సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్లమెంట్‌ ఎదుట ప్రతిపక్ష‍ ఎంపిల నిరసన

57 నిమిషాల క్రితం

Opposition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 'చలో సంసద్' నిరసనలో విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడటంపై కేంద్రం వివరణనివ్వాలంటూ ప్రతిపక్ష ఎంపిలు పార్లమెంటు ఎదుట సోమవారం నిరసన చేపట్టాయి. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు. సభలో జరిగే చర్చలో పాల్గొనబోమని తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టగా, రాజ్యసభలో కూడా ఈ ఘటనపై తక్షణ చర్చ జరపాలని కోరుతూ సభా కార్యకలాపాలను నిలిపివేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు. విద్యార్థులపై దాడికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖను ఎక్స్‌ పోస్ట్‌ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై భద్రతా దళాలు విచక్షణారహితంగా బలప్రయోగం చేశాయని ఆయన ఆరోపించారు. పెల్లెట్ గన్‌ల వినియోగానికి హోం మంత్రి అనుమతి ఇచ్చారా? లేకపోతే ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. అలాగే సాదా దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడి చేసినట్లు కనిపిస్తున్న వ్యక్తులు పోలీసు సిబ్బందా లేదా ఇతరులా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని కోరారు. మహిళా విద్యార్థులపై దాడులు జరిగాయని, ఒక జర్నలిస్టుతో పాటు పలువురు గాయపడినట్లు కూడా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు నిర్వహించిన 'చలో సంసద్‌' ర్యాలీ చేపడుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్‌ చేసినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణనివ్వాలని ప్రతిపక్ష‍ ఎంపిలు డిమాండ్‌ చేస్తున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్