‘ఏంటన్నా, ఏంటీ విశేషాలూ’ అంటూ ఉదయం ఆంజనేయులు వచ్చాడు. యోగయ్య వీధి అరుగు మీద కూర్చుని పేపర్ చూస్తున్నాడు.
‘ఏముంటాయి ఆంజనేయులూ’ అని, పేపర్ వేరు చేసి ఒక షీట్ ఇచ్చాడు. కొద్దిసేపు చూశాడు.
‘ఇదేందన్నా, నాలుగు నెలలు కాలం గడిచిపోయింది. వానా కాలం అయిపోవస్తన్నే, ఇంకేం వానలూ, ఇంకేం పైర్లూ? వానల్లేకుండా ఇంత కాలం ఉంటం, ఇంత కఠాను కరువు నేను పుట్టి బుద్ధెరిగినాక చూడలేదన్నా!’
‘నిజమే ఆంజనేయులూ! మొదట్నించీ సైంటిస్టులు చెబుతున్నారుగా, ఈ ఏడు ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందనీ, వానలు పడవనీ, వాతావరణంలో భారీగా మార్పులు ఉంటాయనీ!’
‘మేత లేదు. గొడ్లు అల్లాడిపోతున్నాయి. ఎక్కడా పచ్చదనం లేదు. గడ్డి పాస లేదు. ఇంకా పదిరోజులు ఆగితే మనుషులు తాగడానికి కూడా నీళ్లు ఉండేలా లేవు. నీళ్లు లేక, పంటల్లేకా, పశువులకి మేత లేక ఇక రైతులూ, కూలీలూ ఎట్ట బతకాలో, ఏంపాడో’ నిరాశగా అన్నాడు ఆంజనేయులు.
యోగయ్య ఇంటికి నాలుగు ఇళ్ళు అవతల వాళ్ళ ఇల్లు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆంజనేయులు భార్య కమల. ఇద్దరూ కష్ట జీవులు. మంచి వ్యక్తులు కూడా. వాళ్ళకి మూడు ఎకరాలు పొలం ఉంది. ఒక్కడే కొడుకు శ్రీధర్. ఇంజనీరింగ్ చదివాడు. మాటల్లోనే విషయం, రాజకీయాల మీదకి మళ్ళింది. కొద్ది సేపు ఏవో పిచ్చాపాటి రాజకీయాలు నడిచాయి.
‘సరే లే, మనకి ఆ రాజకీయాలు గోల ఎందుకు కానీ, నీ కొడుకు జాబ్ విషయం ఎంత వరకూ వచ్చింది?’ యోగయ్య అడిగాడు.
‘చివరి దశకి వచ్చినట్లే అన్నా! ఏ రోజుకారోజు రేపుమాపు అంటన్నారట. ఈ వారంలో అయిపోవచ్చు అని చెప్పాడు’
‘మీ ప్రయత్నం మీరు చేయండి. వదలకుండా పట్టుకోండి. మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదు గానీ నాకైతే నమ్మకం లేదు ఆంజనేయులూ! మనం డబ్బు కడితే ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు చాలా జరుగుతున్నాయి. రోజూ ఆ వార్తలు పేపర్లలో వస్తున్నాయి. ఏదైనా మీరు మాత్రం వాళ్ళని వదలొద్దు’
‘కొంతమందికి జాబ్ ఇచ్చారంటన్నా!’
‘నిజమేనా? నాకైతే నమ్మకం లేదు’
కొద్ది సేపు పేపర్ చూసి ‘గొడ్లు కాడ పని ఉందన్నా’ అంటూ వెళ్ళిపోయాడు. ఆంజనేయులు కొడుకు శ్రీధర్. ఒంగోల్లో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. రెండేళ్ళు అవుతోంది. చదువు పూర్తయిన వెంటనే కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటానని, ఉద్యోగ ప్రయత్నం చేస్తానని హైదరాబాదు వెళ్ళాడు. కోర్సు ఫీజులకి, అతను వుంటానికి, తింటానికి నెల నెలా వీళ్ళు అప్పు చేసి డబ్బు పంపించేవాళ్ళు. ఏదాది కాలం గడిచింది. ఉద్యోగ ప్రయత్నాల్లో అడుగు ముందుకి పడలేదు. ఆరు నెలల క్రితం ఊరికి వచ్చాడు.
