శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నా బతుకు నేనే బతకాలి !

-791 నిమిషాల క్రితం

I must live my own life
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 07:30 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

​‘బొందిలో ప్రాణం ఉన్నంత వరకు బిడ్డల బాగు కోసమే తాపత్రయపడే తండ్రిని చూశాం కానీ కన్నబిడ్డ పైనే కేసు పెట్టమంటున్న తండ్రిని నిన్నే చూస్తున్నాం. అయినా ఎలా? నీకు మనసు ఎలా వచ్చింది ఈ పని చేయడానికి?’

ప్రశ్న ఒక్కటే. అక్షరాలు వేరవుతున్నాయి. అసహ్యంతో ఆగ్రహ పడిపోతున్నాయి. ఆవేశంతో ఊగిపోతున్నాయి. ఆశ్చర్యాన్ని నిబిడీకరించుకుంటున్నాయి. పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రల నుండి తండ్రి ప్రేమను ఉటంకిస్తున్నాయి. కాదు.. కూడదంటు విచారపడిపోతున్నాయి. ‘ఇలా కూడా జరుగుతుందా?’ అని విభ్రాంతితో మునిగిపోతున్నాయి. కలికాల మహిమ అన్న ఉదాసీనతలో ఉన్నాయి. త్యాగాల బాటలో కాక కన్నప్రేమను మరో మలుపు తిప్పిన కొత్త కుతూహలపడుతున్నాయి.

‘నా బొందిలో ప్రాణం నిలుపుకోవడానికే!’ నిశ్చలమైన జవాబు వినిపించింది.

​***

‘ఎప్పుడైనా బొందలోకి పోవాల్సిన ప్రాణమే కదా’

‘పోయేంత దాకా బతకాలి కదా’

‘చావమని ఎవరు చెప్పారు? బతికే ఉన్నారు కదా?’

‘జీవితమంతా కుటుంబం కోసమే కష్టపడి గౌరవప్రదంగా బతికిన ఒక మనిషి మలిసంధ్యలో కూడా అంతే గౌరవంగా, సుఖంగా సంతోషంగా బతకాలి కదా?’ నిర్వేద హాసం.

‘వాటికిప్పుడొచ్చిన లోటు ఏమిటో?’

‘లోటును పూడ్చుకునే ప్రయత్నమే ఈ కేసు’ స్థిర నిర్ణయ కంఠ రవం.

‘అంటే మీ కొడుకు, కోడలు మిమ్మల్ని బాగా చూసుకోవడం లేదా?’

‘సర్దుకుపోవడం రాజీ పడడం అవసరాలకు తక్కువ సహనానికి ఎక్కువ అయినప్పుడు దారి చూసుకోవాలి కదా! అయినా నేను ఇక్కడ ఎవరిని నిందించడం లేదు. నా భార్యను నాకు అప్పగించమంటున్నాను. అంతే!’

‘నీ భార్య వాళ్ళకు అమ్మ కాదా? అమ్మ పైన వాళ్లకు హక్కు లేదా?’

‘హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉండాలి కదా? వ్యక్తిగా ఆమె హక్కులు ఆమె కూడా అనుభవించాలి కదా?’

‘ఇప్పుడు హక్కుల బాధ్యతల ఉల్లంఘన జరిగిందనేది మీ అభియోగమా?’

‘అవును. కచ్చితంగా!’

‘మీరు ఇష్టపూర్వకంగానే ఆమెను మీ కూతురు దగ్గరకు పంపించారు కదా?’

‘అవును కానీ అక్కడే ఉండిపోవాలని కాదు కదా?’

‘అసలు మీరు ఎందుకు మీ భార్యను కూతురు దగ్గరకు పంపించారు వివరంగా చెప్పండి’

