీతమైన రద్దీ ఉండడంతో కారును చేపల మార్కెట్టు మొగదలలో ఆపాడు డ్రైవర్. మేం దిగాక ఎక్కడా పార్కింగ్ కి స్థలం లేక, దూరంగా పార్క్ చేసి వచ్చాడు.
మార్కెట్టులోకి ప్రవేశించకుండానే చేపల నీచు వాసన తాజాగా ముక్కు పుటాలను అదరగొట్టడం ప్రారంభించింది. ముక్కులు మూసుకున్నా నీచు వాసన గొంతులోంచి వెళుతూ ఒకలాంటి వికారమైన భావనను కలిగిస్తోంది. చేపలు తింటే ఉన్న మజా, వాసన పీలుస్తోంటే రావడం లేదు. చేపల మార్కెట్టు సుమారు ఐదువందల గజాల స్థలంలో కిక్కిరిసిన అంగళ్ళతో ఇరుకుగా ఉంది. నడిచే దారి కూడా సరిగ్గా లేనంతగా చేపలను తెచ్చి అమ్మకానికి కూచోవడంతో రద్దీ ఎక్కువై ఒకరి మీదొకరు పడేలా ఉంది వాతావరణం. రకరకాల చేపలు హైదరాబాదు మార్కెట్టుకు ఎక్కువగా ఆంధ్రా నుంచి, పక్కనున్న శ్రీశైలం డాము నుండి వస్తాయి. హోల్ సేల్ మార్కెట్ కావడంతో అన్నీ తాజాగా దిగుతాయి. కొర్రమీను, బొమ్మిడాయలు, అడపాదడపా పులసచేప వంటివి ఎక్కువగా గోదావరి జిల్లాల నుండే వస్తాయి. మార్కెట్టు అంతా రొచ్చు రొచ్చుగా ఉంది. చిన్నా, పెద్దా వందల మంది వ్యాపారం చేసుకుంటున్నారు. అదొక చేపల సముద్రంలా ఉంది. నీరు లేని కేవలం చేపలు మాత్రమే ఉన్న సముద్రం. కొన్ని ఇంకా ప్రాణముండి ఎగిరెగిరి పడుతున్నాయి. బతికున్న వాటిని కొనుక్కున్న వాళ్ళకు వాటిని ఒక్క వేటుతో కొట్టి హమాలీలు ఇస్తున్నారు. నోరు తెరుచుకుని గుండ్రంగా మూతి పెట్టి ప్రాణం పోగొట్టుకున్న చేపలను శుభ్రం చేసి ఇవ్వడానికి పదుల సంఖ్యల్లో ఆడవాళ్ళు నెత్తి మీద ఎండ పడకుండా గొడుగును ఏర్పాటు చేసుకుని సిద్ధంగా కూచుని ఉన్నారు. చేపలు కొనుక్కున్న కస్టమర్లు రావడం ఆలస్యం వాటిని అందుకుని తోక, పక్కనున్న రెక్క కత్తిరించి, పొలుసును కత్తితో గోకి, తలను ఒక్క వేటుతో పేరు చేసి, కడుపు మధ్య భాగంలో ఉన్న చేదు, మిగిలిన భాగం తీసి, జన ఉంటే జాగ్రత్తగా పక్కకు పెట్టి చేపను చిన్న ముక్కలుగా చేసి చకచకా ప్లాస్టిక్ కవర్లో వేసి ఇచ్చి డబ్బు తీసుకుంటున్నారు ఆడవాళ్ళు. వెదురు బుట్టల్లో ఉన్న ఎండ్రకాయలు అటూ ఇటూ కదులుతూ ఎటూ పోలేక బుట్ట అంచు దాకా ఎగబాక కింద పడుతూ జీవన పోరాటం ఆపని సామాన్యుడిలా తిరిగి బుట్ట పైకి ఎగబాకుతున్నాయి. వాటిని బతికుండగానే రోట్లో వేసి రోకలితో కొట్టి చంపుతారని తెలీక, ఎటు పోవాలో తెలీక పోయినా ఎగబాకటం మాత్రం ఆపడం లేదు. మొత్తం చేపల మార్కెట్టు ఒక కార్ఖానాలా ఉంది.