‘ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది నాన్నా! మా ఫ్రెండ్ ఒకడు ఒక కన్సల్టెన్సీ గురించి చెప్పాడు. నేను ఆ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. పదిహేను లక్షలు కడితే యూకేలో అంటే బ్రిటన్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. ఆ దేశంలో కరెన్సీని పౌండ్ అంటారు. ఒక బ్రిటన్ పౌండ్ కి మన డబ్బు 125 రూపాయలు పైగా ఉంది. వాళ్ళ లెక్కలో వెయ్యి పౌండ్లు ఇస్తే మనకి ఒక లక్షా 25 వేలకి పైగా అవుతాయి. వాళ్ళు నాలుగువేల పౌండ్లు శాలరీ ఇచ్చినా మనకి 5 లక్షలకి పైగా వస్తాయి. ఒక మూడు నెలల జీతం అయితే బాకీ తీర్చుకోవచ్చు’ అన్నాడు. ఆ మాటలతో శ్రీధర్ అమ్మా నాన్నకి ఆశ కలిగింది. అదే సమయంలో గుండెల్లో రాయి పడింది. ఐదు వేలూ, పది వేలూ కాదు. 15 లక్షలు అంటే అంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వగలరు? ఇప్పటికే లక్షన్నర బాకీ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కొడుకుని తీసుకుని యోగయ్య దగ్గరికి వచ్చారు. విషయం చెప్పారు.
‘ఈ రోజుల్లో నమ్మడానికి లేదు ఆంజనేయులూ! మన కన్నీరే వాళ్ళకి కాసుల పంట! మన అవసరాల్ని వాళ్ళు దోపిడీకి వాడుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. మొన్న మా బంధువుల్లో ఒకరికి బాగోలేకపోతే హైద్రాబాదు తీసుకుపోయారు. అది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ వాళ్ళు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని బల్ల మీదనే ఎనిమిది లక్షలు కట్టించుకున్నారంట. ఆపరేషన్ అయిన తర్వాత ఐసీయూలో ఉంచి, ఐదు లక్షలు మళ్ళీ కట్టించుకున్నారు. చివరకి నాలుగో రోజు సాయంత్రానికి శవాన్ని ఇచ్చారు. గుంటూరులో డాక్టర్లు ఆపరేషన్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని గట్టిగా చెప్పారంట. అతనికి చిన్న వయసు. వాళ్ళు ఆశ చావక హైద్రాబాదు తీసుకుపోయి డబ్బు పోగొట్టుకొని చివరకి శవాన్ని తెచ్చుకున్నారు. పెద్దగా ఉన్నవాళ్ళు కూడా కాదు. నగరాల్లో కొందరికి డబ్బేలోకం. ఎవరు ఎలా పోయినా పర్లేదు. అలా ఉంది లోకరీతి. ఆ మధ్య ఒక ఐవిఎఫ్ సెంటర్ వాళ్ళు ఎన్ని మోసాలు చేశారో, ఎన్ని కోట్లు కొల్లగొట్టారో కథలు కథలుగా వార్తలు వచ్చాయి కదా?’
‘మరి ఎట్ట చేయాలన్నా? ఒక కొడుకు. ఎంతకాలం జాబ్ కోసం ఎదురుచూడ్డం? పొలం పని అలవాటు లేదు. ఏం చేయాలో తోచకుండా ఉంది’
‘అది నేను చెప్పే విషయం కాదు ఆంజనేయులూ! మీరే నిర్ణయించుకోండి. సాఫ్ట్ వేర్ మార్కెట్ మాత్రం ప్రస్తుతం బాగాలేదు. చాలా కంపెనీలు రిక్రూట్ మెంట్ లు కాదు. లేఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. హఠాత్తుగా తెల్లారేపాటికి ఉన్న ఉద్యోగాన్ని వూడపెరగుతున్నాయి’
‘సరే చూద్దాం’ అంటూ వెళ్ళి పోయారు. శ్రీధర్ మంచి పిల్లవాడు. బాధ్యతగా ఉంటాడు. అల్లరి చిల్లర లక్షణాలు లేవు. చెడు అలవాట్లు లేవు. ఎంత ప్రయత్నిస్తున్నా ఉద్యోగం రాకపోతే అతను మాత్రం ఏం చేయగలడు? ఊళ్ళో ఒకరి దగ్గర పొలమూ, ఇల్లూ ఉన్న ఆస్తి మొత్తం తనఖా పెట్టి పదిహేను లక్షలు అప్పు తీసుకున్నారు.