‘అయ్యా! గర్భవతి అయిన మా అమ్మాయి వాంతులతో బాధపడుతూ అటు ఆఫీసు పని, ఇటు ఇంటిపని చేసుకోలేకపోతున్నాను. నాకు సాయంగా అమ్మను పంపించు’ అని అడిగితే పంపించాను. అయితే డెలివరీ అయ్యేదాకా ఉండననీ అంటే సరేలే అనుకున్నాను. బిడ్డ పుట్టాక .. బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేరని బిడ్డకు ఏడాది నిండే దాకా పంపలేదు. తర్వాత కూడా ఎన్నిసార్లు పంపమని అడిగినా నన్నే అక్కడికి రమ్మంటుంది తప్ప నా భార్యను పంపట్లేదు. నాకు కూతురు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. ఇంతలో నా ఆరోగ్యం దెబ్బతిన్నది. షుగరు, బిపి వచ్చాయి. సమయానికి తిండి, మందులు తినాలి. అమ్మను పంపించు అని అడిగాను. ‘‘నువ్వు వస్తే ఇక్కడికి రా లేకపోతే అన్నయ్య దగ్గరకు వెళ్ళు’’ అంది అమ్మాయి. మనిషి సాయం, వైద్య చికిత్స అవసరం కావడంతో ఇక విధి లేక నేను మా అబ్బాయి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కొడుకు, కోడలు.. వాళ్ళ ఉద్యోగాలు.. పిల్లలు.. నేను అదనపు బరువు, బాధ్యత అయ్యాను వాళ్లకు. నేను వాళ్లను నిందించడం లేదు. కానీ నా భార్య నా దగ్గర ఉంటే నేను హాయిగా నా ఇంట్లో ఉండేవాడిని కదా? కోడలి ముభావత, కొడుకు ఉదాసీనత భరించే కష్టం ఉండేది కాదు కదా. మా అమ్మాయికి ఇదంతా చెప్పి చాలా బతిమిలాడాను కూడా. అయినా ఆమె వినలేదు. పైగా అన్నయ్య దగ్గర ఉండలేకపోతే ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో చేరమని కూడా అంది. ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. అందుకే కేసు పెట్టాల్సి వచ్చింది. నా భార్యపైన సర్వాధికారాలు, హక్కులు భర్తగా నాకే ఉంటాయి. దయచేసి నా భార్యను నా దగ్గరకు పంపించండి.’

జానకిరామయ్య రెండు చేతులు జోడించాడు.

***

‘మీ నాన్నగారు చెప్పింది అంతా విన్నారు కదా మీరు ఏమంటారు ?’ లాయరు నిత్యను ప్రశ్నించారు.

‘ఆయన చెప్పిందంతా నిజమే సార్! కానీ అమ్మపైన భర్తగా ఆయనకు ఉండే హక్కులు అధికారాలు.. బిడ్డగా నాకు లేవా? ఆమె సేవలు నేను పొందకూడదా?’

‘తప్పకుండా పొందవచ్చు. కానీ ఇప్పుడు ఎవరికి ఎక్కువ అవసరమో మీరు కూడా ఆలోచించాలి కదా? మీ నాన్నగారు వార్ధక్యంతో, అనారోగ్యంతో ఉన్నారు కదా?’

‘మరి నా పాప?’

‘తల్లిగా మీ పాప బాధ్యత పూర్తిగా మీదే!’

‘నాదే! కానీ నా తల్లిగా ఆమె సహాయం పొందకూడదా?’

‘సహాయం అంటే అవసరానికి చేయటమే! ఏళ్ల తరబడి మీ అమ్మగారితో బలవంతంగా చేయించుకోవటం కాదు.’

‘నా ఉద్యోగం వల్ల..’

‘మానేయండి లేదా ఆయాను పెట్టుకోండి. డే కేర్ లో వేయండి. పాప తండ్రి తరఫున బంధువులు ఉంటే పిలిపించుకోండి. అదంతా మీ వీలునుబట్టి చేసుకోవాలి కానీ ఒక మనిషిని మీ స్వార్థంతో నిర్బంధించడం న్యాయం కాదు నేరం కూడా’ లాయర్ తీవ్రమైన మాటలకు నిత్య మాట్లాడలేకపోయింది.

‘సో యువర్ ఆనర్! వార్ధక్యంతోను, అనారోగ్యంతో ఉన్న నా క్లయింటు తన భార్యను తన దగ్గరకు పంపించమన్న కోరిక న్యాయమని, సమంజసమని తెలుపుకుంటూ నా వాదనను ముగిస్తున్నాను.’ అంటూ లాయర్ కూర్చున్నారు. జడ్జిగారు ఏదో మాట్లాడబోయే లోపల అంతవరకు మౌనంగా కూర్చున్న పారిజాతమ్మ లేచి నిలబడింది.

