లండన్ : భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను దారి మళ్లించే ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. నాసా 2022లో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన డైమోర్ఫోస్ గ్రహశకలం వద్దకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కి చెందిన హేరా అంతరిక్ష నౌక చేరుకుంది. ఈ నౌక గ్రహశకలాన్ని ఢీకొనడం వల్ల దాని నిర్మాణం, ఉపరితలంపై ఏర్పడిన మార్పులను పరిశీలిస్తోంది. 2022 సెప్టెంబర్ 26న నాసా డార్ట్ అంతరిక్ష నౌక గంటకు సుమారు 22 వేల కిలోమీటర్ల వేగంతో డైమోర్ఫోస్ను ఢీకొట్టింది. దీంతో దాని కక్ష్యా కాలం 33 నిమిషాలు తగ్గింది. గ్రహశకల గమనాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చిన తొలి పూర్తిస్థాయి ప్రయోగంగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం కారణంగా గ్రహశకలం నుంచి భారీగా శిధిలాలు వెలువడ్డాయి. 2024 అక్టోబర్లో ప్రయోగించిన హేరా అంతరిక్ష నౌక 2026 నవంబర్లో డిడిమోస్ గ్రహశకల వ్యవస్థను చేరుకుంది. ప్రస్తుతం 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి పరిశీలిస్తోంది. డార్ట్ ఢీకొనడం వల్ల ఏర్పడిన బిలం, గ్రహశకలం అంతర్గత నిర్మాణం, ద్రవ్యరాశి, ఇతర మార్పులను అధ్యయనం చేయనుంది. డిసెంబర్లో మరింత దగ్గరగా వెళ్లి విస్తృత పరిశోధనలు చేపట్టనుంది. హేరా మిషన్లో భాగంగా జువెంటాస్, మిలానీ అనే రెండు చిన్న అంతరిక్ష నౌకలు కూడా పరిశోధనలు నిర్వహించనున్నాయి. జువెంటాస్ గ్రహశకలం అంతర్గత నిర్మాణాన్ని, మిలానీ దాని ఉపరితల కూర్పు, ధూళి వాతావరణాన్ని అధ్యయనం చేయనున్నాయి. గ్రహశకలాలను ముందుగానే గుర్తించి, అంతరిక్ష నౌకలతో ఢీకొట్టడం ద్వారా వాటి గమనాన్ని మార్చి భూమిని రక్షించవచ్చా అనే అంశాన్ని నిర్ధారించడం ఈ పరిశోధనల ప్రధాన లక్ష్యమని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గ్రహశకలం పరిమాణం, నిర్మాణం, ద్రవ్యరాశి ఆధారంగా ఈ ప్రయోగం సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అనేది తేలనుందని అన్నారు.








కామెంట్లు (0)