సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AI Camera - మన డ్రెస్ ఎఐ ని బోల్తా కొట్టిస్తే ..!

3 గంటల క్రితం

What if we outsmart the dress AI...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

‘డిజిటల్ కామోఫ్లాజ్‌’తో మనిషిని గుర్తించలేకపోయిన నిఘా వ్యవస్థ


బెర్లిన్‌ : ఎదురుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నా .. ఎఐ కెమెరా మాత్రం అతడిని గుర్తించలేకపోతే ఎలా ఉంటుంది ? జర్మనీకి చెందిన డిజైనర్‌ సైమన్‌ వెకెర్ట్‌ రూపొందించిన ప్రత్యేకమైన ‘డిజిటల్ కామోఫ్లాజ్‌’ దుస్తులు ఇలాంటి ఆసక్తికరమైన ప్రయోగానికి వేదికయ్యాయి. ఎఐ ఆధారిత వీడియో నిఘా వ్యవస్థలను గందరగోళానికి గురిచేసేలా రూపొందించిన ఈ దుస్తులకు సంబంధించిన దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారాయి.


బెర్లిన్‌ సహా పలు నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజల కదలికలను పర్యవేక్షించేందుకు ఎఐ ఆధారిత కెమెరాలను ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిఘా వ్యవస్థల సామర్థ్యం, పరిమితులను పరీక్షించేందుకు సైమన్‌ వెకెర్ట్‌ ఈ ప్రత్యేక చొక్కాను రూపొందించారు. ప్రయోగంలో చొక్కా ధరించిన వ్యక్తితో పాటు మరికొందరు రోడ్డుపై నడిచారు. కెమెరా మిగతా వారిని ‘పర్సన్‌’గా గుర్తించగా.. డిజిటల్ కామోఫ్లాజ్‌ ధరించిన వ్యక్తిని మాత్రం సరిగ్గా గుర్తించలేకపోయింది.


01


ఎఐ కి ‘కనిపించకుండా’ ఎలా ?

ఎఐ కెమెరాలు సాధారణంగా మనుషులను గుర్తించేందుకు పెద్ద సంఖ్యలో చిత్రాల ఆధారంగా శిక్షణ పొందుతాయి. కెమెరా ముందు కనిపించే వ్యక్తి శరీర ఆకృతి, దుస్తుల రంగులు, అంచులు, ఆకారాలు వంటి అనేక దృశ్య లక్షణాలను విశ్లేషించి.. గతంలో నేర్చుకున్న నమూనాలతో పోల్చుతాయి. అయితే ఈ చొక్కాపై ఉపయోగించిన ప్రకాశవంతమైన రంగులు, పరస్పరం కలిసిపోయినట్టుగా కనిపించే ఆకారాలు ఏఐ విజన్‌ వ్యవస్థను తికమకపెట్టేలా ఉన్నాయి. దీంతో మనిషి శరీర ఆకృతిని స్పష్టంగా గుర్తించడం కెమెరాకు కష్టమవుతుంది.


కంప్యూటర్‌, ఎఐతో రూపకల్పన

వివిధ దూరాల నుంచి, నైట్‌ విజన్‌ వంటి పరికరాల ద్వారా చూసినప్పుడు వ్యక్తి ఆకారం స్పష్టంగా కనిపించకుండా ఉండేలా ఈ డిజైన్‌ను కంప్యూటర్‌ సాయంతో రూపొందించారు. ఇలాంటి దృశ్య మభ్యపెట్టే పద్ధతులను సైనిక దుస్తుల్లోనూ ఉపయోగిస్తుంటారు. ఈ ప్రత్యేక డిజైన్‌కు తుది రూపం ఇవ్వడంలో కృత్రిమ మేధను కూడా ఉపయోగించినట్లు సైమన్‌ తెలిపారు.


02


మనిషి చూపు.. ఎఐ చూపు వేరు ....

ఎఐ విజన్‌ సాంకేతికతలోని పరిమితులను చూపించడమే తన ప్రయోగం ఉద్దేశమని డిజైనర్‌ పేర్కొన్నారు. మనిషి ఓ దృశ్యాన్ని చూసి దాని సందర్భాన్ని, ఆకృతిని, అర్థాన్ని కలిపి అర్థం చేసుకుంటే.. ఎఐ మాత్రం తనకు శిక్షణ ఇచ్చిన దృశ్య నమూనాల ఆధారంగా గుర్తింపునకు ప్రయత్నిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తన ప్రయోగం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రయోగంలో కనిపించిన ఫలితాలు డిజైనర్‌ పంచుకున్న దృశ్యాల ఆధారంగానే ఉన్నాయని గమనించాలి. ఎఐ కెమెరాలన్నింటినీ ఇలాంటి దుస్తులు మోసం చేస్తాయని దీన్ని బట్టి నిర్ధారించలేం. అయినప్పటికీ ఎఐ ఆధారిత నిఘా వ్యవస్థల విశ్వసనీయత, వాటి పరిమితులపై ఈ ప్రయోగం ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది.
03


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్