శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లచ్చిందేవి నవ్వింది

5 రోజుల క్రితం

katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:05 పూర్వాహ్నం | 9 నిమిషాల చదవడం

పాలు పొంగబోతున్న శబ్దం వినిపించగానే స్టవ్ బంజేసి, స్టీల్ గ్లాసులో కాంటినెంటల్ కాఫీ పౌడర్ వేస్తున్నాను.

సరిగ్గా అప్పుడే పక్కనుంచి ఒక మూలుగు...

‘మేడం…’

పక్కకు తిరిగి చూసాను.

మెయిడ్ ఈశ్వరి.

గోడను పట్టుకుని నిలబడటానికి కూడా శక్తి లేనట్టుగా నెమ్మదిగా జారిపోతోంది. గబగబా రెండడుగులు వేసి ఆమెను పొదువుకున్నాను. నా చేతుల్లోకి తోటకూర కాడలా వాలిపోయింది. ఒళ్లంతా చెమటలు. ముఖం పాలిపోయింది. పెదవులు ఎండిపోయాయి.

‘ఏమైంది ఈశ్వరీ?’ ఆదుర్దాగా అడిగాను.

‘వాంతికచ్చేటట్టు ఉంది మేడం…’ నీరసంగా గొణిగింది.

ఆమెను నెమ్మదిగా కిచెన్ గడప దాటించి బయట సింక్ దగ్గరకు తీసుకెళ్లాను. ఒక క్షణం తటపటాయించింది.

‘పర్లేదు, ఇందులో చేసుకో.’

గబుక్కున మోకాళ్ళ మీద కిందకి వంగి సింక్ జాలీ దగ్గర వాంతి చేసుకుంది. నా చేతులతో ఆమె రెండు చెవులు మూసాను. రెండు మూడు నిమిషాల్లో కడుపులోని వికారమంతా బయటకు వెళ్ళిపోయింది.

‘మొహం కడుక్కునిరా’ అని చెప్పి కిచెన్ లోపలికి వచ్చాను.

వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర బటన్ నొక్కి గ్లాసులో వేడి నీళ్లు పట్టి, కిచెన్ వెనకున్న బాల్కనీలోని దండెం మీద ఆరేసిన నాప్కిన్ తీసుకుని లోపలికి వచ్చాను. అప్పటికే ఈశ్వరి మొహం కడుక్కుని కొంగుతో తుడుచుకుంటూ లోపలికి వచ్చింది. మూలనున్న ప్లాస్టిక్ స్టూల్ లాగి కిచెన్ ప్లాట్‌ఫామ్‌కి ఆనించి ఆమెను కూర్చోబెట్టాను.

‘ఈ నీళ్ళు తాగు’ గ్లాసు చేతికి అందించాను.

రెండు నిమిషాలు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాను.

‘ఏమైంది? బయట ఏమన్నా తిన్నావా, పడలేదా?

ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది.

‘ఒంట్లో బాలేదా? జ్వరమా?’ ( నుదుటి మీదా, గొంతు దగ్గర చెయ్యి పెట్టి చూసాను.

మామూలుగానే ఉంది.

‘ఏమైందో చెప్పు ఈశ్వరీ?’

అంతే. అప్పటివరకు బిగబట్టుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్టు భోరున ఏడ్చేసింది.

నాకు దడ మొదలైంది.

“ఏమైంది? మీ ఆయనతో ఏమైనా గొడవైందా?” అని కంగారుగా అడిగాను.

సమాధానం లేదు. ఏడుపు మాత్రం ఆగడం లేదు.

ఆ శబ్దానికి హాల్లో పేపర్ చదువుకుంటున్న అత్తమ్మ, ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్న అమర్ పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఏమైందన్నట్టు అమర్ నా వైపు చూసాడు. కళ్లతోనే వాళ్లిద్దరినీ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని సైగ చేసాను.

కొన్ని దుఃఖాలకు మాటలు అవసరం లేదు. మరికొన్ని దుఃఖాలకు మనుషుల ఉనికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏడవాలనిపించినప్పుడు మనస్ఫూర్తిగా ఏడవనివ్వాలి. కన్నీళ్లకూ ఒక పరిమితి ఉంటుంది. బాధైనా, ఏడుపైనా, సంతోషమైనా ఏదీ శాశ్వతం కాదు.

ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పడాల్సిందే.

మూడు నాలుగు నిమిషాల తర్వాత ఈశ్వరి ఏడుపు తగ్గింది.

ఈసారి ప్రశ్నలేమీ అడగకుండా కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చాను.

‘వద్దు మేడం, తాగాలనిపిస్తలేదు.’

‘మరి ఎలా? కడుపులో ఏమీ లేకపోతే నీరసం ఎక్కువౌతుంది కదా.’

‘తాగితే మళ్లీ వాంతొస్తది.’

పోపుల డబ్బా మూత తీసి, కొన్ని ధనియాలు ఆమె చేతిలో పెట్టాను.

‘నెమ్మదిగా నమిలి మింగు. కడుపులో వికారం తగ్గుతుంది.’ అన్నాను.

పది నిమిషాల తర్వాత మళ్లీ కిచెన్‌లోకి వెళ్లి చూసేసరికి గోడకు ఆనుకుని కళ్లుమూసుకుని కూర్చుంది. చేతిలో ఫోన్ మోగుతోంది.

ఫోన్ తీసుకుని నెమ్మదిగా ఏదో చెప్పింది.

‘ మీ ఆయనా?’

తలూపింది.

సరిగ్గా పదిహేను నిమిషాలకు కాలింగ్ బెల్ మోగింది.

ఈశ్వరి భర్త ప్రవీణ్.

ఈశ్వరిని నెమ్మదిగా కిచెన్ నుండి నడిపించుకుంటూ తీసుకొచ్చి అతనికి అప్పగించాను.

‘కాస్త ఇళ్లు తగ్గించుకోమని నువ్వైనా చెప్పొచ్చు కదా! ఎంత అలసిపోతుందో?’ అన్నాను, అతని మొహంలోకి చూస్తూ.

నా స్వరంలో బాధ కంటే చిరాకే ఎక్కువగా ఉంది.

“నేను ఎంత చెప్పినా వినదు మేడం. అసలు మనకి ఇన్ని ఇళ్లల్లో పని చేయడం అవసరమా అని ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఎవరి మాటా వినదు” అంటూ ఆమెను జాగ్రత్తగా నడిపించుకుంటూ లిఫ్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు.

వాళ్లు వెళ్లిపోయాక నా మనసంతా గందరగోళంగా మారిపోయింది.

చూడ్డానికి అతను మంచివాడిలాగే కనిపిస్తున్నాడు. ఈశ్వరి కూడా ఎప్పుడూ అతని గురించి చెడుగా చెప్పలేదు. మరి ఎందుకింత కష్టపడడం? ఆరోగ్యం పాడు చేసుకునేంత అవసరమేమొచ్చింది? ఎవరు చెప్పాలి ఈ అమ్మాయికి?

ఆ క్షణంలో ఈశ్వరి మీద కొంచెం విసుగు వచ్చింది.

***

పనులన్నీ ముగించుకుని, టీవీ చూస్తున్న అత్తమ్మ పక్కన కూర్చుని, ఎల్లిపాయ పొట్టు తీస్తున్నాను.

‘ఈశ్వరి వయసెంత?’

‘ఇరవై మూడనుకుంటా.’

‘పిల్లలెంతమంది?’ అత్తమ్మ అడిగింది.

‘ఇద్దరు.’

‘ఇరవైమూడేళ్ళకే ఇద్దరు. మూడో కాన్పుకి ముచ్చటపడుతోంది.’

నేను ఆశ్చర్యంగా అత్తమ్మ వైపు చూశాను.

‘ఆ పిల్ల కడుపుతో ఉన్నట్టుంది.’

‘కాదేమో అత్తమ్మా! మొన్నే కదా చిన్నోడి బర్త్‌డే చేసింది.’

‘ఏమో, నాకెందుకో అట్లానే అనిపిస్తోంది.’

అప్పటికి అత్తమ్మ మాటను పెద్దగా పట్టించుకోలేదు.