‘ఇంత డబ్బుని ఒంటిగా తీసుకుపోవడం ప్రమాదం. నేను కూడా వస్తా. నేనూ వాళ్ళ దగ్గరకి వచ్చి మాట్లాడతా! విషయం కనుక్కుంటా!’ అని ఆంజనేయులు కూడా కొడుకు వెంట హైదరాబాద్ వెళ్ళాడు. శ్రీకాంత్ వెంట రూమ్ కి వెళ్ళి స్నానం చేసి, హోటల్లో టిఫెన్లు చేసి 11 గంటల ప్రాంతంలో కన్సల్టెన్సీ ఆఫీసుకి వెళ్ళారు తండ్రీ, కొడుకూ. ఆఫీస్ బ్రహ్మాండంగా ఏసీతో ఉంది. లోపల ఖరీదైన ఫర్నీచర్. అలాంటి ఆఫీస్ ని ఆంజనేయులు జీవితంలో ఎన్నడూ చూడలేదు. అక్కడ హెడ్ ని వీళ్ళు కలుసుకున్నారు.
‘నూటికి నూరు పాళ్ళూ రెండు మూడు నెలల్లో ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాది. ఇప్పటికి 60 కి పైగా ఉద్యోగాలు ఇప్పించాం’ అన్నాడు ఆయన.
‘అది కాదు సార్. ఇప్పుడు ఐదు లక్షలు తీసుకోండి. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ మొత్తం తీసుకోండి. ఇంకా రెండు, మూడు లక్షలు ఎక్కువ తీసుకోండి’ అన్నాడు ఆంజనేయులు.
‘అవన్నీ కుదరవండీ! ముందు డబ్బు కడితేనే ఫైల్ కదిలేది. లేకపోతే అది అలాగే ఉంటుంది’ అన్నాడు ఆయన.
‘మేం బొత్తిగా లేనివాళ్ళం సార్. అబ్బాయిని చదివించడానికే నానా కష్టాలు పడ్డాం. కొద్దిగా కనికరం చూపండి’ బతిమాలుతూ అడిగాడు ఈయన.
‘నేనేం చేయగలనండీ? మీరు భరించే పని అయితేనే ప్రొసీడ్ కండి. లేకపోతే ఎందుకు వచ్చిన రిస్క్?’
‘మా ఊళ్ళో ఒకాయన ఇలాంటి కంపెనీల్ని నమ్మడానికి వీల్లేదని చెప్పాడండీ. అందుకు భయపడుతున్నాను’
‘ఎవడు వాడు? వాడికేం తెలుసు? పక్కవాళ్ళు బాగుపడుతుంటే చాలా మంది చూడలేని రకాలు ఉంటారు. అలాంటి వాడు అయ్యింటుంది. సరే మా అమ్మాయితో మాట్లాడండి’ అంటూ వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసాడు.
‘అమ్మా రమా! వీళ్ళు ఏమిటో అనుమానపడుతున్నారమ్మా?’ అంటూ స్పీకర్ ఆన్ చేసాడు.
‘అలా అనుమానపడే వాళ్ళతో ఎందుకు డాడీ? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అలాంటి డీలింగ్స్ వద్దు. వాళ్ళ డబ్బు తీసుకోవద్దు. తీసుకుంటే ఇచ్చేయి. మాకు ఇక్కడ పనేం లేదా ఏంటి? వాళ్ళని పంపించు. డబ్బు తీసుకోవద్దు’ అంది ఆమె.
‘చూశావుగా? అమ్మాయి కోప్పడుతోంది. మా పిల్లలు కోట్లకి కొలువు తీరారు. ఆఫ్ట్రాల్ మీ పది లక్షలకీ, పాతిక లక్షలకీ ఆశపడతామా?’ ‘సరేనమ్మా రమా! పది రోజుల క్రితం వీళ్ళు వచ్చి అడిగితే సరే అన్నాను. వాళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చారు. అలాంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపిస్తే ఏం బాగుంటుందమ్మా? మన మీద ఆశ పెట్టుకొని వచ్చారు కదా! అని’
‘మరి వాళ్ళు అనుమానపడితే ఏం చేద్దాం? మనమేమయినా మోసగాళ్ళమా?’ అంది కూతురు కోపంగా.
