శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐక్యపోరాటానికి దక్కిన గొప్ప విజయం : మంత్రి పొన్నం ప్రభాకర్

10 గంటల క్రితం

A major victory for the united struggle: Minister Ponnam Prabhakar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది దేశవ్యాప్తంగా విద్యార్థులు , యువత నిర్వహించిన ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక వ్యక్తి పదవి నుంచి తప్పుకోవడం మాత్రమే కాదని, విద్యార్థి శక్తి ముందు కేంద్ర ప్రభుత్వ అహంకార రాజకీయాలు తలవంచిన అరుదైన సందర్భమని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గద్దె దిగడానికి ఈ రాజీనామా తొలి మెట్టుగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులు , యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే దేశ యువత ఏమాత్రం సహించదని, తగిన రీతిలో బుద్ధి చెబుతుందని ఈ ఉద్యమం స్పష్టంగా నిరూపించిందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన నిరసన తెలిపే ప్రాథమిక హక్కులను హరించాలని చూస్తే ప్రజలు మరింత ఐక్యంగా పోరాడతారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలని హితవు పలికారు. ఈ రాజీనామా పరిణామం దేశ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న తీవ్ర అసంతృప్తికి స్పష్టమైన నిదర్శనమని అన్నారు. విద్య, ఉపాధి , యువజనుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తన పాత వైఖరిని పూర్తిగా మార్చుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ చారిత్రాత్మక ఉద్యమంలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు, యువజన సంఘాలకు , ప్రజాస్వామ్య శక్తులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్