ఈశ్వరికి కూడా నాకున్నట్టే పీరియడ్ పెయిన్ చాలా ఎక్కువ. ఒకసారి నొప్పితో విలవిల్లాడిపోతుంటే మెఫ్తాల్ స్పాస్ టాబ్లెట్ ఇచ్చాను. అప్పటినుంచి నెలసరి వచ్చిన మొదటి రెండు రోజులు ఆ టాబ్లెట్ వేసుకుంటుంది.

‘చాలా థాంక్స్ మేడం. ఈ గోలీ వల్లనే నేను పని చేసుకోగలుగుతున్న’ అని ఒకసారి ఎంత సంతోషంగా చెప్పిందో!

నాకు తెలిసిన చాలామంది నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఈశ్వరి టాబ్లెట్ వేసుకుని మళ్లీ పనిలోకి దిగుతుంది. నేను టాబ్లెట్ వేసుకుని ఆఫీసుకి వెళ్తాను. నాకు ఆఫీసులో లీవు దొరకడం అరుదు. కారణాలేవైతేనేం…కొందరికి ఆ సమయంలో విశ్రాంతి తీసుకునే అదృష్టం కూడా లేదన్నమాట.

ఆమె నెలసరి తేదీలు కూడా నాకు తెలుసు. అత్తమ్మ మాటలు గుర్తు చేసుకుంటే రెండు నెలలుగా అలాంటి దాఖలాలేవీ కనిపించలేదు.

ఈ మధ్య రకరకాల పనుల్లో పడి నేనూ ఆ విషయం మర్చిపోయాను.

అత్తమ్మ చెప్పింది నిజమేనా ?


***


మధ్యాహ్నం రెండు గంటలవుతుండగా మళ్లీ కాలింగ్ బెల్ మోగింది.

ఈసారి ఈశ్వరి అత్త.

‘సగం పని వదిలేసి వచ్చిందట కదా! మల్ల మీకు ఇబ్బంది అయితదేమో అని వచ్చిన’ అంటూ నేరుగా కిచెన్‌లోకి వెళ్లిపోయింది.

నేనేమీ మాట్లాడకుండా నీళ్ళ బకెట్ తో బాల్కనీలోనికి వెళ్లిపోయాను.

పండిన, ఎండిన ఆకుల్ని తెంపి ట్రిమ్ చేసి, మొక్కలకు నీళ్లుపోసి లోపలికి వచ్చేసరికి ఈశ్వరి అత్త గిన్నెలు తోమేసి ఇల్లు ఊడవడానికి బెడ్‌రూమ్‌లోకి వచ్చింది.

‘ఈశ్వరికి ఎలా ఉంది? పొద్దున్నే ఏమీ తినకుండా వచ్చిందా?’

‘టిపినీ పెట్టే పనికి తోలిన మేడం. నీళ్లు పోసుకుంది కదా’ అంది.

ఆ మాట అర్థం కావడానికి నాకు ఒక నిమిషం పట్టింది.

అంటే…అత్తమ్మ అనుమానం నిజమే.

‘నా కొడుక్కి ఆడివిల్ల అంటే శాన పావురం.’

ఆ క్షణంలో నాకు సంతోషపడాలో, బాధపడాలో అర్థం కాలేదు.

‘ఇకనుంచి ఇళ్లు తగ్గించుకోమని నువ్వైనా చెప్పు. ఏడు ఇళ్లలో పని చేస్తున్నానని చెప్పింది. అప్పుడే గట్టిగా అన్నాను, ఇరవై మూడేళ్లకే ఏడిళ్లలో పని చేసి, ఇద్దరు పిల్లల్ని చూసుకుని, నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకుంటావని?’

‘మేమూ వద్దనే చెప్పినం మేడం. అయినా ఇనది మొండిది.’

నేను ఈశ్వరి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను.

ఈశ్వరి గురించి ఇంతగా ఆలోచిస్తున్న నేను నా గురించి ఎప్పుడైనా ఆలోచించానా?

నాకూ ఎల్లుండికి మూడో నెల నిండుతుంది కదా!