‘సరేనండీ, ఆరమో భారమో మీదేనండీ. మీ మీద నమ్మకం పెట్టుకున్నాం. ఇల్లూ, పొలమూ మొత్తం తనఖా పెట్టుకొని తెచ్చాం ఈ డబ్బు’ అని ఆంజనేయులు పదిహేను లక్షలు ఇచ్చాడు. డబ్బు ముట్టినట్టుగా గుమస్తా రసీదు ఇచ్చాడు.
‘సరే, మీరు ఇక అవసరమైన పేపర్స్ అన్నీ రెడీ చేసుకోండి. వీలైనంత తొందరగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి’ భరోసా ఇచ్చాడు ఆయన. మనసులో ఒక మూల తండ్రికీ, కొడుక్కీ భయంగానే ఉంది. సందేహంగానే వుంది. కాస్తా కూస్తా కాదు, ఆస్తి మొత్తం కుదువు పెట్టి తెచ్చిన సొమ్ము. శ్రీకాంత్ యూకే వీసాకి అప్లై చేసుకున్నాడు. కంపెనీ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నాడు.
రెండు నెలలు గడిచాయి. విషయం తెలుసుకుందామని కన్సల్టెన్సీ ఆఫీసుకి వెళ్ళాడు. బయట అటెండర్- హెడ్ ని కలుసుకోవడానికి చాలా సేపు అనుమతించలేదు. గంట తర్వాత లోపలకి పంపించాడు.
‘నీ ప్రయత్నాల్లోనే ఉన్నాం బాబూ! పాస్పోర్ట్ వచ్చిందా?’
‘ఇంతకుముందే పాస్పోర్ట్ ఉంది సార్’
‘సరే త్వరలోనే ఆర్డర్స్ వస్తాయి’ అన్నాడు ఆయన.
‘ఎప్పుడు వస్తాయా?’ అని అనుక్షణం అదే ధ్యాసతో ఎదురుచూస్తున్నాడు శ్రీకాంత్. మరో నెల కాలం గడిచింది. ఆఫీసుకి వెళ్ళాడు. అటెండర్ లోపల హెడ్ ని కలుసుకోవడానికి అనుమతించలేదు. అదే సమయంలో అక్కడ తనలాంటి నిరుద్యోగి కలిశాడు. అతను డబ్బు కట్టి ఆ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు.
‘మాది విజయనగరం జిల్లా అన్నా! నేను ఎనిమిది నెలల క్రితం పన్నెండు లక్షలు కట్టాను. అప్పట్నుంచి రేపూ.. మాపూ అని తిప్పుతున్నారు. మనలాగా చాలా మంది ఉన్నారు. మొన్న గోదావరి జిల్లా అతను కలిశాడు. అతను డబ్బు కట్టి తొమ్మిది నెలలు అవుతోందట! ఇది మోసంగానే వుంది’ అన్నాడు ఆ నిరుద్యోగి. శ్రీ కాంత్ కి కూడా సందేహంగానూ, భయంగానే వుంది.
“మీరు ఆఫీసుకి రావద్దు. ఇక్కడకి వచ్చి మా పనిని డిస్ట్రబ్ చేస్తే ఎలాగా? మేం మీ పనిలోనే వున్నాం. ఇలా మీరు ఆఫీసు చుట్టూ తిరిగితే ఇంకా లేట్ చేస్తాం. మీ ఇష్టం’ బెదిరించాడు అక్కడ ఉన్న మరో ఆఫీసర్. ఐదు నెలల కాలం గడిచింది. ఒక రోజు ఫోన్ చేస్తే అది పని చేయలేదు. కిక్, కిక్ శబ్దం వస్తోంది తప్ప రింగ్ కాలేదు. అంతకుముందు అటెండర్ లిఫ్ట్ చేసే వాడు. కానీ ఇప్పుడు ఫోనే మోగడం లేదు. అడుగుదామని ఆఫీసు దగ్గరికి వెళ్ళాడు శ్రీకాంత్. ఆఫీస్ మూసి వేసి ఉంది. బయట బోర్డు కూడా లేదు. అక్కడికి దగ్గరలో ఉన్న టీ స్టాల్ వాళ్లని అడిగాడు శ్రీకాంత్.
