సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రగ్స్ ముఠా వీరంగం - పోలీసులపైకి కారెక్కించిన యువకుడు

1 గంట క్రితం

Drug gang's rampage – Youth drives car at police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలంగాణ : హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా ఆటకట్టించడానికి వెళ్లిన పోలీసులపై ఓ యువకుడు అంతులేని వీరంగం సృష్టించాడు. డ్రగ్స్ మత్తులో పోలీసుల పైకే కారు ఎక్కించడంతో కానిస్టేబుల్ కాలు విరిగిపోగా, మరో కానిస్టేబుల్, సిఐ కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అబిడ్స్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయగా, హెచ్‌న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, ఇతర సిబ్బందితో కలిసి అబిడ్స్ పరిసరాల్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ వద్దకు ఓ బ్లూ కలర్ బాలెనో కారు రాగా, ఓ వ్యక్తి అందులో ఉన్న వ్యక్తికి డ్రగ్స్ ప్యాకెట్‌ను అందజేశాడు. వెంటనే అప్రమత్తమైన హెచ్‌న్యూ పోలీసులు ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న హుస్సేనీ ఆలంకు చెందిన నిందితుడు సైఫ్‌కు పోలీసులు తమ ఐడి కార్డులను చూపించి, కారు దిగాల్సిందిగా ఆదేశించారు. కారును పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్, ఒక్కసారిగా కారును రివర్స్ చేసి అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ కాలుపై నుంచి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేందర్‌కు తీవ్ర గాయమై కాలు ఫ్రాక్చర్ అయింది. వెంటనే అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ కారును వెంబడించి అఫ్జల్ గంజ్ వద్ద అడ్డుకున్నారు. ఈ హఠాత్పరిణామంలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్ వంశీధర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. అఫ్జల్ గంజ్ వద్ద నిందితుడు సైఫ్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. బాధితుడు మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని హెచ్‌న్యూ పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్