ఏదో సీరియల్ చూస్తున్న అత్తమ్మ సౌండ్ తగ్గించి, ‘చూసావా, అంత పని చేసుకుంట కూడా మూడోసారి కనడానికి సిద్ధమైంది. నువ్వూ ఉన్నావు రెండో బిడ్డను కనడానికే ముక్కుతా మూలుగుతా,’ నావైపు నిరసనగా చూస్తూ అన్నది.

కొన్నిసార్లు మౌనం గొడవలు తీసుకురాకుండా ఆపుతుంది.


***


ఆ రోజు వెళ్లిపోయిన ఈశ్వరి రెండు రోజుల తర్వాత పనికి వచ్చింది.

బాగా నీరసంగా కనిపించింది.

నా మొహంలోకి సూటిగా చూడటం లేదు. రోజూ కిచెన్‌లో కనీసం పది నిమిషాలైనా మాట్లాడుకునే మేమిద్దరం ఆ రోజు మౌనంగా ఉన్నాం.

ఏమడగాలి?

అడగొచ్చా?

అడగకూడదా?

ఆమెకూ ఏదో చెప్పాలనిపిస్తున్నట్టుంది.

నేను కూర్చున్న బెడ్ మీద బట్టలు మడత పెడుతోంది.

ఇంక ఆగలేకపోయాను.

‘ఏంటీ, ఆడపిల్ల అంటే అంత ఇష్టమా?’ నెమ్మదిగా అడిగాను.

ఆమె ముఖంలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు.

‘కనీసం కొంచెం ఆగాల్సింది. మొన్నే కదా చిన్నోడి బర్త్‌డే చేసావు. అయినా ఇద్దరు పిల్లలు చాలరా’?

‘ఇట్లయితదని నేననుకోలేదు మేడం’ ఆమె గొంతులో ఏదో చిన్న బాధ. మా ఆయనకు ఆడపిల్లంటే చాలా ఇష్టం. ఇంట్లో వెండి గజ్జెలతో ఆడిబిడ్డ తిరిగితే లచ్చిందేవి వచ్చినట్టే అంటడు.’

ఆమె మాటలు వింటూ ఉండగానే నాకు మొదటి బిడ్డప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చింది.

ఇద్దరిలో ఉన్న రకరకాల సమస్యల వల్ల నాకు ప్రెగ్నెన్సీ చాలా ఆలస్యంగా వచ్చింది. డెలివరీకి ముందు ఎన్నో కాంప్లికేషన్స్. బిడ్డ పుట్టిందాకా నమ్మకమే లేదు. ఒక రకంగా పాప బయటికి వచ్చిన మరుక్షణం నేను మృత్యువుకి దగ్గరయ్యాను. డాక్టర్ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఏదో అద్భుతం జరిగి ప్రాణాలతో బయటపడ్డాను. అప్పుడు డాక్టర్ అమర్ ని పిలిచి గట్టిగా చెప్పింది. ‘మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ భార్య శరీరం అందుకు సిద్ధంగా లేదు.’

డాక్టర్ అంత చెప్పినా అమర్ వినలేదు. తనకి మగపిల్లాడు కావాలి.

ఇప్పుడు నేను ఈశ్వరిని అడిగిన ప్రశ్నను నా భర్తను ఎందుకు అడగలేకపోయాను?

ఇంకో బిడ్డ ఎందుకని?

ఈమాట మా ఇద్దరి మధ్యా ఎందుకు చర్చకు రాలేదు?

అసలు ఈ బిడ్డ కావాలా వద్దా అన్న నిర్ణయంలో నా అభిప్రాయానికి విలువ ఉందా?

ఈశ్వరి భర్తకు ఆడపిల్ల కావాలని కోరిక.

నా భర్తకు వారసుడు కావాలని కోరిక.

ఇద్దరి మగవాళ్ళ కోరికల మధ్య ఇద్దరు ఆడవాళ్లకు తమకంటూ ఏ కోరికా ఉండకూడదా?

‘మరి నీకు?’ ఆమె కళ్లల్లోకి చూస్తూ అడిగాను.

‘ఆడపిల్లంటే ఎవరికి ఇష్టం ఉండదు మేడం? కానీ చిన్నోడు పుట్టినప్పుడే ఆడబిడ్డ పుడితే బాగుండేది అనుకున్న. కానీ వెంటనే మళ్లీ కావాలనుకోలేదు.”