‘వాళ్ళు ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్ళి పోయారు బాబూ! నాలుగురోజుల క్రితం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫర్నీచర్ అంతా తీసుకొనిపోయారు. మీలాగా చాలా మంది తిరిగిపోతున్నారు’ అన్నాడు టీ స్టాల్ యజమాని. ఆ మాటతో నిలువునా నీరుకారి పోయాడు శ్రీకాంత్. మోసపోయినట్లు గ్రహించాడు.
‘ఈ విషయం అమ్మానాన్నకి ఎలా చెప్పాలి? చెబితే ఇంత బాధని తట్టుకోగలరా? తన మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న అమ్మానాన్న! వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి? తమ ఆస్తి మొత్తం పోయినట్లేనా? ఇల్లు కూడా తనఖాలో ఉంది. అమ్మానాన్న ఇక ఇల్లు ఖాళీ చేసి వీధిన పడాల్సిందేనా? ఎంత కూలి చేసినా పదిహేను లక్షలకి వడ్డీ సంపాదించగలరా? ఏం చేయాలి?’ అని తల్లడిల్లి పోయాడు. శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయానికి ఇంటికి వచ్చాడు.
కొడుకు రాకతో అమ్మానాన్న ఎంతో సంతోషించారు. కొడుకు వెళ్లి ఐదు నెలలు అవుతోంది. డబ్బు కట్టినప్పుడు వెళ్ళిన వెళ్లడం ఇప్పుడే రావడం! మధ్యలో పండుగలు వచ్చినా ఊరి ముఖం చూడలేదు. కొడుకు వస్తాడని రాత్రి దోసెలకి పప్పూ, బియ్యం నాన పోసింది. కొబ్బరి చట్నీ చేసి కొడుక్కి కొసరి-కొసరి వడ్డించింది అమ్మ. బజారుకి వెళ్ళిన ఆంజనేయులు వచ్చి కొడుకు యోగక్షేమాలు విచారించాడు.
‘ఉద్యోగం ఎప్పుడు ఇస్తారంట శ్రీకాంతూ?’
‘ఏమో నాన్నా, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఎదురుచూస్తున్నారు’ ఏం చెప్పాలో తోచక నోటికి వచ్చినమాట చెప్పాడు. వాస్తవం చెప్పే ధైర్యం చెయ్యలేకపోయాడు.
‘రోజురోజుకీ వడ్డీ పెరిగిపోతంది. రెండు రూపాయల వడ్డీ! నెలకి ముప్పయ్యేలు కట్టాలి. తొందరగా వస్తే బాగుండు. సరే, బరిగోడ్లకి ఎండ పడతంది’ అని ఆయన వాటిని విప్పుకొని, మేపుకి బీటికి తోలుకుపోయాడు.
‘కాంతూ! నేను మిరపకాయల కోతకి పోతన్నాగానీ ఆకలైనప్పుడు అన్నం పెట్టుకొని తిను. చీకటి పడితేనే నేను వచ్చేది’ అని అమ్మ, క్యారేజీ తీసుకొని బయటకి వచ్చింది. ఇంటి పక్కనే సెంటర్. కూలీలను ఎక్కించుకుపోవడానికి అక్కడకి ట్రాక్టర్ ఇంకా రాలేదు. పది నిమిషాలు చూసింది. దోసెలు తిని దప్పికగా ఉండటంతో మంచినీళ్లు తాగి వద్దామని ఇంటికి వచ్చింది కమల.
కొడుకు నడి ఇంట్లో కిందపడి ఉన్నాడు. నోట్లో నుంచి నురుగూ, పురుగు మందు వాసనా వస్తోంది.
