బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోబోతోనూ వేధింపులా ? జర్మనీలో కలకలం రేపిన ఘటన !

6 గంటల క్రితం

Harassment by a robot? An incident that caused a stir in Germany!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 16 ఏళ్ల బాలిక పట్ల హ్యూమనాయిడ్‌ రోబో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు యువకులపై పోలీసుల అనుమానం


జర్మనీ : మహిళల భద్రతకు ముప్పు మనుషుల నుంచే కాదు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తే యంత్రాలూ వేధింపులకు సాధనాలుగా మారవచ్చని జర్మనీలోని ఓ ఘటన తెలియజేసింది. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో .... వాటిని ఎవరు, ఎలా ఉపయోగిస్తున్నారనే ప్రశ్నలను ఈ ఉదంతం ముందుకు తెచ్చింది.


జర్మనీలోని కొలోన్‌ నగరంలో ఓ హ్యూమనాయిడ్‌ రోబో 16 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీధిలో వెళుతున్న బాలికల వద్దకు చేరుకున్న రోబో.. ఓ బాలికను హత్తుకోవడంతోపాటు, ఆమె శరీరాన్ని అనుచితంగా తాకినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఊహించని ఈ పరిణామంతో బాలిక దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం.


రోబో వెనుక మనుషుల హస్తం ?

ఈ ఘటన జరిగిన సమయంలో రోబోను ఇద్దరు యువకులు నియంత్రిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. రోబో యజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల బాలుడు, అతని 19 ఏళ్ల స్నేహితుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోబోతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తింపజేయడంతో పాటు, ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోబోను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల సెల్‌ఫోన్లనూ పరిశీలన కోసం తీసుకున్నారు. రోబో కదలికలను ముందుగానే ప్రోగ్రామ్‌ చేశారా ? లేక రిమోట్‌ ద్వారా అప్పటికప్పుడు యువకులే నియంత్రించారా ? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.


సాంకేతికత పెరుగుతున్నా.. బాధ్యత ఏది ?

ఈ ఘటనలో రోబో స్వయంగా నిర్ణయం తీసుకుందా, లేక దాని వెనుక ఉన్న వ్యక్తులే ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తింపజేశారా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇద్దరు యువకులపై ఇంకా అభియోగాలు నమోదు చేయలేదని, వారిని అనుమానితులుగా పరిగణిస్తున్నామని కొలోన్‌ పోలీసులు తెలిపినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. రోబోటిక్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి. కానీ అదే సాంకేతికతను ఇతరులను అవమానించడానికి, వేధించడానికి లేదా వాటిని వినోదంగా చిత్రీకరించడానికి ఉపయోగిస్తే, అది తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతుంది. యంత్రాలకు సామర్థ్యాన్ని అందించడమే కాదు.. వాటి వినియోగంపై బాధ్యత, నియంత్రణ, జవాబుదారీతనం కూడా నిర్ధారించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది. బాధితురాలిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం, ఘటనను వినోదంగా చూడటం, వీడియోలను బాధ్యతారహితంగా పంచుకోవడం మరింత హానికరమని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మనిషి గౌరవం, భద్రతకు ప్రాధాన్యం తగ్గకూడదు. యంత్రాలను నియంత్రించే వ్యవస్థలతోపాటు, వాటిని ఉపయోగించే మనుషుల బాధ్యత కూడా అంతే ముఖ్యం.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్