‘ఇప్పుడు మాత్రం ఆడపిల్లే పుడుతుందని గ్యారంటీ ఏంటి?’ అనేశాను గాని అదే ప్రశ్న నాకూ వర్తిస్తుంది కదా! నాకు మళ్లీ ఆడపిల్ల పుడితే?’

‘ఇదేమాట నా భర్తతో అన్న మేడమ్.’

‘కానీయ్ తియ్, అదృష్టం బాగుంటే ఆడివిల్ల, లేకుంటెమాయిలే, పిల్లలు పుట్టకుంట ఆయనే ఆపరేషన్ చేపిచ్చుకుంట అన్నడు.’

ఆమె చేతులతో ముడతల్ని నున్నగా సాఫ్ చేస్తూ తువ్వాళ్లు మడత పెడుతోంది.

‘నాతో ఒక్క మాటైనా చెప్పలేదే?’

‘మా అమ్మకే చెప్పలేదు మేడం.’

నా నోటికి తాళం పడింది.

కొద్దిసేపటి తర్వాత తనే మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది.

‘ మీకో ముచ్చట చెప్పనా మేడం? కడుపు పోవాలని పొప్పడిపండు నాలుగు రోజులు తిన్న. అయినా పోలే.’

ఆమె కళ్లల్లో సన్నటి నీటి పొర.

నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది.

‘అందుకే వాంతులు అయినయా?’

ఒక ప్రాణం పోకుండా నిలిచిందన్న సంతోషం ఒకవైపు, ఆ అమ్మాయి తనకు ఇష్టంలేని బరువు, బాధ్యత మోయాల్సి వస్తుందేమోనన్న ఆందోళన మరోవైపు.

‘అయ్యో! అట్లా ఎందుకు చేసావ్?’ అంటూ మంచం మీద నుంచి ముందుకు జరిగి ఆమె చేయి పట్టుకున్నాను.

‘ఏమో మేడం… ఇంత తొందరగ వద్దనిపించింది. ఇంట్లో చెబితే ఏమంటరో అని భయం. అందుకే ఆ పని చేసిన.’

ఆ మాటల్లో అపరాధభావం కన్నా నిస్సహాయత ఎక్కువగా కనిపించింది.

తన కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని వద్దనుకోవడం వెనుక ఎంతటి భయం, ఎంతటి ఒత్తిడి, ఎంతటి నిస్సహాయత దాగి ఉన్నాయో! ఆమెకు బిడ్డ మీద ప్రేమ లేదా? ఉంది. కానీ ఆ ప్రేమకంటే ముందుగా తన బతుకు కనిపించి ఉంటుంది.

‘ఒక్క మాట చెప్పు. మీ ఆయన మంచిగానే చూసుకుంటాడా?’

‘మంచోడే మేడం. నా జీతం డబ్బులన్నీ తీసుకుంటాడు. కానీ ఎప్పుడన్నా నాకేమన్నా కావాలంటే కొనిస్తాడు. ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు.’

ఒక్కసారి కూడా కొట్టలేదట!

ఓహో! కొట్టకపోతే మంచివాడన్నమాట.

స్త్రీలు తమ జీవితాల్లో ఎలాంటి కొలమానాలతో సర్దుకుపోతారో!

ఒకరికి కొట్టకపోతే మంచివాడు. మరొకరికి తిట్టకుండా ఉంటే మంచివాడు.

ఆ పిల్ల కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ తన జేబులో వేసుకుని, ఆమెకు ఏదైనా అవసరమైనప్పుడు తిరిగి డబ్బులిచ్చే భర్త మంచివాడా?

ఆమె సంపాదన మీద ఆమెకే హక్కూ లేదా?

ఇవన్నీ అడగాలనిపించింది. కానీ అడగలేను.

ఎందుకంటే నా జీవితంలో కూడా నేను సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలున్నాయి.