‘వామ్మో నాయనో! నా బిడ్డ మందు తాగాడ్రా దేవుడో!’ అని వీధి అంతా వినపడేలా పెద్దగా ఏడుస్తూ కేక పెట్టింది కమల. వెంటనే ఇరుగూ పొరుగూ, వీధిన పోతున్న వాళ్లు పరిగెత్తుకు వచ్చారు. వెంటనే ఆటో పిలిపించి, అందులో వేసుకొని పొరుగూళ్ళో ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయారు. వీళ్ళు వెళ్ళే సరికి డాక్టర్ ఉన్నాడు. వెంటనే మందు కక్కించే పనిలోపడ్డాడు.
‘ఇంకో ఐదూ, పదినిమిషాలు ఆలస్యమైనా ప్రాణం పోయేది. ప్రాణం నిలిచింది కానీ ఏ విషయం ఇప్పుడే చెప్పలేం. మొన్ననే ఒక అమ్మాయికి మందు కక్కించిన తర్వాత ఐదో రోజు ప్రాణం పోయింది’ డాక్టర్ లోపలకి పిలిచి యోగయ్యకి చెప్పాడు.
మందులకీ, ఇతర ఖర్చులకీ యోగయ్యే డబ్బు వాడుతున్నాడు.
‘అబ్బాయిని ఎందుకు తాగావు, ఏమిటీ? అనే విషయం ఇప్పుడు అసలు అడగనే వద్దు ఆంజనేయులూ! ప్రశాంతంగా ఉండనివ్వండి. తర్వాత ఎప్పుడో తనే చెబుతాడు’ యోగయ్య చెప్పాడు. గండం గడిచింది. పది రోజులకి శ్రీకాంత్ ని ఇంటికి పంపించారు.
‘ఏం జరిగింది నాయనా? ఎందుకు అంత పని చేసావు?’ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నెమ్మదిగా అడిగింది. అప్పుడు చెప్పాడు జరిగిన విషయం, మోసపోయిన సంగతి.
‘ఎంత పని జరిగిందిరా! అయితే కానీ, పోతే పోయింది ఎదవ డబ్బు. దాని కోసం ప్రాణం తీసుకుంటావా? బతికుంటే బలుసాకు తిని గడపొచ్చు. లోకంలో బతకలేకపోతామా? ఈ కాలంలో తిండికి లేక చచ్చి పోయినోడు ఎవుడూ లేడు. ఆస్తి లేకపోతే పని చేసుకుని బతకలేమా? ఒక్క బిడ్డవి, మమ్మల్ని కడుపు కోతకి గురి చేయాలనుకున్నావా?’ అని అమ్మ కమల భోరున విలపించింది. అప్పటి వరకు ఉగ్గపట్టుకున్న ఏడుపు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. భార్య ఏడుపుతో ఆంజనేయులు కూడా కండువా నోటికి అడ్డుపెట్టుకుని విలపించాడు.
‘సరే, ముందు కేసు పెడదాం ఆంజనేయులూ’ అక్కడే వున్న యోగయ్య అన్నాడు.
‘పెడదాం అన్నా!’ అన్నాడు ఆంజనేయులు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. అప్పటివరకూ వున్న వాళ్ళ ఆఫీసు అడ్రసూ, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబరూ, డబ్బు తీసుకొని ఇచ్చిన రసీదూ, ఆవిడ యూట్యూబ్ ఛానల్ వీటి ఆధారాలు ఇచ్చి కేసు పెట్టారు. పోలీసులు గునుస్తున్నారు. వాళ్ళ మామూలు వాళ్ళకి తప్పదు గదా? అడిగినంతలో సగం ఇచ్చారు.
‘నిరుద్యోగుల నుంచి కన్సల్టెన్సీ వాళ్ళు కోట్లు కొల్లగొట్టారు. ఎంత మంది ఉసురు తీసారో! ఎన్ని కుటుంబాలను కూల్చారో! అక్రమ సొమ్ముతో పోలీసుల్నే కాదు, వాళ్లు వ్యవస్థనే మెయింటైన్ చేయగలరు. ప్రస్తుతానికి అయితే ఆంజనేయులు వాళ్ళకి డబ్బు తిరిగి వస్తుందనే ఆశ అయితే లేదు. ఎంత న్యాయం జరుగుతుందో ఏమిటో’ అని గ్రామస్తులు అనుకున్నారు.
- మొలకలపల్లి కోటేశ్వరరావు
9989 224 280








కామెంట్‌లు (0)