వ్యాపారులు ఒకరి పక్క ఒకరు చేపల బుట్టలు, తట్టలు పెట్టుకోవడంతో దారులన్నీ నీళ్ళతో పొలుసులతో పల్లం వైపు జారుతున్నాయి. జారకుండా తారుకు, రాళ్ళకు చిక్కుకున్న పొలుసులు చెప్పుల్లేకుండా నడుస్తున్న కాళ్ళను గాయం చేసి కసి తీర్చుకుంటున్నాయి. జారిపోయిన నీళ్ళు జారిపోగా రోడ్ల గుంతల్లో ఉన్న నీళ్ళు కాళ్ళు పెడుతుండగానే చిప్పిల్లుతున్నాయి. వేసుకున్న చెప్పులు ఆ నీచు నీళ్ళల్లో తడిసి, నీళ్ళు చిమ్మి చుట్టు పక్కల అందరి మీదా పడుతున్నాయి. జనం నీచు వాసన మోసుకెళ్తుండడంతో అంతా నడుస్తున్న చేపల్లా ఉన్నారు! ముందు నడుస్తున్న వాళ్ళ బట్టల వెనుక వైపు నీటి చుక్కల ఆనవాళ్ళు. నీచు నీటితో తడిసిన జనం అంతా ఒకే పద్ధతిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్లా ఉన్నారు. అంతా గజిబిజిగా హడావిడిగా గోలగోలగా ఉంది.
'సార్! రండి ఇక్కడ కొనండి. తాజా చేపలు సార్ ! ఒకసారి కొంటే మళ్ళీ మళ్ళీ వచ్చి కొంటారు ఇక్కడే!' అని హమాలీలు పిలుస్తున్నారు. హమాలీలు అందర్నీ పిలుస్తూనే చెయ్యవలసిన పనులు చకచకా చేస్తూ పోతున్నారు. క్రేటర్లలో ఉన్న పెద్ద పెద్ద బొమ్మిడాయలను, బొచ్చెలను, రూపచంద్ లను దించి, అందులో ఉన్న పెద్ద పెద్ద ఐసు గడ్డలు కొన్ని కరిగి, కొన్ని కరగక పోవడంతో, చేపలు నేల మీద పడకుండా ఒడుపుగా క్రేటర్లను ఒంచుతుండడంతో ఐసు గడ్డలు, నీళ్ళు నేల మీద, నడుస్తున్న వాళ్ళ కాళ్ళ మీద పడి జివ్వుమనిపిస్తున్నాయి. జలదరింపు కలిగిన వాళ్ళు గట్టిగా వాళ్ళను తిడుతున్నారు. ఇవేమీ పట్టని హమాలీలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు! తమను కానట్టు! తమకు ఏమీ వినపడనట్టు! అంత బురదలోనూ జనం చేపల కొనుగోళ్ళ కోసం తాపత్రయపడుతుంటే హమాలీలు మాత్రం క్రేటర్లలో ఉన్న ఐసు దొర్లించే పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. నిరంతరం హమాలీలు ఆ చల్లటి నీళ్ళలో ఉండడం వల్లనేమో వాళ్ళ మడమలు తెల్లగా దళసరిగా మారి చీలికలు వచ్చి ఏ క్షణాన్నైనా రక్తం కారతాయేమో అనిపిస్తున్నాయి.
వచ్చే పోయే జనాలు, బేరం చెయ్యకుండా చేపలు కొనుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోవడమే ధ్యేయంగా సాగిపోతున్నారు. హోటళ్ళకు కొనుక్కునే వాళ్ళు క్రేటర్లు లెక్కన కొనుక్కుంటున్నారు. ఆ క్రేటర్లను ఎక్కడో ఉన్న బండిలోకి ఎక్కించడానికి హమాలీలు మోసుకొస్తుంటే, సందు దొరికిందని చిన్న ఆటోలు, టెంపోలు సందుల్లోకి దూరి వచ్చేయడంతో, హమాలీలు బరువు మోస్తూ వాళ్ళను గబగబా దాటలేక నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు దారుణంగా తిట్టుకుంటున్నారు. చిన్న అంగడి, పెద్ద అంగడి అనీ కాదు అన్ని అంగళ్ళు చేపలతో జాతరను తలపిస్తున్నాయి. కొర్రమీను, బొమ్మిడాయలు, బొచ్చెలు, శీలావతి, బంగారు తీగలు, రూప్ చంద్, గడ్డిమోసులు, పండు గప్పలు, పాల చేపలు, వంజరం, పిత్త పరిగలు, నెత్తళ్ళు, గొరకలు, రొయ్యలు ఒకటేమిటి రకరకాలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. ఎందరు కొనుక్కుని వెళ్ళిపోతున్నా మళ్ళీ అంతంతకు జనం ఎగబడుతున్నారు. ఇంత హడావిడి మధ్యలో చిన్న చెక్క బండ్ల మీద ఎండు చేపలు అమ్ముతున్నారు. కడ్డీ చేపలు, తాటాకు సొరగలు, మేను చేపలు, జల్లలు, బొమ్మిడాయి ముక్కలు, పండు గప్పలు, పెద్ద వంజరం, రొయ్య పొట్టు వంటి ఎండు చేపలు రాశులుగా పోసి ఉన్నాయి. ఎండు చేపలు నేల మీద పడితే తడిసి పోతాయి కనుక జాగ్రత్తగా కిందపడకుండా వ్యాపారం చేసుకుంటున్నారు.
