జావా ప్రోగ్రామింగ్‌లో తీవ్ర భద్రతా లోపం.. ఏఐ సాయంతో గుర్తించిన స్టార్టప్
సైటెక్ : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కంప్యూటర్లు, వెబ్‌సైట్లు, డిజిటల్ సేవల్లో వినియోగిస్తున్న జావా ప్రోగ్రామింగ్ భాషలో తీవ్రమైన భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కాలిఫ్ (Calif) ఈ లోపాన్ని గుర్తించింది. ఈ పరిశోధనలో ఓపెన్ ఎఐ అభివృద్ధి చేసిన జీపీటీ-6 కృత్రిమ మేధ (ఎఐ) మోడల్‌ను ఉపయోగించడం విశేషం.
జావా మెమొరీ నిర్వహణ వ్యవస్థలో గుర్తించిన ఈ లోపానికి పరిశోధకులు 'జావా4షెల్' (Java4Shell)గా పేరు పెట్టారు. ఈ భద్రతా బలహీనతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటే, బాధిత కంప్యూటర్లు లేదా సర్వర్లలో అనధికారిక ప్రోగ్రామ్‌లను అమలు చేసే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. తద్వారా కీలకమైన సమాచారానికి ముప్పు వాటిల్లడంతోపాటు, సంస్థల డిజిటల్ వ్యవస్థలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
1995లో ఆవిర్భవించిన జావా ప్రోగ్రామింగ్ భాష నేటికీ ప్రపంచ సాంకేతిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్చ్యూన్-500 జాబితాలోని సుమారు 90 శాతం సంస్థలు తమ వెబ్ ఆధారిత సేవల్లో జావాను ఉపయోగిస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు. యాపిల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ సంస్థలతోపాటు బ్యాంకింగ్, వైద్య, ప్రభుత్వ రంగాల డిజిటల్ వ్యవస్థల్లోనూ ఈ భాష వినియోగంలో ఉంది. దీంతో తాజాగా గుర్తించిన లోపం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ లోపంపై జావా అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు కలిగిన ఒరాకిల్ సంస్థ ప్రత్యేకంగా విస్తృత ప్రకటన చేయనప్పటికీ, భద్రతా లోపాన్ని సరిదిద్దేందుకు కీలకమైన ప్యాచ్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే, ఈ లోపాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటికే సైబర్ దాడులు జరిగాయా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇదిలా ఉండగా ... కాలిఫ్ సంస్థ గతంలో పీహెచ్‌పీ ప్రోగ్రామింగ్ భాషలోనూ తీవ్రమైన భద్రతా లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. తాజాగా జావాలోనూ లోపాన్ని వెలికితీయడం సాఫ్ట్‌వేర్ భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. మరోవైపు అమెరికాలో యాపిల్, గూగుల్ సాఫ్ట్‌వేర్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోపాటు, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) కమ్యూనికేషన్లలోనూ అంతరాయాలు ఎదురైనట్లు వార్తలు వెలువడ్డాయి.







కామెంట్‌లు (0)