‘అయ్యా! మీరు నా అభిప్రాయం తెలుసుకోరా?’ సూటిగా జడ్జి గారిని ప్రశ్నించింది.. రెండు చేతులు జోడిస్తూ. జడ్జి గారితో సహా కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. తన ఉలికిపాటు కనిపించనివ్వకుండా జడ్జిగారు గంభీరంగా అన్నారు.

‘తప్పకుండా! చెప్పండమ్మా!’

‘అయ్యా! నేను ఒక పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మాది ఉమ్మడి కుటుంబం. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు, చిన్నపిల్లల పనులు చేయవలసిందే. నాకు పెళ్లి ఈడు వచ్చాక వచ్చిన సంబంధం టౌన్ లో గవర్నమెంట్ ఆఫీసులు బంట్రోతుగా పనిచేస్తున్నాడు. వయసు కొంచెం ఎక్కువే అయినా గవర్నమెంట్ ఉద్యోగం కదా టౌన్ లో ఉండొచ్చు కదా! అని సంబరపడిపోతూ పెళ్లి చేశారు. నేను సంతోషంగానే కాపురానికి వచ్చాను. కానీ రెండు గదుల ఇరుకు ఇల్లు.. చాలీచాలని జీతం.. ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ అనే కోపిష్టి భర్తతో భయం భయంగానే బతుకుసాగింది. నా ఇబ్బందులు ఏవీ భర్తతో కానీ పుట్టింట్లో కానీ చెప్పుకోలేదు. అలాగే సర్దుకుపోయాను. ఇద్దరు పిల్లలు..! వారు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగా ఉంటుందని చాలా పొదుపుగా సంసారాన్ని


నడుపుకొన్నాను. భర్త మాటకు ఏనాడు ఎదురుచెప్పలేదు. చీరలు, నగలు కావాలని కోరలేదు. కానీ తక్కువ జీతంతో ఇద్దరు పిల్లలను చదివించలేనని అన్నప్పుడు మాత్రం అమ్మాయిని కూడా చదివించాలని పట్టుపట్టాను. ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వారు కోరుకున్న వాళ్లతోనే పెళ్లిళ్లు చేసాము. ఆయన రిటైర్ అయినాక వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చి, మిగిలిన కాస్త డబ్బుతో పల్లెలో ఉన్న పాత ఇంటిని కొంచెం రిపేరు చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాము. టౌనులో బాడుగ ఇంట్లో ఉండడం కన్నా చిన్నదో.. పెద్దదో సొంత ఇంటిలో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. సుఖపడే వాళ్ళు ఎక్కడున్నా సుఖపడతారు.. కష్టపడే వాళ్లకు ఎక్కడున్నా కష్టం తప్పదు.

ఆయన పొద్దున లేచి, కాఫీ తాగి, వాకింగ్ కి వెళ్లేవారు. తిరిగి వచ్చి స్నానం చేసి, టిఫిన్ తిని రచ్చబండ దగ్గరకు వెళ్లేవారు. మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి టీవీ చూస్తూ నిద్రపోయేవారు. సాయంత్రం టీ తాగేసి మళ్లీ వాకింగ్.. రచ్చబండ కబుర్లు అయ్యాక వచ్చి, భోజనం చేసి టీవీ చూసేవారు. నిద్ర! నాకేమో సమయమంతా ఇంటి పని, పెరటి తోటపని సరిపోయేది.

ఇంతలో అమ్మాయి గర్భవతి అయిందని వాంతులు అని.. సాయం రమ్మని ఫోను చేసింది. ఒంటరిగా వెళ్లలేను కదా! అల్లుడే వచ్చి తీసుకెళ్లాడు. పొద్దున్నే వాళ్ళు ఆఫీస్ కి వెళ్లేలోగా కాఫీలు, జ్యూసులు, టిఫిన్లు, వంటలు.. క్యారేజీలు సర్దడం సరిపోయేది. వాళ్లు ఆఫీసులకు వెళ్ళాక ఇంటెడు పనితో సతమతమయ్యే దాన్ని. పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టు ఊపిరి ఆడేది కాదు.