ఈ సంరంభం కేవలం పొద్దున్న పది, పదకొండు గంటల వరకే! ప్రపంచ మార్కెట్టులో కూడా ఇంత ఎత్తున వ్యాపారం జరగదేమో! సుమారు పదకొండు గంటలకు మొత్తం వ్యాపారం ముగిసిపోయి, మార్కెట్టు ఖాళీ అయిపోతుంది. వాన దెబ్బకు చిత్తడై పోయి, చిందరవందరై పోయి తాటాకు మట్టలు, కూసలు ఊడిపోయిన గుడిసెలాగా అక్కడక్కడా ఎగిరిపడుతున్న చేప పిల్లలతో, ఒకటీ రెండు రొయ్యలతో బురదతో, తెగిపోయిన చెప్పులతో, చిందర వందరగా పడి ఉన్న గుడ్డ పేలికలతో,
చిరిగిన ప్లాస్టిక్ కవర్లతో చేపల మార్కెట్టు ప్రజా విధ్వంసానికి ఆలవాలంగా అనాథగా పడి ఉంటుంది రేపటి సంభ్రమాల కోసం ఎదురుచూస్తూ !
అన్నిటినీ చూసుకుంటూ నేను, కృతి ఒక వ్యక్తి దగ్గర ఆగాం. అతడి వద్ద ఒక టార్పాలిన్ నేల మీద పరచి ఉంది. రొయ్యలు వాటి మీద వేసి అమ్ముతున్నాడు. చేతితో తాకుతుంటే చల్లగా తగిలాయి రొయ్యలు. కేజీ మూడొందలన్నాడు. అక్కడ అందరూ ఒకే ధర చెబుతారు. కాబట్టి ఎక్కడ కొన్నా ఒకటే. అంతా ఒకే మాట మీద ఉంటారు. దేశం మొత్తం ఒక మాట మీద నిలబడడం ఇక్కడే చూస్తాం. అంత ఐకమత్యం ఏ శుక్రవారం సంతల్లోనూ కనబడదు. కనుక అటూ ఇటూ తిరగడం వ్యర్థమని అర్థమైంది మాకు.
నేను రొయ్యలు తీసుకున్నాక ఒక స్త్రీ వచ్చి నన్ను పిలిచింది.
‘అమ్మా! రొయ్యలు ఒలిచి, వేగులు తీసి ఇస్తాను కేజీకి నలభై రూపాయలివ్వండి’ అంది.
‘అంత రేటు చెబుతున్నావేంటి?’ అన్నాను.
‘అమ్మా! ఇది చాలా తక్కువ. వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతారు’ అంది.
‘వద్దులే, మరొకర్ని పిలుచుకుంటాను’ అన్నాను.
‘ఏదో పొట్ట కూటి కోసం తాపత్రయం. ఐదు తగ్గించి ఇవ్వండి’ అంది. ఆమె వదలదని అర్థమైంది.