అమర్ నా జీతం తీసుకోడు. దాంట్లో సగం ఇంటి ఈ‌ఎం‌ఐకి పోతుంది. తన ఫ్రెండ్ బెంజ్ కారు కొని తొడ కోసుకున్నాడని ఈయన మెడ కోసుకునే ఉద్యమంలో భాగంగా ఈమధ్యే కొన్న ఆడి కారు ఇన్స్టాల్ మెంట్లకి మిగిలిన సగం జీతం బరాబర్ సరిపోతుంది.

నా మొగుడి ఆఫీసు పని ఒత్తిడి ఇంటిదాకా వస్తుంది. అప్పుడప్పుడు అది నా చెంప మీద అయిదువేళ్ల అచ్చులా మిగులుతుంది.

కోపం వచ్చినప్పుడు

ఆయన వాడే బూతులు పిల్లెక్కడ వింటదోనని సిగ్గుతో చచ్చిపోయి బతిమాలుకున్న సందర్భాలు ఎన్నో.

పిల్లని కన్నాక నీలో అందం తగ్గిపోయింది. అయినా అంతకుముందు మాత్రం నువ్వేం పెద్ద అందగత్తెవు కాదులే అని వెటకారంగా నవ్విన సందర్భాలూ గుర్తొచ్చాయి.

నాకు ప్రాణం పోయినట్టు అనిపించేది.

భర్త తనను కొట్టడని చెప్పినప్పుడు ఈశ్వరి కళ్ళల్లో ఒక మెరుపు.

అప్పుడతను ‘మంచివాడే’ అనిపించింది.

ఎవరు పుట్టినా పర్లేదులే అన్నప్పుడు ‘మంచివాడు’ అనిపించింది.

పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటా అన్నప్పుడు ‘చాలా మంచోడు’ అనిపించింది.

‘పిచ్చిపిల్లా! అయిందేదో అయిపోయింది. ఇట్లాంటి పనులు ఇంకోసారి చేయకు’ ప్రేమగా మందలించాను.

‘సరే, అని తలకాయ ఊపింది.’

‘రేపటి నుంచి డెలివరీ అయ్యేవరకు రెండిళ్లు తగ్గించుకో. ఆ డబ్బులు నేను ఇస్తాను. కాదూ అలాగే చేస్తానంటే నేనే ముందు నిన్ను పనిలోంచి తీసేస్తాను. అట్లయినా నీకు ఒక ఇల్లు తగ్గుతుంది’ అన్నాను కొంచెం బెదిరింపు స్వరంతో.

ఆమె చిన్నగా నవ్వింది.

‘మీరు తీసేసినా నేను పోను మేడం.’

మడత పెట్టిన బట్టలను షెల్ఫ్‌లో సర్దింది.

ఆమె నవ్వులో ఎంత అమాయకత్వం ఉందో అంత అనివార్యతా ఉంది. శరీరం ఎంత అలసిపోయినా, మనసులో ఎన్ని గాయాలున్నా, రేపు మళ్లీ లేచి పనికి వెళ్ళాల్సిందేనన్న జీవన సూత్రం ఉంది.


***


దసరా పండుగకు వారం రోజులుందనగా ఒకరోజు పని ముగించుకుని నా దగ్గరకు వచ్చింది ఈశ్వరి.

‘ఎల్లుండి నుంచి ఐదు రోజులు పనికి రాను మేడం. ఊరికి పోతున్న పండక్కి.’

‘అందరూ నిన్ననే పోయిండ్రు. నేను చిన్నోడిని తీసుకుని మా చిన్నాయిన వాళ్లతోటి పోతా.’

“పండక్కి చీర కొనుక్కున్నావా?”

‘టైం ఎక్కడుంది మేడం! ఊర్ల కొనుక్కుంట.’

‘అక్కడ బాగుంటాయా?’

‘దేవరకొండలో మంచి దుక్ణాలే ఉన్నయి. మా ఆడబిడ్డ ఒక్కరోజులో జాకిటు కుట్టేస్తది.”

‘ఒక్క నిమిషం ఉండు’ అని లోపలికి వెళ్లి కొత్త చీర, జాకెట్ కవర్‌లో పెట్టి చేతికి ఇచ్చాను.

‘పండక్కి కట్టుకో. నీ పొట్టలో ఉన్న లచ్చిందేవి మురిసిపోతది.’