మొదట్లో ‘అమ్మని పంపించమ్మా’ అని మెత్తగా కూతుర్ని అడిగే ఆయన తర్వాతర్వాత ఫోను నాకు ఇవ్వమని చెప్పి ‘ఏం కూతురు ఇంట్లో సుఖాలు మరిగినావా? ఇక్కడ మొగుడు ముండాకొడుకు ఎట్లా చచ్చినా పర్వాలేదు అనుకున్నావా?’ అంటూ తిట్టడం ప్రారంభించారు. కరవమంటే కప్పకు కోపం! విడవమంటే పాముకి కోపం! తండ్రీ కూతుర్ల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయాను. కాన్పు అయ్యాక వచ్చేద్దాం అనుకుంటే పసిగుడ్డును చూసుకోలేను అంటూ అమ్మాయి కన్నీళ్లు. తల్లిగా వాళ్లను వదిలేసి రాలేను. భార్యగా అక్కడే ఉండలేను. నేను పడ్డ మనోవేదన నాకు తెలుసు. ఆయనను రమ్మని నేను, అమ్మాయి, అల్లుడు బతిమలాడినా సరే ససేమిరా రాను అన్నారు.

‘స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంలో ప్రశాంతంగా ఉండాలని కదా పల్లెకు వచ్చింది. అయినా కూతురు ఇంట్లో ఉండటం ఏమిటి? నేను రాను.’ అంటారు.

ఇంతలో ఆయనకు బీపీ, షుగరు ఎక్కువయ్యాయని ఫోన్ చేస్తే.. అప్పుడు కూడా అమ్మాయి నన్ను పంపలేదు.

‘వస్తే ఇక్కడకి రా లేకపోతే అన్నయ్య దగ్గరకు పో. అయినా పల్లెలో డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? సిటీలో చూపించుకో’ అనేసింది. విధిలేక ఆయన కొడుకు దగ్గరకు వెళ్లారు కానీ అక్కడ ఆయన ఇమడలేకపోయారు. అమ్మాయి మీద కేసు పెట్టేంత వరకు వెళ్లారు.’ పారిజాతమ్మ ఆగింది.

అందరూ ఆమెనే చూస్తున్నారు. ‘మరి మీ నిర్ణయం చెప్పండి’ జడ్జి గారు అడిగారు.. ఇదంతా తెలిసిందే కదా మళ్లీ ఎందుకు చెప్పటం అన్న శ్లేషతో.

‘అయ్యా ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఒక కూతురిగా, చెల్లిగా, భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా జీవితమంతా నేను ఎవరికో ఒకొరికి సేవ చేస్తూనే బతికాను. నాలాగా చాలామంది ఆడవాళ్లు ఉంటారు. ఉన్నారు. ఒక ఆడదాని జీవితం ఇంతేనా? ‘‘సదా మీ సేవలో’ అన్నట్లు బతికేయడమేనా? తనకంటూ కోరికలు, కలలు, ఆశలు ఉండవా? ఉంటే అవి ఎప్పుడు తీరాలి ? ఎవరు తీర్చాలి? అసలు తెలుసుకునే వారెవరు? సరే! వాటిని పక్కన పెట్టండి. నా భర్త వాదనలో గాని.. నా కూతురి వాదనలో గాని నా పట్ల ప్రేమ ఎక్కడన్నా కనిపించిందా..? నాపైన వాళ్ళ హక్కులు.. వాళ్ళ పట్ల నా బాధ్యతలు తప్ప? నాకు బాధ్యతలు తప్ప, హక్కులు లేవా? నా బాగోగులు చూసే బాధ్యత వాళ్లకు లేదా? నన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా.. కేవలం జీతం బత్తెం లేని ఒక సేవకురాలుగా మాత్రమే చూసే వీళ్ళు.. రేపు నా ఆరోగ్యం, శక్తి ఉడిగినాక ఎలా చూస్తారు? తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. జడ్జిగారూ! దయచేసి నా కోరిక మన్నించండి!’ క్షణం ఆగిందామె.

‘నా బతుకేదో నేనే బతకాలి’ కళ్ళ కాసారాల నుండి జలపాతాల్లా దుముకుతున్న కన్నీళ్లను పమిటచెంగుతో గట్టిగా తుడుచుకుంది. రెండు చేతులు జోడించి స్థిర గంభీరంగా పారిజాతమ్మ చెప్పిన మాటకు కోర్టు నిర్ఘాంతపోయింది.

‘దయచేసి నన్ను ఏదన్నా అనాధ ఆశ్రమానికో.. వోల్దేజ్ హోమ్ కో పంపించండి!’ అంది.​

ఎం. ఆర్‌. అరుణకుమారి

8121523835

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్