‘సరే కానివ్వు’ అన్నాను. నా చేతిలోంచి నార సంచి తీసుకుని ఒక పక్కగా కూచుంటూ, మరో వ్యక్తి రొయ్యలు కొంటుంటే
‘అయ్యా, ఒలిచిస్తాను’ అంటూ బేరానికి దిగింది. ఇది చూస్తున్న నేను 'తల్లీ, నా సంచి ఇచ్చేయ్. ఒకేసారి ఎంత మంది పనిచేస్తావు’ అని మందలించాను. మాట్లాడకుండా రొయ్య తల, తోక తీసి పైనా లోపలా ఉన్న పేగుల్ని పిన్నీసుతో చాకచక్యంగా ఒలవడం మొదలెట్టింది. ఈలోగా మరదలు వెళ్ళి రెండు కేజీలు గడ్డి మోసు చేపల్ని పులుసుకని కొన్నది. లలిత అడిగింది కదాని ఒక కేజీ, అలాగే డ్రైవర్ కి కూడా ఒక కేజీ తీసుకొమ్మని చెప్పి మొత్తంగా డబ్బులు చెల్లించాం. ఈలోగా రొయ్యలు ఒలిచిన మహిళ ఒలిచిన రొయ్యలు ఇచ్చి డబ్బు తీసుకుంది. అన్నీ తెముల్చుకుని అక్కడి నుండి బయటపడేసరికి సుమారు పదవుతోంది. కొని తిరిగి వెళ్తుంటే మనం నడుస్తున్నామో, తేలుతున్నామో తెలీనంతగా మనల్ని తోసుకుంటూ, మోసుకుంటూ జనమే నడిపిస్తున్నారు. ‘అరే, ఆగండయ్యా! తొయ్యకండి! నడుస్తున్నాంగా’ అంటుంటే మాట వినే నాథుడేడీ?. పై పెచ్చు ‘చాల్చాల్లేవమ్మా! తీరిగ్గా మాటలు కూడా! అడుగులు దాటించు’ అంటూ కసురుతున్నారు. అయినా అంతకంటే ఏం సమాధానం ఊహించగలం? ఏదైనా ఊహించేంత స్థితి మనకక్కడ లేదని తెలిసిపోయింది. వాళ్ళ తోపుళ్ళకి వళ్ళు మండి సంస్కారాన్ని పక్కకు పెట్టి నేనూ తోస్తుంటే ఒకడు ‘ఏమ్మా ? ఆ తొయ్యడాలేంటి?’ అని ఎగిరాడు.
‘నన్నంటావేంటయ్యా? నా వెనుక వాళ్ళను అడుగు’ అన్నాను చిర్రెత్తి.
‘ఆడాళ్ళెందుకు రావడం ఇట్లాంటి చోటుకు’ అని సణిగాడు.
‘ఏమంటున్నావు?’ అని అడిగాను.
‘పెద్దవాళ్ళలా ఉన్నారు, మీరెందుకు ఇలాంటి చోట్లకు అంటున్నానమ్మా’ అన్నాడు స్వరం మార్చి. ఏమనుకున్నాడో! కసురుకోవడం సరి కాదనుకున్నాడేమో! నిజమే ఇలాంటి ఇబ్బందులుంటాయి కనుకే రాకూడదేమో! వాడితో అనిపించుకుని, వాణ్ణి తిరిగి మాట అనడం ఎందుకొచ్చిన గోల అనిపించినా జీవితంలో ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఈ మార్కెట్టును చూసాక కదా జీవితానికున్న మరో పార్శ్వం తెలిసింది. దొమ్మీలు చేయకున్నా దొమ్మీ చేసినంత అలసట కలిగింది. యుద్ధం చెయ్యక పోయినా జీవితంతో యుద్ధం చేస్తున్న వాళ్ళను చూడగలిగాను. ఎంతో జీవితాన్ని చూసొచ్చాను అనుకున్న నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చిన ఈ చేపల మార్కెట్టు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యంలా చేపల మార్కెట్టు వైరాగ్యం ఆవహించింది. అలసట కలిగింది. వీర సైనికుల్లా హమాలీలను, కొనుగోలుదారులను, చిత్తడి వాతావరణాన్ని, నీచు వాసనను, బురద గుంటలను దాటి విశ్వవిజేతలుగా బయటపడి మొత్తానికి మేం ఇద్దరం కారులో పడ్డాం. ఆ రొచ్చులో, ఎండలో, బురదలో రెండు గంటలు తిరిగే సరికి జీవిత సత్యాలు తెలియడంతో ఎక్కడలేని నీరసం ఆవహించి, కారులో కిమ్మనకుండా కూచుని ఏసీ గాలిని ఆస్వాదిస్తూ మరో మాట లేకుండా ఇల్లు చేరాం.
ఇంటికొచ్చాక గడ్డిమోను చేపల పులుసు, జొన్న రొట్టెలు వంటామె వండింది. నా కోసం మా మరదలు రొయ్యల వేపుడు చేసింది. ఘుమఘుమలాడుతున్న వేడి వేడి వంటలను చేపల మార్కెట్టు వైరాగ్యాన్నంతటినీ మరిచిపోయేలా చేస్తే, కడుపు నిండుగా తిని పొద్దున్న తోటలో చూసిన అందమైన ప్రకృతిని తలచుకుంటూ మధ్యాహ్నం కునుకు తీసా! క్షుధార్తి చల్లబడ్డాక ఏ వైరాగ్యాలూ గుర్తు రావేమో! కదిలించవేమో ! అదేగా మనిషి నైజం!
ఆచార్య కె. ఆశాజ్యోతి
94496 72394








కామెంట్లు (0)