ఆమె ఒక్కసారి నా ముఖంలోకి చూసింది.

తర్వాత తన పొట్టను నెమ్మదిగా తడుముకుంది.

‘మీ నోటితోటి అన్నరంటే నిజంగనే లచ్చిందేవే ఉన్నట్టుంది మేడం.’

ఆమె ముఖంలో సంతోషం.

తన కడుపులో పెరుగుతున్న బిడ్డను మొదటిసారి అంత ప్రేమగా తడుముకుందేమో అనిపించింది.

రెండడుగులు వేసి నా దగ్గరకు వచ్చింది. పొట్ట మీద చెయ్యేసి నిమిరాను.

ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య మాటలకందని ఏదో అనుబంధం ఏర్పడింది.

‘సంతోషంగా ఉండు. రెస్ట్ తీసుకో. పండగ మంచిగా చేసుకో’ అంటూ భుజం మీద చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాను.

నిన్న రాత్రి పడుకునేముందు అమర్ అన్న మాటలు గుర్తొచ్చాయి.

తన బెస్ట్ ఫ్రెండ్ భార్య గైనకాలజిస్ట్ అట. స్కానింగ్‌లో జెండర్ చెబుతుందట. దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవచ్చట.

నేనేదో చెప్పడానికి నోరు తెరిచేలోపే గురక శబ్దం వినిపించింది.

ఈశ్వరికి ఆడపిల్ల కావాలి. వాళ్లింట్లో ఆడపిల్ల కోసం ఎదురుచూస్తున్నారు. వెండి గజ్జెలతో తిరిగే లచ్చిందేవి కావాలనుకుంటున్నారు.

మరి మా ఇంట్లో?

మగపిల్లాడు.

బిడ్డ ఆడపిల్లా, మగపిల్లాడా అన్నదానికంటే ముందుగా అది ఒక ప్రాణం కదా!

ఆడపిల్ల పుట్టిందని ఒక తల్లి సంతోషించడానికి, మగపిల్లాడు పుట్టలేదని మరో తల్లి బాధపడకుండా ఉండటానికి మధ్య ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో!

ఆలోచిస్తుంటే నా చేతులు తెలియకుండానే పొట్ట మీదకు వెళ్లాయి.

లోపల కదులుతున్నది ఒక బిడ్డ మాత్రమే కాదు.

నా జీవితంలో నేను తీసుకోలేకపోయిన ఎన్నో నిర్ణయాలు, చెప్పుకోలేకపోయిన ఎన్నో మాటలు, మౌనంగా భరించిన ఎన్నో అవమానాలు కూడా.

ఈసారి మాత్రం నా బిడ్డ విషయంలో నా గొంతు నొక్కుకోకూడదనుకున్నాను.

ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.

అమర్ కు డయల్ చేసాను.

‘నువ్వు చెప్పిన డాక్టర్ దగ్గరికి నేను రావడం లేదు. నా రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి ఇంకా వారం ఉంది. ఆడపిల్లా, మగపిల్లాడా అన్నది తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా నిర్ణయమే ఫైనల్.”

ఈసారి నా గొంతులో అదురూ బెదురూ లేదు.

ఫోన్ పెట్టేసాను.

లచ్చిందేవి ఎవరింట్లో పుడుతుందో తెలియదు. కానీ పుట్టబోయే ప్రతి ఆడపిల్లా తనకు తానుగా వెలుగుపుంజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.

బాల్కనీ దగ్గరకు వెళ్లి బయటికి చూసాను.

పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ అరుపులు, కేకలు నా చెవులకు సంగీతంలా వినిపిస్తున్నాయి. ఆనందంతో నిండిన వాళ్ల మొహాలు విరబూసిన సెంటుమల్లె గుత్తుల్లాగా ఉన్నాయి. అప్పుడే, గులాబీరంగు గౌను వేసుకుని జారుడుబండ పైకి ఎక్కిన ఒక బుజ్జిది తల పైకెత్తి నన్ను చూసి లచ్చిందేవిలా నవ్వింది.

స్వర్ణ కిలారి

7075896536

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్